all

Friday, December 7, 2012

డాక్టర్‌ని అడగండి - డెంటల్

నా వయసు 38. ఐదేళ్ళ కిందట కారులో వస్తుంటే సడన్ బ్రేక్ వేయడం వల్ల ముందు సీటుకు గుద్దుకున్నాను. అప్పట్లో ఎటువంటి సమస్యా రాలేదు. నాలుగు రోజులు నొప్పిగా ఉంది. తర్వాత దానంతట అదే తగ్గిపోయింది. తర్వాత నాకే సమస్యా అనిపించలేదు. గత సంవత్సరకాలంగా ముందు రెండుపళ్లూ కొద్దిగా రంగు మారుతున్నట్లుగా ఉన్నాయి. దీనివల్ల నొప్పేమీ లేదు. కానీ చూడ్డానికి ఇబ్బందిగా ఉంది. ఏం చేయమంటారో సలహా ఇవ్వండి. అలాగే నల్లబడిన పళ్లలో ఒకటి ముందుకు వచ్చినట్లుగా ఉంది. సలహా చెప్పగలరు.
- అపర్ణ, విజయవాడ

ఈ మధ్యకాలంలో ముఖానికి దెబ్బలు తగలడం సర్వసాధారణమైపోయింది. చాలామందికి దెబ్బతగిలినా సమస్య పెద్దది కాకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్ళడం అరుదు. కానీ ఇటువంటి సమస్యలు వెంటనే కాకపోయినా కొన్ని నెలల తర్వాతో, లేదా సంవత్సరాల తర్వాతో ఇబ్బంది పెడతాయి. కారణం దెబ్బతగిలినప్పుడు ఒత్తిడివల్ల ముందుపళ్లకి రక్తప్రసరణ తగ్గిపోయి ఉంటుంది. దాంతో పంటిపైన ఎముకలో ఇన్‌ఫెక్షన్ రావడం, పూర్తిగా రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల పళ్లు వాటి స్వతస్సిద్ధమైన తెల్లటిరంగును కోల్పోయి మెల్లమెల్లగా రంగు మారడం మొదలవుతుంది. క్రమేణా పళ్లు నల్లబడిపోతాయి.

మిగిలిన పళ్లతో పోలిస్తే ఇవి నవ్వినప్పుడు చూడ్డానికి ఇబ్బందిగాను కనబడతాయి. దాంతో నోరు తెరిచి నవ్వలేని దుస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు వీటితోపాటు చిగుళ్లలో ఇన్‌ఫెక్షన్ తోడైతే పళ్లు వాటి స్థానాలను వదిలి ముందుకు జరగడం, పళ్లమధ్య సందులు ఏర్పడడం, ఎత్తుగా రావడం కూడా ఉంటుంది. మరేం కంగారుపడాల్సిన అవసరమేమీ లేదు. ఆధునిక దంతవైద్యంలో ఇటువంటి కాస్మొటిక్ దంతసమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలున్నాయి.

ఎక్స్‌రేల సహాయంతో నల్లబడిన పంటిపైన ఇన్‌ఫెక్షన్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇన్‌ఫెక్షన్ ఉంటే రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్ అనే చికిత్సతో ఆ పంటిని ఆరోగ్యంగా చేయవచ్చు.

ఇకపోతే నల్లబడిన పంటిని తెల్లగా మార్చడానికి లేదా మిగిలిన పంటి రంగులో కలిపివేయడానికి ఎన్నో ఆధునిక పద్ధతులు ఉన్నాయి. కాంపోజిట్ వెనీరింగ్, లేమినేట్ లేదా క్రౌన్స్ చేయడం ద్వారా వీటిని చాలా సులభంగా మామూలు రంగులోకి తేవచ్చు. ఇలా చేస్తున్నప్పుడు చక్కటి స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటే పలువరస ఎంతో అందంగా తయారవుతుంది.

డా. పార్థసారథి, కాస్మటిక్ డెంటల్ సర్జన్,
పార్థా డెంటల్, హైదరాబాద్

No comments: