all

Friday, December 7, 2012

చేమ ముక్క చారెడేసి రుచి

 


రోల్స్: కావలసిన పదార్థాలు:
చేమదుంపలు - పావుకిలో, ఉల్లిపాయలు - రెండు, క్యాబేజి తురుము - ఒక కప్పు, వెల్లుల్లి రేకలు - నాలుగు, మైదా పిండి - అరకిలో, పచ్చిమిరపకాయలు - నాలుగు, జీలకర్ర - ఒక టీ స్పూను, ధనియాల పొడి - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, నూనె - సరిపడా. తయారుచేయు విధానం: ముందుగా మైదాపిండిని చపాతి పిండిలా కలుపుకోవాలి. కలిపేటప్పుడు కొద్దిగా నూనె వేసి కలపాలి. చేమదుంపల్ని కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించి దించేయాలి. చల్లారిన తర్వాత దుంపలపై తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

క్యాబేజిని కూడా ఉడికించి నీరు తీసేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రేకలు వేసి వేగించాలి. తర్వాత ధనియాల పొడి, క్యాబేజి ముక్కలు, చేమదుంప ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి సన్నని మంటపై మగ్గనిచ్చి దించేయాలి. మైదాపిండితో చిన్న సైజు చపాతీలు చేసుకుని అందులో ఈ కూరని పెట్టి చుట్టుకోవాలి. పొయ్యిమీద మరో గిన్నెలో సరిపడా నూనె పోసి బాగా కాగాక అందులో ఈ రోల్స్‌ని వేసి వేగించి దించేయాలి. వీటిని టమోటాసాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

టిక్కీ: కావలసిన పదార్థాలు:
చేమదుంపలు - పది, ధనియాల పొడి - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, కారం - రెండు టీ స్పూన్లు, నూనె - సరిపడా. తయారుచేయు విధానం: ముందుగా చేమదుంపల్ని ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత తొక్క తీసేసి దుంపల్ని మెత్తగా చిదుముకోవాలి. ఇందులో ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు వేసి బాగా ముద్దలా కలుపుకుని చపాతి ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద పెనం పెట్టి ఒక టేబుల్ స్పూను నూనె వేసి కాగాక చేమదుంప ఉండవేసి వెడల్పుగా మనకి నచ్చిన ఆకారంలో వత్తుకోవాలి. దీన్ని సన్ననిమంటపై రెండువైపులా వేగించుకోవాలి. వీటిని చారన్నంలో కాని సాంబారన్నంలోగాని నంజుకు తింటే చాలా రుచిగా ఉంటాయి.

ఫ్రెంచ్ ఫ్రైస్: కావలసిన పదార్థాలు:
చేమ దుంపలు(పెద్ద సైజువి)- ఐదు, కారం - రెండు టీ స్పూన్లు, ధనియాల పొడి - ఒక టీ స్పూను, జీలకర్ర పొడి - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, వంట సోడా - చిటికెడు, నూనె - సరిపడా. తయారుచేయు విధానం: ముందుగా కారం,ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి చాట్ మసాలా తయారుచేసుకుని పక్కన పెట్టుకోవాలి. చేమదుంపలపై తొక్క తీసేసి సన్నగా పొడుగ్గా ముక్కలు కోసుకోవాలి. నాలుగువైపులా ఒకేలా ఉండేలా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసుకుని అందులో కొద్దిగా ఉప్పు, వంటసోడా వేసి బాగా కలపాలి. చేమదుంప ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద కడాయి పెట్టి సరిపడా నూనె పోయాలి. ముక్కల్ని నూనెలో వేసేముందు నీళ్లలో నుంచి తీసి బట్టపైన వేసుకోవాలి. నీరంతా పోయాక నూనెలో వేసి ఎర్రగా వేగించి తీసి ఒక పళ్లెంలో వేయాలి. వీటిపై చాట్‌మసాలా చల్లుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.

చేమ రొట్టె: కావలసిన పదార్థాలు:
చేమదుంపలు - అరకిలో, వరి పిండి - 150 గ్రాములు, ఎండిన మష్రూమ్స్ - ఎనిమిది, ఉల్లిపాయ - ఒకటి, నూనె - ఒక టేబుల్ స్పూను, ఉప్పు - ఒక టీ స్పూను, సోయా సాస్ - రెండు టేబుల్ స్పూన్లు, చికెన్ పౌడర్ - ఒక టీ స్పూను. తయారుచేయు విధానం: ముందుగా చేమదుంపల్ని ఉడికించి తొక్క తీసి చిన్న ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. బియ్యంపిండిలో రెండు గ్లాసుల నీళ్లు పోసి పలుచగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పొయ్యిమీద మందపాటి గిన్నె పెట్టి నూనె పోసి బాగా కాగాక మష్రూమ్ ముక్కలు వేసి వేగించాలి. తర్వాత చేమదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చికెన్ పౌడర్, సోయాసాస్, ఉప్పు వేసి బాగా వేగించాలి. తర్వాత జారుగా కలిపి పెట్టుకున్న బియ్యంపిండి కూడా వేసి ఉడికించాలి. బాగా దగ్గరగా ఉడికిన తర్వాత దించేయాలి. దీన్ని దళసరి రొట్టెలా చేసుకుని పెనంపై రెండువైపులా కాల్చుకోవాలి. మనకి నచ్చిన సైజులో కట్ చేసుకుని టమోట సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

తీపి కుడుములు: కావలసిన పదార్థాలు:
చేమదుంపలు - 300గ్రాములు, బియ్యంపిండి - 100గ్రాములు, పంచదార -నాలుగు టేబుల్ స్పూన్లు, సోయాసాస్ - మూడు టేబుల్ స్పూన్లు. తయారుచేయు విధానం: చేమదుంపల్ని మెత్తగా ఉడికించి తొక్క తీసి చిదుముకోవాలి. ఇందులో బియ్యంపిండి, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకుని చిన్న సైజు ఉండలు చేసుకోవాలి. వీటిని ఓవెన్‌లో రెండు నిమిషాలు ఉంచి తీసేయాలి. తర్వాత మరో గిన్నెలో కొద్దిగా బియ్యంపిండి, పంచదార, నీళ్లు పోసి పలుచగా కలుపుకోవాలి. ఇందులో ఉడికించిన చేమదుంప ఉండల్ని ముంచి ఓవెన్‌లో మరో మూడు నిమిషాలు ఉంచి తీసేయాలి. వీటిని పంచదార నీళ్లలో ముంచి తీసేయాలి. ఇప్పుడు మరో గిన్నెలో అర కప్పు నీళ్లు, రెండు టేబుల్ స్పూన్ల పంచదార, సోయాసాస్ వేసి పాకం తయారుచేసుకోవాలి. దాన్ని వేగించిన చేమదుంప కుడుములపై పోసి తింటే చాలా రుచిగా ఉంటాయి.

No comments: