all

Thursday, December 6, 2012

విజయ రహస్యం


జింగో అనే కుర్రాడు కారు ప్రమాదంలో తన ఎడమచేతిని పోగొట్టుకున్నాడు. కానీ అతనికి జూడో నేర్చుకోవాలన్న పట్టుదల ఉండేది. ఇంట్లోవారు, గురువు ఎంత కాదన్నా మొండికేశాడు. తప్పని పరిస్థితిలో గురువు శిక్షణ ఇవ్వడానికి అంగీకరించాడు.

గురువు దగ్గరికి వెళ్లిన జింగో ఏడాదిపాటు శిక్షణ తీసుకున్నాడు. కానీ చిత్రంగా తన గురువు ఒకే పట్టు నేర్పించాడు. అందులోనే గట్టివాడిని చేశాడు. ఒకరోజు ఉండబట్టలేక ఆ సంగతి అడిగాడు. గురువు నవ్వి, ‘‘నీకు చాలా తెలుసు, ఇదొక్కటే తెలీదు. అందుకనే ఈ పట్టే శ్రద్ధగా నేర్పాల్సి వచ్చింది’’ అన్నాడు. రెండు మాసాల తర్వాత పోటీకి గురువుతో వెళ్లాడు. మొదటి రెండు రౌండ్లలో ప్రత్యర్థులను సునాయాసంగా ఓడించాడు. జింగో ఆశ్చర్యపోయాడు. సెమీస్‌లో కాస్తంత కష్టపడాల్సి వచ్చింది. చివరగా జింగోనే గెలిచాడు.

ఇక టోర్నీ ఫైనల్ ఉన్న ప్రత్యర్థి బలశాలి, వయసులోనూ పెద్దవాడు. అతన్ని చూడగానే ఎలా గెలవగలననుకున్నాడు. కాస్తంత భయపడి రిఫరీతో, పోటీ అతనే గెలిచాడని ప్రకటించమన్నాడు. ఈలోగా రింగ్‌లోకి అతని గురువు వచ్చి పోటీ జరిపించమని పట్టుపట్టాడు. మొత్తానికి పోటీ ప్రారంభమైంది.

ప్రత్యర్థి మొదటి రెండు రౌండ్లలో జింగోను అధిగమించాడు. తర్వాత రెండురౌండ్లలో అనూహ్యంగా జింగో అతడిని చిత్తుచేసి గెలిచాడు. జింగోను టోర్నీ విజేతగా ప్రకటించారు. ఇలా గెలవడానికి కారణమేమిటని గురువును అడిగాడు.‘‘జూడోలో అతి క్లిష్టమైన పట్టులో నువ్వు ఆరితేరావు. ఆ పట్టులోంచి ప్రత్యర్థి బయటపడాలంటే అతడు నీ ఎడమ చేతిని ఒడిసి పట్టుకోవడం తప్ప మరో మార్గం లేదు!’’ అని నవ్వాడు గురువు.

No comments: