all

Saturday, November 24, 2012

kids story-

చిత్తై ఎత్తు
చిట్టి కథ


సుబ్బరాజుది వడ్డీ వ్యాపారం. ఎదుటివారి అవసరాలను ఆసరాగా తీసుకుని అధిక వడ్డీ వసూలు చేస్తుంటాడు. ఓసారి ధర్మయ్య అనే రైతు వ్యవసాయ పనుల నిమిత్తం పదివేల వరహాలు అప్పుగా తీసుకున్నాడు. ప్రతి నెలా వడ్డీ చెల్లించలేనని ధర్మయ్య చెప్పడంతో వచ్చే సంవత్సరం ఈ తారీకునే అసలు, వడ్డీ కలిపి చెల్లించాలని చెప్పాడు సుబ్బరాజు. పత్రాలు కూడా రాసుకున్నారు.

సంవత్సరం గిర్రున తిరిగింది. అనుకున్న తారీకునే అసలు, పన్నెండు నెలల వడ్డీ తీసుకొచ్చి సుబ్బరాజుకు ఇచ్చాడు ధర్మయ్య. కానీ సుబ్బరాజు ‘‘ఈ సంవత్సరం ఒక అధికమాసం వచ్చింది కాబట్టి పదమూడు నెలల వడ్డీ చెల్లించాలి’’ అని పేచీపెట్టాడు.

‘‘సంవత్సరానికి పన్నెండు నెలలు కదా?’’ అడిగాడు ధర్మయ్య. ‘‘నేను తెలుగు సంవత్సరాన్ని లెక్కలోకి తీసుకున్నాను’’ అన్నాడు సుబ్బరాజు.

అతడి దుర్బుద్ధి అర్థమైంది ధర్మయ్యకి. గ్రామపెద్ద దగ్గరకెళ్లి ఫిర్యాదు చేశాడు. ఆయనకు సుబ్బరాజు అతి తెలివి, మోసం అర్థమయ్యాయి. వెంటనే అతణ్ని పిలిపించాడు.

‘‘సుబ్బరాజూ! ఏ తారీకున అప్పు ఇచ్చావో ఆ తారీకునే తీర్చమని పత్రాలలో రాయించావు. నువ్వు అప్పు ఇచ్చింది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన. లీపు సంవత్సరం నాలుగేళ్లకొకసారి వస్తుంది. అప్పుడు ధర్మయ్య నువ్వు కోరినట్టు పదమూడు నెలల వడ్డీతో పాటు అసలు చెల్లిస్తాడు’’ అని తీర్పు చెప్పాడు గ్రామపెద్ద.
ఖంగుతిన్నాడు సుబ్బరాజు. నెల రోజుల వడ్డీకి కక్కుర్తిపడి మూడు సంవత్సరాల వడ్డీ నష్టపోయిన తన తెలివితక్కువతనానికి సిగ్గుపడ్డాడు.

నీతి: దుర్బుద్ధితో ఇతరులకు చెడు చేయాలనుకుంటే మనమే నష్టపోతాం!

No comments: