జలుబే అనుకుంటే ఆస్తమాగా మారవచ్చు
చిన్న పిల్లల్లో జలుబు సాధారణమే. కానీ అలర్జీ వల్ల వచ్చే జలుబు సాధారణం కాదు. నిర్లక్ష్యం చేస్తే ఆస్తమాకు దారితీస్తుంది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం చిన్నపిల్లల పాలిట శాపంగా మారుతుంది. అందుకే ప్రాథమిక దశలో లక్షణాలకు కాకుండా వ్యాధికి చికిత్స అందిస్తే అలర్జీ ఆస్తమాగా మారే అవకాశం ఉండదంటున్నారు సీనియర్ పల్మనాలజిస్ట్ డా. రఘోత్తమ్‌రెడ్డి.
చలికాలంలో చిన్నపిల్లల్లో అలర్జీకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. సైనస్, గొంతు, ఊపిరితిత్తుల అలర్జీలు రావడం ఈ సీజన్‌లో కామన్. అయితే చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల అలర్జీ సమస్యలు వస్తుంటాయని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. చల్లటి వాతావరణమే కారణమైతే స్విట్జర్లాండ్, 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే స్వీడన్‌లో అందరూ ఆస్తమా బాధితులే ఉండాలి. కానీ అక్కడ 1 శాతం మందిలో కూడా ఆస్తమా లేదు. నిజానికి చలికాలంలో వాతావరణంలో కాలుష్యం ఎక్కువ సేపు ఉంటుంది. వాతావరణంలో పుప్పొడి రేణువులు ఉంటాయి. ఈ సీజన్‌లోనే ఉలన్ వస్తువులు ఎక్కువగా వాడతారు. పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు సహజంగానే వైరల్ ఇన్‌ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి ఈ సీజన్‌లో ఎక్కువగా వ్యాపిస్తాయి. ఈ కారణాల వల్ల చలికాలంలో అలర్జీ, ఆస్తమా సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతుంటాయి.
అవగాహన లేమి
ప్రతీ 100 మంది పిల్లల్లో 26 మంది అలర్జీతో బాధపడుతుంటే 11 మంది ఆస్తమాతో బాధపడుతున్నారు. వీరిలో 1 శాతం మందికి మాత్రమే సరియైన చికిత్స అందుతోంది. మిగతా వారందరికి నెబ్యులైజర్ పెట్టించడం, యాంటీబయోటిక్ మందులు ఇప్పించడం చేస్తున్నారు. దీనివల్ల వ్యాధి తగ్గకపోగా పెద్దవారయ్యాక కూడా ఆస్తమా సమస్య కొనసాగే అవకాశం ఉంది. ఒకమాటలో చెప్పాలంటే జీవితాంతం ఆస్తమా వేధిస్తుంది. అలర్జీ సమస్యకు చిన్న వయసులోనే పూర్తి చికిత్స ఇప్పిస్తే ఆస్తమాగా మారే అవకాశం ఉండదు. నిర్లక్ష్యం చేస్తే ఉబ్బసంగా మారుతుందనడంలో సందేహంలేదు.
అలర్జిక్ రైనైటిస్
ఇందులో కూడా గొంతులో అలర్జీ ఉంటుంది. పొడి దగ్గు ఉంటుంది. కళ్ల నుంచి నీరు, చెవుల నుంచి శబ్దాలు, లాలాజలం ఎక్కువ కారడం వంటి లక్షణాలుంటాయి. అలర్జిక్ రైనైటిస్ ఉండే వారికి ఆస్తమా చెకప్ అవసరమవుతుంది. ప్రాథమిక దశలో అలర్జిక్ రైనైటిస్‌కు చికిత్స తీసుకుంటే ఆస్తమా బారినపడకుండా కాపాడుకోవచ్చు.
లక్షణాలు
సాధారణ జలుబు మూడు నుంచి నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది. కానీ అలర్జీ వల్ల వచ్చే జలుబు పది రోజులైనా తగ్గదు. ముక్కు నుంచి పసుపు పచ్చ లేదా ఆకుపచ్చ ద్రవం కారుతుంటే ఇన్‌ఫెక్షన్ వల్ల వచ్చినట్లుగా భావించాలి. అలాకాకుండా ద్రవం తెల్లగా కారుతుంటే అది అలర్జీ వల్ల వచ్చిందని గుర్తించాలి. దీనికి తోడు అలర్జీ ఉన్న వారిలో తుమ్ములు ఎక్కువగా ఉంటాయి. గొంతులో సైతం అలర్జీ ఉంటుంది. పొడి దగ్గు ఉంటుంది. దగ్గు, జలుబు రెండూ ఉండే అలర్జీ ఉందని నిర్ధారించుకోవచ్చు. కళ్లలో నుంచి నీరు, చెవుల్లో నుంచి శబ్దాలు, ఆయాసం, ముక్కుమూసుకుపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
నిర్ధారణ
సైనస్ ఎక్స్‌రే తీయించడం వల్ల సైనసైటిస్ తీవ్రత తెలుసుకోవచ్చు. ఈ పరీక్షతో అలర్జిక్ రైనైటిస్ వ్యాధి గురించి తెలియదు. హైపర్‌సెన్సిటివ్ నోస్ అంటే దుమ్ము, ధూళికి ముక్కు సాధారణం కన్నా ఎక్కువ ప్రతిస్పందిస్తుంది. ఈ సమస్యను అలర్జిక్ రైనైటిస్ అంటారు. ఇది ఎక్స్‌రేలో నార్మల్‌గా కనిపిస్తుంది. అందుకే అలర్జిక్ ప్రొఫైల్ టెస్ట్ అనే రక్తపరీక్ష చేయించాలి.
చికిత్స
జలుబు చేయగానే పిల్లలను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి మాత్రలు ఇప్పిస్తారు. దీనివల్ల జలుబు తాత్కాలికంగా తగ్గిపోతుంది. మళ్లీ చలికాలం రాగానే మొదలవుతుంది. ఎప్పుడు గానీ లక్షణాలకు చికిత్స తీసుకోవడం కరెక్ట్‌కాదు. లక్షణాలకు చికిత్స తీసుకుంటే వ్యాధి లోపల పెరిగిపోతుంది. అలాకాకుండా వ్యాధికి చికిత్స తీసుకుంటే సమూలంగా తగ్గిపోతుంది. అలర్జిక్ రైనైటిస్‌ను తగ్గించడానికి ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక దశలో ఈ సమస్యకు మందులు వాడితే ఆస్తమా బారినపడకుండా కాపాడుకోవచ్చు. ఆస్తమా లక్షణాలున్నప్పుడు ఇన్‌హేలర్ ఉపయోగించాలి. అయితే చిన్నపిల్లలు ఇన్‌హేలర్ ఉపయోగించలేరు కాబట్టి పేసర్ ద్వారా ఇన్‌హేలర్ ఇవ్వాలి.
ఏడాదిలోపు పిల్లలైతే నెబ్యులైజర్ వాడాలి. నెబ్యులైజర్‌లోనూ ఇన్‌హేలర్‌లో వాడే మందు ఒకటే. లక్షణాలను తగ్గించే ఇన్‌హేలర్‌తో పాటు జబ్బును తగ్గించే ఇన్‌హేలర్‌ను వాడాలి. దీన్ని ప్రివెంటివ్ ఇన్‌హేలర్ అంటారు. ఈ చికిత్సను పీఎఫ్‌టీ పరీక్ష (పల్మనరీ ఫంక్షన్ టెస్ట్)నార్మల్ వచ్చే వరకు వాడాలి. 6 సంవత్సరాలు దాటిన పిల్లలకు ఈ పరీక్ష చేయించవచ్చు. ఈ పరీక్షలో నార్మల్ రిపోర్ట్ వస్తే ఆ తరువాత ఇన్‌హేలర్ వాడాల్సిన అవసరం ఉండదు. ఇన్‌హేలర్ వల్ల ఊపిరితిత్తులకు నేరుగా మందు పోతుంది. తక్కువ మోతాదు మందు సరిగ్గా టార్గెట్‌ను రీచ్ అవుతుంది. అయితే ఇన్‌హేలర్ వాడితే సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో స్టెరాయిడ్స్ ఉంటాయి. పిల్లలు ఎత్తుపెరగరు. సరిగ్గా చదవలేరు అని కొంతమంది అనుకుంటుంటారు. కానీ అవన్నీ అపోహలే. ఇన్‌హేలర్ వాడటం మూలంగా ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు.
వాక్సినేషన్
బ్రాంకైటిస్‌తో బాధపడుతున్న వారికి, తరచుగా సైనసైటిస్, ఆస్తమా బారినపడుతున్న వారికి, గుండె జబ్బు వల్ల ఊపిరితిత్తుల్లో సమస్యలు వస్తున్న వారికి ఫ్లూ వాక్సిన్ ఉపయోగకరంగా ఉంటుంది.
నివారణ
చల్లటి నీరు, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీం వంటివి పిల్లలకు ఇవ్వకూడదు. పెర్‌ఫ్యూమ్స్, మస్కిటో రీపెల్లెంట్స్ ఇంట్లో ఉపయోగించకూడదు. ఉలన్ దుస్తులు, కుక్కలు, పిల్లులు పెంచకూడదు. కాటన్ దుస్తులు మాత్రమే వాడాలి. ఇంట్లో ఎవ్వరూ స్మోకింగ్ చేయకూడదు. ఇంట్లో శుభ్రత పాటించాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇన్‌హేలర్ వాడకంతో పాటు వ్యాధి తగ్గిపోతుంది.
డా. డి.రఘోత్తమ్‌రెడ్డి
సీనియర్ పల్మనాలజిస్ట్
యశోద హాస్పిటల్
సోమాజిగూడ, హైదరాబాద్
ఫోన్ : 92465 03775
No comments:
Post a Comment