all

Saturday, November 24, 2012

ప్రియం... వనభోజనం
కార్తీక వెలుగులు
గ్రీష్మంలో మోడువారిన చెట్లు వర్షరుతువులో చిగుర్చుతాయి. శరత్తు వచ్చేసరికి ప్రకృతిమాత ఆకుపచ్చ చీర చుట్టుకున్నదా అన్నంత శోభ వస్తుంది. నదులన్నీ నిర్మలంగా ఉంటాయి. పున్నమి చంద్రుడు కృత్తికా నక్షత్రంలో చరిస్తాడు కాబట్టి ఈ మాసానికి కార్తికమాసం (కార్తీకం కాదు) అని పేరొచ్చింది. అటు గ్రీష్మతాపంకాని, ఇటు వర్షాకాలపు చికాకులు కానీ లేకుండా మంచి వెన్నెల కాసే ఈ ఉత్తరార్థంలో వచ్చే కార్తికమాసమంటే శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమని, ఈ మాసంలో చేసే స్నాన దానాలు, పూజలు, వ్రతాలు మిగిలిన రోజులలో చేసే వాటికన్నా అత్యధిక ఫలాలనిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. సూర్యుడు తులారాశిలో ఉండే ఈ మాసంలో సూర్యోదయానికన్నా ముందు చేసే స్నానం ఆరోగ్యాన్నిస్తుందని విజ్ఞానశాస్త్రమూ ఒప్పుకుంటోంది.

ప్రకృతితత్వాన్ని బట్టి ఆకలి మందగించి, జీర్ణశక్తి తక్కువగా ఉండే ఈ మాసంలో మసాలా, మాంసం, కొవ్వుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు కట్టడి విధిస్తూ, ఉపవాసాలకు పెద్దపీట వేశారు పూర్వికులు. అంతేకాదు, ప్రకృతిపరంగా ఆహ్లాదకరంగా ఉండే ఈ మాసంలో తోటల్లో, వనాల్లో ప్రత్యేకించి ఉసిరిక చెట్ల కింద కూర్చుని పదిమందితోనూ కలిసి చేసే వనభోజనాలు ఎంతో ఆరోగ్యదాయకమన్నారు. అందుకే మామూలు రోజుల్లో కనీసం గడపదాటి వెళ్లనివారు సైతం కార్తీక మాసంలో విధిగా వన సమారాధనలో పాల్గొంటారు. వనసమారాధనలో ఉసిరిగ చెట్టునీడన సాలగ్రా మరూపంలో శ్రీహరిని పూజించి పదిమందికీ భోజనాలు పెట్టిన వారిని అకాలమృత్యువు అంటదని కార్తీక పురాణం బోధిస్తోంది.

అంతేకాదు, అందరితోనూ కలిసి ఇష్టమైన మాటలు మాట్లాడుకుంటూ సరదాగా వనభోజనం చేయడం, రకరకాల పురాణ గాథలు వినడం వల్ల పిల్లలకు మేథోవికాసం కలగడం, మంచి బుద్ధులు అలవడటం, పదిమందితోనూ మర్యాదగా మెలగడం వంటి ఎన్నో సామాజిక ప్రయోజనాలు కూడా చేకూరతాయన్నది పెద్దల ఉద్దేశ్యం. అందుకే అంతగా భక్తిపరులు కాని వారు కూడా కార్తిక వనభోజనాలపై మొగ్గుచూపడం సాధారణం.

పర్వదినాల పరంపర
జ్ఞానపంచమి, సంతాన షష్టి, గోష్టాష్టమి, బోధనైకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, పాషాణ చతుర్దశి, కార్తిక పున్నమి వంటి పర్వదినాలన్నీ ప్రభవిస్తూ, అనేకరకాలైన అర్చనలు, అభిషేకాలు, నోములు, వ్రతాలు, వివాహాది శుభకార్యాలకు శ్రేష్ఠమైన కాలంగా చెప్పుకునే కార్తిక మాసంలో... ఇంటిని, ఒంటిని శుభ్రంగా ఉంచుకోవాలని, ఇరుగుపొరుగును భోజన తాంబూలాలతో తృప్తిపరచాలని, పేదవారికి పట్టెడన్నం పెట్టాలని, దానధర్మాలు పాటించాలని, అశ్లీలతకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పెద్దలు చెప్పారు. కనీసం సాధ్యమైన వాటినైనా ఆచరిద్దాం. ఆధ్యాత్మికానందాలను అనుభవిద్దాం!

 

No comments: