all

Thursday, March 21, 2013

తాగునీటితో రోగాలు....

 

డాక్టర్‌ ఆరవీటి రామయోగయ్య
ఆర్గనైజేషన్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ సోషల్‌ డైమెన్షన్స్‌ ఆఫ్‌ హెల్త్‌,
హైదరాబాద్‌.
98496 69282


తాగునీటితో దాహం తీరుతుంది కానీ, రోగాలు వస్తాయా? అని అనుకోకండి. ఇలా అనేవారికి, పిచ్చా? చాదస్తమా? అని ముక్కు మీద వేలు వేసు కోకండి. మనకు వచ్చే చాలా రోగాలు మనం తాగే నీటి వల్లనే వస్తాయన్నది చేదు నిజం. మనం తాగే నీళ్ళు బాగున్నాయని మనమందరం అనుకుంటూ ఉంటాం. నిజం చెప్పాలంటే మనం తాగే నీళ్ళు, చాలా సందర్భాల్లో కలుషితమైన నీళ్ళే! ఎండా కాలమే కాక, వానాకాలంలోనూ నీళ్ళు కలుషితం అవుతాయి. ఇవాళ్టికీ మన దేశంలో కేవలం 32 శాతం ఇళ్లకే రక్షిత మంచినీటి వసతి ఉంది. 2011 నాటి జనాభా లెక్కలు ఆ సంగతి చెబుతున్నాయి. సాధారణంగా నీళ్లలో సూక్ష్మజీవులు ఉంటాయి. వీటి ద్వారానే జబ్బులొస్తాయి. అందుకే వీటిని 'వాటర్‌ బోర్న్‌ డిసీజెస్‌' అంటారు. కలరా, టైఫాయిడ్‌, చీము, రక్త విరేచనాలు, నీళ్ల విరేచనాలు, పచ్చ కామెర్లు, పోలియో, అమీబియాసిస్‌, నులి పురుగుల లాంటి వ్యాధులు ఈ సూక్ష్మజీవులతో వస్తాయి. అలాగని, నీటిలో అధికంగా ఫ్లోరిన్‌ ఉండడం వల్ల ఫ్లోరోసిస్‌ వస్తుంది.
ఎండాకాలంలో నీళ్లు కలుషితం కావొచ్చు. ఎందుకంటే, నీటి వనరుల్లో నీళ్ళు ఇంకిపోవడం వల్ల నీ ళ్లు కలుషితం అవుతాయి.
ఇక, వానాకాలం నీటి వనరుల్లోకి మురికి నీరు చేరుతుంది. కాబట్టి అప్పుడూ నీళ్ళు కలుషితం అవుతాయి.
2011 నాటి జనాభా లెక్కల ప్రకారం 32 శాతం ఇళ్లలోనే రక్షిత మంచి నీటి సరఫరా ఉంది.
కలరా, నీళ్ల విరేచనాలు ప్రాణాంతకం కావచ్చు. ఇక, పచ్చ కామెర్లు దీర్ఘకాలం బాధిస్తాయి. పచ్చ కామెర్లు ముదిరితే ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉంది. పోలియో వల్ల జీవితాంతం అంగవైకల్యం బాధిస్తుంది. నులి పురుగుల వ్యాధి, అమీబియాసిస్‌ వ్యాధులు మనుషులను బాధపెడతాయి.


నివారణ
తాగునీటితో వచ్చే జబ్బులను నివారించే వీలు ఎంతైనా ఉంది.
ముందుగా మన తాగునీటి వనరులను కాపాడుకోవాలి.
వీటిలో మలమూత్రాలు కలవకుండా జాగ్రత్త పడాలి.
తాగునీటి వనరుల్లో పశువులను కడగకూడదు.
తాగునీటి వనరుల్లో ఆరోగ్య కార్యకర్త, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీ, మున్సిపల్‌ సిబ్బంది బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపేలా చూసుకోవాలి.
గొట్టపుబావి (బోర్‌వెల్‌) ఉంటే, ఆ నీళ్లే తాగడం మంచిది. ఆ బావి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
గుంటల్లోని, చెరువుల్లోని, వాగుల్లోని నీటిని తాగ కూడదు.
తాగునీటి వనరుల్లోని చెత్తా చెదారాన్ని తరచుగా తొలగిస్తూ ఉండాలి.
ఆరోగ్య కార్యకర్త నుంచి క్లోరిన్‌ మాత్రలు తీసుకొని, గృహాల్లోని నీటిని క్లోరినేషన్‌ చేసుకోవాలి.
కాచి చల్లార్చిన నీరు తాగడం అన్నింటి కన్నా ఉత్తమమైన చర్య. నీరు మరిగేటప్పటి నుంచి దాదాపు15 నిమిషాలు కాచాలి. ఏ పాత్రలో వేడి చేస్తామో అదే పాత్రలో చల్లారనీయాలి. స్నానం చేయడానికి సాధారణ నీళ్లను వాడాలి.
మన దేశంలో వ్యాధుల వల్ల ఏటా 7.80 వేల మంది చనిపోతున్నారు. మొత్తం మరణాల్లో 7.5 శాతం మరణాలు మంచినీరు, పారిశుద్ధ్యం లేనందు వల్ల సంభవిస్తున్నవే అంటే ఆశ్చర్యం లేదు.
మన జి.డి.పిలో 6.4 శాతం నిధుల్ని జబ్బులకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
చిన్నపిల్లల మరణాలకు రెండో అతి పెద్ద కారణం - నీళ్ల విరేచనాలు. మిగతా కారణాలే కాక మంచినీళ్ళు కలుషితం అవడమే ప్రధాన కారణం.
అతిసారకు సులభమైన చికిత్స చేయవచ్చు. నోటి ద్వారా ఇచ్చే లవణా లతో చికిత్స చేస్తారు. దీన్నే 'ఓ.ఆర్‌.ఎస్‌ చికిత్స' అంటారు. నీటినీ, లవణాలనూ శరీరం కోల్పోవడం వల్ల మరణాలు జరుగుతాయి. కాబట్టి శరీరానికి నీరు, లవణాలు అందించాలి. ఇది శాస్త్రీయమైన విధానం. దీంతో పాటు సాధారణ ఆహారం ఇవ్వాలి. పాలు తాగే పిల్లలకు తల్లిపాలు పట్టాలి.
వ్యాధుల నివారణలో చేతులను శుభ్రంగా కడుక్కోవడం ఒక మార్గం. సబ్బుతో 30 సెకన్లు కడుక్కోవాలి. ముఖ్యంగా మల, మూత్ర విసర్జన చేశాక ఈ శుభ్రతను మరింత పాటించాలి.
కలరాకు నోటి ద్వారా ఇచ్చే లవణాలతో చికిత్స చేస్తారు.


ఒంట్లో నీటిలేమిని ఎలా తెలుసుకోవాలి?
నీళ్ల విరేచనాల వల్ల ఒంట్లో నీటి లేమి రాకుండా చూసుకో వాలి. జాగ్రత్త తీసుకోవాలి. దీన్ని ఈ లక్షణాల బట్టి కనుక్కోవచ్చు.
నోరంతా ఒకటే ఎండిపోయినట్లు ఉండడం.
కళ్లు లోపలకు పోవడం.
బాగా దాహమేస్తుంది.
చర్మం సాగదీస్తే, వెంటనే ముడుచు కోకుండా చాలాసేపు అలాగే ఉంటుంది.
ఈ లక్షణాలుంటే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి, అత్యవసర చికిత్స చేయించాలి.
టైపాయిడ్‌ జ్వరాన్ని వైడాల్‌ పరీక్షతో నిర్ధారిస్తారు. మందులతో చికిత్స చేస్తారు. అమీబియాసిస్‌కు, నులిపురుగులకు ఔషధాలతో చికిత్స చేస్తారు. ,

No comments: