all

Thursday, March 21, 2013

చెంబునిండా లడ్డూ!

 

ఒక ఊళ్లో ధర్మయ్య అనే వ్యక్తి ఉండేవాడు. పేరు తగ్గట్టు చాలా ధర్మాత్ముడు. అడిగినవాళ్లకు లేదనుకుండా విరివిగా దానం చేస్తుండేవాడు.ఒకరోజు చంద్రయ్య అనే వ్యక్తి వచ్చి ‘‘నాకు లడ్డూలు తినాలని వుంది. కొంచెం సరుకులు ఇప్పిస్తారా’’ అని అడిగాడు. ధర్మయ్య సరేనని ఒక సంచిలో సరుకులు తెచ్చి ఇచ్చాడు.

చంద్రయ్య ఆ సరుకులు తీసుకువెళ్లి పూటకూళ్ల ముసలమ్మకు ఇచ్చి ‘‘అవ్వా! వీటితో నాకు లడ్డూలు చేసిపెడతావా?’’ అని అడిగాడు. సరేనని ముసలమ్మ సరుకులు తీసుకుని లడ్డూలు తయారు చేసింది. అయితే ఈ వెర్రిబాగుల వాడికి లడ్డూలు ఎందుకులే అని లడ్డూలు దాచి, ఒక చెంబునిండా తియ్యని పానకం కలిపి ఇచ్చింది.

తర్వాత చంద్రయ్య దారంట వెళుతుంటే ధర్మయ్య పిలిచి ‘‘ఏం చంద్రయ్యా! లడ్డూలు తిన్నావా?’’ అని అడిగాడు.

‘‘తినడం ఏమిటి బాబయ్యా! చెంబునిండా తాగాను’’ అన్నాడు చంద్రయ్య అమాయకంగా. చంద్రయ్య ద్వారా విషయం తెలుసుకున్న ధర్మయ్య ఒక సంచిలో సరుకులు తీసుకుని వెళ్లి పూటకూళ్ల ముసలమ్మకు ఇచ్చి లడ్డూలు చేసిపెట్టమని అడిగాడు. ధర్మయ్య మారువేషంలో ఉండటంతో ముసలమ్మ గుర్తుపట్టలేదు.

‘‘ఇంకొక అమాయకుడు దొరికాడు’’ అనుకుని ముసలమ్మ లడ్డూలు చేసి దాచిపెట్టుకుని ఒక చెంబునిండా పానకం కలిపి ధర్మయ్యకు ఇచ్చింది.

వెంటనే ధర్మయ్య మారువేషం తొలగించి ‘‘ఓసి ముసల్దానా! అమాయకులను ఇలా మోసం చేస్తున్నావా?’’ అని గద్దించడంతో ముసలమ్మ భయపడి లడ్డూలు తెచ్చి ధర్మయ్యకు ఇచ్చింది. అంతవరకూ చాటుగా నిలబడివున్న చంద్రయ్య కూడా వచ్చి తన లడ్డూలు తీసుకున్నాడు. అటు తర్వాత ముసలమ్మ ఎవర్నీ మోసం చేయలేదు.
 

No comments: