|
రేపట్నుంచి పదవ తరగతి పరీక్షలు మొదలవుతున్నాయి. విద్యార్థులందరిలో టెన్షన్ మొదలవుతోంది. సంవత్సరమంతా చదివినది ఒక ఎత్తయితే, చదివింది గుర్తుపెట్టుకుని పరీక్షలో మంచిగా రాయడం ఒక ఎత్తు. సరైన సూచనలు లేక చాలా మంది విద్యార్థులు పరీక్షల్లో నిరాశకు గురవుతుంటారు. అలాంటివి ఎదురుకాకుండా పరీక్షలకు మిమ్మల్ని మీరు సంసిద్ధత చేసుకోవడానికి కొన్ని సూచనలు...
- పరీక్షల రోజుల్లో రాత్రి 2,3 గంటల వరకు చదువవద్దు. చదవాల్సింది ఏమైనా ఉంటే రాత్రి 12గంటలలోపు పడుకుని తెల్లవారుజామున లేచి మిగిలిన భాగం చదువుకోండి. పరీక్ష ముందురోజు రాత్రి తగినంతగా నిద్రపోవాలి. కొంతమంది ఎగ్జామ్ హాల్‌కి వెళ్లే వరకూ చదువుతూనే ఉంటారు. దీనివల్ల బ్రెయిన్‌లో కన్‌ఫ్యూజన్ ఏర్పడి మేలుకన్నా కీడే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.
- పరీక్షకు వెళ్లే ముందు రోజూ మళ్లీ కొత్త అంశాలు చదవకుండా అప్పటిదాకా నేర్చుకున్న వాటిని మననం చేసుకోవాలి. పరీక్షల సమయంలో ఇతర వ్యాపకాలను పక్కనబెట్టి చదువు మీద దృష్టి కేంద్రీకరించాలి. ప్రతీక్షణం విలువైందని భావించి చదవాలి. చదివింది ఏమాత్రం తడబడకుండా అనువైన విధంగా గుర్తుకు తెచ్చుకుని పరీక్ష రాస్తే మంచి మార్కులు సాధించవచ్చు. పరీక్షల విషయంలో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి సమాచారాన్ని అంతా మెదడులో ఓ క్రమంలో స్టెప్ బై స్టెప్ సంక్షిప్తం చేయాలి.
- పరీక్షలప్పుడు తేలికగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలు తినాలి. జిగురుగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు వంటివి మంచివే. పరీక్షల సమయంలో విద్యార్థులు వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం మంచిది. పండ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. పరీక్షలో ఎక్కువగా టీలు తీసుకోవడం మంచిది కాదు. కారం, మసాలాలు లేని ఆహారం పరిమితంగా తీసుకోండి. అవసరానికి మించి తినకూడదు. ఆకలితో పరీక్షకు వెళ్లకూడదు.
- పరీక్ష హాలు వరకు పుస్తకాలు తీసుకువెళ్లి చివరి నిముషం వరకు చదివి, కంగారుపడటం మంచిది కాదు. మనసు ప్రశాంతంగా ఉంచుకుని పరీక్ష హాలులోకి ఒక అరగంట ముందే చేరుకోవాలి. హాల్‌టిక్కెట్ నెంబర్ ప్రకారం ఏ రూమ్‌లో సీటు కేటాయించిందీ ఆవరణలో ఉండే లిస్టులో చూసుకోవాలి. ఆ రూమ్‌లోకి ప్రవేశించే ముందు పరీక్ష రాయటానికి అవసరమైన వస్తువులన్నీ ఉన్నాయో లేదో ఒకసారి సరిచూసుకోవాలి. రెండు పెన్నులు, రెండు పెన్సిల్లు, స్కేళ్లు, రబ్బరు, షార్ప్‌నర్లు ఉండేలా చూసుకోవాలి. స్కెచ్‌పెన్ సెట్, ఒక అడుగు స్కేలు పరీక్షకు తీసుకువెళ్లండి. పరీక్ష హాలులోకి వెళ్లిన తరువాత తనకు కేటాయించిన సీటులో కూర్చొవాలి. సమాధాన పత్రంపై హాల్‌టిక్కెటు నెంబరు సరిగా వేయాలి. వేశాక సరిగా ఉన్నదీ, లేనిదీ చెక్ చేసుకోవాలి.
- కొంతమందికి పరీక్ష హాలులోకి ప్రవేశించగానే చెమటలు పడతాయి. వణుకు, గుండెదడ వస్తుంది. ఆ టెన్షన్‌లో జవాబులను మరచిపోతారు. టెన్షన్‌ను భయాన్ని తగ్గించుకుని ధైర్యంగా ఉండండి. పరీక్షలో ఎప్పుడూ కంగారుపడకండి. పేపరు చూడగానే అన్ని ప్రశ్నలు మరచిపోతే భయపడకండి. కొన్ని నిమిషాలు స్థిమితపడితే అన్ని గుర్తుకు వస్తాయి.
- క్వశ్చన్ పేపరు ఇవ్వగానే తాపీగా చదివి తర్వాతనే పరీక్ష వ్రాయటానికి ఉపక్రమించండి. ప్రశ్నాపత్రం ఇచ్చిన తరువాత దానిని క్షుణ్ణంగా రెండు లేక మూడుసార్లు చదవాలి. ప్రతి ప్రశ్నను అర్థం చేసుకోవాలి. కొంతమంది ప్రశ్నను పూర్తిగా చదవకుండానే ఒకదానికి బదులు మరోదానికి జవాబు రాస్తారు. ప్రశ్నాపత్రాన్ని సమగ్రంగా చదవినట్లయితే కంగారు తికమక ఉండదు. రాయవలసిన ప్రశ్నలకు టిక్ మార్కు పెట్టాలి.
- సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సమాధానాలు వ్రాయాలి. ప్రతి ప్రశ్న రాసే ముందు దాని ప్రశ్న నెంబరును సమాధాన పత్రముపై రాయాలి. సమయపాలన పాటిస్తూ ప్రతి ప్రశ్నకు తగిన సమయాన్ని నిర్ణయించుకుని ఆలోగానే సమాధానం రాయడం పూర్తిచేయాలి. ప్రశ్నను అర్థం చేసుకుని దానికనుగుణంగా సమాధానం వ్రాయాలి. ప్రశ్నలకున్న మార్కులను బట్టి సమాధానాలు రాయడం నేర్చుకోవాలి. దీనివల్ల అనవసరంగా సమయం వృధా కాకుండా చూడవచ్చు. సమయానుకూలంగా ముఖ్య విషయాలతో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాస్తే ఫుల్‌మార్కులు సాధించవచ్చు. ఇచ్చిన సమయాన్ని రాయవలసిన ప్రశ్నలకు తగినట్లుగా విభజించుకుని దాని ప్రకారంగా జవాబులు రాయాలి.
- ముందు బాగా వచ్చిన సమాధానాలు రాసి మిగిలినవి తరువాత ప్రయత్నించాలి. ప్రశ్నా పత్రంలో ఎన్ని ప్రశ్నలు రాయమంటే అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి. అదనపు ప్రశ్నలు వ్రాయడం వల్ల సమయం వృధా అవుతుంది కాని మార్కులు పడవు. కష్టమైన ప్రశ్నతో మొదలు పెట్టారంటే మీ మెదడు చురుగ్గా పనిచేయక సమయం వృధా అవుతుంది. ప్రశ్నలకు జవాబులు ఒకే క్రమంలో అంటే ఒకటి, దాని తర్వాత రెండు అలాగా రాయాలని ఏంలేదు. ఏవి బాగా వస్తే వాటిని నెంబరు సరిగా వేసి జవాబులు రాయాలి.
- జవాబుకూ జవాబుకూ మధ్య కొంత ఖాళీ వదలాలి. పదాలు విడివిడిగానూ, లైను దూరందూరంగానూ రాస్తే స్పష్టంగా అర్థమవుతుంది. దిద్దివేతలు, కొట్టివేతలు లేకుండా రాయాలి. సమాధానాలను స్పష్టంగా వేగంగా రాయాలి. సమాధానం పాయింట్ల వారీగా సబ్‌హెడ్డింగ్‌తో రాస్తే స్పష్టంగా అర్థమవుతుంది. వాక్యాలు అర్థమయ్యేలా ఉండాలి. ప్రశ్నను ఎస్సే మాదిరిగా రాయడం కన్నా పాయింట్ల వారీగా రాయడం వల్ల ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. సాంకేతిక పదాలకూ, ఉదాహరణలకు అండర్‌లైన్ వేయండి.
- ప్రతి సెక్షన్‌లోనూ అవసరమైనన్ని ప్రశ్నలకు మాత్రమే జవాబు రాయండి. సెక్షన్ వారీగానైనా ఒక క్రమంలో రాసేందుకు ప్రయత్నించండి. పరీక్షల్లో మరి పెద్ద అక్షరాలుగానీ, చాలా చిన్న అక్షరాలుగానీ రాయద్దు. చిన్న అక్షరాలు రాస్తే దిద్దే ఉపాధ్యాయులకు ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ పేజీలు రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయని అనుకోవద్దు. మీరు రాసిన దానిలో విషయం ఉంటేనే మార్కులు వస్తాయి. ఒక ప్రశ్న జవాబు పూర్తయ్యాక ఒక గీత గీసి, తరువాత ప్రశ్న నెంబరు వేసి దాని జవాబు రాయండి. అవసరమైన కామాలు, ఫుల్‌స్టాప్‌లు పెట్టండి. లైన్‌లైన్‌కు మధ్య గ్యాప్ ఉండేలా చూసుకోండి. జవాబులు రాసేటప్పుడు భాషాదోషాలు లేకుండా చక్కటి భాషను ఉపయోగించాలి.
- మార్కులను బట్టి జవాబు రాయాలి. ఐదు మార్కుల ప్రశ్నలకు 20 మార్కులకు రాసేంత జవాబు రాసినా వేసేది ఐదు మార్కులే అని గుర్తుంచుకోండి. అయితే చిన్న జవాబులో ముఖ్యమైన పాయింట్లు చోటుచేసుకోవాలన్న విషయం మర్చిపోకండి. అలాగే పెద్ద జవాబులు రాయవలసిన వాటికి పెద్దగానే రాయండి. ఒకవేళ ఏదైనా ప్రశ్నకు జవాబు రాకపోతే మిగతా అన్ని ప్రశ్నలకూ జవాబులు రాశాక దానివిషయంలో ఆలోచించండి. గుర్తుకు వచ్చినంత మేరకు రాయండి. అంతేగాని పక్కవారిని ముందు వారిని అడగకండి. దానివల్ల మీకు, వారికి కూడా చాలా నష్టం అని గుర్తుంచుకోండి. ఒక్కసారి పరీక్ష రాశాక ఏదో ఒక ప్రశ్నకు రాయవలసిన జవాబులో మరికొన్ని పాయింట్లు గుర్తురావచ్చు. అలాంటి సందర్భాలలో మళ్లీ ఆ ప్రశ్న నెంబరు వేసి, కంటిన్యూయేషన్ అని రాసి రాయవచ్చు.
- ప్రతి పేజీలోను కనీసం 20 పంక్తులు రాయండి. పటాలకోసం పెన్నులకు బదులు రంగు పెన్సిళ్లు ఉపయోగించండి. స్వల్ప సమాధాన ప్రశ్నలకు కూడా అవసరమైన చోట పటాలు గీయండి. పటాల్లో భాగాలు సరిగా గుర్తించండి. బొమ్మలను సాధ్యమైనంత నీట్‌గా వేసేందుకు ప్రయత్నించండి.
- తీసుకొన్న ప్రతీ అదనపు సమాధాన పత్రములో, బిట్‌పేపరు, మ్యాపులు, గ్రాఫ్ పేపర్లమీద మీ నెంబరు వేయాలి. బిట్ పేపరు ఇచ్చిన తరువాత మెయిన్ పేపరు ఆపుచెయ్యండి. సులువుగా మార్కులు వచ్చే బిట్ పేపరు వెంటనే ప్రారంభించండి. బిట్‌పేపరులో డైరెక్టు ప్రశ్నలకు వెంటనే జవాబులు రాయండి. పరీక్ష పేపరు 5నిమిషాల ముందు ముగించి నెంబర్లు సరిగా వేశారో లేదా పరిశీలించండి. అడిషినల్ షీట్లు క్రమంగా అమర్చి, చివరి బిట్ పేపర్లు ఉంచి, దారంతో సరిగా కట్టండి. పరీక్ష రాసేటప్పుడు అడిషినల్ షీట్లపై వరుస సంఖ్య రాసుకుంటే పరీక్ష చివరి కంగారు లేకుండా వాటికి కట్టవచ్చు.
- జవాబు పత్రం ఇన్విజలేటరుకు ఇచ్చే ముందు జవాబులను ఒకసారి సరిచేసుకోవాలి. అడిషినల్ షీట్లను మెయిన్ ఆన్సర్ బుక్‌లో జతచేసి ముడివేసేటప్పుడు అడిషన్ షీట్లు అన్ని వరుస క్రమంలో ఉన్నాయో లేవో సరిచూసు కోవాలి. చివరి ఐదు, పదినిమిషాలు పేపరంతా మరొక్కసారి చదువుకుని, సరిచూసుకోవటానికి వినియోగించాలి.
- ఎక్కడైనా తప్పులు రాస్తే సరిచేసుకునే వీలుంటుంది. పేపర్లను చక్కగా వరుసలో పెట్టి జాగ్రత్తగా ట్యాగ్‌కట్టుట, అడిషినల్ షీట్ల మీద నెంబర్ సరిగా ఉందీ, లేందీ చూసుకోండి. రాసిన సమాధానాలు సంబంధిత ప్రశ్నలకు రాసినదీ, లేనిదీ ఒకసారి చూసుకోండి. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు ఎగ్జామినేషన్ హాల్‌లో ఉండి రాసిన సమాధానములను సరిచేసుకోవాలి. సమాధాన పత్రాన్ని నీట్‌గా ఉంచటం అలవాటు చేసుకోవాలి.
- పరీక్షల్లో ముందురోజు రాసిన పరీక్ష గురించి అనవసరంగా ఆలోచించవద్దు. స్నేహితులతో చర్చిస్తూ సమయం వృధా చేయవద్దు. జరిగిపోయిన పరీక్ష గురించి ఆలోచించకుండా తరువాత పరీక్షకోసం విలువైన సమయం కేటాయించండి. ఆల్ ది బెస్ట్. - ఆర్.వి.ఎం. సత్యం.
|
|
|
No comments:
Post a Comment