all

Thursday, March 21, 2013

స్థానబలిమి

 

నాగులాపురంలో ఒక పెద్దచెరువు వుండేది. ఆ చెరువులో నీళ్లు ఎంతో శుభ్రంగా, తియ్యగా వుండేవి. అయితే ఆ చెరువులో ఒక మొసలి చేరింది. మొసలి భయంతో ఊరిజనం చెరువులో నీళ్లకోసం రావడం మానుకున్నారు. ఒక సింహం అడవిలో దారి తప్పి ఊళ్లోకి వచ్చి అటుగా వెళుతూ దాహం తీర్చుకోడానికి చెరువులోకి దిగింది.మొసలి ఠక్కున సింహం కాలు దొరకబుచ్చుకుని గట్టిగా కొరకడం ప్రారంభించింది. వదిలించుకోవడం సింహనికి సాధ్యం కాలేదు. ‘‘దయచేసి నన్ను వదిలేయ్యి.

నేను నీ అతిథిని, నీళ్లు తాగడానికి వచ్చాను. అతిథిని చంపడం మహాపాపం’’ అన్నది సింహం. మొసలి విరగబడి నవ్వి ‘‘నా బలం ముందు నువ్వెంత. నువ్వు నా కాలిగోటికి కూడా సరిపోవు. నిన్ను మింగేస్తాను’’ అంటూ ప్రగల్భాలు పలికింది. సింహం ఎలాగో తప్పించుకుని బయటపడింది .కానీ మొసలిమీద ప్రతికారం తీర్చుకోవాలని సింహం గట్టిగా అనుకుంది.

ఒకనాడు సింహం ఆ చెరువు దగ్గరికి వెళ్లి ‘‘మొసలిబావా! పాత విషయాలు మరచిపోదాం! ఈ రోజు నా పుట్టినరోజు. నీకోసం పాయసం, లడ్డూలు తెచ్చాను. గట్టుమీదికి వచ్చి ఇవి తిను’’ అన్నది.

మొసలి తల ఎత్తి చూసింది. సింహం చేతిలో పాయసం గిన్నె, లడ్డూల బుట్ట వున్నాయి. దానికి నోరూరింది.

‘‘నేను గట్టుమీదికి రాను. వాటిని నీళ్లలోకి విసిరెయ్యి’8 అంది మొసలి. ‘‘ఓరి వెర్రిబావా! నీళ్లలో వేస్తే నీటిలోనే కలిసిపోతాయి. ఇక నువ్వేం తింటావ్’’ అంది సింహం.

పాయసం, లడ్డూలు ఘుమఘుమలాడిపోతుండటంతో మొసలి ఆతృతగా గట్టుమీదికి వచ్చింది. అదే అదునుగా సింహం దానిమీదికి దూకబోగా, అటుగా వెళుతున్న ఊరకుక్క ఒకటి మొసలిని దొరకబుచ్చుకుని ఇష్టమొచ్చినట్లుగా కరవసాగింది.

‘‘పొగరుబోతు మొసలీ! నువ్వు నా కంటే బలశాలినని ప్రగల్భాలు పలికావు కదా! నీళ్లలో వున్నంతవరకే నీ బలం. బయటకు వస్తే ఊరకుక్క కూడా నిన్ను తినేస్తుందని అర్థమయింది కదా’’ అంటూ సింహం వెళ్లిపోయింది.

నీతి: స్థానబలిమి చూసుకుని అది తమ బలమే అని గర్వపడరాదు.
 

No comments: