all

Thursday, March 21, 2013

మానవాళి మేలుకోసం మూలుగ నిధి

 

బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ (బీఎంటీ)
ఎముక మూలుగలోని కణాలనుంచి రక్తకణాలు తయారవుతాయి. ఆ మూలుగలోనే ఏదైనా లోపం ఏర్పడితే అది కొన్ని ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది. అలాంటప్పుడు ఆ మూలుగను మార్చగలిగితే... ఇకపై మళ్లీ ఆరోగ్యకరమైన రక్తకణాలు ఉత్పత్తి అయి వ్యాధి పూర్తిగా మానిపోతుంది. గతంలో ఇందుకోసం తప్పనిసరిగా దాత నుంచి మూలుగను సేకరించి స్వీకర్తకు ఇవ్వాల్సి ఉండేది. దీన్నే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ (బీఎంటీ) పిలిచేవారు. అయితే ఏ ఇతర కణంగానైనా రూపొందగలిగే మూలకణాలతోనూ ఇదే చికిత్సకు ఆస్కారం ఉంది. అందుకే ఈ ప్రక్రియను స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌గానూ అభివర్ణిస్తున్నారు. అక్యూట్ ల్యుకేమియా, అప్లాస్టిక్ అనీమియా, థలసీమియా, సికిల్‌సెల్ అనీమియా వంటి అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగపడే ‘బీఎంటీ’ ప్రక్రియపై అవగాహన కోసం ఈ సమగ్ర కథనం.

సంతోష్ చాలా అందంగా ఉంటాడు. తెలివైనవాడు కూడా. కంప్యూటర్ సైన్స్‌లో యూనివర్సిటీ ఫస్ట్ తెచ్చుకుని, ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. మంచి పెళ్లి సంబంధం వచ్చింది, ఒకసారి రమ్మని పెద్దవాళ్లు చెబితే సెలవు పెట్టి వచ్చాడు. పెళ్లి కుదిరింది. ఈ హడావుడి అయ్యాక నీరసంగా ఉంది, ఆకలి కొంచెం మందగించింది అనిపించి, ఊరికే ఒకసారి డాక్టర్‌ను కలుద్దాం అనుకున్నాడు. ఏవో పరీక్షలు చేశారు. అంతే... పెద్ద బాంబ్‌షెల్! బ్లడ్ క్యాన్సర్ ఉందని ఆ పరీక్షల్లో తేలింది. దానిపేరు టీ సెల్ ఆక్యూట్ మైలాయిడ్ ల్యుకేమియా (ఏఎమ్‌ఎల్). చాలా భయంకరమైన జబ్బు అని చెప్పారు. సంతోష్, అతని కుటుంబసభ్యులు ఒక్కసారిగా అల్లకల్లోలం అయిపోయారు. డాక్టర్ వాళ్లను చాలాసేపు సముదాయించాల్సి వచ్చింది. ట్రీట్‌మెంట్ జరగాల్సిన విధానం ఏమిటో చెప్పాడు. జబ్బును పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది... అయితే దానికి ముందు కీమోథెరపీ చేయాలి, ఆ తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని చెప్పారు. ‘బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్’ అంటే ఏమిటని అడిగాడు సంతోష్. ఇది సంతోష్ ఒక్కడి ప్రశ్న మాత్రమే కాదు... ఆ ప్రశ్నకు సమాధానం అనేక మందికి అవసరం. అలా అవసరమైనవారి కోసమే ఈ కథనం.

బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ లేక స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే...

బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే తెలుగులో ‘మూలుగ మార్పిడి’ అని చెప్పవచ్చు. మన ఎముకల మధ్యలో నల్లగా ఉండే పదార్థాన్ని మూలుగ అంటారు. ఇంగ్లిష్‌లో దీన్ని మ్యారో అని పిలుస్తారు. ఇది రక్తకణాలన్నింటినీ తయారుచేసే ఫ్యాక్టరీ. ఈ రక్తకణాల ఉత్పత్తి ఏ మూల కణాల నుంచి జరుగుతుందో దాన్ని ‘హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్’ అంటారు. సంతోష్‌కు వచ్చిన ‘ఏఎమ్‌ఎల్’ జబ్బుతో పాటు మరికొన్ని జబ్బులు ఈ ‘మ్యారో’ స్టెమ్ సెల్స్‌లో లోపాల వల్లనే వస్తాయి. అలాంటప్పుడు రోగి మూలుగలో ఉన్న స్టెమ్ సెల్స్ అన్నింటినీ నాశనం చేసి, బాగున్న స్టెమ్‌సెల్స్‌ను బయటి నుంచి ఇవ్వగలిగితే, ఈ కొత్త స్టెమ్ సెల్స్ మూలుగలో మొలకలు వేసి, ఇకపై మంచి కణాలను మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. దాంతో అతడి జబ్బు పూర్తిగా తగ్గేందుకు అవకాశం ఉంది. ఈరోజుల్లో ఈ ప్రక్రియను ‘స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ అని కూడా పిలుస్తారు.

చాలా ఏళ్లపాటు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు అవసరమైన ఎముక మూలుగను ఇతరుల ఎముక మూలుగ నుంచి మాత్రమే సేకరించేవారు. అందుకే ఈ ప్రక్రియకు ‘బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్’ అనే పేరు ప్రాచుర్యం పొందింది. అయితే ఇటీవల ఈ మూలకణాలను రక్తం నుంచి, బొడ్డుతాడు నుంచి కూడా సేకరిస్తున్నారు. అంతేగాక... ఇతరత్రా మరికొన్ని కణజాలాల (టిష్యూల) నుంచి కూడా సేకరించడం సాధ్యపడుతోంది. అందుకే గతంలోలా ఈ ప్రక్రియను బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటూ సాంప్రదాయికంగా పిలుస్తున్నప్పటికీ క్రమేణా ‘స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ అనే పేరు కూడా ప్రాచుర్యం పొందుతోంది.

బీఎంటీ చేసే పద్ధతి ఏమిటి?

మొన్నమొన్నటి వరకు దాతను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లి, తుంటి ఎముకపై చిన్న ఆపరేషన్‌తో రంధ్రాలు చేసి, లోపల మ్యారో స్టెమ్ సెల్స్‌ని బయటకు తీసేవారు. ఈ రోజుల్లో టెక్నాలజీలో మార్పుల వల్ల, ఆపరేషన్ చేయాల్సిన పని లేకుండానే ఈ ప్రక్రియను చేయడం సాధ్యమవుతోంది. చేతిపైన రక్తనాళంలోకి సూదిని పంపించి, ‘ఎఫరెసిస్’ అనే యంత్రం సహాయంతో రక్తంలోంచి నేరుగా స్టెమ్‌సెల్స్‌ను తీసుకోవచ్చు. అంటే... ఇప్పుడు మూలుగ సేకరణ కేవలం ‘రక్తదానం’ చేసినంత సులభంగా సాధ్యమవుతోందన్నమాట. అలా సేకరించిన స్టెమ్‌సెల్స్‌ను ప్రత్యేకమైన ఫ్రీజర్‌లో భద్రపరచి, కీమోథెరపీ అనే మందులతో రోగిలోని రోగగ్రస్తమైన మూలుగను సమూలంగా నాశనం చేసి, భద్రపరచిన నార్మల్ స్టెమ్‌సెల్స్‌ను రోగి రక్తంలోకి ఎక్కిస్తారు. ఇవి మూలుగలో నాటుకొని కొత్త మొలకలు వచ్చి, సుమారు 2-3 వారాలలో నార్మల్ రక్త కణాలను ఉత్పత్తి చేస్తాయి.

స్టెమ్ సెల్స్ వచ్చేది ఎక్కడి నుంచి?

కొన్ని పరిస్థితుల్లో, స్టెమ్‌సెల్స్‌ను స్వయంగా రోగి శరీరం నుంచే తీసుకోవచ్చు. ‘కీమో’ ప్రక్రియతో మూలుగను నాశనం చేశాక, అతని స్టెమ్‌సెల్స్ అతనికే ఎక్కించడం జరుగుతుంది. దీన్ని ఆటోలోగస్ స్టెమ్‌సెల ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. కొన్నిరకాల జబ్బులకు ఇలాగాక, ఇతర దాతల నుంచి (నార్మల్ డోనర్స్) స్టెమ్‌సెల్స్ సేకరించాల్సి ఉంటుంది. దీనిని ‘అల్లోజెనిక్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ అంటారు. ఇతరులు స్టెమ్‌సెల్స్ ఇవ్వాలంటే, అవి రోగి కణాలతో మ్యాచ్ అయి తీరాలి. మ్యాచ్ అయ్యేదీ, లేనిదీ ‘హెచ్‌ఎల్‌ఏ టైపింగ్’ అనే రక్తపరీక్ష ద్వారా చెప్పవచ్చు. మ్యాచ్ అయ్యే అవకాశం తోబుట్టువులకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ముందు రోగి తోబుట్టువులని పరీక్షిస్తారు.

హెచ్‌ఎల్‌ఏ టైపింగ్ అంటే...

నిజానికి హెచ్‌ఎల్‌ఏ అనేది మనుషుల కణాల్లో ఉండే ఒక రకం ప్రోటీన్. దీని ఆధారంగానే ఒక కణం తనకు చెందిందేనా లేక అది బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవాలన్న విషయాన్ని గుర్తించడం సాధ్యమవుతుంది. అందుకే ఒకవేళ ఈ హెచ్‌ఎల్‌ఏ ప్రోటీన్ వేరుగా ఉంటే స్వీకర్తకు చెందిన కణాలను... దాతకు చెందిన కణాలు తిరస్కరిస్తాయన్నమాట. అలా తిరస్కరించడం మొదలుపెడితే అది తీవ్రమైన సమస్యలకు, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితికి, ఒక్కోసారి మరణానికి కూడా దారితీస్తుంది. అందుకే ఎవరినుంచి పడితే వారి నుంచి మూల కణాలను స్వీకరించడానికి వీలు కాదు.

పైన పేర్కొన్న తిరస్కరణ అనే ప్రమాదాన్ని తప్పించడం కోసమే స్వీకర్త కణాలకు దగ్గరగా ఉన్న కణాలను ఎంచుకునేందుకే ఈ హెచ్‌ఎల్‌ఏ టైపింగ్ మ్యాచ్ పరీక్ష నిర్వహిస్తారు. మనందరం మన తల్లి నుంచి ఒక సెట్ హెచ్‌ఎల్‌ఏ ప్రోటీన్లనూ, మరో సెట్‌ను తండ్రి నుంచీ ఆనువంశీకంగా పొందుతాం. అందుకే ఒకే కడుపున పుట్టిన ఇద్దరిలో ఈ హెచ్‌ఎల్‌ఏ ప్రోటీన్లు మ్యాచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ హెచ్‌ఎల్‌ఏలో ప్రధానంగా మూడు రకాలు... ఏ, బీ, డీక్యూ అనేవి రెండు సెట్‌లలో ఉంటాయి. అంటే ఈ ఆరు సెట్‌లలో ఆరూ మ్యాచ్ అయితే అది సరిగ్గా సరిపోయినట్లన్నమాట. ఒకవేళ ఈ ఆరు సెట్లలో కనీసం ఐదు సరిపోయినా అప్పుడవి దాత నుంచి స్వీకర్తకు హానిచేయని విధంగా సరిపోతాయని పరిగణించి దాత మూలకణాలను స్వీకర్తకు ఇవ్వవచ్చని నిర్ధరిస్తారు.

స్టెమ్‌సెల్స్ మ్యాచ్ దొరకకపోతే?

చాలామంది రోగులకు కుటుంబంలో హెచ్‌ఎల్‌ఏ మ్యాచ్ ఉన్న వాళ్లు దొరకరు. అలాంటప్పుడు ‘బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ రిజిస్ట్రీ’ అనబడే సంస్థలో రిజిస్టర్ చేయించుకోవచ్చు. ఈ ‘రిజిస్ట్రీ’ చేసేది ఎందుకంటే... లోకంలో తమ స్టెమ్‌సెల్స్‌ని దానం ఇవ్వడానికి ఇష్టపడే దాతల జాబితా, వారి హెచ్‌ఎల్‌ఏ తరహా (టైప్)ని కంప్యూటర్ ఫైల్‌లో మెయింటెయిన్ చేస్తారు. రోగి రిజిస్టర్ అయ్యాక, అతనికి మ్యాచ్ అయ్యే దాత ఎక్కడైనా దొరుకుతారేమో వాళ్ల డేటాబేస్‌లో వెతికి చెబుతారు. ఒకవేళ ఇలా ఒక దాత స్టెమ్ సెల్స్ దొరికితే దానిని మ్యాచ్‌డ్ అన్‌రిలేటెడ్ డోనర్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. కానీ మన దేశంలో ఉపయోగపడే బీఎంటీ రిజిస్ట్రీస్ లేవు. ఉన్న పెద్దవల్లా అమెరికా, యూరోప్‌లో ఉన్నాయి. వాళ్ల రిజిస్ట్రీస్ మీద మన దేశస్తులకు మ్యాచ్ దొరకడం అనేది చాలా అరుదు. ఇలా చాలామందికి బీఎంటీ వల్లనే పూర్తి చికిత్స జరిగి, జబ్బు నయమయ్యే అవకాశం ఉండి కూడా, మ్యాచ్ లేకపోవడంతో చికిత్స చేయడం కుదరడం లేదు. అయితే కొద్ది ఏళ్ల క్రితం తెలుసుకున్న విషయం ఏమంటే... పిల్లలు పుట్టిన తర్వాత బయటకు వచ్చే మాయ (ప్లాసెంటా), దానితో ఉండే బొడ్డుతాడు (అంబిలికల్ కార్డ్)లో ఉన్న రక్తంలో చాలా స్టెమ్‌సెల్స్ ఉంటాయని.

ఈ స్టెమ్‌సెల్స్ పసివి కావడం వల్ల చాలామందికి మ్యాచ్ కాగలవు. లోకంలో ఎంతోమంది పిల్లలు పుడుతూనే ఉన్నారు, మామూలుగా మనకు ఏమీ తెలియకుండానే ఎంతో విలువైన ‘స్టెమ్‌సెల్స్’ను సమకూర్చే ప్లాసెంటా, అంబిలికల్ కార్డ్‌లను పారేస్తుంటాం. అలా కాకుండా అందులోంచి స్టెమ్‌సెల్స్‌ను సేకరించి, భద్రపరచగలిగితే ఎందరో రోగులకు ఉపయోగపడతాయి. ఇలా... కార్డ్ బ్లడ్ స్టెమ్‌సెల్ బ్యాంక్స్ ఇప్పటికే ఏర్పడ్డాయి. భారతదేశంలో కూడా ఇప్పటికే పెద్ద నగరాల్లో ఇవి వెలిశాయి. ఎందరో రోగులకు ఇది వరం అయ్యింది. కానీ, కేవలం ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే చూసుకోకుండా, నాణ్యతను పరిగణనలోకి తీసుకుని, ప్రైవేట్ కార్డ్ బ్లడ్ బ్యాంకులు ఏర్పడాలి. పబ్లిక్ కార్డ్ బ్యాంకులు కూడా రావాలి. దీనికోసం సమగ్రమైన చట్టాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది.

బీఎంటీ ఉపయోగపడే జబ్బులు ఏవి?

ఆటోలాగస్ స్టెమ్ సెల్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ లేక బీఎంటీ అనే చికిత్సను మామూలుగా మల్టిపుల్ మైలోమా, మళ్లీ మళ్లీ వచ్చిన లింఫోమా (రిలాప్స్‌డ్ లింఫోమా), టెస్టిక్యులార్ జెర్మ్‌సెల్ క్యాన్సర్లు, న్యూరోబ్లాస్టోమా తదితర క్యాన్సర్లలో చేసి, పూర్తిగా నయం అయ్యేలా చూడవచ్చు. అల్లోజెనిక్ బీఎంటీ అనే ప్రక్రియ ద్వారా అక్యూట్ ల్యుకేమియా, అప్లాస్టిక్ అనీమియా, మైలోడిప్లేసియా, థలసీమియా, సికిల్‌సెల్ అనీమియా వంటి వ్యాధులను పూర్తిగా నయం చేయవచ్చు. క్యాన్సర్‌లతో గానీ, రక్తంతో గాని సంబంధం లేని కొన్ని వ్యాధులైన... కంబైన్డ్ ఇమ్యునో డెఫీషియెన్సీ సిండ్రోమ్, గౌషర్స్ డిసీజ్ వంటివి కూడా ఈ ప్రక్రియ ద్వారా నయం చేయవచ్చు.

దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్...
బీఎంటీ చేయడం కానీ, చేయించుకోవడం గాని అంత సులభం కాదు. దీని నుంచి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ముందు 3-4 వారాలలో పెద్ద ఇన్ఫెక్షన్స్ కానీ, ఇతరత్రా జబ్బులుగా కానీ సోకి అవి రోగికి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఇది బీఎంటీ వల్ల ఎదుర్కోవాల్సిన తొలి సవాలు. ఇందులో ప్రాణాపాయానికి అవకాశాలు చాలా ఎక్కువ. ఈ సవాలును ఎదుర్కొనే క్రమంలో రోగులను ప్రత్యేకంగా రూపొందించిన యూనిట్లలో ఉంచి, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అల్లోజెనిక్ ట్రాన్స్‌ప్లాంట్ జరిగినట్లయితే, ఇచ్చిన స్టెమ్‌సెల్స్ రోగివి కావు కాబట్టి, వాటి వల్ల రియాక్షన్ వచ్చి జీవీహెచ్‌డీ అనే జబ్బు రావచ్చు. వింతవింత రకాల ఇన్ఫెక్షన్స్, అరుదైన సమస్యలు ఎన్నో వచ్చే అవకాశం ఉంది. దీనికి బాగా తర్ఫీదు పొందిన డాక్టర్లు, నర్స్‌లు, ప్రత్యేకమైన ఇతర సిబ్బంది చాలా అవసరం. అన్ని సౌకర్యాలూ ఉండి, ప్రత్యేకంగా నిర్మితమైన బీఎంటీ యూనిట్స్, దానికి తోడు మల్టీ స్పెషాలిటీ సపోర్ట్ కూడా ఎంతో అవసరం. అనుభవం ఉన్నచోట ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చేయడంతో, ఎందరో రోగులు కోలుకుని మామూలు మనుషులు అవుతున్నారు. సుమారు 3-6 వారాలలో రోగి ఇంటికి వెళ్లవచ్చు. 6-12 నెలల్లో మామూలు మనుషులుగా అన్ని పనులూ చేసుకుంటూ ఉండవచ్చు.

ఖర్చు...

ఆటోలాగస్ అయితే సుమారు 5 నుంచి 15 లక్షల రూపాయలు, అల్లోజెనిక్ అయితే సుమారు 15 నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉంది. మన దేశంలో ఇది పెద్ద మొత్తం అనిపించవచ్చు కానీ, పాశ్చాత్య దేశాల్లో అయ్యే ఖర్చు సుమారు 75 లక్షల రూపాయల నుంచి రెండు కోట్ల వరకూ ఉంటుంది.

చివరగా... మళ్లీ మొదటికి

ఇప్పుడు చివరగా మనం మొదట తెలుసుకున్న సంతోష్ పరిస్థితి ఏమిటో కూడా కాస్త చూద్దాం. మొదట సంతోష్‌కు కీమో జరిగింది. ఆ తర్వాత సంతోష్‌కు తగిన (హెచ్‌ఎల్‌ఏ మ్యాచ్‌కు అర్హమయ్యే) మూలకణాలు దొరుకుతాయేమోనంటూ అతడి సోదరుడికి పరీక్షలు నిర్వహించారు. అవి మ్యాచ్ కావడంతో కీమో తర్వాత సంతోష్‌కు అల్లోజెనిక్ బీఎంటీ నిర్వహించారు. ఆ తర్వాత బీఎంటీ ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో అంత తీవ్రమైన జబ్బు నుంచి సంతోష్‌కు విముక్తి కలిగింది. ఇప్పుడు సంతోష్ పూర్తిగా ఆరోగ్యవంతుడైన సాధారణ వ్యక్తి. ప్రస్తుతం బిడ్డను పొందే ప్రయత్నంలో ఉన్నాడు.


కార్డ్ బ్లడ్ బ్యాంక్స్...

ప్రస్తుతం మూలకణాల ప్రాధాన్యాన్ని గుర్తించడం ప్రారంభం కావడంతో తల్లి బొడ్డు తాడును నిల్వ చేసి, దాని నుంచి మూలకణాలను వేరుచేసి, వాటిని జాగ్రత్తగా దాచి భవిష్యత్తులో బిడ్డకు ఏవైనా ప్రాణాంతకమైన జబ్బు వచ్చినా లేదా మూలకణాల చికిత్స అవసరమైనా వాటిని వాడేందుకు ఉద్దేశించినవి ప్రైవేటు బ్యాంకులే. అలా అవి కేవలం ఆ బిడ్డకు మహా అయితే ఆ కుటుంబానికి మాత్రమే ఉపయోగపడగలిగే బాధ్యతలను నిర్వహించేందుకు పరిమితమవుతున్నాయి.


అయితే భవిష్యత్తులో ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా అందరికీ మూలకణాలు అందేలా విస్తృతంగా అవగాహన పెంపొందేలా కాబోయే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉందిప్పుడు. ఇలా విస్తృతమైన ప్రయోజనాలు నెరవేర్చేందుకు ఉద్దేశించిన మూలకణాల బ్యాంక్ భారత్‌లో ఒక్కటి మాత్రమే ఉందంటే... భవిష్యత్తులో క్వాలిఫైడ్ డాక్టర్లు కౌన్సెలింగ్ చేసి, ఇలాంటి బ్యాంకులు మరిన్ని రూపొందడానికి ఎంత కృషి జరగాల్సి ఉందో ఊహించవచ్చు.

- నిర్వహణ: యాసీన్
 

No comments: