all

Thursday, March 21, 2013

రోజూ క్లెన్సింగ్ మిల్క్ వాడచ్చా?

 

గుడ్ లుకింగ్


నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని. పనిలో అలసట, బయట దుమ్ముధూళి మూలంగా ముఖం తాజాదనం కోల్పోయినట్టుగా ఉంటుంది. ‘రోజూ పడుకునేముందు క్లెన్సింగ్ మిల్క్ ఉపయోగించి, ఆ త ర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మంచిదని, ముఖచర్మం చాలా బాగా శుభ్రపడుతుంద’ని నా స్నేహితురాలు చెబుతోంది. దీనివల్ల ముఖం మరీ డ్రై అవుతుందేమోనని నా భయం. అసలు క్లెన్సింగ్ మిల్క్‌ను ఎందుకు ఉపయోగించాలి? ఏయే సందర్భాలలో ఉపయోగించాలో చెప్పగలరు.
- శార్వరి, ఈమెయిల్


క్లెన్సింగ్‌మిల్క్ చర్మంలోని పోర్స్ వరకు వెళ్లి మలినాలను తొలగించి, శుభ్రం చేస్తుంది. దీనిని రోజూ వాడితే చర్మంలోని సహజసిద్ధమైన ఆయిల్స్ పోయి పొడిగా తయారవుతుంది. పొడిగా మారిన చర్మం త్వరగా ముడతలు పడుతుంది. దీంతో త్వరగా వయసు పైబడినట్టుగా కనిపిస్తారు. అందుకని ఎప్పుడు పడితే అప్పుడు క్లెన్సింగ్‌మిల్క్ వాడకూడదు. చర్మతత్త్వాన్ని బట్టి పదిహేను, నెలరోజులకు ఒకసారి ఉపయోగించడం మేలు.

ముఖానికి టొమాటో, బొప్పాయి, ఆరెంజ్.. వంటి పండ్లతో మసాజ్ చేసుకోవచ్చని, ఫేస్‌ప్యాక్‌లు వాడొచ్చని చెబుతుంటారు. కాని వీటివల్ల స్కిన్ డామేజ్ అవుతుందని, నాణ్యమైన బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలని బ్యూటీపార్లర్ వారు అంటున్నారు. ఏది నిజం?
- సౌమ్య, వనస్థలిపురం


మీ సౌందర్యనిపుణులు చెప్పింది నిజమే. మన చర్మతత్త్వం ఎలాంటిదో తెలుసుకోకుండా రకరకాల పండ్లను మసాజ్‌లకు వాడితే చర్మం దెబ్బతినవచ్చు. పైగా ఆ పండ్లలోని రకరకాల ఆమ్లాలకు మన చర్మం ఎలా ప్రభావితం అవుతుందో కూడా తెలియదు. ఆ పండ్లలో ఉండే ఆమ్లాలు చర్మాన్ని దెబ్బతీయవచ్చు. ఉదాహరణకు చాలామంది పసుపు రాసుకుంటారు. కాని కొందరికి ఆ పసుపులోని గుణాలుపడక మొటిమ లు రావచ్చు. అంటే ఎవరి చర్మతత్త్వానికి తగ్గట్టుగా వారు ఆ ఉత్పత్తులను వాడితేనే సరైన ఫలితాలు లభిస్తాయి. మసాజ్ విషయానికి వస్తే నిపుణులు చేసే మసాజ్‌లో స్ట్రోక్స్ చర్మానికి తగ్గట్టుగా ఉంటాయి. అక్కడ వాడే నాణ్యమైన ఉత్పత్తులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తాజా పండ్లు తినడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్యం చర్మకాంతిని పెంచుతుంది. అందుకని పండ్లను మసాజ్‌లకు కాకుండా తినడానికి ఉపయోగించడం మంచిది. అంతగా అయితే కొన్నిరకాల పండ్లను మాత్రం ఆ చర్మతత్వానికి తగ్గట్టు ఫేస్ ప్యాక్ మాత్రమే వేసుకోవాలి. మసాజ్‌లు చేసుకోకూడదు.

నా వయసు 15. నా జుట్టు చాలా డల్‌గా ఉంటోంది. అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు కూడా వచ్చాయి. చుండ్రు సమస్య కూడా ఉంది. ఈ సమస్య వల్ల నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చాలా ఇబ్బందిపడుతున్నాను.
- అభినవ్, ఈమెయిల్


చుండ్రు వల్ల ముఖంపైన, వీపు భాగంలో మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువ. బ్యాక్టీరియా కూడా ఎక్కువ చేరుతుంది. అందుకని మీ జుట్టుకు సరిపడా మంచి నాణ్యమైన షాంపూను తలస్నానానికి వాడాలి. డల్‌గా ఉంది కదా అని నూనె రాస్తే చుండ్రు సమస్య మరీ పెరుగుతుంది. ముందుగా డెర్మటాలజిస్ట్ దగ్గరకు వెళ్లి మీ చర్మతత్త్వాన్ని పరిశీలించుకోండి. తర్వాత హెయిర్‌స్టైలిస్ట్ దగ్గరకు వెళ్లి వారు చెప్పిన సూచనలు పాటించండి.
 

No comments: