all

Sunday, March 24, 2013

దెబ్బకు దెబ్బ... kids story

 



ఆదిత్యపురి రాజ్యాన్ని ఆర్యదేవుడు, అమరేంద్రపురి రాజ్యాన్ని ఆనందదేవుడు పరిపాలిస్తుండేవారు. ఇవి రెండూ ఇరుగుపొరుగు రాజ్యాలు. ఆదిత్యపురి రాజ్యం పెద్దది. అమరేంద్రపురి రాజ్యం చిన్నది.

రెండు రాజ్యాల మధ్య ఒక నది, నది మీద వంతెన ఉండేవి. రెండు రాజ్యాల మధ్య రాకపోకలతో వంతెన కొంతకాలానికి కూలిపోవడానికి సిద్ధమైంది.

‘‘వంతెన బాగుచేయించడం ఇరు రాజ్యాల బాధ్యత. మీరు కొంత ఖర్చు భరించాలి ’’ అని ఆనందదేవుడు ఆర్యదేవుడికి వర్తమానం పంపాడు.

ఇందుకు ఆర్యదేవుడు తిరస్కరించి ‘‘మీ రాజ్యం నుండి వ్యాపారం కోసం మా రాజ్యానికి వస్తున్నారు. మేము అటువైపు రావడం లేదు. కాబట్టి ఖర్చు మీరే భరించండి’’ అని ప్రత్యుత్తరం పంపించాడు.

తమది చిన్న రాజ్యం కాబట్టి తాము అంత ఖర్చు భరించలేమని ప్రాధేయపడ్డా ఫలితం లేకపోవడంతో ఆనందదేవుడికి ఏమి చేయాలో తోచక దీర్ఘాలోచనలో పడ్డాడు.వంతెన మీదుగా వెళ్లలేకపోవడంతో అమరేంద్రపురిలో వ్యాపారులు పలు ఇబ్బందులు పడ్డారు.ఆనందదేవునికి ఒక ఆలోచన వచ్చింది. చిన్న రాజ్యమే అయినా నది తమ వైపు నుంచి ఆదిత్యపురి వైపు పారుతోంది.

ఇటువైపు నీరు అటు వైపు వెళ్లకుండా అడ్డుకట్ట వేయమని ఆనందదేవుడు ప్రజలను ఆదేశించాడు. దాంతో ఆదిత్యపురికి నీరు ఆగిపోయింది. రాజు సహా ప్రజలంతా నీళ్లు లేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది.

ఆర్యదేవునికి జ్ఞానోదయమైంది. తన ఖర్చుతోనే వంతెన పునర్నిర్మించాడు. ఇరు రాజ్యాల మధ్య సఖ్యత నెలకొంది.


నీతి: కలసి ఉంటే కలదు సుఖం.
 

No comments: