all

Sunday, March 24, 2013

వేసవి చిక్కులు వేయి చిట్కాలు............

 

వేసవి వచ్చేసింది. తనతోపాటు వడగాలులు, దాహం, నీరసం, అలసట... తీసుకొస్తుంది. వీటివల్ల చిరాకుతో మరింత నీరసం. రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు. ఆ ఎండలకు ఒకటే ఉక్కపోత. పగలు ఎక్కువ, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. ఇన్నిటి మధ్యన వేసవిలో మాత్రమే వచ్చే మధుర ఫలం మామిడి, చల్లని లేత కొబ్బరిలాంటి తాటిముంజలు, తీయని పుచ్చకాయలు, నోరూరించే ఐస్‌ఫ్రూటులు, ఐస్‌క్రీములు, లస్సీ, ఫలూదా, పుదీనా పానీ లాంటివి వుండనే వున్నాయి. వీటి సాయంతో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండు వేసవిని కూడా చల్లని వెన్నెలా ఆస్వాదించొచ్చు.
వేసవి వచ్చిందంటే చాలు! నోరు ఊరక పిడచకట్టుకుపోతుంటుంది. చల్లగా ఏదైనా తాగితే బాగుండనిపిస్తుంది. బయట కన్పించే శీతలపానీయాలు దాహాన్ని మరింత పెంచుతాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కొంచెం తెలివిగా ఆలోచించాలి. ఏది పడితే అది తాగేయకుండా ఏది ఆరోగ్యమో, ఏది అనారోగ్య హేతువో ఆలోచించాలి.
నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. పిల్లలకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్‌ నీళ్లు, నిమ్మరసం, ఎండు ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, సగ్గుబియ్యం కాచిన నీరు, గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, ఓ స్పూన్‌ పంచదార కలిపి ఒ.ఆర్‌.ఎస్‌ ద్రావణంలా కలిపి ఇస్తే మంచిది. వీటికి తోడు తాజా పండ్లు, పుచ్చముక్కలు, చెరుకు రసం ఉండనే ఉన్నాయి.


నోరూరిస్తూ ఆకర్షించే కూల్‌డ్రింకులు తాత్కాలికంగా దాహాన్ని తీరుస్తాయి తప్పితే మరెందుకూ ఉపయోగపడవు. తాగిన కొద్ది సేపటికే మళ్లీ దాహం వేస్తుంది. వాటికి బదులు తాజా పండ్లు, పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ, నిమ్మకాయ రసం లాంటివి ఆరోగ్యానికి మంచిది. పుచ్చకాయ, కర్బూజా, బొప్పాయి ముక్కలు తింటే కడుపు నిండుతుంది. దాహార్తిని అరికట్టువచ్చు. రాగి-బార్లీ జావ ఆరోగ్యానికి ఎంతో మంచిది. చేయడం కూడా తేలిక. అందులో పంచదార కానీ, తీపి ఇష్టం లేనివాళ్లు మజ్జిగ, ఉప్పు కలుపుకుని గానీ తాగితే చలువ చేస్తుంది. సగ్గుబియ్యం జావ కూడా శరీర వేడిని తగ్గిస్తుంది. ఈకాలంలో జంక్‌ఫుడ్‌, మసాలాలు, స్వీట్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువ తినకపోవడమే మంచిది.
కాఫీ, టీ వంటి వేడిగా ఉండే ద్రవాలను తీసుకోవడం వల్ల బయటి వాతావరణ వేడికి తోడు వీటి వేడి వల్ల మరింత చెమట పట్టి చిరాకు తెప్పిస్తాయి. అందువల్ల వీటికి దూరంగా ఉంటేనే మంచింది. వాటికి బదులుగా చల్లటి లస్సీ, నిమ్మరసం తీసుకుంటే ఆరోగ్యం కూడా. వేసవిలో అందరూ ఇష్టంగా తాగే పానీయం నిమ్మరసం. పల్చగా చేసిన మజ్జిగలో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, పంచదార కలుపుకుని తాగితే వేసవిలో ఉండే అధిక దాహార్తి తగ్గి శరీరానికి కావలసిన లవణాలు లభిస్తాయి. అందులోనే అల్లం, పచ్చిమిర్చి ముద్ద కూడా కొద్దిగా వేసుకుంటే మజ్జిగ మరింత రుచిగా వుంటాయి.


వేసవిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పిల్లల గురించి. స్కూళ్లకు సెలవులు కావడంతో వీరిని వడదెబ్బ బారిన పడకుండా రక్షించుకోవడం చాలా ముఖ్యం. కష్టం కూడా. ఎండాకాలంలో దుమ్ము, ధూళి, కాలుష్యం వంటి అనారోగ్య పరిసరాలు పిలలకి ఎక్కువ హాని కలిగిస్తాయి. వేసవిలో నిర్ణీత ఆహార నియమాలు పాటించాలి. చాక్లెట్లు, స్వీట్ల వంటి తీపి పదార్థాలు తింటున్నప్పుడు బాగానే ఉంటాయి కానీ అతిగా దాహం వేస్తుంది. ఆకలి మందగిస్తుంది. దాంతో నీళ్లతోనే కడుపు నింపుకుంటారు. అందులోనూ పిల్లలు మరీ చల్లటి నీళ్లు తాగుతుంటారు. ఇది పళ్లకు హానిచేస్తుంది. పైగా అంత చల్లటి నీళ్లు రుచిని కోల్పోతాయి. కుండలోనీళ్లు రుచిగాను, చల్లగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మంచిది. స్టీలు బిందెకు మందపాటి టవల్‌ చుట్టి ఆరారా తడిపి చూడండి. ఆ నీళ్లు కూడా చల్లగా బావుంటాయి. ఎండు ఖర్జూరాలను రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే వాటిని నలిపి, ఆ నీళ్లలో పటిక బెల్లం వేసి చిన్నపిల్లలకు ఇస్తే చలువ చేస్తుంది.
చిన్నారులు...చిరు వ్యాపకాలు...
పిల్లలను ఎండలో తిరగకుండా నీడపట్టున ఉంచడం పెద్ద ప్రహసనమే అవుతుంది. సెలవుల్లో వాళ్లకు ఏదో ఒక వ్యాపకం ఉండాలి. ఖాళీగా ఇంట్లో ఉన్నారంటే టీవీ చూస్తూనే ఉంటారు. అది అంత మంచిది కాదు. అందుకని వాళ్లకి ఇష్టమైన పనినే హాబీగా అలవాటు చేస్తే మంచి కాలక్షేపం. వాటిలో బొమ్మలు వేయడం, సంగీత సాధన, కథల పుస్తకాలు చదవడం, ఫొటోలు తీయడం లాంటివి ఎన్నో. వీటికి తోడు సమ్మర్‌ క్యాంపులు కూడా ఉన్నాయి. ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు చెప్పి చేయిస్తుంటే వారికీ ఇంటి పనుల బాధ్యత తెలుస్తుంది. సాయంత్రం చల్లబడ్డ తర్వాతే బయటికి ఆడుకోవడానికి పంపించాలి. లేదంటే ఎండదెబ్బకి పిల్లలు తోటకూర కాడల్లా వాలిపోతారు. వేసవిలో పిల్లలు అమితంగా ఇష్టపడేది నీళ్లలో ఆడడం. చల్లగా ఉంటుందని ఎక్కువ సేపు నీళ్లలో ఉండడానికి ఇష్టపడతారు. మధ్యాహ్న సమయంలో అస్సలు నీళ్ల దగ్గరికి వెళ్లనివ్వకూడదు. ఉదయం, సాయంకాలాలు మాత్రమే స్విమ్మింగ్‌ కి అనుమతివ్వాలి. లేదంటే నీళ్లలో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది కానీ తర్వాత వాతావరణ వేడికి వడదెబ్బ బారినపడే ప్రమాదముంది.
పిల్లలెప్పుడూ మనతోటే ఉంటారు. వాళ్లమీద ప్రేమకొద్దీ ఏది కావాలంటే అది కొనిస్తుంటాం. నిముషాల్లో అమర్చిపెడుతుంటాం. వాళ్లకిష్టంలేనివి జరిగాయంటే భరించలేరు. అలాంటప్పుడు నలుగురితో సర్దుకుపోవడమెలాగో పిల్లలకి ఎలా తెలుస్తుంది? అందుకే కొన్ని రోజులు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల దగ్గరికి పంపించడానికి వేసవి సెలవులు మంచి సమయం. ఏదో ఒక పండుగకు అందరం వెళ్తుంటాం. కానీ అప్పుడు హడావుడిగా ఓ రెండు మూడ్రోజులే ఉంటాం. కానీ ఇప్పుడలా కాదు. వాళ్లకి సమయం ఎక్కువగా ఉండేది వేసవిలోనే. ఓ పది రోజులు పెద్ద వాళ్ల దగ్గర ఉంచితే పిల్లలకు పెద్దలకు మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. అందరితో కలివిడిగా ఉండడమెలాగో తెలుస్తుంది.
రాత్రి వెన్నెల్లో నాలుగు స్థంభాలాట ఆడుతూ అమ్మమ్మో, నానమ్మో భోజనానికి పిలుస్తున్నా పట్టించుకోకుండా ఆటల్లో మునిగిపోవడం, రాత్రిపూట డాబామీద వరుసగా చాపలేసుకుని (వీలయితే రాత్రి భోజనం కూడా అక్కడే) ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ, వాటిని లెక్కపెట్టే ప్రయత్నం చేస్తూ... పెద్దవాళ్లు చెప్పే రాజుల కథలు వింటూ నిద్రలోకి జారుకోవడం... ఇవన్నీ కాదంటే... సంవత్సరాంత పరీక్షలు అయిపోగానే పిల్లలకు వేసవి శిక్షణా తరగతులు మొదలవుతుంటాయి. 45 రోజులు నుంచి రెండు నెలల వరకు ఇవి జరుగుతుంటాయి. ఎక్కువ సమయం కాకపోయినా రోజులో గంటో రెండు గంటలో ఉంటుంటాయి. స్కూలుకు వెళ్లే రోజుల్లో నేర్చుకోడానికి వీలవనివి సమ్మర్‌ స్పెషల్‌ క్లాసుల్లో నేర్చుకోవచ్చు. సంగీతం, నాట్యం, ఏదైనా వాయిద్య పరికరాలు, కరాటే, స్విమ్మింగ్‌, డ్రాయింగ్‌, పెయింటింగ్‌ వంటివి నేర్చుకోడానికి మంచి అవకాశం లభిస్తుంది.



విహారాల వేళ
మన దేశంలో ఎన్నో చూడచక్కని ప్రదేశాలున్నాయి. అభిరుచి, సమయ పాలన, ఆర్థిక స్ధోమతకు తగ్గట్టు దగ్గర్లోనో, దూరంగానో ఏదో ఒక ప్రదేశానికి ప్రయాణమవుతాం. కొత్త ప్రదేశానికి వెళ్తున్నామంటే అక్కడి ప్రకృతి అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదించడమొక్కటే కాదు. అందుకు తగిన జాగ్రత్తలు కూడా అవసరం. అదీ వేసవి కాలంలో అంటే మరీ జాగ్రత్తగా ఉండాలి. వెళ్లేది వేసవిలో కాబట్టి అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి. పైగా కొత్త ప్రదేశాలు కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా ముఖ్యం. మంచినీళ్లు, ఆహారం విషయంలో అప్రమత్తత అవసరం. కొత్త ప్రదేశంలో లభించే వంటకాలను రుచి చూడడం వరకే సరిపెట్టాలి. రుచిగా ఉన్నాయి కదాని ఎక్కువ తిన్నా తర్వాత ఇబ్బందులు పడాల్సొస్తుంది. అవసరమైన మందులు దగ్గర పెట్టుకోవాలి. వయసులో పెద్దవాళ్లుంటే వాళ్లకు అవసరమైన మందులూ, ఇతర జాగ్రత్తలు తప్పనిసరి.
కాటన్‌ బట్టలకే పెద్ద పీట
వేసవి అంటే చాలు మనసు చల్లగా ఉండే కాటన్‌ దుస్తులమీదకి పోతుంది. నిన్న మొన్నటి వరకు హాయిగా అనిపించిన సిల్కు, షిఫాన్‌ దుస్తులు ఒక్కసారిగా చిరాకు తెప్పిస్తాయి. చల్లగా, మెత్తగా, హాయిగా ఉండే కాటన్‌ దుస్తులు సౌకర్యంగా ఉంటాయి. కాటన్‌లోనూ మంగళగిరి, కంచి, వెంకటగిరి, ఉప్పాడ, చీరాల గద్వాల్‌, కోటా... ఇలా బోలెడు రకాలున్నాయి. ఫ్యాషన్‌ ప్రియులకు కూడా కాటన్‌లో ఎన్నో రకాలున్నాయి. ఇంతకముందులా కాకుండా ఎన్నో డిజైన్లు, ప్రింట్లు. చూడ్డానికి సిల్కు వాటిలా ఉన్నా బోలెడు వెరైటీలు. పిల్లలు, పెద్దలు, ఆడ మగా తేడా లేకుండా అందరికీ నచ్చే, అందరూ మెచ్చేలా తయారవుతున్నాయి. కాటన్‌లో ఎన్ని రంగులు, డిజైన్లు వచ్చినా లేత రంగులకున్న ప్రాధాన్యత ముదురు రంగులకు ఉండదు. కాస్త శ్రద్ధ పెట్టామంటే చాలా రోజులు మన్నుతాయి కూడా. ఉద్యోగులైతే... ఒక్కసారి గంజిపెట్టి ఇస్త్రీ చేయిస్తే నాలుగైదు సార్లు ధరించొచ్చు. ఎప్పటికీ కొత్తవాటిలాగే కనిపిస్తాయి.
వేసవి ఫలాలు...
వేసవిలో మాత్రమే ఎక్కువగా దొరికే పండ్లు మామిడి, పుచ్చ. పండ్లలో రారాజు మామిడి. వేసవిలో ఎక్కువగా వచ్చేవి ఈ పండ్లే. కంటికి ఆకర్షణీయంగా కనిపించడమే కాదు, రుచిలోకూడా దీనికి సాటి మరోటిలేదు. పండ్లుగా తినడమేకాదు, ఎన్నో రుచికరమైన పదార్థాలు కూడా చేసుకోవచ్చు. మామిడి పండ్ల గుజ్జుతో ఐస్‌క్రీములు, కేకులు, ఫ్రూట్‌ సలాడ్‌... ఇలా ఒకటేమిటి. ఎన్నో రకాలు. వీటికి తోడు మామిడికాయతో చేసే పచ్చళ్లు మరెన్నో. మాగాయ, ఆవకాయ, ముక్కల పచ్చడి... ఇలా బోలెడు రకాలు. అందులోనూ పచ్చడి కలిపిన బేసిన్‌లోనే కాస్త అన్నం కలిపితే నాకో ముద్దంటే నాకో ముద్దంటూ ఇంట్లో అందరూ పోటీపడి తినడం భలేగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, కాస్త నెయ్యి, కొత్త ఆవకాయ ముక్క కలుపుకుని తింటే ఆ రుచి ఎప్పటికీ మర్చిపోలేం. వేసవి ఆరంభంలోనే పండుమిరపకాయ, టమాటా , ఉసిరి పచ్చళ్లు పెట్టకోవడం మొదలవుతుంది.



పైకి ముదురాకుపచ్చలో, చారలు చారలుగా కనిపించినా కోయగానే ఆకట్టుకునే ఎరుపు రంగుతో తియ్యగా నోరూరిస్తుంది పుచ్చకాయ. ఎంతటి మండుటెండలోనైనా సరే పుచ్చకాయ ముక్కలు నాలుగు తింటే కడుపులో చల్లగా, హాయిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. శరీరానికి కావలసిన పోషకపదార్థాలను అందిస్తుంది. గుండె పనితీరు, రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు డయాబెటిస్‌తో బాధ పడేవారికి మేలు చేస్తుంది. మరో విషయం... చర్మ సంరక్షణకి దీని గుజ్జు భలేగా పనిచేస్తుంది. ఇందులోని గింజలు కూడా ఉపయోగపడేవే. వీటిని వేయించి స్నాక్స్‌లా తింటారు. అంతే కాక... పొద్దు తిరుగుడు గింజలకులాగే వీటి గింజల్నుండి కూడా నూనె తీస్తారు. పుచ్చకాయలోని ఎర్రని పదార్థాన్ని తిన్న తర్వాత మిగిలిన దాన్ని పడేస్తాం. కానీ దేశాల వాళ్లు ఇందులోని తెల్లటి పదార్థాన్ని ముక్కలు కోసి నిల్వ పచ్చళ్లు కూడా పెడతారట. రుచిగా ఉండి దాహాన్ని తీర్చడమే కాకుండా, అనేక వ్యాధుల నివారణకీ ఉపయోగపడుతుంది.



తాటిముంజెలు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరిబోండాలు కాస్త రేటు ఎక్కువ అనిపించినా తర్వాత హాస్పటల్‌, మందుల ఖర్చుతో పోల్చుకుంటే వీటికి పెట్టే ఖర్చు తక్కువే. కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్‌ కలుపుకుని తాగితే వేసవి బడలిక, నీరసం చాలా త్వరగా తగ్గిపోతుంది.


వాతవరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా వుండడం వల్ల ఒంట్లోని నీరంతా త్వరగా ఆవిరయిపోతుంది. ఫలితంగా నీరసం, నిస్సత్తువ. అందుకే ఈ కాలంలో ఎక్కడికి వెళ్లాలన్నా నీళ్ల బాటిల్‌ వెంట ఉంచుకోవాలి. దాహం అయినప్పుడే తాగుదామని కాకుండా ఆరారా గొంతు తడుపుకుంటుండాలి. వీలును బట్టి పుచ్చకాయ ముక్కలు, మజ్జిగ, కొబ్బరిబోండాం, కీరాదోస ముక్కలు తీసుకుంటుండాలి. వీటి వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఎండాకాలం శీతలపానీయాల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. ఇవి తాగినప్పుడు దాహం తీరినట్లు అనిపిస్తుంది. డ్రింకుల్లో ఉండే పంచదార వల్ల తర్వాత కొద్ది సేపటికే మళ్లీ దాహం వేస్తుంది. వాటిలో ఆరోగ్యానికి ఉపయోగపడే పదార్థాలేవీ ఉండవు. పైగా వాటిలోని రసాయనాల వల్ల వచ్చే నష్టమే ఎక్కువ.
చర్మం కోసం...
చర్మం నల్లబడడం, దద్దుర్లు రావడం, చర్మం మృదుత్వం కోల్పోవడం లాంటివి సాధారణంగా ఎండాకాలంలో ఎదురయ్యే సమస్యలు. ఉదయం తొమ్మిది పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండలో తిరగకపోవడమే మంచిది. తప్పనిసరైతే గొడుగు వేసుకునో, స్కార్ఫ్‌ కట్టుకునో బయటికి వెళ్లాలి.
వేసవిలో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది చెమట. తద్వారా వచ్చే దుర్వాసన. అయితే ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పలేం కానీ కొంతమందిని తీవ్రంగా బాధించే విషయం. చెమట దుర్వాసననుండి తప్పించుకోవాలంటే కొన్ని చిట్కాలు వున్నాయి. రోజూ రెండుసార్లు సాన్నం చేయడం తప్పనిసరి. కొంతమందికి వేడి నీళ్లతో సాన్నం చేస్తేగానీ చేసినట్లు ఉండదు. మరీ వేడినీళ్లతో చేయడం వల్ల ఆవిరిగా ఉండి వెంటనే చెమటపడుతుంది. అలా కాకుండా చన్నీళ్లు, చల్లని నీళ్లతో చేయలేకపోతే గోరు వెచ్చటి నీళ్లతో చేయాలి. కాస్త పౌడర్‌ అద్దుకుంటే చమటని నివారిస్తుంది.


మరో సమస్య మొటిమలు. వీటికి కాలానితో పని లేకపోయినా వేసవి కాలంలో ఉక్కపోతకి చర్మం జిడ్డు పట్టినట్లయి మొటిమలు రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. వీటికోసం ఒక టీ స్పూన్‌ కొత్తిమీర రసం, ఒక స్పూన్‌ పుదీనా రసంలో చిటికెడు పసుపు కలిపి ముఖానికి పట్టిస్తే మొటిమలు రావు.


ఎండలో బయటికి వెళ్లాల్సొస్తే సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవాలి. వీలయినన్ని సార్లు ముఖాన్ని చల్లటి నీళ్లలో కడగాలి. అలాగని ప్రతి సారీ సబ్బు ఉపయోగించకూడదు. ఎక్కువసార్లు సబ్బు వాడడం వల్ల చర్మం పొడిబారుతుంది.
కళ్లకు రక్షణ తప్పనిసరి. కళ్లచుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఎండ వేడిమికి ఎక్కువసేపు ఉంటే కళ్లు తొందరగా అలసిపోతాయి. ఎక్కువ సేపు ఎండలో వుంటే కళ్లు మసకబారడం, చీకట్లు కమ్మినట్లవడం, కళ్లచుట్టూ నల్లటి వలయాలు ఏర్పడడం చూస్తుంటాం. ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే కళ్లకు నేరుగా ఎండ తగలకుండా చూసుకోవాలి. వీలయినంత వరకు గొడుగు ఉపయోగించడం, ముఖానికి ఎండ వేడిమి తగలకుండా స్కార్ఫ్‌ కట్టుకోవడం, టోపీలు పెట్టుకోవడం కూడా చేయొచ్చు. ఇప్పుడు మార్కెట్లోకి రకరకాల టోపీలు వస్తున్నాయి. ముద్దగా ఉండే తెల్ల నందివర్ధనం పువ్వు, బచ్చటి ఆకులు కళ్లమీద పెట్టుకోవడం వల్ల కళ్ల మంటలు తగ్గుతాయి. కీరదోసకాయను చక్రాల్లా కోసి కళ్లమీద పెట్టుకుంటే కళ్ల మంటలు తగ్గి కొంత ఉపశమనం కలుగుతుంది. కీరదోస కళ్లకే కాదు చర్మానికీ మంచిదే. కీరదోస గుజ్జును చర్మానికి రాసుకుంటే చర్మం మెరుపు వస్తుంది.
ఈ కాలంలో బయటికెళ్లేవారు ముఖ్యంగా బైకుల మీద వెళ్లేవారు చలువ కళ్లద్దాలు పెట్టుకోవడం మర్చిపోకూడదు. అలాగే సూర్యకిరణాలు నేరుగా చర్మం మీద పడకుండా చేతులకు గ్లౌజులు వేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్లకు సాక్సులు, బూట్లు వేసుకోవడం వల్ల గాలి తగలక చెమటపట్టి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. అందుకే వేసవి కాలం వరకు వాటికి వీలయినంత దూరంగా ఉండి చెప్పులు వేసుకోవడమే శ్రేయస్కరం.
వేసవిలోనూ వ్యాయామం
వేసవిలో ఎండలకు అలసటగా, బద్దకంగా ఉంటుంది. అయినా శరీరానికి తగినంత వ్యాయామం అవసరం. రోజులో కనీసం అరగంట వ్యాయామానికి కేటాయిస్తే మంచిది. అధిక శ్రమతో కూడిన వ్యాయామాలు అవసరం లేదు. శరీరానికి కొద్దిగా చెమట పట్టేలా వేగంగా నడకయినా సరే. ఉదయమో, సాయంత్రమో ఎండ లేనప్పుడు కొద్ది సమయాన్ని కేటాయిస్తే చాలు. జాగింగ్‌, వాకింగ్‌, సైకిల్‌ తొక్కడం, స్కిప్పింగ్‌ వంటివి తేలికగా చేసుకోవచ్చు.
ఇలా చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు! వేసవి కాలం హాయిగా గడిచిపోతుంది.


హిమక్రీముల హవా!
ఎండాకాలం వస్తుందంటేనే చల్ల చల్లని ఐసులు, నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఐస్‌క్రీములు గుర్తొస్తాయి. ఒకప్పుడు వేసవి రావడం ఆలస్యం... సైకిల్‌ మీద ఐసు పెట్టెతో గంట కొట్టుకుంటూ వచ్చేవాడు ఐసులమ్మే అబ్బాయి. వీధిలోని పిల్లలంతా గ్లాసో, గిన్నో పట్టుకుని ఐస్‌ బండి చుట్టూ చేరిపోయేవారు. అప్పుడు పుల్లైస్‌, పాలైస్‌ మాత్రమే ఉండేవి. ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు రకరకాల ఐస్‌ఫ్రూట్లు, ఐస్‌క్రీములు అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో ఏన్నో రంగులు, మరెన్నో ఫ్లేవర్లతో నోరూరిస్తుంటాయి. స్ట్రాబెరీ, చాకొలెట్‌, ఆరంజ్‌, యాపిల్‌, పైనాపిల్‌, మామిడి, ద్రాక్షా, పుచ్చ... ఇలా ఒకటేమిటి! వంద రకాల రుచులు. వీటిలోనే పాలమీగడలాంటి కుల్ఫీది ప్రత్యేక స్థానం. వీటితో చిక్కులు కూడా వుంటాయి కనుక జాగ్రత్త పడుతుండాలి.
ఇది మల్లెల వేళయనీ...
వేసవిలోనే దొరికేవి మల్లెలు. తెల్లటి మల్లెపూలను చూస్తేనే మనసుకు హాయిగా ఉంటుంది. మంచి సువాసనలిస్తూ హాయిగొలుపుతాయి. ఇవి ఆరోగ్యానికి కూడా మంచిదే. చలువ చేస్తుంది. ఎండాకాలంలో అధిక వేడికి తరచూ తలనొప్పితో బాధపడేవారు చాలామంది ఉంటారు. ఈ పూలని పట్చటి క్లాత్‌లో చుట్టి మాడుకు కట్టుకుంటే తలనొప్పి తగ్గి మాడు చల్లగా ఉంటుంది. ఇక పూలజడలంటే ఇష్టపడని మగువలు ఉండనే వుండరు. ఇప్పటి పిల్లల్ని పూలు పెట్టుకోమంటే ఏదో కొత్త విషయాన్ని విన్నట్లుగా చూస్తుంటారు కానీ ఇంతకు ముందు ఆలా కాదు. మల్లెపూల సీజన్‌ వచ్చిందంటే చాలు... కనీసం ఒక్కసారైనా పూలజడ వేయించుకోవాల్సిందే. మల్లెపూలకు మధ్యలో కనకాంబరాలు, మరువం చేర్చి జడ కుడితే ఆ ఆందమే వేరు. ఆ జడల్లో కూడా ఒంకుల జడ, పుల్లలకు పూలను గుచ్చి కుట్టించుకునేది... ఇలా ఎన్ని రకాలో. ఈ సరదా పిల్లలకే కాదు కాస్త పెద్దవాళ్లు కూడా ముడి చుట్టుకునేవారు.


ఇల్లు చల్లగా...
వేసవి మొదలు కాకముందే ఎండలుమండిపోతున్నాయి. గాలి రాకపోకలకు కిటికీలెంత ప్రధానమైనవో తెలియంది కాదు. కూలర్లు, ఏసీలు ఉన్నా ప్రస్తుత కాలంలో కరెంటు కోతలే ఎక్కువ. ఎప్పుడు కరెంటు ఉంటుందో, ఎప్పుడు పోతుందో చెప్పడం కష్టం. అందుకే వాటి మీద ఆధారపడితే వేడిగాలికి, ఉక్కకు బెంబేలెత్తాల్సిందే. వేడిగాలిని నివారించాలంటే కిటికీలకు, గుమ్మాలకు వట్టివేళ్ల చాపలు కట్టి మధ్యమధ్యలో తడుపుతుంటే గదంతా చల్లగా ఉంటుంది. వట్టివేళ్లు మంచి వాసన కూడా వస్తాయి. వేడిని పెంచేవి ఎక్కువగా విద్యుత్‌ పరికరాలే. ఇంట్లో టీవీ, ఫ్రిజ్‌, వాషింగ్‌ మెషీన్లు వంటి వాటినుండి కూడా వేడి ఉత్పత్తవుతుంది. ఉదయం సాయంత్రం కొద్దిసేపు కిటికీ తలుపులు, గుమ్మం తలుపులు తీసి ఉంచాలి. పై కప్పు నుండి అధిక వేడిని నివారించే ధర్మాకోల్‌ షీట్లు, వేడిని నిరోధించే సున్నం వంటివి ఏర్పాటు చేసుకుంటే కొంత వరకు ఉపశమనం పొందొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది పచ్చదనం. మొక్కలను ఎక్కువగా పెంచితే చల్లటి స్వచ్ఛమైన గాలి. ఆరోగ్యకరమైన వాతావరణం ఎప్పటికీ మన సొంతమవుతాయి.

No comments: