పురాణ స్త్రీ - సులక్షణ
కాశీ నగరంలో ప్రియవ్రతుడు, శుభవ్రత దంపతులు ధార్మికబద్ధమైన జీవనాన్ని సాగిస్తుంటారు. పరమశివుణ్ణి కొలుస్తూ మంచికి మారుపేరుగా మసలుతుంటారు. వారిని ఒకానొక చింత పీడిస్తుంటుంది. అది సంతానరాహిత్యం. పిల్లల కోసం గుళ్లూ గోపురాలు తిరుగుతుంటారు. అలా చాలా ఏళ్లకు వారి కడుపు పండుతుంది. లేక లేక అమ్మాయి పుడుతుంది. అందాల చిన్నారికి సులక్షణ అని పేరుపెట్టుకుంటారు. అల్లారు ముద్దుగా పెంచుకొస్తుంటారు. అయితే ఈ సంతోషం వీరికి ఎక్కువ కాలం నిలవదు.
పాప జన్మకుండలిని గణన చేసిన జోస్యులు ఆమె సంసార బంధనాలకు దూరంగా భగవంతుని సేవలోనే కాలం గడుపుతుందని చెబుతారు. దీంతో ప్రియవ్రతుడు తల్లడిల్లిపోతాడు. వంశం వృద్ధిపొందని నాడు, దౌహిత్రులే లేని నాడు తమకు గతులు చెడిపోతాయని బావురుమంటాడు. ఆ బాధతోనే అనతికాలంలో మృత్యువుఒడికి చేరుతాడు. భర్తపోయిన దుఃఖంలో శుభవ్రత కూడా కొన్నాళ్లకే కాలం చేస్తుంది. జననీ జనకులు హఠాత్తుగా దూరం కావడంతో సులక్షణ జీవితం అతలాకుతలమైపోతుంది. యుక్తవయసులో ఉన్న తనకు దేవుడు వినా వేరెవరూ దిక్కు కాజాలరని తలపోస్తుంది. ఉత్తరార్కమనే ప్రదేశానికి వెళ్లి శంకరుని కోసంతపస్సు ప్రారంభిస్తుంది. అన్నపానాలు మాని తపమాచరిస్తున్న సులక్షణ చెంతకు ఒక మేషం వస్తుంటుంది. ధ్యానముద్రలో ఉన్న సులక్షణను కొంతసేపు తదేకంగా చూసి వెళ్లిపోతుంటుంది. ఇలా ప్రతీరోజూ ఈ మేక రావడం మామూలవుతుంది. సులక్షణ తపస్సు నానాటికీ ఉగ్రరూపం దాల్చడంతో శంకరుడు కటాక్షిస్తాడు. దర్శనమిస్తాడు. ఆమె కళ్లు తెరిచి నీలకంఠుని చూస్తుంది. ఆనంద పరవశురాలవుతుంది. భయభక్తులతో ప్రార్థనలు చేస్తుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న మేకపిల్ల కూడా ఆమె కళ్లల్లో పడుతుంది. రోజూ తన ముంగిటకు మేషం వస్తోందన్న సంగతిని దివ్యదృష్టితో గ్రహించగలుగుతుంది. సులక్షణ భక్తికి మెచ్చిన మహదేవుడు వరం కోరుకోమంటాడు. తనతో పాటుగా మేకను కూడా కరుణించాలని ఆమె విజ్ఞాపన చేస్తుంది. నోరులేని మేకకూ న్యాయం జరగాలనుకుంటున్న సులక్షణ హృదయాన్ని మెచ్చుకుంటాడు. తదుపరి జన్మలో కాశీరాజుకు కుమార్తెగా మేకపిల్ల రాచకన్యయై పుడుతుందని దీవిస్తాడు. ఆ వెంటనే పార్వతీపతి సులక్షణవైపు దృష్టి సారిస్తాడు. ఏం కావాలో చెప్పమంటాడు. ఆమె ధనకనకవస్తువాహనాలు కోరుకోదు. శాశ్వతంగా తనకు పార్వతీమాత సేవ చేసుకునే భాగ్యం కల్పిస్తే చాలంటుంది. పార్వతీదేవికి నిత్యమూ సేవలు చేసుకునేలా సులక్షణను అనుగ్రహిస్తాడు. ఆమె వెనువెంటనే కైలాసంలో పార్వతీదేవికి అనుంగు చెలికత్తెగా మారిపోతుంది. ఆ అమ్మకు సపర్యలు చేస్తూ మహదానందాన్ని పొందుతుంటుంది. శంకరసతి సైతం సులక్షణ తీరుకు మురిసిపోతుంది. ఆమె మాట పొందిక, ఆ వినయవిధేయతలకు ముచ్చటపడుతుంది. ప్రాణసఖిగా ఆమెను చూసుకుంటుంది. సులక్షణకు చిన్ననాటనే తల్లిదండ్రులు దూరమైపోతారు. ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. కాని, చలించిపోదు. దైవాన్ని నమ్ముకుంటుంది. కంటకప్రాయమైన తపస్సును కోరి మరీ చేపడుతుంది. శివుడు ప్రత్యక్షమయ్యాక తన పక్కనే ఉన్న మేకపిల్లనూ అనుగ్రహించమంటుంది. మనిషి ఎంతటి విశాలమైన హృదయంతో మనుగడ సాగించాలో తెలుసుకోవాలంటే సులక్షణ జీవితాన్ని అర్థం చేసుకోవాలి. ప్రాణికోటిని ప్రేమించే ఆమె తత్వాన్ని ఆకళింపు చేసుకుంటే కలియుగాన ఎన్నో సమస్యలు సునాయాసంగా తొలగిపోతాయి. ప్రాణులన్నింటి ఆత్మ ఒక్కటేనని మనసావాచా నమ్మిన సులక్షణ సమత మమతలకు ప్రతిరూపం. భక్తిసామ్రాజ్యంలో ఆమె ఇప్పటికీ వెలుగుహారతులు అందుకోవడానికి హేతువిదే. బర్కరము అంటే మేక. ఒకానొక మేకపిల్ల దైవ కృపకు పాత్రమైన ప్రదేశం గనుకనే ఉత్తరార్కమనే ప్రాంతానికి అనంతరకాలంలో బర్కరీ తీర్థమన్న పేరు స్థిరపడింది. - డా. చింతకింది శ్రీనివాసరావు |
No comments:
Post a Comment