all

Sunday, March 24, 2013

మెరిసే మురిపెం - ముత్యం


























 

ముత్యాలంటేనే మగువలకు ఓ మంచి ఫీలింగ్‌. ముత్యాల నునుపు, నిగారింపు మదిని ఇట్టే ఆకట్టుకుంటాయి. ధరిస్తే ఎక్మడ లేని అందాన్నీ తీసుకొచ్చి మనస్సును మురిపిస్తాయి. ముత్యాలు ధరించినప్పుడు వచ్చే అందమే వేరు!

హుందాతనం, సౌందర్యం మేళవించిన ముత్యాలు తమ వద్ద వుండాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. ఎన్నాళ్లు వాడినా వన్నె తగ్గనివి ముత్యాలు. ఉంగరం, గొలుసు, దిద్దులు, జుంకాలు, గాజులు... ఇలా ముత్యాలను ఎలాగైనా పొదగొచ్చు. స్వాతికార్తెలో వాన చినుకు ముత్యపు చిప్పలో పడినంతనే ముత్యం రూపు దాల్చుతుందంటారు. కవి హృదయాలు అలా సెలవిచ్చాయి కానీ, ఇసుక రేణువు ముత్యపు చిప్పలో చేరినా ముత్యం అవ్వాల్సిందే!




తనకు అడ్డొచ్చే రాయి, రప్పను తొలగించే క్రమంలో ముత్యపు చిప్ప అలా చేసినా మనకో విలువైన ముత్యాన్ని ఇస్తోంది. బ్రతుకు సార్థకత అంటే అదీ! ఒకరు కనిపెట్టిన మార్గాన్ని మానవులు ఇట్టే అల్లుకుపోతారు. కనుక ఈ ట్రిక్‌ను అనుసరించి ఆర్టిఫిషియల్‌ ముత్యాలు కోకొల్లలుగా తయారై మగువల మనస్సులను మురిపిస్తున్నాయి.
పలు రూపాల్లో మదిని ఆకట్టుకునే ముత్యాలు పదికాలాల పాటూ మన వద్ద అట్టేపెట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. మనం కొనుక్కున్న ఆభరణాలు, వస్త్రాలు ఏవైనా సరే సరైన రీతిలో వాడుకున్నప్పుడే కదా సరదా, సంతృప్తి!


ఒక మెత్తని వస్త్రంలో ముత్యాలను చుట్టి భద్రపరచాలి. అది కాటన్‌, సిల్క్‌ ఏదైనా కావచ్చు. మృదువుగా ఉండాలి. అంతేతప్ప, ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో ఉంచకూడదు. వేడిసోకే ప్రాంతాల్లో ముత్యాలను దాచకూడదు.
ముత్యాలను శుభ్రం చేయాలన్నా మెత్తని వస్త్రాన్నే ఉపయోగించాలి. బజార్లో దొరికే నగల క్లీనర్లను వాడకూడదు.
పూర్తిగా ముస్తాబైన తరువాతనే ముత్యాలను ధరించాలి. పెర్‌ఫ్యూమ్‌లు ముత్యాలపై స్ప్రే చేయకూడదు. రసాయనాలు ముత్యాల్లోని మెరుపును పోగొడతాయి.
ముత్యాలను గుచ్చిన సిల్క్‌ దారం సరిగ్గా ఉందో, లేదో రెండేళ్లకోసారి జ్యూయలరీ షాపులో చెక్‌ చేయించుకుంటే మంచిది.
ముత్యాల నగలను మిగతా నగలతో కలిపి ఉంచకూడదు. ఆ ఆభరణాలు ముత్యాలకు తగిలి, గీరుకుని గీతలు పడితే ముత్యాలు పాడవుతాయి. సున్నితంగా చూసుకుంటేనే ఇవి కలకాలం మన్నుతాయి.
ముత్యాలను ఎంపిక చేసుకునే సమయంలో పంటికి రాసుకుని చూస్తే అసలైనవి శబ్దం చేస్తాయి.
స్విమ్మింగ్‌ చేసే సమయంలో, నీళ్లలో తడిసే సమయంలో ముత్యాలను ఒంటి మీద ధరించకూడదు. ముత్యాలు సిల్క్‌ దారంతో గుచ్చుతారు. కనుక ఆ దారాలు పాడై హారం తెగిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది.




















No comments: