all

Thursday, July 11, 2013

ఏవి అసలు పురిటి నొప్పులు..? ఏవి కావు? (గైనిక్ కౌన్సెలింగ్)

 
     
 
నాకిప్పుడు తొమ్మిదో నెల. ఇటీవలే నొప్పులు వస్తుంటే మావాళ్లు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అవి పురిటి నొప్పులు కాదని, కేవలం వేడి నొప్పులేనని వెనక్కి పంపించారు. ఏవి పురిటి నొప్పులు, ఏవి కావు అని గుర్తించడం ఎలా?
- సుమతి, శేరిలింగంపల్లి


గర్భవతులకు నెలలు నిండాక గర్భసంచి కండరాల సంకోచ వ్యాకోచాల వల్ల నొప్పులు వస్తున్నట్లుగా అనిపిస్తాయి. ఆ మాటకొస్తే అసలు గర్భవతులు కానివాళ్లలో కూడా గర్భసంచికి సంకోచవ్యాకోచాలు కలుగుతూ ఉంటాయి. అయితే ప్రసవానికి చాలా రోజుల ముందు నుంచే గర్భసంచి కండరాల్లో సంకోచవ్యాకోచాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. వీటినే బ్రాక్స్‌టన్-హిక్స్ కంట్రాక్షన్స్ అంటారు. ఈ సంకోచవ్యాకోచాలన్నవి తొమ్మిది నెలలూ ఉండనే ఉంటాయి. కాకపోతే ఇవి వచ్చే వ్యవధి, ఫ్రీక్వెన్సీ పెరుగుతూ... నెలలు నిండాక అవే పురిటినొప్పులుగా రూపాంతరం చెందుతాయి. ఈ సంకోచవ్యాకోచాల సమయంలో పొట్ట కండరాలు బిగుసుకుని, ఆ తర్వాత మెత్తబడుతూ ఉంటాయి.

ఈ గర్భసంచి కండరాల్లోని సంకోచ-వ్యాకోచాల్లో ఏవి పురిటి నొప్పులో గుర్తించడానికి ఒక గుర్తు ఉంటుంది. ఈ సంకోచ సమయంలో పొట్ట కండరాలు గట్టిబడటంతో పాటు నొప్పి కూడా వస్తుంటుంది. ఈ నొప్పి నడుము వెనక భాగం నుంచి మొదలై క్రమంగా ముందు భాగంలో తొడల వరకు (సరిగ్గా చెప్పాలంటే ప్యూబిక్ బోన్ వరకు) వ్యాపిస్తుంది. పురిటి నొప్పులుగా వచ్చిన నొప్పులు ఒకసారి వచ్చాక అదేపనిగా ఆ నొప్పిగానే ఉండక... ఆ నొప్పులు వస్తూ, తగ్గుతూ ఉంటాయి.

ఈ పురిటినొప్పులు పూర్తి ప్రభావపూర్వకంగా ఉన్నప్పుడు గర్భసంచి ముఖద్వారం (అంటే సర్విక్స్) తెరచుకుంటూ ఉంటుంది. అంటే గర్భసంచి పైభాగం (ఫండస్) ముడుచుకుంటూ, ముఖద్వార (సర్విక్స్) భాగం తెరచుకుంటూ ఉండేవి నిజమైన పురిటినొప్పులన్నమాట. నిజమైన పురిటినొప్పుల్లో 10 నిమిషాల వ్యవధిలో మూడు సార్లు కండరాల సంకోచాలు వచ్చి... ఒక్కో సంకోచ సమయం కనీసం 45 సెకెన్ల పాటు కొనసాగుతూ ఉండి, ఆ టైమ్‌లో గర్భాశయ ముఖద్వారం తెరచుకుంటూ ఉంటే అది నిజమైన ప్రసవ సమయం (ట్రూ లేబర్) అని చెప్పవచ్చు.

ఇక గర్భవతి నొప్పులతో డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్లాలంటూ చాలామంది అడుగుతుంటారు. మీరు భరించలేనంత నొప్పులు వస్తూ ఉన్నప్పుడుగాని; ఇలా పురిటినొప్పులువస్తూ ఉన్న సమయంలో రక్తస్రావం కనపడుతున్నా గాని; ఉమ్మనీరు మీ నియంత్రణలో లేకుండా పడిపోతున్నాగాని; లేదా నొప్పిలేనప్పుడు కడుపులో బిడ్డ తిరిగినట్లు అనిపించకపోయినా... ఈ నాలుగు సందర్భాల్లో తప్పనిసరిగా, అత్యవసరంగా డాక్టర్‌ను కలవాలి.

తొలిచూలు గర్భవతుల్లో చాలా మంది తమకు వచ్చే నిజమైన ప్రసూతి నొప్పులను గుర్తించకపోవడంతో ఇలా ఆసుపత్రికి వెళ్లి, తిరిగి రావడం మామూలే. కాబోయే తల్లి కంటే డాక్టర్లే పురిటినొప్పులను బాగా గుర్తించగలరు కాబట్టి వాళ్లు మిమ్మల్ని తిప్పిపంపినా ఈ విషయంలో మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు. నిజమైన నొప్పులను గుర్తించడం అన్నది ఆ సమయంలో తేలిగ్గానే జరుగుతుంది. అప్పుడు డాక్టర్లు మీకు తప్పనిసరిగా సహాయపడతారు.

No comments: