all

Thursday, July 11, 2013

పనీర్ .....పనీర్ ....పనీర్


చికెన్ సిక్స్‌టీ ఫైవ్ కావాలి... లోపల చికెన్ ఉండకూడదు!
మటన్ బాల్స్ కావాలి... లోపల మటన్ తగలకూడదు!
బేబీ కార్న్ కనిపించాలి... చుట్టూ జున్నులాంటిదుండాలి!
స్వీట్‌కార్న్ కనిపించాలి... స్మూత్‌గా పన్ను దిగుతుండాలి!
ఔర్ కుచ్?
టచింగ్‌గా రెండు ఉల్లిపాయలు... మనసు నచ్చింగ్‌గా... అల్లం వెల్లుల్లి గుబాళింపులు!
ఓహో... అలాగా!
అయితే... ఈ మంత్రం జపించండి.


పనీర్ 65


కావలసినవి
పనీర్ - 100 గ్రా. (ముక్కలుగా కట్ చేయాలి); మైదా - 20 గ్రా.; కార్న్‌ఫ్లోర్ - 20 గ్రా.; అల్లం పేస్ట్ - టీ స్పూను; కారం - టీ స్పూను; పసుపు - అర టీ స్పూను; గరంమసాలా - టీ స్పూను; నూనె - వేయించడానికి తగినంత; ఉల్లితరుగు - పావు కప్పు ఉప్పు - తగినంత, కొత్తిమీర - కొద్దిగా
తయారి:
స్టౌ మీద బాణలి ఉంచి అందులో నూనె వేసి కాగాక పనీర్ ముక్కలు, కార్న్‌ఫ్లోర్, మైదా, అల్లం పేస్ట్ వేసి కలపాలి

ఉప్పు, కారం, పసుపు, గరంమసాలా, కొద్దిగా నీరు వేసి బాగా వేయించాలి


చిన్నబాణలిలో కొద్దిగా నూనె వేసి స్టౌ మీద ఉంచి, కాగాక పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు ఉల్లితరుగు వేసి బాగా వేయించాలి.


తయారుచేసి ఉంచుకున్న పనీర్ 65ను వీటితో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

పనీర్ బాల్స్

కావలసినవి:
పనీర్ - 20 గ్రా. (తురమాలి); అల్లం పేస్ట్ - టీ స్పూను;
కొత్తిమీర - కొద్దిగా; కారం - టీ స్పూను; పసుపు - చిటికెడు;
గరంమసాలా - టీ స్పూను; మైదా - 10 గ్రా; కార్న్‌ఫ్లోర్ - 10 గ్రా;
ఉప్పు - తగినంత; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా.
తయారి:
పైన చెప్పిన పదార్థాలలో నూనె తప్పించి మిగిలిన పదార్థాలను ఒక గిన్నెలో వేసి బాగా కలిపి గుండ్రంగా బాల్స్‌గా చేసి ఒక ప్లేట్‌లో ఉంచాలి

స్టౌ మీద బాణలి ఉంచి నూనె పోసి కాగాక, వీటిని ఒక్కొక్కటిగా వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించి తీసి, పేపర్ ప్లేట్‌లో ఉంచాలి.


పచ్చిమిర్చి, ఉల్లిచక్రాలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

పనీర్ బేబీకార్న్

కావలసినవి:
పనీర్ - 50 గ్రా.; బేబీకార్న్ - 50 గ్రా.; పసుపు - తగినంత; కారం - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; నూనె - తగినంత; జీడిపప్పు పొడి - 20 గ్రా.; తర్బూజా గింజల పేస్ట్ - 20 గ్రా.; అజినమోటో - అర టీ స్పూన్; బటర్ - 10 గ్రా; అల్లం వెల్లుల్లి పేస్ట్ - 50 గ్రా; ఉల్లితరుగు - పావు కప్పు; టొమాటో తరుగు - పావు కప్పు; గరంమసాలా - టీ స్పూను; జీడిపప్పు - గార్నిషింగ్ కోసం.
తయారి:
పనీర్‌ను డైమండ్ ఆకారంలో కట్ చేయాలి

బేబీకార్న్‌ని గుండ్రంగా తరగాలి స్టౌ మీద బాణలి ఉంచి మూడు టీ స్పూన్ల నూనె వేసి కాచాలి ముందుగా తరిగి పెట్టుకున్న పనీర్, బేబీకార్న్ ముక్కలను వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి వేరే బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లితరుగు వేసి వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీని వేసి బాగా కలిపి 5 నిముషాలు ఉడికించాలి


గరంమసాలా, అజినమోటో, ఉప్పు వేసి కలపాలి జీడిపప్పు తురుము, తర్బూజాగింజల పేస్ట్, కొద్దిగా నీరు, కారం, పసుపు వేసి ఉడుకుతుండగా, ముందుగా వేయించి ఉంచుకున్న పనీర్ ముక్కలు, బేబీకార్న్‌ముక్కలు వేసి కలపాలి పనీర్ తురుముతో గార్నిష్ చేయాలి.

పనీర్ స్వీట్‌కార్న్ మటర్

కావలసినవి:
పనీర్ - 100 గ్రా;
స్వీట్‌కార్న్‌గింజలు - 50 గ్రా;
బఠాణీ - 50 గ్రా;
పచ్చిమిర్చి పేస్ట్ - 2 టీ స్పూన్లు;
ఉప్పు - తగినంత;
ఉల్లితరుగు - 50 గ్రా;
టొమాటో ప్యూరీ - 50 గ్రా;
పుదీనా - అర కప్పు;
జీడిపప్పు + తర్బూజా గింజల పేస్ట్ - రెండు టీ స్పూన్లు కొత్తిమీర - అర కప్పు పసుపు - కొద్దిగా
నూనె - తగినంత
తయారి:
స్టౌ మీద బాణలి ఉంచి, మూడు టీ స్పూన్ల నూనె పోసి కాగాక, గరంమసాలా, ఉల్లితరుగు వేసి వేయించాలి

అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక, టొమాటో ప్యూరీ వేసి నూనె పైకి తేలేంతవరకు వేయించాలి


పనీర్, స్వీట్‌కార్న్ గింజలు, బఠాణీ వేసి ఉడికించి, రోటీలతో వేడివేడిగా సర్వ్ చేయాలి.

పనీర్ దో ప్యాజా

కావలసినవి:
పనీర్ - 100 గ్రా; కారం: 2 టీ స్పూన్లు; పసుపు - చిటికెడు; ఉప్పు- తగినంత; జీడిపప్పు- 20గ్రా. (పొడి చేయాలి); తర్బూజా గింజల పేస్ట్- 20 గ్రా; అజినమోటో - అర టీ స్పూను; బటర్ - 10 గ్రా; అల్లంవెల్లుల్లి పేస్ట్ - 25 గ్రా; ఉల్లితరుగు - పావుకప్పు; టొమాటోలు - 4; గరంమసాలా - టీ స్పూను; నూనె - తగినంత.
గార్నిషింగ్ కోసం:
సన్నగా తరిగిన జీడిపప్పు - కొద్దిగా; కరివేపాకు - రెండురెమ్మలు; క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు; బెంగళూరు టొమాటో ముక్కలు - పావు కప్పు; ఉల్లిపాయలు - 2 (పొరలుగా తీయాలి) పైన చెప్పిన పదార్థాలను నూనెలో వేయించుకోవాలి.
తయారి:
ముందుగా పనీర్‌ను డైమండ్ ఆకారంలో కట్ చేయాలి

స్టౌ మీద బాణలి ఉంచి నూనె పోసి కాగాక పనీరు ముక్కలను వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించాలి


తరిగి పెట్టుకున్న ఉల్లిపాయముక్కలు, కరివేపాకు జతచేసి వేయించాలి


అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీని వేసి బాగా కలిపి 5 నిముషాలు ఉడికించాలి


గరంమసాలా పొడి, అజినమోటో, తగినంత ఉప్పు వేసి కలపాలి


జీడిపప్పు పొడి, తర్బూజాగింజల పేస్ట్, కొద్దిగా నీరు పోసి బాగా కలిపి, కొద్దిగా ఉడుకుతుండగా పసుపు, కారం వేసి కలపాలి


ముందుగా వేయించి ఉంచుకున్న పనీరు ముక్కలను ఈ మిశ్రమంలో వేసి కలపాలి


గార్నిషింగ్ కోసం వేయించి ఉంచుకున్న వాటితో అందంగా అలంకరించాలి.

పనీర్ అంగా

కావలసినవి:
పనీర్ - 100 గ్రా; కారం - 2 టీ స్పూన్లు; పసుపు - తగినంత; ఉప్పు - తగినంత; జీడిపప్పు పొడి - 10 గ్రా; తర్బూజాగింజలు - 10 గ్రా; అజినమోటో - అర టీ స్పూన్; బటర్ - 10 గ్రా; అల్లం వెల్లుల్లి పేస్ట్ - 100 గ్రా; ఉల్లిపాయలు - 2; టొమాటోలు - 4; గరంమసాలా - టీ స్పూన్; మిరియాలు - 10 గింజలు; ఎండుమిర్చి - 10; కొబ్బరిపొడి - రెండు టీ స్పూన్లు, క్యాప్సికమ్ ముక్కలు - కొద్దిగా.
తయారి:
ముందుగా ఉల్లిపాయలు, టొమాటోలను చిన్నముక్కలుగా చేసి ఉంచుకోవాలి

ఎండుకొబ్బరి, జీడిపప్పుపొడి, తర్బూజాగింజలు, కొద్దిగా నీరు కలిపి మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి


స్టౌ వెలిగించి బాణలిలో నూనె వేసి కాగిన తరవాత ఉల్లితరుగు వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించాలి


టొమాటోముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి


కారం, పసుపు, తగినంత ఉప్పు వేసి కలిపి 5 నిముషాలు ఉడికించాలి


ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఎండుకొబ్బరి, జీడిపప్పు పొడి, తర్బూజా గింజల పేస్ట్, కొద్దిగా నీరు పోసి రెండు మూడు నిముషాలు ఉడికించి దింపేముందు కారం, గరంమసాలా వేయాలి


చివరగా మిరియాలు, ఎండుమిర్చి, పనీర్‌ముక్కలు వేసి కలిపి కొద్దిగా ఉడికించి, క్యాప్సికమ్ + టొమాటో ముక్కలతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.


చెఫ్: ఎ.వేణుమాధవ్

No comments: