ఒక శిశువు తమ
జీవితంలోకి ప్రవేశించగానే, ఇక తాము బోధించే సమయం వచ్చిందని సామాన్యంగా
తల్లిదండ్రులందరూ అనుకుంటారు. కాని ఒక పాపో, బాబో కొత్తగా వస్తున్నారంటే, మీరు
మరచిపోయిన జీవితాన్ని తిరిగి నేర్చుకునే సమయం వచ్చిందని అర్థం.
ఒక వయసుకొచ్చాక,
అంటే పెద్దవాళ్లైపోయాక, అందరూ చెక్కబొమ్మల్లాగా తయారైపోతారు. కానీ ఈ బుజ్జి వరాలమూట
ఎప్పుడైతే ఈ భూమ్మీదకు వచ్చిందో, అప్పట్నుంచీ తెలీకుండానే నవ్వటం మొదలుపెడతారు.
సోఫాల కింద పాపాయితో పాటు పాకుతారు. పాపాయి వల్లనే మీ జీవితం, జీవితంలాగా ఉంది.
అంతేకాని మీ వల్ల కాదు. మిమ్మల్ని, మీ పాపాయిని పోల్చి చూడండి. 24 గంటల్లో, ఎవరు
ఎక్కువ ఉల్లాసంగా ఉంటున్నారు? మీ పాపాయి, అవునా? మరి జీవితం గురించి ఎవరిని
సంప్రదించాలి? మీ పాపాయిని. కాబట్టి, అది మీరు జీవితాన్ని నేర్చుకునే సమయం.
జీవితాన్ని బోధించే సమయం కాదు.
మీ శిశువును మీరు పెంచే అవసరం లేదు. వారు తమంత
తాముగా ఆనందపు మూటలు. మీ ప్రభావం మీ పిల్లల మీద పెద్దగా ఉండకూడదు. ఇది మాత్రం
కచ్చితంగా చూసుకోండి. అలా అయితేనే వారు హాయిగా ఉంటారు. మీ పిల్లవాని చుట్టూ, ఒక
ప్రేమపూర్వకమైన, సహాయపూర్వకమైన వాతావరణాన్ని సృష్టించండి. ఇక వారు చక్కగా
పెరుగుతారు. ఇది మీ తోటలో ఒక మొక్కను పెంచటం వంటిదే. వాతావరణం సరిగ్గా ఉండేటట్లు
మీరు చూసుకుంటే చాలు. మొక్క తన సంపూర్ణ సామర్థ్యంతో పెరుగుతుంది. ప్రతిరోజూ, అదే
పనిగా మీరు దాని జోలికి పోతూ ఉంటే గనుక, అది ఎదగనే ఎదగదు.
మీ పిల్లల్ని చక్కగా
పెంచాలనుకుంటే, మీరు గుర్తించాల్సిన మొదటి విషయం, మీరు ఆనందంగా ఉండి తీరాలి.
ప్రస్తుతం మీకే ఎలా ఆనందంగా ఉండాలో తెలియదు. ప్రతిరోజూ మీ ఇంట్లో ఆందోళన, కోపం,
భయం, ఆదుర్దా, అసూయ ప్రదర్శన జరుగుతూ ఉంటే, పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. మీ
పిల్లవాణ్ని చక్కగా పెంచాలనే ఉద్దేశం, మీకు నిజంగా ఉంటే, ముందు మీరు మీ తీరును
మార్చుకోవాలి.
పిల్లవాణ్ని ప్రేమపూర్వకంగా పెంచటం అంటే, వాడికి
‘అడిగినదల్లా ఇవ్వటమే’ అని చాలామంది అనుకుంటారు. మీ పిల్లవాణ్ని బాగా గమనిస్తే,
అడిగిందల్లా తెచ్చి ఇవ్వటం మూర్ఖత్వమే అని మీకు తెలుస్తుంది. మీరు చేయవలసిందంతా,
ఇంట్లో ప్రేమపూర్వకమైన, సహాయ పూర్వకమైన వాతావరణాన్ని కల్పించటమే. అదొక్కటే మీ పని.
ఈ ఒక్కటి కచ్చితంగా చూసుకోండి.
కోపంగా ఉండటం అంటే ఏమిటో, దీనంగా ఉండటం అంటే ఏమిటో,
బాధపడటం అంటే ఏమిటో, మీ పిల్లలు ఎప్పటికీ చూడకూడదు. ఇల్లు ప్రేమతో, ఉల్లాసంతో నిండి
ఉండేలా చూడండి. ఇక వారు మనోహరంగా పెరుగుతారు. ఆ వాతావరణాన్ని కల్పించటమే మీ పని. మీ
అనవసరపు సోదినంతా వాళ్లకు బోధించటం కాదు. మీరు వాళ్ల జోలికి వెళ్లకుండా ఉండేలా
కచ్చితంగా చూసుకుంటే చాలు. వాళ్లు చక్కగా ఉంటారు. ఎటువంటి పరిస్థితిలోనైనా వాళ్లు
ఉల్లాసవంతంగా జీవించగలగాలి. ఆ రకంగా వాళ్లను పెంచండి. వాళ్లు పెరగవలసిన తీరు అదే.
కాదా?
సమస్య - పరిష్కారం
పిల్లల్ని కనడం ఎంతో బాధ్యతాయుతమైన ప్రక్రియ
అనిపిస్తోంది. నేను దానికి యోగ్యుడనేనా? ఎలా తెలుసుకోవడం?
- ఆర్.ప్రసాద్,
కరీంనగర్
సద్గురు: పిల్లల్ని కనడం అంటే అది మీకూ, మీ భాగస్వామికీ సంబంధించిన
విషయం మాత్రమే కాదు. మీరు తరువాతి తరం వ్యక్తులను తయారుచేస్తున్నట్లు కూడా. కాబట్టి
అదో మహత్తరమైన బాధ్యత. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉంటుందనేది మీరు ఈ రోజు కంటున్న
పిల్లల మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల కనడం అనేది యథాలాపంగానో, ప్రేమ లేకుండానో
కాకూడదు.
పిల్లల్ని కనడమంటే అది మీకు కనీసం 20 ఏళ్ల ప్రణాళిక అని అర్థం
చేసుకోవాలి. అంటే పిల్లలు బాగా రాణిస్తే 20 ఏళ్లు, లేకపోతే జీవితాంతపు ప్రణాళిక.
మీరు 20 ఏళ్ల ప్రణాళిక స్వీకరించాలంటే కనీసం అంత సమయం దానికి కేటాయించాలి. కాలం
గడుస్తున్నకొద్దీ మన ఆలోచనలూ, అభిప్రాయాలూ మారవచ్చు. అనేక అభిప్రాయబేధాలు,
వ్యతిరేకతలూ, కష్టాలూ రావచ్చు. కాని మీరు ప్రణాళిక స్వీకరించారు కాబట్టి, దానికి
బద్ధులై ఉండాలి.
పిల్లలు కావాలనుకున్నారు కాబట్టి ఈ మాత్రం పరిపక్వతా,
నిబద్ధతా కలిగి ఉండాలి. ఎవరితోనో దెబ్బలాడి వెళ్లిపోయేవారైతే, ఎవరితోనో సరిపడక
ఇల్లు వదిలి వెళ్లిపోయే రకం మీరైతే, మీరింకా చిన్నపిల్లలనే అర్థం. ఆ పరిస్థితులలో
గనక మీరు ఉంటే మీరు పిల్లలు కావాలనుకోకూడదు. ఒక పిల్లవాడిని మరో పిల్లకాయను కనమనడం
సబబు కాదు.
No comments:
Post a Comment