నా వయసు 46. నాకు మాటిమాటికీ కళ్లు తిరుగుతున్నాయి. కొన్నిసార్లు కింద పడిపోతున్నాను. పక్కకు వంగినప్పుడు లేదా తల పైకి ఎత్తినప్పుడు ఇలా జరుగుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. అన్నీ బాగానే ఉన్నాయన్నారు. అప్పుడప్పుడూ తల కూడా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పవలసిందిగా కోరుతున్నాను.
- వి.మధు, ఏలూరు మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీరు ‘బినైన్ పొజిషనల్ వర్టిగో’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మన చెవి లోపలిభాగంలో వినికిడిని, బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు... రెండు వ్యవస్థలు ఉంటాయి. బ్యాలెన్స్ నియంత్రించే వ్యవస్థను ‘వెస్టిబ్యులర్ వ్యవస్థ’ అంటారు. ఇందులో ఓటోలిత్ అనే కణాలు, హెయిర్‌సెల్స్, ఇతర భాగాలు ఉంటాయి. ఇవి మన బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. వాటిలోని లోపాల వల్ల బ్యాలెన్స్ వ్యవస్థలో లోపాలు రావడానికి అవకాశం ఉంది. మీరు మొదట నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి వినికిడి, బ్యాలెన్స్ వ్యవస్థకు సంబంధించిన, క్లినికల్ పరీక్షలు చేయించుకోండి.
కళ్లు తిరగడంతో పాటు తలనొప్పి, వినికిడి లోపం, ఇతర సమస్యలు ఉన్నట్లయితే ఈఎన్‌టీ వైద్యుల సలహాపై న్యూరాలజిస్ట్‌ను కూడా సంప్రదించండి. అయితే ఈ సమస్య అంత ప్రమాదకరమైనది కాదు. కొన్నిరకాల వెస్టిబ్యుల్‌కు సంబంధించిన ఎక్సర్‌సైజులతో తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది.
నా వయసు 24. నేను మాట్లాడుతుంటే నత్తి వస్తోంది. వేగంగా మాట్లాడటం కష్టమవుతోంది. మా నాన్నకు కూడా ఈ సమస్య ఉంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక బాధపడుతున్నాను. నా సమస్యకు తగిన సలహా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.
- కె.ప్రకాష్, నిజామాబాద్ మీ సమస్యను వైద్య పరిభాషలో స్టట్టరింగ్ అంటారు. దీనికి గల ముఖ్య కారణాల్లో జన్యుపరమైన అంశం ప్రధానమైనది. మీరు మీ సమస్య తీవ్రత ఎంత, ఏయే సందర్భాల్లో నత్తి వస్తోంది అన్న అంశాలు తెలుసుకోవడానికి మొదట అనుభవజ్ఞులైన స్పీచ్ థెరపిస్ట్‌లను సంప్రదించవలసి ఉంటుంది. అవసరమైతే సైకాలజిస్ట్‌ను కూడా సంప్రదించాల్సి ఉంటుంది.
మీరు దీని గురించి మానసికంగా బాధపడితే ఈ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదముంది. మీకు అవకాశాలు వచ్చినప్పుడు ప్రయత్నపూర్వకంగా మాట్లాడండి. దిగులు పడకుండా ధైర్యంగా సంభాషించండి. స్పీచ్ థెరపిస్ట్, సైకాలజిస్ట్‌ల నుంచి కౌన్సెలింగ్ తీసుకుని వారు చెప్పినట్లుగా ఇంటిదగ్గర ప్రాక్టీస్ చేస్తే ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు.
డాక్టర్ ఇ.సి. వినయకుమార్
సీనియర్ ఇఎన్‌టి నిపుణులు, సొసైటీ టు ఎయిడ్ ద హియరింగ్
ఇంపెయిర్డ్ (సాహి), అపోలో హెల్త్ సిటీ, హైదరాబాద్
No comments:
Post a Comment