పుష్య శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. సహజంగానే ఏకాదశి తిథి ఎంతో ఉత్తమమైంది. ఇక వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైంది. ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి.
విష్ణుమూర్తి ముర అనే రాక్షసుని సంహరించి, ఇంద్రాది దేవతలను ఆనందింపచేసిన రోజిది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు దేవుని దర్శించుకుని, ఉపవాసం ఉన్నవారికి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి.
వైకుంఠ ఏకాదశినాడు చేసే దైవారాధన మూడు కోట్ల దేవతలకూ చెందుతుంది. ఈ విశిష్ట దినాన చేసే పూజతో మూడు కోట్ల దేవతలూ ప్రసన్నం అవుతారు. కనుక ఈరోజు విధిగా ఆలయానికి వెళ్తారు. భక్తిగా దేవుని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఉపవాసం ఉండి, పాలు, ఫలాలు మాత్రమే సేవిస్తారు. ముక్కోటి ఏకాదశినాడు దేవాలయాలన్నీ భక్తులతో కళకళలాడతాయి. ఇక వైష్ణవ దేవాలయాల సంగతి చెప్పనవసరం లేదు. కలియుగ వైకుంఠంగా చెప్పుకునే తిరుమలలో ముక్కోటి ఏకాదశి మహా వైభవోపేతంగా జరుగుతుంది.
ముక్కోటి ఏకాదశినాడు భక్తులు ముఖ్యంగా వైష్ణవులు ''విష్ణు సహస్రనామం''తో మొదలుపెట్టి స్వామివారికి అర్చనలు, పూజా కార్యక్రమాలు చేస్తారు. వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పురాణ శ్రవణాలు, ధార్మిక ఉపన్యాసాలు నిర్వహిస్తారు. ఈ పుణ్య తిథినాడు యజ్ఞయాగాదులు జరిపితే మంచిది కనుక కొందరు యజ్ఞాలకు పూనుకుంటారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకునే భక్తులు ఇతర దినాల్లో కంటే, ముక్కోటి ఏకాదశి లాంటి విశేష పర్వదినాల్లో తిరుమల వెళ్ళడం మరింత శ్రేష్ఠమని నమ్మి, ఆ వేళ్టికి అక్కడ ఉండేలా ఏర్పాటు చేసుకుంటారు.
నిజానికి రద్దీ విపరీతంగా ఉండటంవల్ల వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని.
అయినా లక్ష్యపెట్టకుండా వెళ్తారు. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి నాడు చనిపోయిన వారు తిన్నగా వైకుంఠానికి వెళ్తారని, మోక్షం పొందుతారని పూరాణాలు చెప్తున్నాయి.
సూర్యుడు ధనూరాశిలో ఉండే ధనుర్మాసంలో, శుక్ల ఏకాదశినాడు, ముక్కోటి దేవతలను వెంటబెట్టుకొని శ్రీమన్నారాయణుని దర్శనం కోసం బ్రహ్మ వైకుంఠానికి వెళ్లాడు. రావణాసురునితో పీడింపబడుతున్న దేవతలంతా దుఃఖంతో తమ కష్టాలు చెప్పుకోవడానికి వైకుంఠానికి చేరారు. ప్రభాతకాలంలో ఉత్తరద్వారం దగ్గర స్వామివారి దర్శనం కోసం నిలబడ్డాడు.
అప్పుడు నారాయణుడు వారికి దర్శనం ఇచ్చాడు. దేవతలు ఆయనను స్తుతించి, అనుగ్రహాన్ని పొందారు. ముక్కోటి దేవతలూ స్వామిని దర్శించిన ఏకాదశి కనుక ఇది ముక్కోటి ఏకాదశి అయింది. ఆగమశాస్త్రం ప్రకారం దేవాలయాలకు తూర్పున సింహద్వారం, మిగిలిన దిక్కుల్లో కూడా ద్వారాలు ఉంటాయి. ముక్కోటి ఏకాదశినాడు ఉత్తరద్వారం నుండి ప్రవేశించి, ప్రభాతవేళ స్వామిదర్శనం చేసుకోవాలి.
స్వామివారు దేవేరుల ఉత్సవ విగ్రహాలను ఉత్తర ముఖంగా ఉత్తర ద్వారానికి ఎదురుగా ఉంచుతారు కనుక దీనిని ఉత్తరద్వార దర్శనం అంటారు.
సంవత్సరానికి పన్నెండు నెలలు. సూర్యుని గమనాన్ని బట్టి మొదటి ఆరు నెలలు ఉత్తరాయణం, తరువాత ఆరునెలలు దక్షిణాయనం అవుతుంది. మానవులు ఉత్తరాయణంలో దేవకార్యాలకు, దక్షిణాయనంలో పితృకార్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిని దేవయానం, పితృయానం అంటారు. ఉత్తరాయణంలో దేవయానంలో మరణించినవారు సూర్యమండలాన్ని భేదించుకుని వెళ్లి మోక్షాన్ని పొందుతారు. దక్షిణాయనంలో పితృయానంలో పోయినవారు చంద్రమండలానికి చేరి, మళ్లీ జన్మిస్తారు. అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు అంపశయ్యపై ఎదురుచూశాడు.
కృత్యోత్సవం తథా భూతం ఏకాదశ్యాం విశేషతః
విశంతి మోక్షం తస్మాత్ స మోక్షత్సవ ఇతీర్యతే ॥
ముక్కోటి ఏకాదశి వేకువజామున ఉత్తరద్వారం నుండి శ్రీమహావిష్ణుదర్శనం చేసుకొన్నవారికి మోక్షం తప్పక లభిస్తుంది. కనుక ఈ దర్శనాన్ని మోక్షోత్సవం అంటారు. వైఖానసుడు అనే రాజు రాజకార్య నిమగ్నుడై దేవతలను, పితృదేవతలను పూజించటం మానేశాడు. దాంతో పితృదేవతలు దుఃఖంతో కలలో కనబడ్డారు.
‘నాయనా! నీవు దేవతార్చన, పితృదేవతార్చన చేయకపోవడం వలన మాకు ఉత్తమలోకాలు లభించటం లేదు. వైకుంఠ ఏకాదశినాడు స్వామిని ఉత్తరద్వార దర్శనం చేసుకొని ‘ఏకాదశీవ్రతం’ ఆచరించి, ఆ ఫలాన్ని ధారపోస్తే మాకు పుణ్యలోకాలు, నీకు ముక్తి లభిస్తాయి’ అన్నారు. వైఖానసుడు వారు చెప్పినట్లు చేశాడు. ఐహిక బాధ్యతలతో మునిగి దేవపితృకార్యాలను మరచిపోయే వారికి ముక్కోటి ఏకాదశి కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది.
అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు మొత్తం పదకొండూ భగవంతుని యందు లగ్నం చేసి, ఏకాదశీవ్రతం చేసినవారికి తప్పక ముక్తి లభిస్తుంది. ఇహం కోసం పరాన్నీ, పరం కోసం ఇహాన్నీ నిర్లక్ష్యం చేయకుండా మానవుడు సమతూకంగా జీవించి, జన్మను సార్థకం చేసుకోవాలి. ముక్కోటిఏకాదశి మనకు ఇచ్చే సందేశం ఇదే.
No comments:
Post a Comment