all

Thursday, May 30, 2013

అతిథి మర్యాదలో దైవప్రస్నత...

 

దైవాలజీ
తమ అవసరాలకంటే, ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత నివ్వడం, వారి కష్టసుఖాలలో పాలు పంచుకోవడం, అతిథులను గౌరవించడం అత్యున్నతమైన పుణ్యకార్యాలు.

పూర్వం మానవుల మధ్య సత్సంబంధాలు, ఆప్యాయతానురాగాలు, త్యాగం, పరోపకార గుణాలు మెండుగా ఉండేవి. ఇప్పుడు బొత్తిగా లేవని కాదు గాని, గతంతో పోల్చుకుంటే ఈనాడు మానవుల మధ్య ఆత్మీయ సంబంధాలు బాగా సన్నగిల్లాయని చెప్పవచ్చు. ఆ రోజుల్లో ఎవరైనా తమ ఇంటికి వస్తే, ఆ ఇంటివారు ఎంతో సంతోషించేవారు. అతిథి మర్యాదలో ఎలాంటి లోటూ రానిచ్చేవారు కాదు. వారికి ఎలాంటి ఇబ్బందీ, అసౌకర్యమూ కలుగకుండా చూసుకునేవారు. ఉన్నంతలోనే అతిథి మర్యాదలో ఎలాంటి లోపమూ లేకుండా జాగ్రత్త పడేవారు. వారి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడేవారు. అతిథి మర్యాద ఇస్లామీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన అంశం. అతిథి మర్యాదకు, త్యాగగుణానికి అద్దం పట్టే ఒక సంఘటన చూడండి.

ఒకసారి దైవప్రవక్త ముహమ్మద్ (స) సన్నిధిలో ఒక వ్యక్తి హాజరై, ‘‘అయ్యా! నేను చాలా బాధల్లో ఉన్న నిరుపేదను. ఆకలి దహించి వేస్తోంది’’అని వేడుకున్నాడు. ఆ రోజు ప్రవక్త మహనీయుల వారి ఇంట కూడా పచ్చిమంచినీళ్లు తప్ప మరే పదార్థమూ లేదు. అప్పుడు ప్రవక్త మహనీయులు అక్కడున్న తన సహచరులతో ‘‘ఈ పూట ఇతనికి ఆతిథ్య ఇచ్చే వారైవరైనా ఉన్నారా?’’ అని అడిగారు. వెంటనే ఓ వ్యక్తి లేచి నిలబడి ‘‘నేనిస్తాను’’ అన్నాడు. తరువాత అతిథిని వెంటబెట్టుకుని ఇంటికి వెళ్లాడు. ‘‘ఈరోజు మన ఇంటికి ఓ అతిథి వచ్చారు. తినడానికి ఏమైనా ఉందా?’’ అని శ్రీమతిని ప్రశ్నించాడు. ‘‘పిల్లల కోసమని ఉంచిన కాస్తంత భోజనమే తప్ప మరేమీ లేదు. వచ్చిన అతిథికి ఒక్కరికైతేనే అది కూడా సరిపోతుందేమో’’ అని బదులిప్పించాడు. అతిథిని గౌరవించడం మన విధి. అందులో ఎలాంటి లోటూ రానీయకూడదు. పిల్లలకు ఏదో ఒక సాకు చెప్పి నిద్రపుచ్చు. పిల్లలు నిద్రపోయిన తరువాత భోజనం వడ్డించు. అతిథి ఇంట్లోకొచ్చి భోజనం కోసం కూర్చోగానే మనమూ కూర్చుందాం. అతనికి వడ్డిస్తున్న సమయంలో దీపాన్ని సరిచేస్తున్నట్లు చేసి దాన్ని ఆర్పేసెయ్యి. చీకటిలో మనం తింటున్నదీ లేనిదీ అతనికి తెలియకుండా ఉంటుంది. మనం కూడా తింటున్నట్లు నటి ద్దాం’’ అని చెప్పారాయన.

అనుకున్నట్లుగానే ఆ ఇల్లాలు పిల్లలను నిద్రపుచ్చింది. అతిథికి అన్నం వడ్డించి అందరూ కూర్చున్నారు. కాని అతిథి మాత్రమే భోజనం చేశాడు. తామూ తిన్నట్లు నటించిన ఆ దంపతులిద్దరూ పిల్లలతో సహా పస్తులున్నారు. పిల్లల నోటిదగ్గర అన్నాన్ని కూడా త్యాగం చేసి ఆకలితో బాధపడుతున్న ఆ అపరిచిత అతిథి క్షుద్బాధను తీర్చారు.

మరునాడు ఉదయం ఆ ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి ప్రవక్త వారి సన్నిధిలో హాజరైనప్పుడు, ప్రవక్త మహనీయులు ‘అబూ తల్లాహ’ అంటూ ఆయన పేరునూ, ఆయన శ్రీమతి పేరునూ ఉచ్చరిస్తూ, ‘దైవానికి తన ఫలానా భక్తుడు, భక్తురాలి తీరు ఎంతగానో నచ్చింది. అతిథి పట్ల వారు చూపిన మర్యాద, త్యాగభావనకు అల్లాహ్ అమితంగా సంతోషించాడు’ అని శుభవార్త అందజేశారు. ‘వారు స్వయంగా అగత్యపరులైనప్పటికీ, తమకంటే ఇతరులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు’ అని పవిత్ర ఖురాన్ ఈ త్యాగగుణాన్ని అభివర్ణించింది.

తమ అవసరాలకంటే, ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత నివ్వడం, వారి కష్టసుఖాలలో పాలు పంచుకోవడం, అతిథులను గౌరవించడం అత్యున్నతమైన పుణ్యకార్యాలు. అప్పుడే సమాజంలో సామరస్యం, సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తుంది. జీవితాలు శాంతిమయమవుతాయి. దైవప్రసన్నత ప్రాప్తమవుతుంది.
 

అందంగా... హుందాగా!

 

ఇంటిరియం
‘‘రాత్రి కర్టెన్లు వే సి, దీపాలు వెలిగించగానే నా పుస్తకాలకి ఒక గౌరవం వచ్చినట్లు భావిస్తాను’’ అంటాడు ఇంగ్లీష్ నవలారచయిత ఇ.ఎం. ఫాస్టర్. కర్టెన్ అనేది గదికి అందాన్ని ఇవ్వడంతో పాటు, హుందాతనాన్ని తీసుకువస్తుంది. కర్టెన్లకు శబ్దాన్ని నియంత్రించే గుణం ఉంది. కొన్నిరంగులు గదికి వెలుగును కూడా తీసుకువస్తాయి. అలాగే కర్టెన్ రాడ్‌లు కూడా కర్టెన్లకు సరికొత్త అందాన్ని సంతరిస్తాయి. రెండుమూడు రంగుల కర్టెన్లను పక్కపక్కన అమర్చడం లేటెస్ట్ ఫ్యాషన్. అటువంటప్పుడు కూడా కాంబినేషన్‌ల విషయంగా జాగ్రత్తపడాలి.

గదిలోని వస్తువులు, గోడల రంగులు, కర్టెన్లు, రాడ్‌లు అన్నీ ఒకదానితో ఒకటి కలిస్తేనే అందం. ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ చిత్రం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ చిత్రంలో ఒక గదిని బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఉండే వస్తువులతో డెకొరేట్ చేశారు. ఆ గది అందరి మనసుల్లోనూ నిలిచిపోయింది. మన ఇల్లు కూడా ఇలా సర్దుకుంటే బాగుంటుందనే భావన కలిగేలా ఉంటుంది ఆ గది అమరిక.ఇక్కడ ఇచ్చిన కర్టెన్‌ల ధర సుమారు 3000 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది.
 

Wednesday, May 22, 2013

మొటిమల నివారణకు ఆయుర్వేదంతో శాశ్వత పరిష్కారం..!


మొటిమలు అనేవి చర్మ సమస్యల్లో చాలా సాధారణమైన సమస్య. మరీ ముఖ్యంగా టీనేజర్స్ లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. మరీ మీరూ మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? మొటిమల నివారించుకోవడానికి చాలా రకాల రసాయణాలు మరియు మెడిసిన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే రసాయనాలతో కూడిన క్రీములు, మెడిసిన్స్ ఉపయోగించడం కన్నా మొటిమలు నివారించడానికి సహజసిద్దంగా ఆయుర్వేద చికిత్స కూడా ఉంది. అందమైన చర్మాన్ని పొందడానికి ఆయుర్వేదం చాలా ఉపయోగకరమైన మరియు సహజ సిద్దమైన చికిత్స.

  మొటిమలు లేని చర్మ సౌందర్యాన్ని పొందడానికి వివిధ రకాల హోం రెమడీస్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించనట్లైతే మీకు ఆశ్చర్యం కలగక మానదు. ఆ వ్యత్యాసాన్ని మీరు తప్పకుండా గుర్తించవచ్చు. మొటిమలతో అందవిహీనంగా మారిన చర్మానికి ఆయుర్వేదిక్ ఫేస్ ప్యాక్ వల్ల మొటిమలు నివారించబడి అందమైన మరియు కాంతివంతమైన చర్మ సౌందర్యాన్ని మీరు పొందగలరు.

ఈ నేచురల్ ఫేస్ ప్యాక్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మీరు కూడా నిరభ్యంతరంగా పాటించవచ్చు . మరి మీ ముఖం మొటిమలు లేని అందమైన చర్మ సౌందర్యాన్ని పొందాలంటే మీరు కూడా ఈ క్రింది ఆయుర్వేద ఫేస్ ప్యాక్ లను ప్రయత్నించి చూడండి...

 
పసుపు-శెనగపిండి: హిందూ పెళ్ళిళ్ళు మరియు శుభకార్యాల్లో పసుపును ఎక్కువగా ఉపయోగించడం మనకు తెలిసిన విషయమే. రెండు చెంచాలో రోజ్ వాటర్ లో పసుపు మరియు శెనగపిండి వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. దాంతో మీ ముఖం మీద మొటిమల మాత్రమే కాదు చర్మ సమస్యలు కూడా నివారించడంతో పాటు మీ ముఖంలో సరికొత్త కాంతి పొందుతారు.


 
బంతి పూల((మ్యారిగోల్డ్ )తో ఫేస్ ప్యాక్: ఇది వినడానికి ఆశ్చర్యం కలిగించవచ్చు . అయితే ఈ బంతి పూలలో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీసెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉన్నందున మొటిమలను సులభంగా నివారించగలుగుతాయి. కొన్ని తాజా బంతిపూలను తీసుకొని వాటిని మెత్తగా పేసట్ లా తయారుచేసి, దానికి తేనె మరియు పాలు మిక్స్ చేసి ముఖం మీద అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత 15నిముషాలు అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.


 
చందనం ఫేస్ ప్యాక్: ఆయుర్వేదిక్ ఫేస్ ప్యాక్స్ లో చాలా సింపుల్ ఫేస్ ప్యాక్ ఇది. మీరు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు ఇది బాగా సహాయపడుతుంది. చందనం పౌడర్ మార్కెట్లో అందుబాటులో ఉంది. దీన్నితెచ్చుకొని రోజ్ వాటర్ తో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చాలా సాధారణ ఆయుర్వేదిక్ ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది చర్మానికి కాంతిని మరియు సున్నితత్వాన్ని కలిగిస్తుంది.


 
వేపాకుతో ఫేస్ ప్యాక్: కొన్ని తాజా వేపఆకలు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి, దానికి కొద్దిగా పసుపు మిక్స్ చేసి రెండు మూడు చుక్కల వేపనూనెను మిక్స్ చేసి మెత్తని పేస్ట్ లా చేసుకొని ముఖానికి పట్టించాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, బాగా ఎండిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.



 
ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్: ఇది చాలా సులభమైన ఆయుర్వేదిక్ ఫేస్ ప్యాక్. దీన్ని మొటిమలు నివారించడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముల్తానీ మట్టికి రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేసి అరగంట తరవ్ాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.


 
పుదీనా ఫేస్ ప్యాక్: పుదీనా ఆకులను తీసుకొని మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను రోజుకు రెండు సార్లు అప్లై చేస్తే మొటిమలు మటు మాయం అవుతాయి. ఇది మొటిమల తాలూకు మచ్చలను కూడా నివారిస్తాయి. ఇది అద్భుతమైన యాంటీ ఎన్స్ ఏజెంట్.

 



వెల్లుల్లి: అధికంగా మొటిమలున్న ప్రదేశంలో వెల్లుల్లి రెబ్బలు చితగొట్టి అప్లై చేయాలి. లేదా వెల్లల్లి రెబ్బలతో మసాజ్ చేయాలి. దీనిలో ఇల్ల్యూషన్ ఉండటం వల్ల యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మొండుగా ఉండి మొటిమలను నివారించబడుతాయి.

 
నువ్వులు: నువ్వులను, కొద్దిగా నీళ్ళు చేర్చి మెత్తని పేస్ట్ లా తయారు చేసి మొటిమలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇది ఎండిన తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల మొటిమలు నివారించబడుతాయి.



 
ఉప్పు- వెనిగర్: ఉప్పుకు వెనిగర్ చేర్చి పేస్ట్ లా చేసి ముఖం మీద అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మొటిమలు ఏర్పడవు.

 
గోధుమగడ్డి జ్యూస్: ప్రతి రోజూ రెండు సార్లు వీట్ గ్రాస్ జ్యూస్ త్రాగడం వల్ల మొటిమలు, మచ్చలు నివారించవచ్చు.

 


పపాయ: పచ్చిగా ఉండే పాపాయను మెత్తటి పేస్ట్ లా తయారు చేసి ముఖానికి అప్లై చేసి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
కలబంద మరియు ఉసిరి రసం: కలబంద మరియు ఉసిరి కాయ రసంను మిక్స్ చేసి బ్రేక్ ఫాస్ట్ కు ముందు 30యంఎల్ సేవిస్తే మొటిమలు ఎప్పటికీ రాకుండా నివారించబడుతాయి.


 
కొత్తిమీర-పసుపు: గుప్పెడు కొత్తిమీర ఆకులను శుభ్రం చేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకొని అందులో పసుపు చేర్చి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి శుభ్రం చేసుకోవాలి.


 
క్యారెట్ జ్యూస్: మొటిమలను నివారించడంలో అద్భుతమైన మార్పును తీసుకొస్తుంది కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో క్యారెట్ జ్యూస్ ను చేర్చుకోండి.


 
చెక్క: చెక్కను మెత్తను పౌడర్ గా చేసి అందులో నిమ్మరసం కలిపి పేస్ట్ లా చేసి మొటిమలున్న ప్రాంతంలో అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి.

 
తేనె: చెంచా తేనెకు ఒక చెంచా చెక్కపౌడర్ కలిపి, నిద్రించే ముందు ముఖానికి అప్లై చేసి, నిద్ర లేచిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా ప్రతి రోజూ రెండు వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే మొటిమలకు శాశ్వతంగా గుడ్ బాయ్ చెప్పవచ్చు.


 
టమోటో: టమోటో గుజ్జును మొటమలున్న ప్రదేశంలో అప్లై చేసి ఒక గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.



దానిమ్మ: దానిమ్మ తొక్కను ఎండబెట్టి పౌడర్ చేసి, దానికి నిమ్మరసం మిక్స్ చేసి మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మొటిమలను నివారించుకోవచ్చు.


 
పాలు: బాగా మరిగించి, చల్లార్చిన పాలలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల బ్లాక్ హెడ్స్, పగుళ్ళు, మొటిమలు నివారించబడుతాయి.

 


బంగాళదుంపు: బంగాళదుంపను మొత్తగా పేస్ట్ లా తయారుచేసి మొటిమలు, మచ్చలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి శుభ్రం చేసుకోవడం వల్ల వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, ఇతర చర్మ సమస్యలు తొలగిపోతాయి.

 

Tuesday, May 21, 2013



ఎంత ఇస్తున్నామన్నది కాదు, ఎంత ప్రేమగా ఇస్తున్నామన్నది ముఖ్యం.
- మదర్ థెరిసా 

  





విపరీతమైన దగ్గు, గ్యాస్... గొంతు మారుతోంది...

డాక్టర్‌ని అడగండి - ఇ.ఎన్.టి.


నా వయసు 36. ఉద్యోగరీత్యా తరచూ దూరప్రాంతాలకు వెళ్లాల్సిన జాబ్‌లో ఉన్నాను. రోజూ సరైన వేళకు తినే అవకాశం ఉండదు. ఒక్కోసారి వేరే రాష్ట్రాలకూ వెళ్లాల్సి ఉండటంతో నేను తినే ఆహారాలూ మారుతుంటాయి. నాకు గ్యాస్ ట్రబుల్ సమస్య కూడా ఉంది. దగ్గు, గ్యాస్ సమస్యలతో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. స్వరం బొంగురుగా మారుతోంది. నా సమస్యకు సరైన సలహా ఇవ్వండి.
- ఎం.డి. అన్వర్‌ఖాన్, హైదరాబాద్


మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మన కడుపులో కొన్ని ఆసిడ్స్ తయారవుతూంటాయి. ఇవి ఆహారం జీర్ణమయ్యేందుకు ఉపయోగపడుతుంటాయి. అయితే మనం ఆహారం సరిగా తీసుకోకపోయినా, సరైనవేళకు తినకపోయినా ఈ ఆసిడ్స్ తేన్పుల రూపంలో పైకి వస్తాయి. ఇవి మొదట స్వరపేటికలోని వోకల్ ఫోల్డ్స్, గొంతులోని ఇతరభాగాలపై ప్రభావం చూపుతాయి. దాంతో దగ్గు వస్తుంది. స్వరం మారుతుంది.

ఎప్పుడూ గొంతు సరిచేసుకోవాలనిపిస్తుంది. దగ్గు ఎక్కువ కావడం, స్వరం మారడం, చెవిలో నొప్పి, ఇతర సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మీరు వెంటనే మీకు దగ్గరలోని ఈఎన్‌టీ నిపుణులు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌లను సంప్రదించి, ఎండోస్కోపీ వంటి అవసరమైన పరీక్షలు జరిపించి సమస్య ఏమిటన్నది నిర్ధారణ అయిన తర్వాత దాన్నిబట్టి మందులు వాడాల్సి ఉంటుంది. మందులతో పాటు మీ సమస్యకు అసలు కారణాలైన జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం.

నా వయసు 20. మాట్లాడుతుంటే నత్తివస్తోంది. ఈ పోటీ యుగంలో నెగ్గుకురావడం ఎలా అన్నది ఆలోచిస్తే ఆందోళన కలుగుతోంది. ఈ విషయంలో తగిన సలహా ఇవ్వండి.
- అఖిలేష్, విజయవాడ


మీ సమస్యను వైద్య పరిభాషలో స్టట్టరింగ్ అంటారు. మొదట మీరు... మీ సమస్య తీవ్రత ఎంత, ఏయే సందర్భాల్లో నత్తి వస్తోంది అన్న అంశాలు తెలుసుకోడానికి అనుభవజ్ఞులైన స్పీచ్ థెరపిస్ట్‌లను సంప్రదించండి. కొన్నిసార్లు అవసరమైతే సైకాలజిస్ట్‌ను కూడా సంప్రదించాల్సి ఉంటుంది.

మీరు దీని గురించి మానసికంగా బాధపడిన కొద్దీ ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. మీకు అవకాశాలు వచ్చినప్పుడల్లా ప్రయత్నపూర్వకంగా మాట్లాడండి. దిగులు పడకుండా ధైర్యంగా సంభాషిస్తూనే ఉండండి. స్పీచ్ థెరపిస్ట్, సైకాలజిస్ట్‌ల కౌన్సెలింగ్ తీసుకుంటూ వారు చెప్పినవి ఇంటిదగ్గర ప్రాక్టీస్ చేస్తే ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు.

డాక్టర్ ఇ.సి. వినయకుమార్
సీనియర్ ఇఎన్‌టి నిపుణులు, సొసైటీ టు ఎయిడ్ ద హియరింగ్
ఇంపెయిర్డ్ (సాహి), అపోలో హెల్త్ సిటీ, హైదరాబాద్