దేవుడంటే ఆలకించేవాడు,
కరుణించేవాడు, కాపాడేవాడు! అవునూ... అన్నీ దేవుడే ఎందుకు వినాలి? దేవుడే ఎందుకు
చేయాలి? సాటి మనిషి ప్రార్థనను మనం వినలేమా? సాటి మనిషికి చేతనైన సాయం చేయలేమా?
దేవుడిలా కోరికలను తీర్చలేం సరే, బాధల్ని తీర్చేందుకు చిన్న ప్రయత్నం చేయగలం కదా!
ప్రశాంత్‌కుమార్ దంపతుల గురించి విన్నప్పుడు ఎవరి మదిలోనైనా ఇవే ఆలోచనలు కలుగుతాయి.
హెచ్.ఐ.వి.పాజిటివ్ చిన్నారులు, అనాథలు... ఓ ముప్పై మంది వరకు వారి దగ్గర
పెరుగుతున్నారు. ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఎదుగుతున్నారు. ఆ పసివాళ్లూ ఎవర్నీ
ప్రార్థించలేదు. ప్రార్థించే అవసరం రాకుండా చూసుకునే ‘అమ్మానాన్నల’ చేతుల్లో
పడ్డారంతే! ఆ ఇద్దరి ప్రేమ, వాత్సల్యాలే... ఈవారం ప్రజాంశం.
చినుకులు
చల్లగా మేనిని తడుముతుంటే, రివ్వున వీచే గాలి తలని నిమురుతుంటే పచ్చని ప్రకృతిలో
మమేకమవుతూ కనిపించారు పార్క్‌లో ఆడుకుంటున్న చిన్నారులు. తోటిపిల్లలతో ఆటపాటల్లో
మునిగి తేలుతున్న చిన్నారులను చూసి ‘ఏదో స్కూల్ పిల్లల్లా ఉన్నారే!’ అనుకుని
పలకరిస్తే- ‘‘వీరంతా మా పిల్లలేనండి. మొత్తం ముప్పైమంది. మాది పే...ద్ద కుటుంబం’’
సంబరంగా చెప్పారు ప్రశాంత్‌కుమార్, అతని ఇల్లాలు అపరంజి. ఆసక్తికరంగా అనిపించిన ఈ
కథను పిల్లలతో పాటూ ఆడుతూ పాడుతూ కనిపించిన వారి మాటల్లోనే
తెలుసుకుంటే...
హెచ్‌ఐవి
ఉన్నా..!ఆధునికంగా ఎంత ప్రగతి సాధించినా మన సమాజంలో ఇంకా హెచ్‌ఐవి
బాధితులు వేదనాభరితమైన జీవితాలనే గడుపుతున్నారు. ఉన్న జబ్బును బయటకు చెప్పుకోలేక,
అయినవారికి దూరం కాలేక, తెలిసినవారు ఏహ్యంగా చూసే చూపులకు తట్టుకోలేక... వారు పడే
యాతన వర్ణించలేము. ‘‘ఇవేవీ తెలియని ఈ పసికందులకు కావలసినది కాసింత ప్రేమ, వేళకు ఇంత
తిండి, ఉండేందుకింత నీడ. వీరిలో హెచ్‌ఐవి బాధితులు ఉన్నారు. తల్లిదండ్రులు ఎయిడ్స్
కారణంగా చనిపోతే అనాథలైన పిల్లలూ ఉన్నారు. ఇప్పుడు వీరు అనాథలు కారు. నేనున్నాను.
ఇప్పుడు వీరు అనారోగ్యంతో బాధపడటం లేదు. అవసరమైన మందులతో ఆరోగ్యంగా ఎదుగుతున్నారు.
వీరికి ఆ అవకాశం కల్పించడానికే దేవుడు నన్ను ఎంచుకున్నాడని భావిస్తాను. వీరంతా
‘అన్న, నాన్న’ అని పిలుస్తూ ఉంటే మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతుంది’’ తెలిపారు
ప్రశాంత్‌కుమార్.
సికింద్రాబాద్ మిర్జాల్‌గూడలో ‘ఫ్యూచర్ తఫౌండేషన్’ పేరుతో
ఉన్న మూడుగదుల ఇంటికి వెళితే ఈ చిన్నారులకు చదువు చెబుతూనో, భోజనం పెడుతూనో వారి
ఆలనాపాలనా చూస్తూనో ఈ తల్లిదండ్రులు కనిపిస్తారు. ఆదివారాలు, సెలవురోజుల్లోనూ ఇలా
దగ్గరలో ఉన్న పార్క్‌లోనూ, ఆరుబయట షికారులోనూ పిల్లల సందడి మధ్య తామూ పిల్లలై
తిరుగుతుంటారు.
అనాథలకు నీడ...ఇక్కడ
ఉన్నవారిలో పదిమంది దాకా ఆడపిల్లలూ ఉన్నారు. ‘ఇంత చిన్న ఇంట్లో ఎలా
సర్దుకుపోతున్నారు, ఏ అండా లేని పిల్లలను చేరదీయాలనే ఆలోచన ఎలా కలిగింది’ అని
అడిగితే ప్రశాంత్‌కుమార్ తన కథ వినిపించారు. ‘‘మా అమ్మనాన్నలకు మేం ముగ్గురం
సంతానం. మా చిన్నప్పుడే మరో పెళ్లి చేసుకోవడానికి అమ్మను, మమ్మల్ని వెళ్లగొట్టాడు
నాన్న. అమ్మ మనోధైర్యంతో అక్కడా ఇక్కడా పనులు చేసి మమ్మల్ని ప్రయోజకులను చేసింది.
అమ్మకు సాయపడేందుకు పదవతరగతి చదువుకునే రోజుల నుంచే ట్యూషన్లు చెప్పేవాడిని.
అప్పుడే నిరుపేద పిల్లలు, పుస్తకాలు కూడా కొనలేని స్థితిలో స్కూల్ మానేసిన
విద్యార్థులు నా దగ్గరకు చదువుకోవడానికి వచ్చేవారు. ఆ పిల్లలను ఆదుకోవడానికి
ఇల్లిల్లూ తిరిగి పాత న్యూస్‌పేపర్లు సేకరించేవాడిని. ఇందుకు మా స్నేహితులూ సాయం
అందించేవారు. మా లంచ్‌బాక్స్‌లూ పిల్లలకు ఇచ్చేవాళ్లం.
ఆ రోజుల్లో మా ఇంటి
దగ్గర ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సిస్టర్‌గా పనిచేసే విశాలాక్షి (పేరుమార్చాం)కి
హెచ్.ఐ.వి సోకింది. ఎవరికీ చెప్పుకోలేక మా గురించి తెలిసి, తన ఇద్దరు పిల్లలకు ఇంత
నీడ కల్పించమని కోరింది. ఆమెను కలిసినప్పుడు ఆమె బతుకుతుందనుకోలేదు. అప్పుడు ఆమె
సిడి 4 కౌంట్ 16. ఆమెను ఆసుపత్రిలో చేర్చాను. మందులు, మంచి ఆహారం తీసుకున్నాక
ఇప్పుడు బాగా కోలుకుంది. ఆమె ఇద్దరు పిల్లలు ఇప్పుడు డిగ్రీ చేస్తున్నారు. ఆమె ఓ
ఆసుపత్రిలో సిస్టర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఆమె బాగోగుల గురించి తెలుసుకోవడానికి
ఆస్పత్రికి వెళ్లినప్పుడు హెచ్.ఐ.వి రోగులను, పిల్లలను గమనించాను. అనాథలైన వారికి
ఒక నీడ కల్పిస్తే నా జీవితానికో అర్థం ఉంటుందనిపించి, తొమ్మిదేళ్ల క్రితం ఫ్యూచర్
ఫౌండేషన్ పేరుతో ఈ హోమ్‌ని ఏర్పాటు చేశాను’’ అని చెబుతున్న ప్రశాంత్‌కుమార్ కళ్లలో
చెప్పరానంత సంతృప్తి కనిపించింది.
పెరిగిన
ప్రేమ..పెళ్లికాక ముందే పదిమంది పిల్లలతో అనుబంధాన్ని ఏర్పరుచుకున్న
ప్రశాంత్‌కుమార్ ‘‘పిల్లలు ‘అన్న అన్న’ అంటూ నా చుట్టూ తిరుగుతుంటే చాలా ఆనందం
వేసేది. ఫొటోగ్రఫీ అంటే నాకు ఎంతో ఇష్టం. పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలకు తీసే
ఫొటోలతో వచ్చే ఆదాయం పిల్లల ఖర్చులకు సరిపోయేది. మమ్మల్ని చూసిన వారు కొందరు సాయం
చేయడానికి ముందుకు వచ్చేవారు. ఇక్కడ పిల్లల సంఖ్య పది నుంచి ఇరవైకి పైగా పెరుగుతూ
వచ్చింది. కాని ఏనాడూ పిల్లలు భారంగా అనిపించలేదు.
ఐదేళ్లక్రితం మా మేనమామ
కూతురినే పెళ్లి చేసుకున్నాను. పెళ్లికి ముందే తనకు అన్ని విషయాలు వివరించాను.
పిల్లలు మనతో ఉంటేనే ఈ పెళ్లికి ఒప్పుకుంటానన్నాను. అన్ని షరతులనూ అంగీకరించి,
మనస్ఫూర్తిగా నా ఇంట అడుగుపెట్టింది అపరంజి’’ అని ఆగారు
ప్రశాంత్‌కుమార్.
అపరంజి మాట్లాడుతూ -‘‘పెళ్లి అవుతూనే పాతికమంది పిల్లలకు
తల్లినయ్యాను. తర్వాత మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత మరో ముగ్గురు పిల్లలు
చేరారు. ఒకరిద్దరు పిల్లలు ఉంటేనే ఇల్లంతా ఎంతో సందడిగా ఉంటుంది. అలాంటిది
ముప్పైమంది అంటే... రోజూ పండగలాగే ఉంటుంది’’ అని తెలిపారు ఆమె. ‘‘పిల్లలందరూ
దగ్గరలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఫీజులు కట్టడంలో ఆలస్యమైనా ఆంక్షలు
పెట్టని మంచితనం అక్కడి టీచర్లలో ఉంది’’ అని వివరించారు ప్రశాంత్‌కుమార్
పట్టించుకోని సలహాలు..‘‘పెళ్లి
అయ్యింది మొదలు వీరిని వదిలిపెట్టి ఒక్కరోజు కూడా ఉన్నది లేదు. పెద్ద పిల్లలకు
బాధ్యతలు అప్పజెప్పి, ఎక్కడైనా వెళ్లి నాలుగురోజులు ఉండి రావచ్చుగా! ’ అని కొందరు
సలహా ఇస్తుంటారు. కాని మనసొప్పదు. ఒకసారి వైజాగ్ వెళదామనుకున్నాం. పిల్లల్ని
ఒంటరిగా వదిలి వెళ్లాలనిపించలేదు. అందుకే వారందరితో కలిసి బయల్దేరాం. సినిమాకు
వెళ్లినా, షికారుకైనా వీరంతా ఉండాల్సిందే!’’ పిల్లలను దగ్గరకు తీసుకుంటూ ప్రశాంత్
చెబుతుంటే తనలోని తండ్రి మనసు కళ్లకు కడుతుంది.
దొరికిన ఆధారం...రెండేళ్లక్రితం ఒక ఆడపిల్లను
కన్నతల్లి ఆ బిడ్డను వీరి హోమ్‌లో వదిలి వెళ్లింది. ‘హోప్’ అని పేరుపెట్టుకొని
కన్నబిడ్డలా అక్కున చేర్చుకున్నారు ఈ దంపతులు. ‘‘ఏడాది క్రితం వరకు అద్దె ఇంట్లోనే
ఉన్నాం. దాతలు ఇచ్చిన స్థలంలో రెండుగదులకోసం ఇంటిపని మొదలుపెట్టాను. చేతిలో పైసా
లేదు. కాని ఏదో ధైర్యం. అపరంజి తన నగలను ఇచ్చింది. పని మొదలుపెట్టాను. అంతే! ఒకరు
సిమెంట్‌బస్తాలకు, ఇంకొకరు స్లాబ్ వేయడానికి... ఇలా స్థానికులు తమకు తోచిన సాయం
అందించారు.
మూడుగదులతో సిద్ధమైన ఇల్లు ఇప్పుడు పిల్లలకు ఆధారమైంది.
రెండేళ్ల క్రితం వరకు కట్టెల పొయ్యి మీద వంటలు చేసేవాళ్లం. ఇప్పుడు గ్యాస్ అమరింది.
రెండు నెలలకు సరిపడా సరుకులను ముందుగానే సిద్ధం చేసుకుంటాను. పిల్లలను
పస్తుపెట్టడమంటే దేవుణ్ని ఆకలితో అలమటించేట్టు చేయడమే అని నా భావన. అలాగని
ఎవరిదగ్గరా చేయి చాచి అడిగింది లేదు. నన్నూ, పిల్లలను చూసే తమకు తోచినసాయం
చేస్తుంటారు. నేను చేసే ఫొటోగ్రఫీ వర్క్, సిస్టమ్స్ బాగుచేసే పని మాకు ఇంత తిండి
పెడుతుంది. మనస్పూర్తిగా చేపట్టిన పనికి తోటివారి అండదండలు అడక్కుండానే
అందుతుంటాయనేది నేను నమ్మిన సిద్ధాంతం. వీరికో జీవనాధారాన్ని చూపించాలనేది మా తపన.
ఇదే మా లక్ష్యం’’ అని ముగించారు ఈ దంపతులు.
కన్నబిడ్డలను చూసుకోవడానికే
ఎన్నో అవస్థలు పడే ఈ కాలపు తల్లిదండ్రులు... ప్రశాంత్, అపరంజిల సేవాభావాన్ని చూసి
ఎంతో నేర్చుకోవచ్చనిపించింది. ‘పరిశుభ్రంగా ఉండవలసింది శరీరాలు కాదు, మనసులు!’ అని
తమ సేవాదృక్ఫథంతో తెలియజేసే ఈ అమ్మనాన్నలకు హ్యాట్సాఫ్ చెబుదాం. ఇలాంటి ఆపన్నులకు
మనమూ ఓ చేయూత అవుదాం.
- నిర్మలారెడ్డి,ఎవరికెవరూ తీసిపోరు!
‘‘నేను
చిత్తూరులో ఉండేవాణ్ణి. అమ్మానాన్న చనిపోయారు. ప్రశాంత్ అన్న దగ్గరికొచ్చి ఏడేళ్లు
అయ్యింది. టెన్త్‌క్లాస్ చదువుతున్నాను. పెద్దయ్యాక అటోమొబైల్ ఇంజనీర్‌ను
అవుదామనుకుంటున్నాను. మా అన్న నాకు కీ బోర్డ్ కూడా నేర్పిస్తున్నాడు’’ అని సాయిచరణ్
చెబుతుంటే నవ్య వచ్చి ‘నేను పైలట్‌నవుతా! అందుకే ఇప్పుడు బాగా చదువుతున్నాను’’
అంది. ‘‘మా వెంకీ థర్డ్‌క్లాస్ చదువుతుండు. క్రికెట్ మస్తు ఆడతడు’’ అని వెంకటేష్ తల
నిమురుతూ చెబుతున్న ప్రశాంత్ దగ్గరకు వచ్చిన అపరంజి ‘‘స్మైలీ, రోజీ, ప్రవల్లిక,
కీర్తన, కవిత, నవ్య.. ఎవరికెవరూ తీసిపోరు. చదువులో ఫస్టే కాదు, చిన్నపిల్లల బాధ్యత
తీసుకోవడంలోనూ ముందుంటారు. ఇక్కడ కులమతాలకు తావులేదు. అందరూ అన్నదమ్ముల్లా,
అక్కచెల్లెళ్లలా కలిసిపోతారు.
No comments:
Post a Comment