all

Wednesday, July 24, 2013

నాకు ఎదురైన పరాజయాలే నా కోచింగ్ క్లాస్‌లు

 
     
సూర్య స్ట్రయిట్ ఫిల్మ్ తెలుగులో ఒక్కటైనా లేదు.
సూర్యకి, తెలుగుకీ ఎక్కడా ఒక్క లింకైనా లేదు!
గొంతు మీద కత్తి పెట్టి అడగండి... తెలుగులో మాట్లాడమని...
రెండు చెవుల్నీ చేతుల్తో పట్టుకుని గుంజీలు తీస్తారు సూర్య!
అలాగని సూర్యను తెలుగువాళ్లు వదిలేశారా?!
‘గజనీ’ మన ఫ్రెండేరోయ్ అన్నారు.
‘వీడొక్కడే’ అన్నంతగా కలిపేసుకున్నారు.
లేటెస్టుగా సూర్య ఇప్పుడు ‘సింగం’లా గర్జిస్తుంటే....
థియేటర్లు క్లాప్స్‌తో ప్రతిగర్జన చేస్తున్నాయి!
ఇంకా చాలా విషయాల్లో సూర్య హీరో.
మంచి నాన్నగా హీరో, మంచి భర్తగా హీరో...
మంచి కొడుకుగా హీరో, మంచి అన్నగా హీరో...
అబౌ ఆల్... మంచి మనిషిగా హీరో!
ఏముంది సూర్యలో అంత హీరోయిజం?
చదవండి ఈవారం ‘తారాంతరంగం’ బై ద వే... జూలై 23... సూర్య, సన్నాఫ్ శివకుమార్ బర్త్ డే!


‘సింగం’గా ఓ రేంజ్‌లో గర్జించారే?
సూర్య: చాలా ఆనందంగా ఉందండీ. నేను ఏ సినిమా చేసినా తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొనే చేస్తా. కానీ అన్ని ఫలితాలూ ఒకలా ఉండవు కదా! కొన్ని హిట్ అయితే... కొన్ని ఫట్‌మంటుంటాయి. ఈ మధ్య నా సినిమాలు కొన్ని నెగిటివ్ ఫలితాలనిచ్చాయి. ఆ బాధనంతా ‘సింగం’ పటాపంచలు చేసేసింది. థియేటర్‌లో ప్రేక్షకులు హర్షధ్వానాలు చేస్తుంటే కడుపు నిండిపోతోందంటే నమ్మండి! రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఈ సినిమా చూశా. ఓ తమిళ నటుడి సినిమాను తెలుగువారు ఆదరిస్తున్న తీరు చూస్తే హృదయం పులకించిపోయింది.

తెలుగువారు మిమ్మల్ని అంతగా ఆదరిస్తున్నప్పుడు.. తెలుగు నేర్చుకోవడం మీ బాధ్యత కాదా?
సూర్య: కచ్చితంగా. తెలుగు భాషంటే నాకు భక్తి, గౌరవం. టైమ్ లేకే నేర్చుకోలేకపోతున్నాను.

మీ తమ్ముడు కార్తి కూడా ఖాళీ లేకుండా సినిమాలు చేస్తున్నారు. మరి ఆయన చక్కగా తెలుగు నేర్చుకున్నారే?
సూర్య: వాడి సినిమాలు మొదట్నుంచీ తెలుగులో డబ్ అవుతున్నాయి. పైగా కెరీర్ ప్రారంభం నుంచీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నాడు. కానీ నా విషయం అలా కాదు కదా! నా ఒక్కో సినిమా నిర్మాణానికీ దాదాపుగా రెండేళ్లు పడుతుంది. దాంతో తెలుగు నేర్చుకోవడానికి సమయం కుదరడంలేదు. అయినా... నేను కార్తి అంత స్పీడ్ కాదండీ. వాడు ఏదైనా అనుకున్నాడంటే సాధించేదాకా వదలడు. ఏది చేసినా క్లారిటీతో చేస్తాడు. మంచి మాటకారి కూడా. తన మాటలతో ఎవరినైనా ఇట్టే బుట్టలో వేసేసుకోగలడు. నాకా లక్షణాలు లేవు.

మీ తమ్ముడ్ని చూసి మీరు జెలసీగా ఫీలవుతారా?
సూర్య: జెలసీ కాదు... కాంపిటీటివ్‌గా ఫీలవుతాను. (నవ్వుతూ) త్వరలో వాడికంటే బాగా తెలుగు మాట్లాడేస్తా చూడండి. ఏది ఏమైనా నా తమ్ముడు గ్రేటండీ!

కార్తికి మీరేమన్నా సలహాలు ఇస్తుంటారా?
సూర్య: తమిళంలో ఓ సామెత ఉంది. ‘యుద్ధంలో సైన్యం మొత్తం అంతమైనా ఫర్లేదు. వెనుక తమ్ముడుంటే చాలు. ఆ తోడు లక్షల సైన్యం పెట్టు’ అని! అలా... నాతమ్ముడు నా ధైర్యం. ఇంతకుముందే చెప్పానుగా... వాడు ఏది చేసినా క్లారిటీతో చేస్తాడని! సలహాలిచ్చే రేంజ్ వాడిది, నాది కాదు.

తమ్ముడిపై మీకున్న ఎఫెక్షన్ చూస్తుంటే.. మీ చిన్నప్పటి విషయాలు తెలుసుకోవాలనిపిస్తోంది...
సూర్య: మా చిన్నతనం అందరూ అనుకున్నంత ఆనందంగా ఏం గడవలేదు. ఆడుతూ పాడుతూ ఎదిగిన పిల్లలం కాదు మేము. మా అమ్మానాన్నలకు మేం ముగ్గురు పిల్లలం. నేను, కార్తీనే మీకు తెలుసు. మా ఇద్దరికీ ఓ చెల్లెలు కూడా ఉంది. ఇంటికి నేనే పెద్ద కొడుకుని. అయితే... పెద్దకొడుక్కి ఉండాల్సిన లక్షణాలేవీ నాకు ఉండేవి కావు. భయం భయంగా ఉండేవాణ్ణి. ఆత్మవిశ్వాసం ఆవగింజంతైనా ఉండేది కాదు. ఆ వయసులో ఉండే చురుకుతనమూ ఉండేది కాదు. ఎప్పుడూ డల్‌గా ఉండేవాణ్ని. అప్పుడు నా ఆకారం కూడా పెక్యులర్‌గా ఉండేది. పీలగా ఉండేవాణ్ణి. దానికి తోడు పళ్లకు క్లిప్. చదువులో పూర్. ఒక్కో క్లాస్ రెండేళ్లు చదివేవాణ్ణి. 10వ తరగతి కూడా రెండేళ్లు చదివా. ఇంటర్ పూర్తిచేసి, డిగ్రీలోకి వెళ్లడానికి మూడేళ్లు పట్టింది. దాంతో నాన్న చేతిలో అక్షింతలు తప్పేవి కావు.

అంటే శివకుమార్‌గారు చాలా స్ట్రిక్ట్ అన్నమాట?
సూర్య: అన్నమాట కాదు ఉన్నమాటే! నాకింకా గుర్తు... సెవెన్త్‌క్లాస్‌లో మార్కులు సరిగ్గా రాకపోయేసరికి నా తల పగలగొట్టారు. అంత కఠినంగా ఉండేవారు. జీవితాన్ని క్రమశిక్షణతో గడపాలంటారాయన. అందువల్లే ఇంట్లో స్నేహపూరిత వాతావరణం అంతగా ఉండేది కాదు.

ఓ పెద్ద స్టార్ కొడుగ్గా మిమ్మల్ని స్కూల్లో అందరూ ప్రత్యేకంగా చూసేవారు అనుకుంటా?
సూర్య: అలాంటిదేమీ లేదు. ఎందుకంటే... మా నాన్న స్టార్ కాదు... పేరొందిన నటుడు మాత్రమే! దాదాపు 200 సినిమాల్లో నటించారాయన. తెలుగులో శోభన్‌బాబుగారిలా నాన్నకు ఫ్యామిలీ ఇమేజ్ ఎక్కువ. ఎన్ని సినిమాలు చేసినా... ఎంత పేరు గడించినా ఆయన బ్యాంక్ బ్యాలన్స్ మాత్రం ఏరోజూ మూడు లక్షలు దాటలేదంటే నమ్ముతారా! కానీ ఇది నిజం. అందుకే చిన్నతనం నుంచీ మాది మధ్య తరగతి జీవితమే!

అదేంటి? అంత బిజీనటుడికి 3 లక్షల బ్యాంక్ బ్యాలన్స్ మాత్రమేనా?
సూర్య: నాన్నది చాలా విలక్షణమైన మనస్తత్వం. విపరీతమైన జాలిగుణం. అందుకే ఆయన్ను అందరూ తేలిగ్గా మోసం చేసేవారు. తాను నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేయడానికి నిర్మాత ఇబ్బంది పడుతున్నట్లు తెలిస్తే... ఇక ఆ సినిమాకు పారితోషికం తీసుకునేవారు కాదు. సినిమా పూర్తి చేసిన నిర్మాత విడుదల చేయడానికి ఇబ్బంది పడుతుంటే... తానే మధ్యవర్తిగా ఉండి మరీ సినిమాను విడుదల చేయించేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో కారణాలు. నాన్న అతిమంచితనం ఓ సందర్భంలో మమ్మల్ని అప్పులపాలు చేసింది. అసలు నటుడవ్వాలనే ఆలోచన మొదలైంది నాకు అప్పుడే.

అంటే నటనపై మొదట్లో మీకు ఆసక్తి ఉండేది కాదా?
సూర్య: అస్సలు లేదు. సినిమా షూటింగ్స్ అంటేనే చిరాకు. ఓసారి నాన్న షూటింగ్ జరుగుతున్న చోటికి వెళ్లాను. నాన్న ఫ్యామిలీ హీరో కదా! అప్పుడేదో ట్రాజెడీ సీన్ తీస్తున్నారు. నాకు చెప్పలేనంత విసుగొచ్చేసింది. అప్పట్నుంచి షూటింగులకు వెళితే ఒట్టు. అలాగే ఓసారి తన సినిమా ప్రీవ్యూకు రమ్మని నాన్న అడిగారు. అప్పుడు నేను టీవీలో ఏదో కార్టూన్ షో చూస్తున్నాను. దాంతో రానని చెప్పేశాను. అప్పుడు నాన్న చాలా ఫీలయ్యారట. సినిమాలకు నేను ఏమాత్రం విలువ ఇచ్చేవాణ్నో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఓ సంఘటన చెప్పాలి మీకు. ఓ సారి నాన్న, నేనూ ఫ్లయిట్‌లో వెళుతున్నాం. నాన్నకు నన్ను నటుణ్ణి చేయాలని కోరిక. సినిమా ఇండస్ట్రీలో ఎదగడం ఎంత కష్టమో, చెడిపోవడం అంత సులువు. ఈ విషయం బాగా తెలిసిన వ్యక్తి నాన్న. అందుకే నా వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలనుకున్నారు. ఎన్నడూ లేని విధంగా ఫ్లయిట్‌లో వైన్ ఆఫర్ చేశారు. ‘నేను తాగను’ అన్నాను. ‘ఫర్లేదు తాగరా’ అని బలవంతంగా ఇవ్వబోయారు. కానీ నేను ససేమిరా అన్నాను. దానికి నాన్న ఎంత ఆనందపడిపోయారో చెప్పలేను! అప్పుడే ఆయన మనసులోని మాటను నా ముందుంచారు. ‘నేను సినీనటుణ్ని. ఇప్పటిదాకా మనల్ని ఆ నటనే బతికించింది. నా కొడుకుగా నువ్వు కూడా ముఖానికి రంగేసుకోవాల్సిందే. ఐతే... ఆ రోజు ఎప్పుడో నువ్వేచెప్పాలి’ అన్నారు. నాకు ఏం సమాధానం చెప్పాలో తెలీలేదు. కాసేపు మా ఇద్దరిమధ్య నిశ్శబ్దం. అప్పుడు చెప్పాను... ‘నాకు యాక్టింగ్ ఇష్టం లేదు నాన్నా’ అని. నాన్న షాక్. ‘మరి ఏం చేస్తావ్?’ అన్నారు నిర్లిప్తంగా. ‘నాకు బిజినెస్ అంటే ఇష్టం. నేను ఇండస్ట్రీలు పెట్టాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి వందల మందికి పని కల్పించడం గొప్ప విషయం కద నాన్నా’ అన్నాను. నాన్న నుంచి ఏం సమాధానం రాలేదు..!

మరి అందుకు తగ్గ ప్రయత్నాలు ఏమైనా చేశారా?
సూర్య: ఎందుకు చేయలేదు! బీకామ్ పూర్తవ్వగానే వ్యాపార మెళకువలు తెలుసుకోవడానికి ఓ కాటన్ ఫ్యాక్టరీలో చేరాను. జీతం 750 రూపాయలు. తొలిసారి జీతం అందుకున్న ఆనందక్షణాల్ని ఇంకా మరిచిపోలేదు. మూడు నెలలు మాత్రమే ఆ ఫ్యాక్టరీలో పనిచేశా. తర్వాత బీఎన్‌టీ ఎక్స్‌పోర్ట్స్ అనే మరో కంపెనీలో చేరాను. అక్కడ రోజుకు 18 గంటలు పని. డైలీ 150 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణం. రెండున్నరేళ్లు చేశాను ఆ ఉద్యోగం. జీవితం బోర్ అనిపించింది. ఏదైనా కొత్తగా చేయాలనే తపన మొదలైంది. అదే సమయంలో ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. నాన్న అతి మంచితనం వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను హీరోని చేయాలని నాన్న కలలు కన్నారు. కానీ ఆ ఆశలపై కూడా నేను నీళ్లు చల్లేశాను. దాంతో ఆయన చాలా దిగులుగా ఉండేవారు. ఇవన్నీ చూసి నా ఆలోచనలలో మార్పు రావడం మొదలైంది. డెరైక్టర్ ఉదయ్‌కుమార్‌గారిది మా ఇంటిపక్క ఇల్లు. మా ఇంటిసంగతి పూర్తిగా తెలిసిన మనిషి ఆయన. ‘మీరున్న పరిస్థితుల్లో నువ్వు నటుడవ్వడమే కరెక్ట్. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లు. నువ్వు హీరోగా పనికిరావని ఎందుకు అనుకుంటున్నావ్. ఒక్కసారి నువ్వు ‘ఓకే’ అను. సినిమా ఇండస్ట్రీనే నిన్ను హీరోని చేస్తుంది! డ్యాన్సులు, ఫైట్లు అన్నీ వాళ్లే నేర్పుతారు’ అన్నారు. ‘నువ్వు ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టాలంటే... దాదాపు కోటి రూపాయలు కావాలి. కానీ, ఇప్పుడు మీరు అప్పుల్లో ఉన్నారు. అందుకే, నా మాట విని హీరో అయిపో...’ అంటూ ఎంతో అనునయంగా చెప్పారు. ఆయన చెప్పిన మాటలతో నా మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయింది.

తొలి అవకాశం ఎలా వచ్చింది?
సూర్య: నటుడిగా నాకు తొలి అవకాశం ఇచ్చింది మణిరత్నంగారు. నా తొలి సినిమా ‘నేరుక్కు నేర్’. వసంతబాలన్ దర్శకత్వంలో మణిరత్నం ఆ సినిమాను నిర్మించారు. నేను యాక్టర్‌ని అవుతానని నాన్నకు చెప్పగానే... ఆయన ముందు చేసిన పని నా ఫొటోలను మణిరత్నంగారికి పంపించడం. నా ఫొటోలు చూడగానే.. ‘ఇతనిలో మంచి నటుడున్నాడు’ అని చెప్పేశారట మణిరత్నం. నాపై నాకున్న నమ్మకాన్ని పక్కనపెట్టి, కేవలం మణిరత్నంగారిపై ఉన్న నమ్మకంతో ఆ సినిమా చేశాను.

ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోలేదా?
సూర్య: ప్రతిరోజూ నేను అనుభవించిన ఒత్తిడే నాకు శిక్షణ. కెరీర్‌లో నాకు ఎదురైన పరాజయాలే నా కోచింగ్ క్లాస్‌లు.

సరే... ఆ విషయాన్ని పక్కనపెడదాం. జ్యోతికగారితో మీ పరిచయం ఎలా ఏర్పడింది?
సూర్య: దానికి కారణం మీ మీడియావారే. ఉన్నవీ లేనివీ కల్పించి మాపై రూమర్లు క్రియేట్ చేశారు. వాటి కారణంగానే మా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. నేను, జ్యోతిక జంటగా అయిదు చిత్రాల్లో నటించాం. కలిసి నటించిన తొలిసినిమా మాత్రం ‘పూవెల్లామ్ కెట్టుప్పార్’. ఆ సినిమా షూటింగ్‌లోనే మొదటిసారి జ్యోతికను కలిశాను. ఆ సినిమా అయిన వెంటనే ఇద్దరం కలిసి ‘ఉయిరిలే కలందుదు’ చిత్రంలో నటించాం. వరుసనే రెండు సినిమాల్లో కలిసి నటించామో లేదో... మా ఇద్దరికీ లింకులు పెట్టేసి రాయడం మొదలుపెట్టారు. దాంతో కలిసినప్పుడల్లా ఆ రూమర్ల గురించి మాట్లాడుకొని నవ్వుకునేవాళ్లం. అది పక్కనపెడితే... వర్క్ విషయంలో ఆమె సిన్సియారిటీ నాకు బాగా నచ్చేది. రానురాను తెలీకుండానే జ్యోతికకు ఫ్యాన్‌ని అయిపోయాను. నా ‘నంద’ సినిమా షూటింగ్ పనిమీద ఓసారి రామేశ్వరానికి రెండువందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరికి వెళ్లాల్సి వెళ్లాను. సరిగ్గా అదేరోజు జ్యోతిక నటించిన ‘123’ సినిమా రిలీజవుతోంది. షూటింగ్ సాయంత్రమని మాడెరైక్టర్ బాల చెప్పడంతో... 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి రామేశ్వరం వెళ్లి సినిమా చూసి వచ్చేశాను. జ్యోతిక చాలా మంచి నటి. అంతేకాదు... తను పనిచేసేది చిన్నదర్శకునితో అయినా, పెద్ద దర్శకునితో అయినా వర్క్ విషయంలో తేడా చూపించదు. అంతటి సిన్సియర్.

పెళ్లి కాకముందు జ్యోతికతో మీ మెమొరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా చెబుతారా?
సూర్య: ‘నంద’ తర్వాత నా కెరీర్ కాస్త స్లో అయ్యింది. రెండేళ్లు గ్యాప్ వచ్చింది. ఆ టైమ్‌ని వృథా చేయకుండా ఫైటింగులు, జిమ్నాస్టిక్స్ నేర్చుకునేవాణ్ని. ఓరోజు చెన్నయ్ వైఎంసీ గ్రౌండ్స్‌లో జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అదే టైమ్‌లో జ్యోతిక, అజిత్ జంటగా నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్ అక్కడే జరుగుతోంది. జిమ్నాస్టిక్స్ చేస్తున్న నన్ను చూసి తన అసిస్టెంట్ ద్వారా కబురు పంపించింది జ్యోతిక. నేనేమో వళ్లంతా మట్టి కొట్టుకుపోయి, చెమట వాసనతో ఉన్నాను. దాంతో తర్వాత కలుస్తానని అతనితో చెప్పి తప్పించుకొని వెళ్లిపోయాను. అప్పటికే తనను కలిసి చాలా నెలలైంది. దాంతో తనే వచ్చి ‘ఎందుకు నాకు దూరంగా తిరుగుతున్నారు’ అని అడిగేసింది. తన ఫోన్ నంబర్ నాకిచ్చింది. నా ఫోన్ నంబర్ తను తీసుకుంది. ‘ఇక నుంచి ఇద్దరం టచ్‌లో ఉందాం... అర్థమైందా?’ అని సీరియస్‌గా చెప్పి వెళ్లిపోయింది. ఎంతమంది హీరోయిన్లతో నటించినా జ్యోతికంటే నాకు ఓ ప్రత్యేకమైన అభిమానం. సేమ్ టు సేమ్ తను కూడా నా విషయంలో అలాగే బిహేవ్ చేసేది. ఓ విధంగా ఆమె పరిచయం నా సినిమా కెరీర్‌ని కూడా పూర్తిగా మార్చేసింది. నా కెరీర్‌లో తొలి మేజర్ హిట్ ‘కాక కాక’. ఆ సినిమా కథను గౌతమ్ మీనన్ చాలామంది హీరోలకు వినిపించారట. కానీ ఎవరూ ఓకే చెప్పలేదు. హీరోయిన్‌గా మాత్రం అప్పటికే జ్యోతిక సెట్ అయిపోయి ఉన్నారు. తనే గౌతమ్ దగ్గర నా పేరును రికమెండ్ చేసింది. ఓసారి నేను నటించిన ‘నంద’ సినిమా చూడమని గౌతమ్‌కి చెప్పింది. ‘నంద’ చూశాక... ‘కాకా కాకా’లో పాత్రకు నన్ను తీసుకున్నారు గౌతమ్. ఏదిఏమైనా ‘జో’ దేవుడు నాకిచ్చిన ఓ అందమైన, అపురూపమైన బహుమతి.

మీ ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరు?
సూర్య: ప్రపోజల్ ఏమీ లేదు. అలా జరిగిపోయింది అంతే! ఒకరి నంబర్ ఒకరు తీసుకున్నాం కదా... ఇక రోజూ ఫోన్లలో మాట్లాడుకునేవాళ్లం. కొంతకాలం తర్వాత మాపై మాకే అనుమానం వచ్చింది. ఏంటి పరిధి దాటుతున్నామా? అని! అంతే! ఇక నుంచి ఫోన్లు చేసుకోకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నాం. ఒకరికొకరం ప్రామిస్ కూడా చేసుకున్నాం. కానీ ఉండలేకపోయాం. ప్రామిస్ తప్పేశాం. అలా మూడుసార్లు ఒట్టు తీసి గట్టుమీద పెట్టేశాక అర్థమైంది... మా మధ్య తెలీని కెమిస్ట్రీ ఏదో వర్కవుట్ అవుతోందని! ఇక పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని ఇద్దరం అనుకున్నాం. అయితే... నేనే కండిషన్ పెట్టాను... నా చెల్లి పెళ్లి అయ్యేదాకా ఆగాలని. తను కూడా ‘ఓకే’ అంది. అనుకున్న విధంగా మా చెల్లి పెళ్లి కాగానే, ఇరువర్గాల పెద్దలనూ ఒప్పించి ఒక ఇంటివారం అయిపోయాం.

తెరపై హీరోయిన్లతో ఓ రేంజ్‌లో రొమాన్స్ చేస్తుంటారు కదా... జ్యోతిక ఎలా ఫీలవుతారు?
సూర్య: మా ఇంట్లో వాళ్లు నేను హీరో అవ్వగానే నా నుంచి ప్రామిస్ తీసుకున్నారు... ‘నువ్వు హీరోయిన్‌ని మాత్రం పెళ్లి చేసుకోకూడదు’ అని. కానీ నేను మాట తప్పాను. (నవ్వుతూ) హీరోయిన్‌నే చేసుకున్నాను. ‘జో’ కూడా సినిమాల్లో చాలామంది హీరోలతో నటించినా, నేను తెరపై ఏ హీరోయిన్‌తోనయినా క్లోజ్‌గా కనిపిస్తే మాత్రం తన ముఖంలో వింత మార్పులు కనిపిస్తుంటాయి.

మీ పిల్లల గురించి చెప్పండి?
సూర్య: మాకు ఓ పాప, ఓ బాబు. పాప పేరు దియా. తనకి ఆరేళ్లు. బాబు పేరు దేవ్. వాడికి మూడేళ్లు. వాళ్ల అల్లరి చూస్తేనే కడుపు నిండిపోతుంటుంది. వాళ్లిద్దరినీ గుండెలకు హత్తుకుంటే కలిగే ఆనందమే వేరు! ఈరోజు నేను పొందుతున్న ఆనందాన్ని అప్పట్లో నాన్న పొందలేకపోయారనే చెప్పాలి. పాపం! ఎప్పుడూ షూటింగ్స్‌లోనే ఉండేవారాయన. ఎప్పుడో.. మేం నిద్రపోయాక ఇంటికొచ్చేవారు. బహుశా నిద్రపోతున్నప్పుడే మమ్మల్ని ముద్దుపెట్టుకొని ఉంటారేమో! అలా ఆయన మమ్మల్ని ఎన్నిసార్లు ముద్దుపెట్టుకొని ఉంటారో తెలీదు కానీ... మేం మాత్రం నాన్నను ఒక్కసారి కూడా ముద్దు పెట్టుకోలేదు. కనీసం ఆయన్ను హత్తుకొని నిద్రపోలేదు. అందుకే మేం కూడా తండ్రి ప్రేమను సరిగ్గా పొందలేకపోయామనే చెప్పాలి. అందుకే ఆ లోటును నా పిల్లలకు మాత్రం కలగకుండా జాగ్రత్త పడుతున్నాను. నా పిల్లలు నాకు రోజూ ముద్దులు పెడతారు. నా గుండెలపై పడుకుంటారు. వాళ్లు గొడవ చేస్తుంటే నేను అస్సలు అడ్డు చెప్పను. వాళ్లు నన్ను కొట్టినా, నా తలపై కాళ్లు పెట్టినా నాకు ఆనందమే.

పెళ్లయ్యాక జ్యోతికకూ మీకు ఎప్పుడైనా గొడవలయ్యాయా?
సూర్య: భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గిల్లికజ్జాలు కామన్. అంతే తప్ప పెద్ద పెద్ద గొడవలేం మా మధ్య జరగలేదు. జరగకూడదనే కోరుకుంటున్నాను. నాకు తనపై కోపం వచ్చిందనుకోండీ... తనే వచ్చి ‘సారీ’ చెప్పేస్తుంది. అలాగే... జో సీరియస్‌గా ఉందనుకోండీ.. నేనే స్వయంగా వెళ్లి క్షమాపణ వేడతాను. ఎవరికి కోపం వచ్చినా... అయిదు నిమిషాలకు మించి ఉండదు.

మీ అమ్మానాన్నా జ్యోతికతో ఎలా ఉంటారు?
సూర్య: వాళ్లు ఒకర్ని వదిలి ఒకరు ఉండలేనంతగా కలిసిపోయారు. వాళ్లకు నేను హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఇంతకుముందే చెప్పానుగా. కానీ ఇప్పుడు మాత్రం జ్యోతిక లాంటి కోడలు వచ్చినందుకు ఎంత ఆనందిస్తున్నారో మాటల్లో చెప్పలేను. మీకో విషయం తెలుసా? ఇప్పటికీ మాది ఉమ్మడి కుటుంబమే. మా అందరికోసం ఇటీవలే కొత్తగా ఓ ఇల్లు కట్టుకున్నాం. అందులో అమ్మానాన్నా, నా ఫ్యామిలీ, తమ్ముడు ఫ్యామిలీ... అందరం కలిసే ఉంటాం.

సరే... కాసేపు సినిమాల విషయానికొద్దాం. మీ నాన్నగారు శివకుమార్... తమిళనాట పౌరాణిక పాత్రలు పోషించడంలో దిట్ట. మీరు కూడా అలాంటి పాత్రలు ట్రై చేయొచ్చు కదా?
సూర్య: కె.రాఘవేంద్రరావుగారి లాంటి దర్శకుడు తెలుగులో ఉన్నారండీ. కానీ తమిళంలో అలాంటి సినిమాలను హ్యాండిల్ చేసే దర్శకులు లేరు. హీరోగా నాకున్న బిజినెస్ స్పాన్ పెద్దది. ఒక్క తమిళులే కాదు... తెలుగువారు, విదేశీయులు కూడా నా సినిమాలు చూస్తున్నారు. అందుకే నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో నేను రిస్క్ చేయడం కరెక్ట్ కాదు.

శివపుత్రుడు, గజిని, సూర్య సన్నాఫ్ కృష్ణన్, సుందరాంగుడు.. ఇలా చాలెంజింగ్ రోల్స్ చేసిన మీరు ఒక్కసారిగా యుముడు, సింగం 2 అంటూ మాస్ పాత్రలు చేయడం మొదలుపెట్టారే?
సూర్య: ఈ విషయంలో నాకు ప్రేరణ అమితాబ్‌బచ్చన్, రజనీకాంత్. స్టార్‌డమ్ ప్రకారం చూస్తే... వీరిద్దరూ అందనంత ఎత్తులో ఉన్నారు. కానీ వీరిద్దరూ ఎంత గొప్ప సూపర్‌స్టార్లో... అంత గొప్ప నటులు కూడా. వారు నటించిన పాత్రలను ఒక్కసారి పరికించి చూస్తే ఆ విషయం మీకు అవగతం అవుతుంది. పూర్తి మసాలా సినిమా అయినా... అందులోని వారి పాత్రలు మాత్రం జనహృదయాల్లో నిలిచిపోతాయి. ప్రస్తుతం నేను వారినే ఫాలో అవుతున్నాను. సినిమాలో కమర్షియల్ అంశాలుండాలి. పాత్ర చాలెంజింగ్‌గానూ ఉండాలి. అలాంటి పాత్రలనే ఎంచుకుంటున్నా.

కానీ నటునిగా మీరు చేసిన ప్రయోగాలు చూస్తే మీకు కమల్‌హాసన్ ప్రేరణేమో అనిపిస్తుంది?
సూర్య: ఒక స్టార్‌గా నాకు రజనీ, అమితాబ్ ప్రేరణ. కానీ నటునిగా మాత్రం కచ్చితంగా నాకు కమల్‌సారే ఆదర్శం. మా నాన్నగారు చాలామందికి నటులకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. కానీ నాకు మాత్రం కమల్‌గారే ఇన్‌స్పిరేషన్. నటునిగా ఆయన చేసిన ప్రయోగాలు ఎవరూ చేయలేరు. ఈ సాహస నటప్రయాణంలో ఆయన ఎన్నోసార్లు కిందపడి, మళ్లీ పైకి లేచారు. కానీ నేటికీ అలిసిపోలేదు. నటునిగా ఆయన ఆడుగుజాడలే నాకు మార్గదర్శకాలు. ఏది ఏమైనా కమల్, అమితాబ్, రజనీకాంత్... ఈ ముగ్గురూ నాకు త్రిమూర్తులతో సమానం! వారినుంచి సిన్సియారిటీ, హార్డ్‌వర్క్ అంటే ఏంటో తెలుసుకున్నాను. తెరపై ఎలా కనిపించాలో అవగతం చేసుకున్నాను.

మీ అగరం ఫౌండేషన్ సేవాకార్యక్రమాలు ఎందాకా వచ్చాయి?
సూర్య: ఈరోజు నా జీవితానికి ఓ పరిపూర్ణత్వం వచ్చిందంటే... దానికి కారణం అగరం ఫౌండేషన్. ఆత్మానందం, ఆత్మసంతృప్తి అనే పదాలకు అర్థం తెలిపింది ఈ ఫౌండేషన్. ఈ క్రెడిట్ నేను సాధించగలిగానంటే దానికి కారణం సినిమా. కేవలం నటుణ్ణి కావడం వల్లే ఇంత భారాన్ని సమర్థవంతంగా మోయగలుగుతున్నాను. ఈ ఫౌండేషన్‌ను స్థాపించి నాలుగేళ్లయ్యింది. ఎనిమిది వేలమంది ఐటీ నిపుణులు ఈ సంస్థలో వాలెంటీర్లుగా పనిచేస్తున్నారు. 500 మంది కోర్ టీమ్ ఈ ఫౌండేషన్ కోసం పనిచేస్తోంది. ఈ ఫౌండేషన్‌లో విద్యార్థుల్ని చేర్చుకోవాలంటే... కేవలం మార్కులనే కాకుండా, ఇంకా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తరతరాలుగా నిరక్షరాస్యులుగా ఉండిపోయి మొదటిసారి బడి గడప తొక్కుతున్న కుటుంబాలకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. అంతేకాదు, ప్రతిభతో పాటు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న విద్యార్థులకు కూడా ఈ ఫౌండేషన్‌లో చేరే అవకాశం లభిస్తుంది. ఇంటర్ రెండవ సంవత్సరం వరకూ వారిని మేమే చదివిస్తాం. అలాగే పై చదువులు చదవడానికి కూడా కావాల్సిన వెసులుబాటును మేమే కల్పిస్తాం. పై చదువులకు అర్హతగల విద్యార్థులను మా వాలెంటీర్లే ఎంపిక చేస్తారు. దానికి ఓ పద్ధతి ఉంది. పరీక్ష 300 మార్కులకు అనుకోండి... అందులో 150 మార్కులు సబ్జెక్ట్‌లకు సంబంధించి ఉంటాయి. విద్యార్థి తల్లిదండ్రులు లేనివాడైతే... అదనంగా యాభై మార్కులు. నాన్న ఉండి అమ్మ లేనివాడైతే 40 మార్కులు, అమ్మ మాత్రమే ఉండి నాన్న లేకపోతే... ఇరవై మార్కులు. దీనితో పాటు... ఇంట్లో ఒకే బల్బు, ఒకే మంచం ఉండి, నెలకు 2500రూ. మాత్రమే సంపాదించే కుటుంబానికి సంబంధించిన కుర్రాడైతే... మరో పాతిక మార్కులు వేస్తాం. ఈ అర్హతలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని యేటా రెండువందల మంది విద్యార్థులను ఎంపిక చేసి... వారి పై చదువులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చేస్తాం. ఈ ఫౌండేషన్ ద్వారా జీవితంలో స్థిరపడిన వాళ్లను చూస్తుంటే చెప్పలేనంత సంతృప్తి కలుగుతోంది. జీవితానికి ఒక అర్థం ఏర్పడినట్టు అనిపిస్తోంది!

బుర్రా నరసింహ

మీరు గజనీ చేశారు... అదే పాత్రను బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్ చేశారు. మీ ఇద్దరిలో ఎక్కువ మార్కులు వేయాల్సి వస్తే... మీరు ఎవరికి వేస్తారు?
సూర్య: కచ్చితంగా అమీర్‌సాబ్‌కే వేస్తా. అసలు ఆ పాత్ర ఎలా చేయాలో చూపించారాయన. స్క్రిప్ట్‌లో ఉన్న చిన్న చిన్న తప్పుల్ని కూడా సవరించి, సెల్యులాయిడ్‌పై ఓ అద్భుతాన్ని ఆవిష్కరింపజేశారు. పాత్ర కోసం ఆ వయసులో ఆయన సిక్స్‌ప్యాక్ చేయడం నిజంగా గ్రేట్. నిజానికి సంజయ్ రామస్వామి పాత్రను నేను బాగా చేశానని చెప్పాలి. ఎందుకంటే... నా వయసు ఆ పాత్రకు బాగా ఉపయోగపడింది. కానీ మెమొరీలాస్ పాత్ర గురించి చెప్పాల్సి వస్తే మాత్రం... ఆమిర్‌ఖాన్ నటన అనితరసాధ్యం. నార్త్‌లో నాకు గుర్తింపు రావడానికి కారణం ఆయనే. కానీ ఆమిర్ మాత్రం ఎప్పుడూ తనను తాను తగ్గించుకొనే మాట్లాడతారు. ఆ సినిమా టైమ్‌లో ఆయన మీడియావారితో మాట్లాడుతూ ‘‘నేనేం ఈ పాత్ర గొప్పగా చేయలేదు. జస్ట్ సూర్యని కాపీ కొట్టానంతే’ అని చెప్పారట. నటునిగా నాకు ఈ మార్కులు చాలవా!

********

నా మొదటి సినిమా ‘నేరుక్కు నేర్’ చేసే ముందు ఒకటే అనుకున్నా... ‘ఒకవేళ సినిమా ఆడకపోయినా, నటునిగా నేను జనాలకు నచ్చకపోయినా... నాకు అన్నం పెట్టడానికి నా చదువు ఉంది. ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బతికేయగలను’ అని! 1997 సెప్టెంబర్ 6న విడుదలైన ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాకు నాకిచ్చిన పారితోషికం ఎంతో తెలుసా? 50 వేలు. అంత పెద్ద మొత్తాన్ని ఒక్కసారి అందుకున్న తర్వాత ఇంకా దృఢంగా నిశ్చయించుకున్నా... ‘సూర్య ఇక హీరో’ అని! దైవదత్తమో ఏమో... ఊహించలేనంత ఆత్మవిశ్వాసం నాలో ప్రవేశించింది. ఎంతంటే... డ్యాన్స్ అనేది చూడటం తప్ప ఏనాడూ చేయని నేను... డ్యాన్స్‌లో మంచి పరిణతి సాధించా! శరీరాన్ని హింసించుకొని మరీ ఫైట్లు నేర్చుకున్నా. ప్రేమను ఎలా వ్యక్త పరచాలి? కోపాన్ని ఎలా ప్రదర్శించాలి? ఇవన్నీ ఇంట్లోనే అద్దం ముందు కూర్చొని ప్రాక్టీస్ చేశాను.

No comments: