all

Monday, October 21, 2013

ఆడపడచుల ఆటపాటల పండుగ... అట్లతద్దె

ఆడపడచుల ఆటపాటల పండుగ... అట్లతద్దె
ఆశ్వయుజ బహుళ తదియ నాడు అట్లతద్దె నోము నోచుకోని తెలుగువారు అరుదు. అందుకే అష్టాదశ వర్ణాలకు అట్లతద్దె అని సామెత. కన్నెపిల్లలు తమకు సలక్షణమైన భర్త రావాలని, వివాహితలు తమ కాపురం కలకాలం సంతోషంగా సాగాలనీ కోరుతూ నోచే నోము అట్లతద్దె. ఈ నోమును మొట్టమొదటిసారిగా గౌరీదేవి నారదముని ప్రోద్బలంతో నోచుకుని సాక్షాత్తూ పరమేశ్వరుని పతిగా పొందిందని పురాణోక్తి.


తూరుపు తెలతెలవారకముందే కన్నెపిల్లలు, కొత్తపెళ్లికూతుళ్ల కాళ్లు పారాణితోనూ, చేతులు గోరింటాకుతోనూ, నోరు తాంబూలంతోనూ, చెంపలు సిగ్గుతోనూ ఎర్రగా పండే పండుగ అట్లతద్దె. కొత్త పరికిణీ, వోణీ, మువ్వల పట్టాలు ధరించి ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్- ముద్దపప్పోయ్ మూడట్లోయ్... పీటకిందా పిడికెడు బియ్యం పిల్లల్లారా జెల్లల్లారా లేచిరండోయ్.. ’ అంటూ ముచ్చటగొలిపే ఆటపాటలతో ఆడపిల్లలు ఊరంతా సందడి చేస్తారు.

సాయంత్రం సంజెచీకట్లు పడేసరికల్లా అట్లతద్దెనోము చంద్రోదయ వేళకు గౌరమ్మను షోడశోపచారాలతో పూజించి- పసుపు, కుంకుమ, రవికెల గుడ్డ సమర్పించి అట్లు నివేదించి, ముత్తయిదువలకు పండు, తాంబూలం, అట్లు వాయనమిస్తారు. వారు నిండు మనస్సుతో ‘‘మంచి మొగుడొచ్చి పిల్లాపాపలతో నీ కాపురం నిండు నూరేళ్లు చల్లగా సాగాలి’’ అంటూ ఆశీస్సులందిస్తారు.

వ్రతవిధానం: ఆశ్వయుజ బహుళ తదియనాడు కన్నెపిల్లలు, కొత్తగా పెళ్లయిన ఆడపడచులు తెల్లవారు ఝామున లేచి చద్దెన్నం, పొట్లకాయకూర, గోంగూర పచ్చడి, నువ్వులపొడి, ఉల్లిపాయ పులుసు, గడ్డపెరుగుతో భుజించి తాంబూలం వేసుకోవాలి. ఆ తర్వాత తిన్న అన్నం వంటబట్టేదాకా ఆటపాటలతో గడపాలి. హాయిగా ఊయలలూగాలి. అనంతరం స్నానపానాదులు పూర్తి చేసుకుని గౌరీదేవిని పూజించాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్ర ం ఆకాశంలో తారాచంద్రులు తొంగి చూసే సమయానికి శుచిగా తయారై, గౌరీ పూజ చేసి అమ్మవారికి వారి వారి ఆనవాయితీ  ప్రకారం నిర్ణీత సంఖ్యలో అట్లు నివేదించాలి. తర్వాత ఒక ముత్తయిదువను గౌరీదేవి ప్రతిరూపంగా భావించి, ఆమెకు అలంకారం చేసి, అట్లు, పండు తాంబూలం వాయనంగా ఇవ్వాలి.

ఉద్యాపన విధానం: పదిమంది ముత్తయిదువలకు ఒక్కొక్కరికి ఒక నల్లపూసల గొలుసు, లక్కజోళ్లు, రవికెల గుడ్డ, దక్షిణ, తాంబూలంతో పది అట్లు చొప్పున వాయనం ఇవ్వాలి. అనంతరం వారికి భోజనం పెట్టి సంతుష్టి పరచి వారి వద్ద నుండి ఆశీస్సులందుకోవాలి.

శాస్త్రీయ దృక్పథం: మన పెద్దలు ఏర్పరచిన ప్రతి సంప్రదాయం వెనుకా ఎంతో అమూల్యమైన శాస్త్రీయ దృక్పథం ఉంది. అట్లతద్ది నోములో కూడా అంతే విశిష్ఠత ఉంది. నవగ్రహాలలోని కుజునికి అట్లంటే ప్రీతి. కుజునికి అట్లను నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమవడమేగాక సంసారంలో ఎటువంటి అడ్డంకులూ రావు. రజోగుణం కల కుజుడు స్త్రీలకు రుతుసంబంధమైన సమస్యలు, గర్భధారణ సమస్యలకు కారకుడు. కుజునికి అట్లు నివేదించడం వల్ల అటువంటి సమస్యలు తలెత్తవు. అట్లను తయారు చెయ్యడానికి వాడే మినప పిండి, బియ్యప్పిండి మిశ్రమంలో మినుములు రాహువుకూ, బియ్యం చంద్రునికీ సంబంధించినవి. అందువల్ల ఈ రెండూ కలిసిన అట్లను వాయనంగా ఇవ్వడం వల్ల గర్భదోషాలు తొలగి సుఖప్రసవం అవుతుంది.

గౌరీదేవికి ఆటపాటలంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ వ్రతంలో భాగంగా ఆడపిల్లలంతా తెల్లవారుజామున మసక మసక వెలుతురులో ముందురోజే చెట్లకొమ్మకి కట్టి ఉంచిన ఉయ్యాలలు ఊగేందుకు వెళుతూ తమ స్నేహితురాళ్లందరికీ వినిపించేలా చప్పట్లు చరుస్తూ పాటలు పాడతారు. ఆ చప్పట్లకీ ఆటపాటలకీ, కోలాహలానికీ గలగల నవ్వుల సవ్వడికీ సాటి ఆడపిల్లలు, వారికి తోడుగా ఈడైన కుర్రకారు అక్కడికొచ్చి సందడి చేస్తారు. మొత్తం మీద అట్లతద్దె అంటే సంప్రదాయకంగా నోచే నోము మాత్రమే కాదు, ఆటపాటలతో గడిపే సంబరం కూడా.

 - డి.వి.ఆర్

 అట్లతద్ది సందేశం: అట్లతద్ది రోజు ఆటలాడటం వల్ల నడుము గట్టిపడుతుంది. తద్దెపాటలు లోకంలో బతకాల్సిన తీరు గురించి సందేశమిస్తాయి.

No comments: