all

Monday, November 11, 2013

కార్తీకమాసము



కార్తీకమాసంతో సమానమైనమాసం, విష్ణువుతో సమానమైన దైవం, వేదంతో సమానమైన శాస్త్రం,గంగతో సమానమైన తీర్దం లేదని చెప్తారు. సూర్యుడు తులారాశిలోకి రాగానే కార్తీకమాసం ఆరంభమైంది.
పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.

హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం మహిళలు ఈ మాసంలో విశేష పూజలు జరుపుకుంటారు. శివ కేశవులకు అద్యంత ప్రియమైన ఈ మాసంలో ఆచరించవలసిన వ్రతాలు,చేయవలసిన దీపారాధనల గురించి….
కార్తీకమాసంలో ఆధ్యాత్మిక సాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ నెల మొత్తం తెల్లవారుజాముల నదీతీరంలోగాని, చెరువులు, కొలనులు, బావుల వద్ద స్నానం చేయాలి. స్నానానంతరం ఓం ప్రభాకరాయనమః, ఓం దివాకరాయమః, ఓం ప్రభాకరాయమః, ఓం అచ్చుతాయమః, ఓం నమో గోవిందాయనమః అనే నామాలను స్తుతిస్తూ సూర్యభగవానునికి ఆత్గ్యం పోయాలి. ఈ నెల మొత్తం ఇంటి ముందున్న ప్రధాన ద్వారానికి రెండువైపులా దీపాలను వెలిగించాలి.

ఉత్థాన ఏకాదశి

ఈ మాసంలో వచ్చే కార్తీకశుద్ధ ఏకాదశి ఎంతో వైశిష్ట్యం వుంది.ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి వివాహం జరిగిన రోజుగా భావిస్తారు.దీన్నే కొన్ని ప్రాంతాల్లో ఉత్థాన ఏకాదశిగా పిలుస్తుంటారు. ఉత్థాన ఏకాదశినాడే దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినట్టు పురాణాలు పేర్కొన్నాయి. ఈరోజు ఉపవాసం వుండి మరుసటిరోజు ద్వాదశి పారయణం చేస్తే ఎంతో మంచిది. ఈ కార్తీకమాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వున్న శివుడు అత్యంత వైబోవోపేతంగా పూజలందుకుంటారు ప్రధానంగా భక్తులు కార్తీకమాసంలో శివాలయానికి వెళ్ళి పార్వతీ-సమేత పరమేశ్వరునికి భస్మలేపనం, బిల్వపత్రాలు, అవిసే పూలతో పూలతో పూజలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మిక.

కోరికలను తీర్చే దీపపు కాంతులు

పౌర్ణమిరోజు వేకువజామున గ్రామాల్లో చెరువులు లేదా నదుల్లో మహిళలు అరటిదొప్పలతో దీపాలను పెట్టి నీటిలోకి వదులుతుంటారు. ఈ సమయంలో కోరుకున్న కోర్కెలు నెరవేరతాయనే సంకల్పంతో వివాహం కాని యువతులు భక్తిశ్రద్ధలతో కార్తీకదీపాలను నదుల్లో వదులుతారు.
పూర్వం శౌనకాది మహర్షులతో కలిసి ఆశ్రమం నిర్మించుకుని నైమి శారణ్యంలో నివసిస్తున్న అదిగురువు సూత మహర్షి కార్తీకవ్రత మహత్మ్యం, దానిని ఆచరించే విధానం గురించి ఋషులకు బోధించాడు. ఇలాంటి వ్రతమే కావాలని పార్వతీదేవి కుడా ఈశ్వరుని ప్రార్థించినట్టు పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు నారదనికి, మహావిష్ణువు లక్ష్మిదేవికి ఈ వ్రతవిధానం చెప్పారు. దీని గురించి స్కందపురాణంలో కూడా వివరించడం విశేషం.

కార్తీక పౌర్ణమిరోజు రాత్రి 12 గంటలకు పాలలో చంద్రుడిని చూసి ఆ పాలను తాగితే ఎంతో ఆరోగ్యమని పండితులు చెబుతుంటారు. ఈ రోజు బ్రాహ్మీ సమయంలోనే తులసిని పూజిస్తారు. పౌర్ణమిరోజు ఆవు నెయ్యితో తడిపిన దారపువత్తుల దీపాలు వెలిగించి తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టి 365 వత్తులతో హారతి ఇవాలి. నక్షత్రాలు కనుమరుగు కాకముందే ఈ పూజ చేస్తే చాలా మంచిది.

కార్తీక సోమవారాలు - నదీస్నానాలు

కార్తీకమాసం వచ్చిన వెంటనే నదీస్నానం అత్యంత ప్రధాన మైనదని భక్తులు నమ్ముతుంటారు. లోకరక్షకుడైన సూర్యభగవానుడు కార్తీకమాసంలో వేకువవేళల్లో తులారాశిలో సంచరిస్తున్నప్పుడు నదీ స్నానం చాలా మంచిదని ఋషులు పేర్కొన్నారు. మనఃకారకుడైన చంద్రుని ప్రభావం దేహంపైన, మనస్సుపైనా వుంటుంది. మానసిక దేహారోగ్యానికి కార్తీక మాసంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది.


దీనిని నివారించడానికి ప్రతి సోమవారం లయకారకుడైన శివుడుని ధ్యానించాలనే ఉద్దేశంతో పూర్వం నుంచి ఈ అనవాయితీ కొనసాగుతోంది. ముఖ్యంగా కార్తీకమాసంలో శివభక్తితో శీతల స్నానమాచరించడం ఆరోగ్యనికి మంచిదని చెబుతారు. దీంతోపాటు ఈ నెలరోజులు భక్తులు సాత్వికాహారం పరి మితంగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. ఈ మాసంలో ముక్ష్యంగా సోమవారాల్లో లక్షతులసి దళాలు లేదా బిల్వపత్రాలు, మారేడు దళాలతో గాని శివపూజ చేసిన భక్తులకు మహత్తరశక్తి కలుగుతుందని చెబుతారు.

కార్తీక పౌర్ణమి

కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఎక్కువ. కార్తీక పౌర్ణమినాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకపౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ(కాయలతో) పెట్టి తులసి చెట్టుపక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుతున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. ఈ కార్తీకపౌర్ణమి రోజున ఉసిరికదానం చేయడం వల్ల దారిద్యం తొలగిపోతుంది. ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీకపౌర్ణమి రోజున దీపారాధన చేయడంవల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెబుతుంటారు.

వనభోజనం

కార్తీకమాసం అంటేనే వనబోజనాల మాసం అని చెప్పుకోవచ్చు. ఉసరిచెట్టుక్రింద శ్రీ మహావిష్ణువుని ఫోటో పెట్టి పూజించడంతో పాటు అదే చెట్టుక్రింద సహబంతి భోజనాలు చేయాలి.

క్షీరాబ్ది ద్వాదశి:

అలాగే ఏకాదశి తర్వాత వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఏకాదశి నాడు విష్ణుమూర్తి క్షీర సాగరం నుంచి బయలుదేరి వచ్చి తనకెంతో ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలో ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. ఆ కారణం చేతనే ఈ రోజున తులసి దగ్గర విశేష పూజలు జరుపుతుండటం ఆచారంగా వస్తోంది. ఈ ద్వాదశినే మధన ద్వాదశి అని కూడా అంటారు.
దేవ దానవులు సముద్రాన్ని మధించింది.. కార్తీక శుద్ధ ద్వాదశి నాడని, దానికి గుర్తుగానే ఈ ద్వాదశిని జరుపుకోవడం ఆచారమైందని పెద్దలంటారు. ఈ రోజున కడలిలో శయనించిన విష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశినాడు, లక్ష్మీ, బ్రహ్మలాంటి దేవతలందరితో కలిసి తులసి దగ్గరకు వస్తాడు. ఆ రోజున సూర్యాస్తమం తర్వాత తులసిని, విష్ణువును పూజించిన దానాది కార్యక్రమాలు చేసే వారికి కేశవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా దీపదానం చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.
ఇంకా కార్తీక ద్వాదశి రోజున తులసిని పూజించడం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరం కావచ్చు. ఈ రోజున కొన్ని తులసి దళాలను నములుతూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుచేత కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో శివ, విష్ణువులతో పాటు తులసీ కోటను కూడా పూజించేవారికి ఈతిబాధలు తొలగి, సకల సంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా ఈ రోజుల్లో శైవ, వైష్ణవ క్షేత్రాలను దర్శించుకునే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

కార్తీకమాస వ్రతాలు

కేదారేశ్వర వ్రతం

చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఈ రోజు ఇంటిల్లి పాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. నోములు నోచు కుంటారు. ఈ నోము నోచుకున్నవారికి సిరిసంపదలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.

అఖండమాస సౌభాగ్యవ్రతం

వివాహితులు ఈ అఖండ సౌ భాగ్యాలను చేస్తారు. భర్త కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలంటూ చంద్రునికి ఆద్యం ఇచ్చి వ్రతాన్ని పూర్తి చేస్తారు. కార్తీక చతుర్థశి నాడు చేసే ఈ వ్రతంలో స్త్రీలు శివపార్వతులను కార్తీకేయుని,గౌరీదేవిని పూజించాలి. పాండవులు వనవాసం చేసే రోజులలో అర్జనుడు ఇంద్రనీలాద్రిపై తపస్సుచేయడానికి వెళ్లాడు.ఎంతకాలమైన తిరిగి రాలేదు. అర్జనుడు రాకపోవడానికి కారణాలు తెలిపాక ద్రౌపతి ఎంతో బాధపడింది. అర్జనుడు తిరిగి రావాలంటే సౌబాగ్యవ్రతం చేయాలంటూ కృష్ణుడు ద్రౌపదికి ఈ వ్రతమహాత్యం,వ్రతవిధానం వివరించాడు.

గోవత్స ద్వాదశి ఉత్సవం

ఈ మాసంలో వచ్చే కృష్ణ ద్వాదశిన గోవత్స ద్వాదశి అంటారు. ఆ రోజు వ్రతం చేసుకునే వారు తెల్లవారుజామున లేచి నదీస్నానం చేయాలి. రోజుమొత్తంమీద ఒక్కపూట భోజనం చేయాలి. దూడతో కూడిన ఆవును పూజిస్తారు.

గోత్రి రాత్రీ వ్రతం

ఈ వ్రతాన్ని కార్తీక కృష్ణాత్రయోదశనుండి అమవాస్య వరకు చేస్తారు. గోవర్దునికి రెండు వైపుల రుక్ష్మిణి, సత్యభామలు, బాలచంద్రడు, యశోద తదితర ఫోటోలు పెట్టి పూజించి, తదుపరి గోమాతను పూజంచాలి. తెల్లవారుజామున లేచి స్నానంచేసి గాయిత్రిమంత్రంతో 110 పిడికిళ్లు నువ్వులను ఆహుతిఇచ్చి వ్రతాన్ని పూర్తిచేయాలి.

No comments: