all

Tuesday, July 9, 2013

ఏడడుగులకు ముందే...కలిసి నడిచారు

 
     
జస్ట్ మ్యారీడ్ కొండపల్లి బొమ్మల్లా ఉన్నారు!
వీళ్లేం చెప్తారు భార్యాభర్తల అనుబంధం గురించి?
ఒక కష్టమా? ఒక నిష్టూరమా?
ఒక పోట్లాటా? ఒక మాట్లాటా?
ఈ ఏడాదిన్నరలో మిస్టర్ - మిసెస్ ఆర్యన్‌ల మధ్య
ఇవేమీ లేకపోవచ్చు... కానీ...
వీటన్నిటినీ ఓర్చుకోగలిగిన స్థాయికి
ఏడడుగులకు ముందే రీచ్ అయ్యారు!
పెళ్లి కుదిర్చి చూడకుండా వెళ్లిపోయిన తండ్రి...
కోలుకోలేని దుఃఖంలో పడిపోయిన ఆర్యన్...
నేనున్నాను కదా అని నిలబడ్డ అమ్మాయి...
ఇలా... ముడులు పడకుండానే బలపడిన
దాంపత్యబంధమే... ఈవారం ‘మనసే జతగా’

ఆర్యన్‌రాజేష్ సినీనటుడు. దర్శక నిర్మాత ఇవివి సత్యనారాయణ పెద్దకుమారుడు. తెలుగు, తమిళ సినిమాల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన భార్య సుభాషిణి. తమ దాంపత్యబంధం గురించి వారిద్దరూ ముచ్చటిస్తూ... ‘‘ఆలుమగల మధ్య దాపరికాలు ఉండకూడదు. తప్పో ఒప్పో ఏదైనా సరే జీవితభాగస్వామి దగ్గర మనస్పూర్తిగా మాట్లాడగలగాలి. నిజాయితీగా ఉండాలి. ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోగలిగితేనే ఆ దాంపత్యబంధం సంతోషంగా, చూపరులకు ఆదర్శంగా ఉంటుంది. ఈ మాటలు చెప్పడమే కాదు, ఆచరణలో పెడుతున్నాం’’ అని తెలిపారు. ఈ జంట వైవాహిక జీవితంలోకి (ఫిబ్రవరి 11, 2012) అడుగుపెట్టి ఏడాదిన్నర పూర్తయ్యింది. భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా బాధ్యతలను పంచుకుంటున్న ఈ జంట చెబుతున్న మరిన్ని విషయాలు...

పెళ్లి చూపుల్లో ఆకట్టుకున్న ఆత్మీయత
ఆ.రాజేష్: నాన్నగారు ఉన్నప్పుడే ఆయన స్నేహితుని కూతురైన సుభాషిణిని చూసి, నాకు ఆ ఫొటో చూపించారు. నచ్చలేదన్నాను. నేరుగా చూస్తే తెలుస్తుందన్నారు నాన్నగారు. అలా సుభాషిణిని కడి యం దగ్గర (రాజమండ్రి) జేగురుపాడులోని వారి ఇంట్లో పెళ్లిచూపుల్లో చూశాను. ఫొటోకి, తనకు అస్సలు పోలికే లేదు. నాన్న చెప్పినట్టు అమ్మాయి నిజంగా చాలా బావుందనుకున్నాను. అక్కడే కాసేపు మేం మాట్లాడుకునే అవ కాశం దొరికింది. అయితే ఒకరినొకరు పరిచయం చేసుకోవడం మాత్రమే కుదిరింది. కాని ఆ క్షణాల్లోనే ఏదో ఆత్మీయబంధం మా ఇద్దరి మధ్య ఏర్పడిందనిపించింది. నేను సింపుల్‌గా ఉంటాను. ఆనందంగా ఉండటాన్ని ఇష్టపడతాను. నా మనస్తత్వం ప్రకారం... కుటుంబాన్ని, నన్ను ఇష్టపడే అమ్మాయి కావాలనుకున్నాను. సుభాషిణిలో ఆ లక్షణాలు చూశాను.

సుభాషిణి: ఎం.బి.ఏ చేసిన నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే వ్యక్తిని పెళ్లిచేసుకుంటానేమో అనుకున్నాను. సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకుంటానని అస్సలు అనుకోలేదు. అయితే నన్ను కట్టుకోబోయేవాడికి మద్యం, సిగరెట్ అలవాట్లు మాత్రం ఉండకూడదని గట్టిగా అనుకున్నాను. అవి ఉంటే అస్సలు చేసుకోనని మా నాన్నకు ముందే చెప్పాను. అప్పటికే ఈయన మంచితనం, ఏ అలవాట్లు లేకపోవడం గురించి నాన్న నాకు చెప్పారు. మా బంధువుల్లోనూ వీరి బంధువులు ఉన్నారు. వారి ద్వారా వీరి కుటుంబం గురించి అప్పటికే విన్నాను. పెళ్లిచూపుల నాడే... ఈయన మాటతీరు, పెద్దలకు ఇచ్చే గౌరవం నన్ను బాగా ఆకట్టుకున్నాయి.

పెద్దలు తమ పిల్లల బాగోగుల గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునేవారే! కాని పెళ్లిపేరుతో నూరేళ్లూ కలిసి జీవించే అబ్బాయి, అమ్మాయి ఆలోచనలూ తెలుసుకోవాలి. ఆ అవకాశాన్ని పెద్దలు ఆర్యన్‌రాజేష్, సుభాషిణిలకు కల్పించారు. పెళ్లికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. అయితే పెళ్లికుమారుడి తండ్రి అనారోగ్య కారణంగా కుమారుడి పెళ్లి కాకముందే మరణించారు. ఆయన మరణం వీరి బంధంపై ఎలాంటి ప్రభావం చూపి ఉంటుంది?

ఏర్పడిన మానసిక బంధం
ఆ.రాజేష్: జనవరి 5న పెళ్లిచూపులు జరిగాయి. అప్పటికే నాన్నగారి ఆరోగ్యం బాగోలేదు. జనవరి 11న ఆయన మరణించారు. ఆ దుఃఖంనుంచి కోలుకోవడానికి మాకు చాలా సమయమే పట్టింది. ఆ సమయంలో సుభాషిణి... అత్తయ్యను, మన కుటుంబాన్ని నేను బాగా చూసుకుంటానని చెప్పింది. ఇంకా మా మధ్య పెళ్లి బంధం ఏర్పడకుండానే మా కుటుంబంలో వ్యక్తిగా కలిసిపోయింది. సంతోషంలోనే కాదు కష్టంలోనూ నన్ను, నా కుటుంబాన్ని ప్రేమించేవ్యక్తి అని అర్థమైంది.
సుఖాలు కాదు కష్టాలే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి పునాదిరాళ్లుగా మారుతాయి. ఆ సమయంలో అండగా ఉంటానన్న భరోసా ఆ వ్యక్తుల మధ్య బంధాన్ని పటిష్టం చేస్తుంది. మనస్ఫూర్తిగా ఇచ్చే ఆలంబన ఇరుహృదయాలను కట్టిపడేస్తుంది. కలిసి జీవించాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ సూత్రాన్ని ఒంటపట్టించుకోవాల్సిందేనని వీరి మాటల్లో స్పష్టమవుతుంది.

అరమరికలే ఉండవ
ఆ.రాజేష్: మా అమ్మగారు, సుభాషిణి తెగ కబుర్లు చెప్పుకుంటారు. అంతసేపు ఏం కబుర్లు ఉంటాయని అడిగితే ‘అత్తా-కోడళ్ల మధ్య ఉండే సఖ్యత కుటుంబ ఆనందాన్ని పెంచుతుంది’ అని అంటుంటే ఆనందంగా అనిపిస్తుంటుంది. సుభాషిణి నా కంటే ఆరేళ్లు చిన్నది. కాని మెచ్యూరిటీ పరంగా నాతో ఈక్వల్‌గా ఉంటుంది. సుబ్బూ, సుబ్బి అని ఆటపట్టిస్తుంటాను. నన్ను రాజేష్ అని పిలవమని చెబుతుంటాను. కాని అలా పిలవదు. మా మధ్య చిన్న చిన్న అలకలు, బుజ్జగింపులు మామూలే! కాని అబద్ధాలకు మాత్రం తావుండదు. ఆనందానికి అవరోధం కలిగించే విషయాలేవీ మా మధ్య చోటుచేసుకునే అవకాశాలు కల్పించను.
సుభాషిణి: మా పుట్టింట్లో ఈయన మా అన్నయ్యలాగే బాగా కలిసిపోతారు. అల్లుడిగా ప్రత్యేక మర్యాదలు చేయనివ్వరు. మా అమ్మ ‘మా అల్లుడు బాగా కలిసిపోతాడు! మేము చాలా అదృష్టవంతులం!’ అంటుంటారు.

ఈయన నటించిన ‘లీలామహల్ సెంటర్’ సినిమా నాకు బాగా ఇష్టం. ఆ సినిమా చాలా సార్లు చూశాను. నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నా లైఫ్‌లో జరిగిన విషయాలన్నీ ఈయనకు ఏదో సందర్భంలో చెబుతూనే ఉంటాను. అన్నీ ఓపిగ్గా వింటారు. వాకింగ్ చేస్తారే తప్ప జిమ్‌కి వెళ్లరు. ఇంకా టైమ్ ఉందిలే అని చెబుతుంటారు. కాని నేనే ఊరుకోను. చిన్న చిన్న విషయాలకు ఎంత త్వరగా కోపం వస్తుందో, అంతే త్వరగా కూల్ అయిపోతుంటాం.

ఫీల్‌గుడ్
ఆ.రాజేష్: పెళ్లయిన కొద్దినెలల వ్యవధిలోనే సినిమా వర్క్‌లో ఉన్నాను. ఉదయాన్నే పేపర్లలో హీరోయిన్‌తో కలిసి ఉన్న సినిమా యాడ్ చూసినా, పోస్టర్స్ చూసినా సుభాషిణి ముఖం మాడ్చుకోవడం గమనించాను. ‘అలాగ ఎందుకు ఉండాలి? ఇలా ఎందుకు ఉండాలి?’ అనేది. నాకు నచ్చిన ఫీల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అందులోని సాధకబాధకాలు తనూ అర్థం చేసుకోవాలని షూటింగ్స్‌కి తీసుకెళ్లాను. అక్కడ అందరూ ఎంత హార్డ్‌వర్క్ చేస్తారో కళ్లారా చూసి తెలుసుకుంది. తనకు ఇండస్ట్రీ గురించీ, నా గురించీ ఇంకాస్త అర్థం చేసుకోవడానికి అది ఉపయోగపడింది. ఇప్పుడు తనే కొత్త సినిమాల గురించి అడిగి తెలుసుకుంటుంది.
సుభాషిణి: పెళ్లికిముందు నాతో చాలామంది ‘సినిమా హీరోలు హీరోయిన్స్‌తో క్లోజ్‌గా ఉంటారు, నీకు ఓకేనా!’ అని అడిగేవారు. ‘అది సినిమా వరకే’ అని చెప్పేదాన్ని. సినిమాను సినిమాలాగే చూడటం మొదలుపెట్టాక నా ఆలోచనల్లో మార్పు వచ్చింది.
ఎవరికి వారు ఆనందంగా ఉండాలనే కాదు, తన జీవితంలోకి అడుగుపెట్టిన జీవిత భాగస్వామికీ ఆనందం పంచాలన్న భావన ఇద్దరిలోనూ ఉండాలి. వృత్తిపరంగానే కాదు జీవనగమనంలో ఏ చిన్న అరమరికలకూ తావు ఇవ్వకుండా, మనసులు కలిసి ప్రయాణించాలని ఈ జంట స్పష్టం చేసింది.

No comments: