all

Tuesday, July 9, 2013

అందాన్ని మెరుగుపరిచే సహజ సౌందర్య సాధనాలు..!

స్త్రీకి అందం... ప్రకృతి నుంచి ప్రేయసి వరకు అన్నింటికీ ఇచ్చే కొలమానం. అందానికి ఉన్న ఆకర్షణ, ఆదరణ నేటి ఆధునిక యుగంలో ఇంతా అంతా కాదు. అందులోనూ స్త్రీ అందం ప్రాధాన్యత మరీ ఎక్కువ. ప్రకృతితో పోటీ పడే స్త్రీ అందానికి ఆధునిక మెరుగులు దిద్దితే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే చాలా అందంగా ఉందికదూ! అలాంటి ఆధునిక మెరుగులు దిద్దేందుకు అవతరించినవే‘బ్యూటీ'పార్లర్‌లు.

ఒకప్పుడు మెట్రో సిటీలకే పరిమితమైన ఈ బ్యూటీపార్లర్‌లు, ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరించాయి. దాంతో యూత్ లో ఎక్కడలేని క్రేజ్ ఏర్పడి బ్యూటీపార్లలకు ఎక్కువ మొత్తంలో వెచ్చిస్తున్నారు. అలాగే వివిధ రకాలైన వ్యాపార ప్రకటనలను చూసి ప్రభావితమవుతునారు . ఈ కృత్రిమ రసాయన ఉత్పత్తుల వాడకం వల్ల అందచందాలు వస్తాయో లేదో కాని కొన్ని చర్మ సమస్యలు తలెత్తుతున్నాయి.

సహజంగా సౌందర్యాన్ని సంరక్షించుకోవడం , ప్రస్తుత యాంత్రిక జీవితంలో కష్టమే అయిపొయింది. అయినా, మన ఇంట్లో ఉండే సహజ సౌందర్య సాధనాలే , మార్కెట్ లో దొరికే ఖరీదైన ఉత్పత్తుల కన్నా మెరుగైన సౌందర్యం మనకు అందిస్తాయి అనేది , సౌందర్య నిపుణులు కూడా చెబుతూ వస్తున్న విషయం. మరి ఈ విషయాన్ని కనుక ఆచరణలో పెట్టదలిస్తే , కొన్ని సహజ సౌందర్య చిట్కాలు మీకోసం;

ప్రకృతి ప్రసాధించిన సహజ సౌందర్య సాధనాలు.!
ఆల్‌మండ్‌ నూనె: పొడిగా ఉన్న చర్మం గలవారు వాడితే మృదువుగా వుంటుంది. ఈ ఆయిల్‌ మొటిమలకు, మచ్చలకు సంజీవిలా పనిచేస్తుంది. ఆల్‌మండ్‌ పైభాగాన్ని బాగా దంచి కొద్దిగా నీరు కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే నిగ నిగలాడిపోతారు.



ఆపిల్‌: ఆపిల్‌లో సౌందర్య రహస్యం కూడా దాగివుంది. ఇది చర్మం పగుళ్లకు, చర్మంపై మంటలు, దురదలు లాంటి ఇబ్బందులు వున్నవారు ఈ గ్రీన్‌ ఆపిల్స్‌ జ్యూస్‌ రాస్తే సేద తీరుతారు. ముందు ముందు ఆ సమస్య దూరమౌతుంది.


ఆప్రికార్ట్స్‌: సూర్యరశ్మి వల్ల ముఖం నల్లబడినా, దురదలున్నా ఫ్రెష్‌గా వున్న ఆప్రికార్ట్స్‌ జ్యూస్‌ను రాయండి.


శెనగపిండి: మొటిమలున్నవారు, చర్మ సంబంధిత ఎలర్జీ గలవారు పెరుగుతో కలిపి పేస్ట్‌లా చేసుకోండి. పేస్ట్‌ చేసిన దాన్ని సమస్య వున్న చోట రాయండి. మంచి ఛాయ కోసం వాడేవారు నీటితో లేదా గ్లిజరిన్‌తో కలిపి రాసుకోండి.


దోసకాయ: ముఖంపై బొబ్బలు, దద్దుర్లు, పొక్కులకు దోసకాయ మహామందు. జ్యూస్‌ చేసి మృదువుగా రాసుకోండి. అంతకన్నా మృదువుగా మీ చర్మం మారుతుంది. ఇంకా బెటర్‌మెంట్‌ కోసం క్యారెట్‌, లెటూస్‌, అల్ఫా జ్యూస్‌లతో కూడా కలిపి వాడుకోవచ్చు.


మునగకాయలు: మునగ కాయ గింజలతో, ఆకులతో నిమ్మరం కలిపి పేస్ట్‌లా చేసి నల్లటి మచ్చలు, మొటిమలకు రాయటం ద్వారా చక్కటి గుణం వుంటుంది


మెంతులు: మెంతి ఆకులని, నీటిని కలిపి పేస్ట్‌లా చేయండి. దాన్ని రాత్రిపూట రాసుకొని, తిరిగి ఉదయం పూట వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ముఖంపై ముడుతలు తగ్గుతాయి. పొడిచర్మం మృదువుగా తయారవుతుంది. మెంతిగింజలను నీటిలో బాగా వుడకబెట్టి ఆపై పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించండం ద్వారా చక్కటి సౌందర్య ఫలితం కనిపిస్తుంది.


వెల్లుల్లి: మొటిమలున్నవారు పచ్చి వెల్లుల్లిని మృదువుగా, సుతారంగా రుద్దండి. ఎంతోకాలంగా పీడిస్తున్న మొటిమలు సమస్య తీరిపోతుంది. రెగ్యులర్‌గా చేయటం ద్వారా మచ్చలు, మొటిమలు కనిపించకుండా చేయవచ్చు. చర్మ సంబంధమైన సమస్యలున్నవారు, భోజనం చేసేటప్పుడు అన్నం ముద్దలో వెల్లుల్లిని పెట్టి మింగేయండి. చర్మంపై వున్న సమస్యలని లోపలినుంచి క్లియర్‌ చేస్తుంది.


తేనె: కొద్దిగా తేనెని నీటిలో బాగా కలపండి. శరీరంపై మచ్చలున్న దగ్గర రాయండి. మృదువుగా సుమా! దీనివల్ల చర్మం కాంతి వంతమవుతుంది. చక్కటి చర్మ నిగారింపుకు తేనె, పాలు, పెరుగు నువ్వుగింజల పిండి సమపాళ్లలో బాగా కలిపి మృదువుగా రాయండి.


నిమ్మరసం: చర్మ పగుళ్లను, మొటిమలు, మచ్చలను తరిమికొడుతుంది. గోరువెచ్చని వేడిపాలలో నిమ్మ పండురసం కలిపి ముఖాన్ని శుభ్రం చేసుకోండి.


మామిడికాయలు: మామిడి ఆకులను, కాయ తొక్కలను బాగా వేడిచేసి చర్మంపై రాసుకుంటే చర్మ సంబంధిత అనేక ఇన్‌ ఫెక్షన్స్‌ తగ్గిపోతాయి.


పుదీనా: మొటిమల నివారణకు, ఏవైనా కీటకాలు కుట్టినప్పుడు దద్దుర్లు వచ్చినప్పుడు అలాంటి ఇబ్బందులు ఎదురయినప్పుడు, చర్మ సంబంధమైన విషయాలకూ చాలా బాగా పనిచేస్తుంది. నిద్రపోయే ముందు పుదీనా రసం ముఖానికి రాసుకుంటే మంచి చక్కటి ఫలితం వస్తుంది. ముఖం లక్ష్మీదేవిలా కళకళలాడుతుంది. మీ సౌందర్య రహస్యం ఏమిటని పక్కవారు అడిగేలా వుంటారు.

వేపాకులు: వేపాకులు పదిరెబ్బలు తీసుకుని శుభ్రంగా కడిగి, బాగా నూరి ఉండలాగా చేసుకొని నీటితో మాత్ర వేసుకున్నట్టు వేసుకోండి. చర్మం లోపలి బాగాలు శుభ్రపడతాయి. కొంతమందికి నోటి దుర్వాసన వస్తుంది. అలాంటివారు తాజా వేపాకులను బాగా నలిమి మింగటం ద్వారా నోరు భాగమంతా ఫ్రెష్‌ అవుతుంది. ఆహ్లాదంగా వుంటుంది.

కమలాపండు: మొటిమలున్నవారు కమలా తొక్కలను ఎండబెట్టి బాగాపొడిచేసి తగినంత నీరు కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకోండి. మొటిమల తీవ్రత మెల్లమెల్లగా తగ్గుతుంది.

బొప్పాయి: ఫ్రూట్‌ జ్యూస్‌ త్రాగే అలవాటు వున్నవారు హ్యాపిగా తాగండి. పచ్చిబొప్పాయి రసాన్ని, తోలు, గింజలతో కలిపి తీసిన జ్యూస్‌ని మచ్చలున్నవారు, మొటిమలున్నవారు, చర్మపు వాపులున్నవారు రాసుకోండి. తగ్గటంతోపాటు ముఖం మంచివన్నె వస్తుంది. ముఖకాంతి కోసం రాసుకునేవారు పచ్చి లేదా పండిన బొప్పాయిని మృదువుగా రాసుకోండి.

పైనాపిల్‌ :ఇది కూడా ఆపిల్‌లాగా శరీరంపై ముఖంపై ఏర్పడే చిన్నచిన్న సమస్యలు తీరుస్తుంది. జ్యూస్‌ ని రాసి బాగా ఆరాక మెత్తటి టవల్‌తో అద్దుతూ తుడవండి. పైనాపిల్‌ జ్యూస్ తాగటం ద్వారా, ముఖానికి రాసుకోవటం ద్వారా ముఖం మీద చిన్నచిన్న మచ్చలు కూడా కనిపించకుండా మాయమవుతాయి. పైనాపిల్‌ మధ్య భాగంతో ముఖంమీద ముడతలు వద్ద పదిహేను నిమిషాలు మృదువుగా రుద్దండి. ముఖంపై పగుళ్లు, మంటలు, కందిపోవటం లాంటి ఇబ్బందులున్న వారు ఈ రసాన్ని రాసు కోవటం ద్వారా ఉపశమనం కలుగుతుంది.


దానిమ్మపండు: ముందుగా దానిమ్మపండు తొక్కను ఎండబెట్టండి. ఆపై పొడిచేసి దానికి ఫ్రెష్‌ నిమ్మ పండురసాన్ని కలపండి. పేస్ట్‌లా చేసిన ఈ రెంటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించటం ద్వారా చాలా రకాల సమస్యలు తీరి అందంగా వుంటారు.

ముల్లంగి: ముందుగా ముల్లంగి గింజలను, నీటితో కలిపి పేస్ట్‌లా చేసుకోండి. నల్లటిమచ్చలు, మొటిమలకి బాగా పనిచేస్తుంది.

టమాటాలు: ఎర్రటి టమాటాలలోని గుజ్జుతో మొటిమలున్న చోట అప్లెయ్‌ చేయండి. పదిహేను నిమిషాలు వుంచి ఆపై చక్కగా శుభ్రంగా ముఖాన్ని వాష్‌ చేసుకోండి.

పసుపు: కంటిచుట్టూ వలయాలున్నవారు పైనాపిల్‌ జ్యూస్‌లో పసుపుని కలిపి పేస్ట్‌లా చేసి మృదువుగా సుతారంగా రాయండి. పసుపులో గోధుమపిండిని కలిపి ఆ పేస్ట్‌ని చర్మసంబంధిత ఇన్‌ ఫెక్షన్‌లకు రాయటం ద్వారా చక్కటి గుణం కనిపిస్తుంది. ముడుతలున్నవారు వయస్సు పైబడ్డట్టు కనబడేవారు పసుపుని చెరుకురసంలో పేస్ట్‌లా కలుపుకొని రాసుకుంటే అందరిలో మీరే ఎట్రాక్షన్‌గా వుంటారు.

No comments: