all

Saturday, July 27, 2013

త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా!

వెన్నెల... చల్లగా, ప్రశాంతంగా ఉంటుంది.
ధ్యానముద్ర పట్టినట్లుగా గంభీరంగా ఉంటుంది.
సముద్రపు హోరుకు నిశ్శబ్ద నేపథ్యంలా ఉంటుంది.
శరత్‌బాబు కూడా సేమ్ టు సేమ్.
ప్రశాంతం! గాంభీర్యం! నిశ్శబ్దం!
‘ఇదిగో తీస్కోపో’ అని దేవుడు విసిరిన గిఫ్ట్‌ప్యాక్
ఆయనకు... తన జీవితం!
ఆ ప్యాక్‌లో ఏమేమి ఉన్నాయో చూడండి.
ఆముదాలవలసలో ఆలయాల మధ్య ఇల్లు...
పన్నెండు మంది తోబుట్టువుల ప్రేమాభిమానాలు...
సినిమా అనే మరో పెద్ద కుటుంబం...
ఓనమాలు నేర్పిన బాలచందర్, విశ్వనాథ్, బాపు!
అయితే, దేవుడిచ్చిన గిఫ్ట్‌ప్యాక్ ఒక్కటే శరత్ జీవితం కాదు!
తనకై తాను తొక్కిన ఓ ‘బాంబ్’ కూడా!!
ఆ బ్లాస్ట్ నుంచి బయటపడి ఆయన ఇంట్రావర్ట్ అయ్యారు.
తన ‘స్పేస్’ లో తను ఉండిపోయారు.
ఈ శరత్‌చంద్రుడి...
వెన్నెల్ని షేర్ చేసుకోడానికి, స్పేస్‌ని నింపడానికిఏ చుక్కైనా రాబోతోందా? వస్తే ఏ దిక్కు నుంచి?
తరచి చూడండి... ఈవారం ‘తారాంతరంగం’.


చాలా గ్యాప్ తర్వాత ఇంటర్వ్యూ ఇస్తున్నారు... అసలు మీరు ఇంటర్వ్యూలివ్వడం తక్కువే కదా?
శరత్‌బాబు: నేను చాలా బిజీగా ఉన్న రోజుల్లో కూడా ఇంటర్వ్యూలు ఎక్కువ ఇవ్వలేదు. సినిమాలు చేసినప్పుడు దాని తాలూకు ప్రెస్‌మీట్స్‌లోనో, రిలీజ్ అప్పుడు ఇతర వేడుకల్లోనో పాల్గొంటుంటాను. ఆ విధంగా నేను చేసే సినిమాల గురించి మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలుస్తుంటుంది. ఇక మిగతా సమయాల్లో మాట్లాడటానికి ఏముంటుంది? మన గురించి మనం చెప్పుకోవడానికి మనమేమన్నా మహాత్మాగాంధీయా? సుభాష్ చంద్రబోసా? అని నా ఫీలింగ్. అందుకే చాలామటుకు ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటాను.

మూడు, నాలుగు రాష్ట్రాల్లో అభిమానులను సంపాదించుకున్నారు...
శరత్‌బాబు: ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం నీళ్ల కోసం, బార్డర్ల కోసం కొట్టుకుంటుంటే.. అన్నిటినీ పక్కన పెట్టి... ఒక నటుణ్ణి ప్రతి రాష్ర్టం తమ వ్యక్తిలా భావించడం నా అదృష్టం. అది ఆ దేవుడి ఆశీర్వాదం.

మీ చిన్ననాటి జీవితం గురించి?
శరత్‌బాబు: మాది ఆముదాలవలస. చిన్న మున్సిపల్ టౌన్. అక్కడ నాన్నగారు హోటల్ నడిపేవారు. ఇప్పటికీ ఆ హోటల్ ఉంది. మేం మొత్తం ఎనిమిది మంది అన్నదమ్ములం. ఐదుగురు అక్కచెల్లెళ్లం... నేను నాలుగోవాణ్ణి. అమ్మా నాన్నతో కలిపి మేం పదిహేను మంది. నా స్కూల్, కాలేజీ జీవితాన్ని చాలా ఎంజాయ్ చేశాను. మా ఊరుకి ఐదు కిలోమీటర్ల దూరంలో దూసి అనే గ్రామం ఉండేది. చిన్న రైల్వేస్టేషన్, నాగావళి అని ఓ నది.. దాని మీద వంతెన... చాలా బాగుండేది. శని, ఆదివారాలు స్కూల్ అయిపోగానే ఆ వంతెన దగ్గరకు వెళ్లేవాళ్లం. నాకు ఈత రాదు. నీళ్లు తక్కువ ఉన్నప్పుడు ఆ నదిలో నుంచి వెళ్లేవాణ్ణి.

మీ అమ్మానాన్నలు పదమూడుమంది పిల్లలను పెంచడం చిన్న విషయం కాదు కదా...
శరత్‌బాబు: ప్రతి తల్లీ గొప్ప తల్లే. తండ్రీ గొప్పే. ఆడవాళ్లు తల్లి అనే పాత్రను బాగా పోషిస్తారు. ఎవరి తల్లి అయినా సరే.. ఆల్ మదర్స్ ఆర్ గ్రేట్ మదర్స్. అమ్మకు నేనంటేనే ఎక్కువ ఇష్టం అని మేమందరం అనుకునేలా మా అమ్మ మమ్మల్ని పెంచింది. ఎప్పటికీ తనే తల్లిగా ఉండాలనిపిస్తుంది.

అంటే.. ఏ జన్మలో అయినా ఆమే మీకు అమ్మ అవ్వాలనుకుంటున్నారా?
శరత్‌బాబు: నాకిదే ఆఖరి జన్మ అని తాళపత్రాలు చెబుతున్నాయి.

తాళపత్రాలేంటి?
శరత్‌బాబు: అదో పెద్ద సబ్జెక్ట్. బహుశా దాని గురించి మాట్లాడితే కొంతమందికి ఇంట్రస్ట్‌గా అనిపించదేమో. నేను దేవుణ్ణి నమ్ముతాను. ఆ నమ్మకం ఉన్నవాళ్లకి జన్మల మీద నమ్మకముంటుంది. నాకిది ఆఖరి జన్మ అని నాకు తెలుసు.

పైకి మోడర్న్‌గా కనిపించినా.. లోలోపల మీరు ఆధ్యాత్మిక బాటలో నడుస్తారనిపిస్తోంది?
శరత్‌బాబు: ఆముదాలవలసలో మా ఇల్లు ఆలయాల మధ్యలో ఉండేది. ఆ ప్రభావం నా మీద ఉందేమో. బహుశా కిందటి జన్మలో చాలా మంచి పనులు చేసి ఉంటాను. అందుకే దేవుడా ప్రభావం ఇచ్చి ఉంటాడు. ‘‘జీవితంలో భగవంతుడు అన్నీ ఇచ్చాడు. అన్నీ ఉన్నా మనశ్శాంతి లేదు’’ అని చాలామంది అంటుంటారు. కానీ ఆ భగవంతుడికి నేనంటే చాలా ఇష్టమేమో.. నాకు మనశ్శాంతి కూడా ఇచ్చాడు.

అంటే.. మీ జీవితం మొదట్నుంచీ సాఫీగా సాగుతోందనా?
శరత్‌బాబు: ఎత్తుపల్లాలు సహజం. పగలూ రాత్రిలా మంచీ చెడూ ఉంటాయి. కష్టసుఖాలుంటాయి. ఆ కష్టాలు అస్సలు కష్టాలే కాదనుకునేంత పరిపక్వత నాకెలానో క్రియేట్ అయ్యింది. బహుశా పెంపకం ద్వారా వచ్చింది అయ్యుండొచ్చు. పదమూడు మంది పిల్లలం. మేమందరం బాగా చదువుకునే అవకాశాన్ని కల్పించాడు భగవంతుడు. నేను చాలా గుడ్ స్టూడెంట్‌ని. ఆర్థికంగా మాది ఇబ్బందులు లేని స్థితి. చక్కని తల్లిదండ్రులు, మంచి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు. మాలో మాకు చిన్న చిన్న గొడవలుంటాయి. కానీ ఏదైనా ఫంక్షన్ అంటే అందరం ఒక్కటైపోతాం. కెరీర్‌పరంగా కూడా ఓకే. కాబట్టి సాఫీగా సాగుతోందనే చెప్పాలి.

మీ లుక్స్ మీద మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉండేదా?
శరత్‌బాబు: మా నాన్నగారు చాలా అందగాడు. అప్పట్లో ఆయన రోడ్డు మీద వెళుతుంటే కిటికీలోంచి తొంగి చూసేవాళ్లట. చివరి రోజుల వరకు ఆయనకు బీపి, షుగర్, కొలెస్ట్రాల్ ఏమీ లేవు. మా అమ్మగారు చాలా కళగా ఉండేవారు. ఇద్దరిలోనూ ఉన్న బెస్ట్ ఫీచర్‌‌స నాకు వచ్చాయేమో అనుకుంటున్నాను. హైస్కూల్లోనే నేను ఫైవ్ టెన్ హైట్ ఉండేవాణ్ణి. కానీ నా ఎత్తు, లుక్స్ గురించి స్కూల్ డేస్‌లో ఎప్పుడూ పట్టించుకోలేదు. కాలేజీకి వెళ్లిన తర్వాత మాత్రం లుక్స్ బాగున్నాయనుకునేవాణ్ణి. క్లాస్‌రూమ్‌లో నా పక్కబెంచ్‌నుంచి, క్యాంటీన్‌కి వెళ్లినప్పుడు ‘హీరో’, ‘గోల్డెన్ ఫిష్’ అని నన్ను ఉద్దేశించి మాట్లాడుకోవడం వినిపించేది. ఆ వయసులో కొంచెం ఇంట్రావర్ట్‌ని. అందుకని పెద్దగా పట్టించుకునేవాణ్ణి కాదు. చదువు మీదే ధ్యాస ఉండేది.

కాలేజీ డేస్‌లో ఎవరి మీదైనా మనసు పారేసుకున్నారా?
శరత్‌బాబు: ఆ వయసులో ఇన్‌ఫాచ్యుయేషన్ ఉండటం సహజం. ఇప్పుడవన్నీ చెప్పడం అవసరమా?

మీ మాటల్లో వింటే పాఠకులు ఎంజాయ్ చేస్తారు కదా...
శరత్‌బాబు: ఓ అమ్మాయి మీద ఆకర్షణ ఉండేది. కాలేజ్ కారిడార్‌లో తను నడిచి వచ్చేటప్పుడే నాకు ఆ శబ్దం తెలిసిపోయేది. ఆ వయసులో దాన్నే ప్రేమ అనుకుంటాం. ఏదేమైనా నేనెవరితోనూ పెద్దగా కలిసేవాణ్ణి కాదు. నాకంటూ ఓ నలుగురు స్నేహితులుండేవాళ్లు. ఆ బ్యాచ్‌తోనే గడిపేవాణ్ణి.

మీ తోడబుట్టిన వాళ్లెవరిలోనూ లేని క్వాలిటీ (యాక్టింగ్) మీకే వచ్చినందుకు ఎలా అనిపిస్తోంది?
శరత్‌బాబు: బహుశా నాకంటే వాళ్లకి ఎక్కువ క్వాలిటీస్ ఉన్నాయేమో. యాక్టింగ్ వాళ్లకి ఇంట్రస్ట్ లేదు. 19వ ఏట డిగ్రీ పూర్తి చేసాను. చదువుకునే రోజుల్లో నాకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఉండేది. కానీ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడే కళ్లద్దాలు వచ్చేశాయ్. పోలీస్ అవ్వాలంటే అది డిస్‌క్వాలిఫికేషన్ కదా. ఆల్రెడీ హీరో అని నన్ను కొంతమంది అనడంవల్ల, యాక్టింగ్ ట్రై చేద్దామనిపించింది. ఆదుర్తి సుబ్బారావుగారు కొత్తవాళ్లతో సినిమా తీసి, సక్సెస్ చేశారని తెలిసి, ఫొటోలు దిగి, ఆయనకు పంపించాను. ‘‘సినిమాలు చూడటంవరకే తెలుసు, యాక్టింగ్ తెలియదు. పనికొస్తాననుకుంటే వస్తాను’’ అంటూ నిజాయితీగా ఓ ఉత్తరం రాశాను. సాయిభాస్కర్ అని సుబ్బారావుగారబ్బాయి ఉన్నాడు. అతను, ప్రసాద్ అని వాళ్ల కజిన్ ఉన్నారు. నేను రాసిన ఉత్తరం ఇప్పటికీ వాళ్ల దగ్గర ఉందట. నా ఉత్తరానికి స్పందించి, మద్రాసు రమ్మని ట్రైన్‌చార్జీలు కూడా ఇచ్చి పంపించారు ఆదుర్తిగారు. తమిళ్ ఒక్క ముక్క రాదు. అయినా వెళ్లాను. నా క్లాస్‌మేట్ బ్రదర్ మద్రాసులో పని చేస్తున్నాడు. అతని అడ్రస్ కూడా తెలియదు. కానీ ఏదో ధైర్యంతో ట్రైన్ ఎక్కేశా.

తర్వాత ఏమైంది...
శరత్‌బాబు: మద్రాసు వెళ్లి, సుబ్బారావుగారిని కలిసాను. అప్పుడాయన హిందీ సినిమా చేస్తున్నారు. మరో ఏడెనిమిది నెలల్లో తెలుగు సినిమా చేస్తాను. అప్పుడు రమ్మన్నారు. సినిమా చూద్దామని ఓ థియేటర్‌కి వెళితే అక్కడ నా క్లాస్‌మేట్ వాళ్ల ఫ్రెండ్ కనిపించాడు. తన రూమ్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకేమో యాక్టింగ్ అనేది పురుగులా తొలిచేసింది. ఊరెళ్లాలనిపించలేదు. అదే సమయంలో రామవిజేత అని ఓ సంస్థ కొత్తవాళ్లతో సినిమాలు తీస్తున్నారని విని, వెళ్లాను. అక్కడ దాదాపు వెయ్యి అప్లికేషన్స్ ఉన్నాయి. ఓ ముగ్గుర్ని సెలక్ట్ చేసారు. ఆ ముగ్గురికీ స్క్రీన్ టెస్ట్ చేసారు. వాళ్లల్లో నేనూ ఉన్నాను. ఫైనల్‌గా ‘నువ్వే మా హీరో’ అన్నారు. అది విని, నేను సెలైంట్‌గా ఉంటే, ఏంటి రియాక్షన్ లేదని అడిగారు. హీరో అవ్వడం చాలా కష్టమని వాళ్లూ వీళ్లూ చెబుతుంటే విన్నాను. నాకంత సులువుగా వచ్చేటప్పటికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడంలేదు, కానీ ఆనందంగా ఉన్నానని చెప్పాను. ఆ సినిమాలో చంద్రకళగారు హీరోయిన్. కాలేజీలో చదువుకునేటప్పుడు ఆమెను ఇష్టపడేవాణ్ణి. సినిమా పేరు ‘రామరాజ్యం’. జగ్గయ్యగారు, ఎస్వీ రంగారావుగారు, సావిత్రిగారు, చంద్రమోహన్‌గారు.. అందరూ హేమాహేమీలు నటించారు. ఆ సినిమా యావరేజ్‌గా ఆడింది. ఆ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అట్లూరి పూర్ణచంద్రరావుగారు స్క్రీన్ టెస్ట్ చేసి, ‘స్త్రీ’ చిత్రంలో సపోర్టింగ్ హీరోగా చేసే అవకాశం ఇచ్చారు.

కాలేజీలో మిమ్మల్ని హీరో అని పిలిచినట్లుగా మీరలానే ఉంటారు. కానీ మీరు యాంటీ హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా కూడా చేయడానికి కారణం ఏంటి?
శరత్‌బాబు: నేను హీరో, విలన్ అని ఏదీ ఫిక్స్ అవ్వలేదు. ఏవీయం సంస్థ వారు ‘నోము’లో నెగటివ్ రోల్ ఇస్తే, సవాల్‌గా తీసుకుని చేశాను. అలాగే డూండీగారు ‘అభిమానవతి’లో ఓ మంచి పవర్‌ఫుల్ నెగటివ్ కేరక్టర్ ఇస్తే, చేశాను. అటు ఏవీయం, ఇటు డూండీగారు.. అగ్రదర్శకులు, నిర్మాతల చిత్రాల్లో అవకాశాలు రావడం ప్రారంభమైంది. ఆ తర్వాత బాలచందర్‌గారి దర్శకత్వంలో తమిళంలో ‘నిళల్ నిజమాగిరదు’ అనే చిత్రంలో నటించాను. అది వంద రోజులాడింది. పరభాషలో మొదటి సినిమా హిట్ కొట్టడం ఆనందాన్నిచ్చింది. ఇక అక్కడ్నుంచీ కెరీర్ పూర్తిగా మారిపోయింది. వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేకుండాపోయింది.

బాలచందర్‌గారు, బాపుగారు, కె.విశ్వనాథ్‌గారులాంటి లెజెండ్స్‌తో సిని మాలు చేశారు.. వాళ్ల దగ్గర్నుంచి మీరు నేర్చుకున్నదేంటి?
శరత్‌బాబు: నటుడిగా ఓనమాలు దిద్దుకున్నది బాలచందర్‌గారి దగ్గరే. ఆయన్ని పరిశీలిస్తేనే చాలు.. నటన నేర్చేసుకోవచ్చు. అలాగే విశ్వనాథ్‌గార్ని పరిశీలించటం ద్వారా టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్ గురించి తెలుసుకున్నాను. బాపుగారితో సినిమా చేసేటప్పుడు నటన కాకుండా కేరెక్టర్ మాత్రమే సహజంగా కనిపించేలా నటించడం అలవాటైంది. ఆర్టిస్ట్‌గా నన్నో ప్రత్యేకమైన మార్గంలో తీసుకెళ్లిన దర్శకులు ఈ ముగ్గురూ. సౌత్‌లో ఇంచుమించు ఇరవై నుంచి ముప్ఫయ్ కోట్లమంది ఉంటారేమో. వారి మనసుల్లో పర్మినెంట్ ప్లేస్ దక్కడానికి ముఖ్యకారణం ఈ ముగ్గురూ. ఇంకా దాసరి నారాయణరావుగారు, రాఘవేంద్రరావుగారు, కోదండరామిరెడ్డిగారు.. ఇలా చాలామంది దర్శకుల దగ్గర్నుంచి ఎంతో నేర్చుకుని కోట్లాదిమందికి దగ్గర కాగలిగాను.

ఇన్నేళ్ల కెరీర్‌లో మీరు వివాదాల్లో నిలవడం అనేది చాలా చాలా తక్కువ. సినిమా పరిశ్రమలో అలా ఉండటం ఎలా సాధ్యమైంది?
శరత్‌బాబు: సినిమా అనేది పెద్ద కుటుంబం. అందరితో హ్యాపీగా మాట్లాడేవాణ్ణి. పనిలో ఉన్నప్పుడు దాని మీదే ధ్యాస. వ్యక్తిగతంగా నాకు నా స్పేస్ (ఒంటరిగా) చాలా ఇష్టం. నాకున్న అతి కొద్దిమంది హితులు, సన్నిహితులు వస్తారు. నేను వాళ్ల దగ్గరకు వెళతాను.

పన్నెండు మంది అక్కచెల్లెళ్లు, అన్నతమ్ములతో పెరిగిన మీరు ఒంటరితనం ఇష్టపడటమేంటి?
శరత్‌బాబు: షూటింగ్‌లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు దాదాపు నూటయాభై మందితో ఉంటాను. దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇక ఇంటికొచ్చిన తర్వాత నాదంటూ స్పేస్ ఉండాలని కోరుకుంటాను. ఇంటికి రాగానే స్నానం చేయడం, రాత్రి ఏడున్నరకల్లా భోజనం చేయడం, ఆ తర్వాత పది గంటలకు నిద్రకు ఉపక్రమించడం నా అలవాటు. షూటింగ్ ఉన్నా లేకపోయినా పొద్దున్నే ఐదున్నరకల్లా నిద్ర లేస్తాను. నా మొబైల్‌లో వేకప్ కాల్ టైమ్ అదే ఉంటుంది.

అంటే.. చిన్నప్పట్నుంచీ ఓ పద్ధతి ప్రకారం మీ జీవన శైలి ఉండేదా?
శరత్‌బాబు: మా అమ్మానాన్న చాలా క్రమశిక్షణగా పెంచారు. స్కూల్, కాలేజ్ డేస్‌లో జిమ్ అంటే పిచ్చి. అమ్మినాయుడు అనే ఆయన జిమ్ సెంటర్ స్టార్ట్ చేశారు. ఆయనే నన్ను జిమ్‌లో జాయిన్ అవ్వమని చెప్పారు. కరణం మల్లీశ్వరి కూడా అదే జిమ్‌లో వర్కవుట్ చేసేవారు. ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుని జిమ్‌కి వెళ్లేవాణ్ణి. మా నాన్నగారికి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఆయనకు ఆరోగ్యాన్ని పాడు చేసే అలవాట్లేవీ ఉండేవి కాదు. ఏ కొడుక్కైనా తండ్రే హీరో. తండ్రికి మంచి అలవాట్లుంటే కొడుకులకు అదే వస్తుంది కదా. జెనిటికల్‌గా ఆ దేవుడు నాకు చాలా మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇంతవరకూ నా కోసం నేనెప్పుడూ డాక్టర్‌ని కలవాల్సిన పరిస్థితి లేదు. తలనొప్పి, కడుపునొప్పి అనేది తెలియదు.

మీ ఆహార్యం, వ్యవహారం చూసినవాళ్లెవరైనా పక్కా ‘జెంటిల్‌మేన్’ అనే అనుకుంటారు. కానీ, రమాప్రభగారి గురించి అనుకున్నప్పుడు మీరే మోసం చేశారేమో అనే ఫీలింగ్ కొంతమందికి ఉంది. దీనికి మీ సమాధానం?
శరత్‌బాబు: అలా ఎందుకు అనుకుంటున్నారు? అసలు నేనే మోసం చేశానని ఎందుకు అనిపించాలి?

ఆడా మగా మధ్య ఏదైనా సమస్యలు వస్తే.. ఆ సమస్యకు కారణం మగవాడని, మోసం చేసి ఉంటాడేమోననే అభిప్రాయం కలగడం కామన్...?
శరత్‌బాబు: ఒక కన్నీటి చుక్కతో దేన్నయినా మార్చొచ్చు. అబద్ధాన్ని నిజం చేయొచ్చు. నిజాన్ని అబద్ధం చేసెయొచ్చు. నేను అబద్ధాన్ని నిజం చేయడానికి నా కన్నీటిని వృధా చేయను. నేను చెప్పేది ఒక్కటే. పెళ్లిళ్లు మనకు రెండు పద్ధతుల్లో జరుగుతాయి. ఒకటి హిందూ ధర్మశాస్త్ర ప్రకారం, మరొకటి న్యాయ శాస్త్రప్రకారం. విడిపోవడం కూడా ఆ రెండు పద్ధతుల ద్వారానే ఉంటుంది. నేను ఒంటరిగా ఉండటం మొదలుపెట్టింది 1987లో. అంటే 26 ఏళ్లయ్యింది. ఇన్నేళ్లయినా ఎక్కడో శరత్‌బాబు అనే వ్యక్తి మీద ఇష్టం ఉండటంవల్లో, అసలు ఎందుకు ఇతనికి ఇలా జరగాలనే ఫీలింగ్ వల్లో? లేక వేరేవాళ్ల మీద ఉన్న అభిమానం వల్లో మీరు అడిగి ఉండొచ్చు. అసలు నావల్లే పొరపాటు జరిగిందని మీరెలా నిర్ధారణకు వచ్చారు. కానీ ఏం జరిగినా అది నా మేలుకే అని నా ఫీలింగ్.

ఏ రకంగా మేలంటున్నారు.. దాదాపు ఇరవై ఆరేళ్లయినా ఈ విషయాన్ని చాలామంది మర్చిపోలేదు కదా?
శరత్‌బాబు: నాకు ఎవరి మీదా రాయి వెయ్యడం ఇష్టం ఉండదు. ఎటాక్ చెయ్యను. ఏ వ్యక్తితో ముడిబడి అయితే నా జీవితంలో సంఘటనలు జరిగాయో అప్పుడు ఆ వ్యక్తికి స్వయానా తమ్ముడు నాతోనే ఉన్నాడు. విడిపోయిన తర్వాత కూడా అతను కొన్నాళ్లు నాతోనే ఉన్నాడు. ఇక ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదనుకుంటా. దాన్నిబట్టి పరిస్థితులను మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే... ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలని ఉంటే... ఏ కారణంతో విడాకులు ఇస్తారో కోర్టులో చెబుతారు కదా.. ఆ కారణం వింటే అందరి అనుమానాలు పటాపంచలైపోతాయి. 1987 డిసెంబర్ 24న ఫిజికల్‌గా సెపరేట్ అయితే, 89లో లీగల్ సెపరేషన్ వచ్చింది. ఏ బేసిస్ మీద విడాకులు వచ్చాయో మీరు ‘రైట్ టు ఇన్‌ఫర్మేషన్’లో తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్‌లో మొత్తం ఇన్‌ఫర్మేషన్ ఉంటుంది. నేను ఎవర్నీ ఎటాక్ చేయను కాబట్టి, నా నోటితో నేనేమీ చెప్పడానికి ఇష్టపడటంలేదు.

కానీ.. అవతలి వైపు నుంచి ఇన్‌డెరైక్ట్‌గా మిమ్మల్ని ఎటాక్ చేస్తే.. మీరెందుకు దాస్తున్నారు?
శరత్‌బాబు: నేనేదీ దాయడంలేదు. నిజానిజాలు సంబంధిత వ్యక్తులకి, అవతలి కుటుంబానికి తెలుసు. నిజం దాయడం కాదు.. చెప్పడంవల్ల ఇతరులు సమాజంలో చులకనవుతారు. ఆ పని చేయడం నాకిష్టం లేదు. ఈ సంఘటలన్నింటికీ స్వయానా ఆ వ్యక్తి సోదరుడే సాక్షి. అప్పుడు అతను నాతోనే ఉన్నాడు.

నిజం కాబట్టే సెలైంట్‌గా ఉన్నారనుకునే అవకాశం ఉంటుందేమో?
శరత్‌బాబు: కౌంటర్ ఇవ్వను. మీడియాకి మెటీరియల్ ఇచ్చినవాణ్ణి అవుతాను. తప్పు చేసినవాళ్లే సెలైంట్ అవుతారని లేదు. ‘డోంట్ వాష్ డర్టీ లినెన్ ఇన్ పబ్లిక్’ అంటారు. దాన్ని ఫాలో అవుతుంటాను. తెల్లచొక్కా మీద కాకులు రెట్ట వేస్తే వెంటబడి తరమడం వివేకం కాదేమో. ఫామ్‌లో లేనప్పుడు సచిన్‌ని, ధోనీని విమర్శకులు విమర్శించారు. వాటికి సమాధానం చెప్పి, వాళ్లిద్దరూ టైమ్ వేస్ట్ చేశారు. వాళ్ల పని వాళ్లు కరెక్ట్‌గా చేసుకుంటూ ఇప్పటికీ ఎప్పటికీ గ్రేట్‌గానే ఉండిపోతారు. సెలబ్రిటీస్‌కి విమర్శలు, విమర్శకులు ఉండటం సహజం. ఐ డోంట్ బాదర్. అపోహలు తొలగించుకుని, నిజానిజాలు తెలుసుకోవాలంటే స్వయంగా కోర్టువారు ఫీడ్ చేసిన రైట్ టు ఇన్‌ఫర్మేషన్‌లోకి వెళితే సరైన సమాచారం దొరుకుతుంది.

మాకు పరీక్ష పెడుతున్నారేంటి?
శరత్‌బాబు: పరీక్ష కాదు.. మీరు రైట్ టు ఇన్‌ఫర్మేషన్ చూసి... నిజమేంటో తెలుసుకుని, నా మీద అపోహ ఉన్న వారికి, ఆ అపోహను తొలగిస్తారని ఆశిస్తున్నా.

వయసుపరంగా చూస్తే మీ ఇద్దరికీ చాలా వ్యత్యాసం ఉందనుకుంటా! మరెందుకు పెళ్లి చేసుకున్నారు?
శరత్‌బాబు: కర్మలంటారు కదా. ఆ కర్మల తాలూకే ఇది అని నేననుకుంటున్నాను.

మీ ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారు?
శరత్‌బాబు: ఒక కన్నీటి చుక్క రాలడంతో స్టార్ట్ అయ్యింది. జనరల్‌గా మగాడు అలా చేయడుగా! మీరు పెళ్లి పెళ్లి అని మాట్లాడుతున్నారు కాబట్టి ఓ విషయం చెబుతున్నా. ఒకవేళ ఎవరైనా వ్యక్తికి ఆల్రెడీ పెళ్లయ్యిందనుకోండి... ఆ వ్యక్తి మళ్లీ పెళ్లి చేసుకుంటే అది పెళ్లెలా అవుతుంది? అందుకే చెబుతున్నా. నాది ‘ఇన్‌వాలిడ్ మ్యారేజ్’ అని.

అంటే.. అప్పట్లో మీలో ఎవరికి ఆల్రెడీ పెళ్లయ్యింది?
శరత్‌బాబు: అది నేను చెప్పను. నేనొక వ్యక్తి గురించి మాట్లాడను. దటీజ్ శరత్‌బాబు. ఆ వ్యక్తిని మీరే అడగండి.

మరి.. ఇన్‌వాలిడ్ మ్యారేజ్ అనుకున్నప్పుడు విడాకులకు కోర్టుకి ఎందుకెళ్లారు?
శరత్‌బాబు: భవిష్యత్తులో పరస్పరం సమస్యలు లేకుండా, రాకుండా ఉండటంకోసం. అందుకే లీగల్‌గా క్లియర్ అవ్వాలనుకున్నాను. జీవితంలో మీరు పైన ఉన్నారనుకోండి... నన్ను వదిలేసి పోతారు. కానీ మీరు దెబ్బ తిన్నప్పుడు నేను హిమాలయాల్లా కనిపించొచ్చు కదా. అప్పుడు నా జోలికి రాకూడదనే విడాకులు తీసుకున్నా.

ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు?
శరత్‌బాబు: ఇంచుమించుగా అరణ్యవాసం అంత. కానీ సింహభాగం అవుట్‌డోర్ షూటింగుల్లోనే గడిచిపోయింది.

మీ అమ్మా నాన్న సమక్షంలోనే పెళ్లి జరిగిందా?
శరత్‌బాబు: పెళ్లి కాదు... ఇన్‌వాలిడ్! మా అమ్మా నాన్నల సమక్షంలోనే కాదు.. వారి అనుమతి కూడా లేదు.

కేవలం రమాప్రభగారి దగ్గరున్న డబ్బు కోసమే మీరు ఆమెకు దగ్గరయ్యారని, విడిపోయే నాటికి చాలానే చేజిక్కించుకున్నారనే ఆరోపణ ఉందే..!
శరత్‌బాబు: మనకి రికార్డ్స్ ఉంటాయి. సినిమాల లిస్ట్‌ని ఎవరూ మాయ చేయలేరు. విడిపోయే నాటికి నా చేతిలో ఎన్ని సినిమాలున్నాయో రికార్డ్‌లు తిరగేస్తే తెలుస్తుంది. ఇన్‌కమ్ టాక్స్ రికార్డ్స్ తిరగేస్తే ఇన్‌కమ్ పరంగా ఎవరు బెటర్ పొజిషన్‌లో ఉన్నారో మీకర్థమవుతుంది. ఇన్‌వాలిడ్ మ్యారేజ్ సెపరేషన్ గురించి ఒక మాట చెబితే.. చాలామందికి నా మీద ఉన్న అపోహ తొలగిపోయి, మరింత గౌరవం పెరుగుతుంది. ఎవరైనా విడాకులు కోరినప్పుడు, కోర్ట్ అవి మంజూరు చేసిన తర్వాతే కదా సెటిల్‌మెంట్ చేస్తారు. కానీ అవకముందే సెటిల్ చేశానంటే ఎంత ఫూల్ అయ్యుంటానో అర్థం చేసుకోండి. మీరు చెప్పే పేరుని మీతోనే కాదు.. నేనెక్కడా ఉచ్ఛరించను. నా స్నేహితుల దగ్గర కూడా ఎత్తను.

విడాకులు కావాలని మీరే కోర్టుకెళ్లారా?
శరత్‌బాబు: అవును.. నేనే. ప్రవచనాలు జరుగుతాయి చూడండి. నేనెప్పుడూ వాటికి వెళ్లలేదు. ఇప్పుడూ వెళ్లను. గతంలో ఒక్కసారే వెళ్లాను. కృష్ణుడు ఏదో సమాధానం చెబుతున్నాడు... ఎవరికో. ‘గో ఎ హెడ్.. వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రైట్. ఇప్పటికే లేట్ చేశావ్’ అని చెబుతుంటే, అది నాకు చెబుతున్నట్లే అనిపించింది. ఆధ్యాత్మికంగా ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు మనం కనుక బాగా మనసు పెట్టి వింటే, ఆ ప్రవచనాల్లో మన పరిస్థితికి తగ్గ సమాధానం దొరుకుతుంది. అప్పటికే నాలో జరుగుతున్న అంతర్మథనానికి ఆ రోజు ప్రవచనాల ద్వారా సమాధానం దొరికింది. ఆ తర్వాతే కోర్టుకెళ్లా.

మీ జీవితంలో జరిగిన ఈ సంఘటనలను ఎవరితోనూ పంచుకోలేదా?
శరత్‌బాబు: నెవ్వర్. ఎవరితోనూ చెప్పుకోలేదు. నా క్లోజ్ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోలేదు. ఒకే ఒక్కరికి చెప్పాను. ఆ దేవుడు శివుడు దగ్గర చెప్పుకున్నాను. ఎప్పుడైనా కొంచెం డిస్ట్రబ్ అయితే ధ్యానం చేస్తాను. నా ఆలోచనల ద్వారా దేవుణ్ణి కనెక్ట్ అవుతాను కానీ నేరుగా కనెక్ట్ అయ్యేంత శక్తి నాకింకా రాలేదు. ఆ భగవంతుడు నాకు నేరుగా వచ్చి సమాధానం చెప్పకపోయినా ఏదో రూపంలో నాకు సమాధానం దొరుకుతుంది.

ఓవరాల్‌గా వీటివల్ల మీరు కోల్పోయిందేంటి?
శరత్‌బాబు: చాలా ఉన్నాయి. అవి పక్కన పెడదాం. ఈ సంఘటనల ద్వారా చాలా నేర్చుకున్నాను. అర్హత లేని స్త్రీకి ఆమడ దూరం ఉండటం నేర్చుకున్నాను. కన్నీటికి చాలా విలువ ఇచ్చేవాణ్ణి. కానీ నాటకీయంగా పెట్టుకునే కన్నీళ్లకు, నాటకంతో కూడుకున్న కాళ్ల మీద పడటాలకు ఇప్పుడు నేను కదిలిపోవడంలేదు. చేసిన తప్పు మళ్లీ చెయ్యను. సంచిత కర్మలని ఉంటాయి. వాటి గురించి చెప్పాలంటే... మనిషికి చివరి జన్మ మనిషి జన్మే అంటారు. కానీ ఏ మనిషికైనా చాలా జన్మలుంటాయి. రాముడుగా పుట్టినప్పుడు చాలామంది ఏదో అడిగితే.. కృష్ణుడి జన్మలో చూస్తానన్నాడట రాముడు. నా విషయంలో కూడా గత జన్మది వెంటాడి ఉండొచ్చనుకుంటాను. నేను రాముణ్ణి అనడంలేదు. కృష్ణుణ్ణి డెఫినెట్‌గా కాదు. ఏ లేడీ ఆర్టిస్ట్‌తో కూడా పేకప్ తర్వాత మాట్లాడిన దాఖలాలు ఉండవు. కానీ నాకిష్టమైనవాళ్లు ఉన్నారు. ఆ ఇద్దరూ నాకు సీనియర్స్. వాళ్లిచ్చిన సలహాలను రైట్ టైమ్‌లో తీసుకోలేదు. ఆ ఇద్దరు హీరోయిన్స్ పేరు చెబితే.. వారి గురించి ఎవరెవరో ఏదేదో మాట్లాడతారు. నాకిష్టం లేదు. అలాగే గిరిబాబు, రంగనాథ్, మురళీమోహన్, జయసుధ.. ఈ అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. ఇక్కడ ఇంకోవిషయం స్పష్టం చేయదలిచాను. ఇక ముందు ఈ సంఘటన గురించి ఎవరడిగినా సమాధానం చెప్పను. ఎందుకంటే ఇది ఇరవై ఆరేళ్ల క్రితమే ముగిసిన ప్రహసనం. లెట్ ఇట్ రిమైన్ దో. అది విన్న సహృదయులకు, విజ్ఞులకు ధన్యవాదాలు. ఆదరాభిమానాలు కనబరుస్తున్న అభిమానులకు సదా కృతజ్ఞుణ్ణి. దీనికి సంబంధించి ఎవరేం అడిగినా సమాధానం రాదని మరోసారి స్పష్టం చేస్తున్నా.

మీకు పిల్లలున్నారా?
శరత్‌బాబు: నాకిద్దరు పిల్లలున్నారని బయట టాక్ వచ్చి ఉండొచ్చు. కానీ నా బ్లడ్ గ్రూప్‌తో పిల్లలు లేరు. నేనెవర్నీ దత్తత చేసుకోలేదు. నాకు ఇరవై అయిదు మంది పిల్లలున్నారు. నా అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల పిల్లలు వాళ్లు. నా చివరి మజిలీ ఏంటో అతి త్వరలో తెలుస్తుంది. కొన్నేళ్లుగా నేను సింగిల్‌గానే ఉన్నాను. అది ఎన్నేళ్లు అని చెప్పను. ఒంటరితనం.. ఏకాంతం అని రెండుంటాయి. ఇప్పుడు ఏకాంతంగానే ఉన్నా. కానీ ఒంటరిని కాను. నా ఇంట్లో నాతో పాటు ఎవరూ ఉండరు. యాష్ ట్రే ఉండదు. డ్రింక్స్ ఉండవు. భగవంతుడి దయవల్ల ఆరోగ్యాన్ని పాడు చేసే అలవాట్లేవీ లేవు.

సినిమా పరిశ్రమలో మందు, మగువ లేనివాళ్లు చాలా తక్కువ అంటారు. మీరు వాటికి దూరం అంటున్నారా?
శరత్‌బాబు: అనడం కాదు అది నిజం. ఒకసారి కిచెన్‌లోకి రండి. ఇదిగో నా ఫ్రిజ్‌లో బ్రెడ్, ఫ్రూట్స్, పాలు తప్ప ఏమైనా ఉన్నాయోమో చూడండి. ఇల్లు ఎంత నీట్‌గా ఉందో చూశారు కదా. మందు కొట్టే అలవాటుంటే మిమ్మల్ని సాయంత్రం ఆరు తర్వాత ఇంటర్వ్యూకి ఎందుకు రమ్మంటాను? నా మానసిక, శారీరక ఆరోగ్యం పాడు చేసేవాటి జోలికి వెళ్లను. ఒక్కోసారి యాక్సిడెంటల్‌గా జరిగే సంఘటనల తాలూకు గుణపాఠం వల్ల ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటున్నాను.

మీ ఇన్‌వాలిడ్ మేరేజ్‌కి ఫుల్‌స్టాప్ పడిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్నారు కదా..?
శరత్‌బాబు: ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడను. త్వరలో సందర్భం వస్తుంది.. అప్పుడు చెప్తా.

ఇంతకీ పెళ్లి చేసుకున్నారా?
శరత్‌బాబు: చేసుకోబోతున్నా.

ఈ వయసులో...?
శరత్‌బాబు: శారీరకంగా, మానసికంగా ఇంకా నా వయసు ముప్ఫయ్ అయిదే.

ఎవర్ని పెళ్లి చేసుకోబోతున్నారు?
శరత్‌బాబు: ఆమె గురించి ఇప్పుడు చెప్పను. ఐదక్షరాల పేరుంటుంది.

జరిగిన సంఘటనలవల్ల అర్హత లేని స్త్రీకి ఆమడ దూరంలో ఉన్నానన్నారు. మరి ఇప్పుడు మీరు చేసుకోబోయే అర్హతలున్న స్త్రీ గురించి చెబుతారా?
శరత్‌బాబు: నిజాయితీ, మంచి వ్యక్తిత్వం ఉన్న స్త్రీకి దగ్గరవ్వడానికి ఏ మగాడైనా వెనకాడడు. ఐయామ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. ఇంతకుమించి ఆమె గురించి ఏమీ చెప్పను.

మీరు నాలుగు దక్షిణాది భాషల్లో సినిమాలు చేశారు కదా.. ఆమె ఏ భాషకు చెందిన వ్యక్తి?
శరత్‌బాబు: మీకిష్టమైన బ్యాగ్రౌండ్‌కి చెందిన అమ్మాయి..

అంటే... జర్నలిజమా? సినిమా పరిశ్రమా?
శరత్‌బాబు: త్వరలోనే సమాధానం దొరుకుతుంది. అయితే ఇది సంచిత కర్మ కాదు. ఆత్మతృప్తితో చేయబోతున్నది. అంతకు మించి ఏమీ చెప్పను.

ఇంతకీ ఇది వాలిడ్ మేరేజేనా?
శరత్‌బాబు: ఎస్... దిసీజ్ ది ఓన్లీ వేలీడ్ మేరేజ్ (నవ్వుతూ).

- డి.జి. భవాని

నేను ఆర్టిస్ట్ అవుతానని ఆ దేవుడికి ముందే తెలుసు కాబట్టే... మేకప్ వేసి పంపించేశాడేమో అనిపిస్తుంటుంది. కెమెరా లైట్స్‌కి సూట్ అవ్వడం కోసం తప్ప మేకప్‌తో నాకు పెద్దగా పనిలేదు.

ఇంకో యాభైఏళ్లయినా ఇంతే ఆరోగ్యంగా ఉంటానన్నది నా నమ్మకం.

వంట చేయడం చేతకాదు. నా కోసమే మా ఇంటి పక్కనే హోటల్ ఉంది. కాఫీ షాప్ ఉంది. ఆ భగవంతుడు నాకన్నీ అలా సమకూరుస్తాడనుకుంటా.

నాకేదైతే చెడు జరిగిందో అది మంచి అనుభవం నేర్పించింది.

*********

దేవుడిమీద మనసు లగ్నం అవ్వాలంటే ఓ ఆకారం ఉండాలి. అందుకే ఓ ఆకారం ఇచ్చి, దేవుళ్లకు ఇన్ని పేర్లు పెట్టారు. కానీ దేవుడికి ఆకారం లేదు. అందుకే ధ్యానం చేసేటప్పుడు నేను జ్యోతిని ఊహించుకుంటా.

మా నాన్నగారికి మేం నీళ్లల్లో దిగడం ఇష్టం ఉండేది కాదు. అందుకని ఫ్రెండ్స్ అందరూ ఈత కొడుతున్నా నేను మాత్రం చూస్తూ ఉండిపోయేవాణ్ణి.

*********

ఏ ప్రాణినీ చంపే హక్కు మనకు లేదు. అందుకే నేను మాంసాహారం తినను. అఫ్‌కోర్స్ మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది. అయితే ఒక ఆకు కోస్తే ఇంకో ఆకు వస్తుంది. కానీ కోడి, మేకకు కాలు తీస్తే మళ్లీ వస్తుందా? సైంటిఫికల్‌గా చూస్తే మొక్కలకు సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ ఉండదు. బ్లడ్ ఊజ్ కాదు. వాటికి పెయిన్ తక్కువ. అందుకే శాకాహారం తింటాను.
  

No comments: