all

Saturday, July 27, 2013

తరచు పళ్లు క్లీన్ చేయించుకోవడం ప్రమాదమేమో.!?

 
     
డెంటల్
నా వయసు 32. చాలాకాలంగా బ్రష్ చేసినప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారుతోంది. డెంటిస్ట్‌ను కలిస్తే రెండుమూడుసార్లు పళ్లు క్లీన్ చేశారు. కొన్నాళ్లు బాగానే ఉంటుంది. కాని, సమస్య మళ్లీ మొదటికి వస్తోంది. ఇలా రెండుమూడుసార్లు జరిగింది. మళ్లీ మళ్లీ పళ్లు క్లీన్ చేయించుకుంటే ఏమవుతుందో అనిభయంగా ఉంది. ఏం చేయమంటారో సలహా ఇవ్వండి.
- పద్మప్రియ, హైదరాబాద్.


బ్రష్ చేసినప్పుడో, గట్టిపదార్థాలను నమిలినప్పుడో, చిగుళ్ల మీద ఒత్తిడి కలిగినప్పుడో రక్తంరావడం చిగుళ్ల జబ్బుకు సంబంధించిన ఒక ప్రధాన లక్షణం. చిగురు అంచుల్లో బ్యాక్టీరియా చేరడం వల్ల చిగుళ్లు వాచి, ఇటువంటి సమస్యకు దారితీస్తుంది. మొదటిదశలో దీనిని క్లీన్‌చేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. చిగుళ్ల నుంచి రక్తం కారడం తప్ప ఎటువంటి నొప్పి, బాధ ఉండదు కాబట్టి చాలామంది ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా నిర్లక్ష్యం చేసేకొద్దీ మురికిలోని ఇన్ఫెక్షన్ లోపలికి పాకి, పంటికి ఆధారంగా ఉన్న ఎముకలను పాడు చేస్తాయి. పంటిదృఢత్వాన్ని చెడగొడతాయి. అందుకే చాలామందికి చిన్న వయసులోనే పళ్లు వదులైపోతుంటాయి. చిగుళ్లకు సంబంధించిన అన్ని ఇన్ఫెక్షన్లకు పళ్లు క్లీన్ చేస్తే సరిపోదు. క్యూరటాజ్, ఫ్లాప్ ట్రీట్‌మెంట్ వంటి కొన్ని ప్రత్యేక చిగుళ్ల చికిత్సల ద్వారా సమస్యను దూరం చేయవచ్చు.

పళ్లు వదులవుతూ ఉంటే బోన్ గ్రాఫ్టింగ్ విధానం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇకపోతే ... క్లీన్ చేయడం ద్వారా పళ్లు అరిగిపోతాయని, పంటిపై ఉన్న ఎనామిల్ దెబ్బతింటుందని అపోహలు వద్దు. వెంటనే మంచి స్పెషలిస్టును కలిసి చికిత్స చేయించుకోండి.

నా వయసు 24. ఇటీవల నా పళ్ల మధ్య ఏదో ఇరుక్కుపోయినట్లుగా ... దురదగా అనిపించటం వల్ల ఏమీ తోచక పిన్నుతో కెలికేదాన్ని. దాంతో పళ్లమధ్య ఉండే పొర కాస్తా తెగిపోయి, క్రమేణా పళ్లమధ్య గ్యాప్ ఏర్పడింది. దానికితోడు చిగుళ్లపైన నల్లటి మచ్చలు పడి, నవ్వితే అసహ్యంగా కనిపిస్తోంది. ఇది నాకు మానసికంగా బాధ కలిగిస్తోంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు.
- కుమారి, కొత్తగూడెం


పళ్ల మధ్య ఏదో ఇరుక్కుపోయినట్లుగా అనిపించడం, దురదగా ఉంటోంది అంటే దంత శుభ్రత సరిగా పాటించకపోవడమే కారణం. సమస్యతో నిమిత్తం లేకుండా కనీసం ఆరేడు నెలలకోసారి దంతవైద్యుని వద్దకెళ్లి, పళ్లను, చిగుళ్లను క్లీన్ చేయించుకోవడం వల్ల చాలా రకాలైన చిగుళ్లు, పళ్ల సమస్యలకు చెక్ చెప్పవచ్చు. ముందు మీరు పళ్లను పిన్నులతో, పుల్లలతో కుట్టుకోవడం మానేయండి. మీకు కలిగిన సమస్య చిన్నదే. దీనికి కుంగిపోనవసరం ఏమీ లేదు. దీనిని కాస్మటిక్ ఫిల్లింగ్ లేదా క్లిప్పులతో సరి చేయవచ్చు. ఇందుకు చిగుళ్లకు చేసే సాధారణ చికిత్స సరిపోతుంది. అలస్యం చేయకుండా వెంటనే దంతవైద్యుని సంప్రదించండి.

No comments: