ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. తెలుగు పండుగల్లో నరక చతుర్దశి, దీపావళి ప్రముఖమైనవి. హిరణ్యాక్షుడు, బకాసురుడు తదితర రాక్షసుల్లాగే నరకాసురుడు దేవ, మానవ లోకాల్లో సంక్షోభం కలిగించాడు. నరకాసురుడు వరాహస్వామి, భూదేవిల సంతానం. నరకాసురుని విష్ణుమూర్తి చంపకూడదని, తన కొడుకు తన చేతిలోనే మరణించాలని, ఎంత లోక కంటకుడు అయినప్పటికీ తన కొడుకు నరకాసురుని పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని వరం పొందుతుంది భూదేవి. ఆ వరాన్ని అనుసరించి, భూదేవి, ద్వాపరయుగంలో సత్యభామగా జన్మించింది.
దేవేంద్రుడు శ్రీకృష్ణునికి నరకాసురుని అకృత్యాలను వివరించాడు. దాంతో శ్రీకృష్ణుడు ఆ అసురుని హతమార్చేందుకు బయల్దేరాడు.
ఇదంతా చూసిన సత్యభామ ఆ దుష్టున్ని తానే వధిస్తాను అంది. శ్రీకృష్ణుడు వద్దని వారించినా ఆమె తన పట్టు విడవలేదు. గరుడ వాహనాన్ని అధిరోహించి శ్రీకృష్ణునితో కలిసి రణరంగానికి వెళ్ళింది. చాకచక్యంగా బాణాలు వేసి శత్రుసైన్యాన్ని మట్టి కరిపించింది. గతంలో పొందిన వరాలను అనుసరించి, చివరికి భూదేవి అంశ అయిన సత్యభామ చేతిలోనే మరణించాడు నరకాసురుడు. అలాగే నరకాసురుని వధించిన రోజు ''నరక చతుర్దశి'' అయింది. అలా నరకాసురుని పేరు శాశ్వతంగా నిలిచిపోయింది.
దేవ, మానవులను పీడించే నరకాసురుని బాధ తొలగిపోవడంతో ఆ మరుసటి రోజు, అంటే ఆశ్వయుజ అమావాస్య నాడు అందరూ ఆనందంగా దీపాలు వెలిగించి, పరవశంగా టపాసులు కాల్చారు. అదే దీపావళి పండుగ.
No comments:
Post a Comment