భారతీయ సంస్కృతికి ప్రతిబింబాలుగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్యదీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.
దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపమాలికలతో లక్ష్మీదేవికి నీరాజనమిచ్చే రోజు కావడం చేత దీనికి దీపావళి అని పేరొచ్చింది. ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాం. లక్ష్మీ పూజ లేదా దీనినే ఐశ్వర్యాన్ని సంపదలను ఇచ్చే మాత లేదా అమ్మవారి పూజ అంటారు.
ఉత్తర భారత దేశమైనా లేక దక్షిణ భారతదేశమైనప్పటికి దీపావళి పండుగ కార్యక్రమాలలో లక్ష్మీ పూజ ప్రధానమైంది. లక్ష్మీ దేవి చల్లని చూపు తమపై ప్రసరించాలని కోరుతూ, ప్రతి ఇంట్లోను పండుగనాడు స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ అట్టహాసంగా ఆ మాత కు పూజలు చేసి ఆశీర్వాదాలు కోరతారు.
మాత లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో చక్కటి శుభ్రత ఒకటి. శుభ్రంగా కళ కళ లాడే ఇంటిని ఆ మాత మొట్టమొదటే అడుగిడుతుందన్న నమ్మకంతో ప్రతి ఇల్లు ఈ రోజు ఎంతో శుభ్రతతో, వివిధ రకాల ముగ్గులతో, దీపాలతో, పూలతో అలంకరిస్తారు.
శుభ్రతకు చిహ్నమైన చీపురు కట్టకు పసుపు, కుంకుమలు పెట్టి ఈ రోజున పూజిస్తారు.
అమ్మవారు తాము పెట్టిన దీపాల వెంట రావాలని కోరుతూ సాయంత్రమయ్యే సరికి ప్రమిదల దీపాలు, లేదంటే, రంగురంగుల బల్బులు కల తోరణాలను ఇంటికి కట్టి అలంకరణలు చేస్తారు.
ఇక దీపావళి పూజ ఎలా చేస్తారు?
పూజలో ప్రధానంగా వినాయకుడిని, మాత లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఏ పూజ చేసినా విఘ్నఅధిపతి అయిన వినాయకుడిని ముందుగా పూజించాలి.
దీని తర్వాత లక్ష్మీ దేవిని ఆమె మూడు రూపాలయిన లక్ష్మీ, సరస్వతి, మహా కాళి, రూపాలలో పూజిస్తారు. వీరితో పాటు ధనాగారాలకు అధిపతి అయిన కుబేరుడిని కూడా పూజిస్తారు.రతి హైందవ గృహంలోనూ లక్ష్మీ దేవి రూపం వుంటుంది.
విడిగా, విష్టుసమేతంగా లక్ష్మీదేవికి నిత్య పూజలు నిర్వహించడం కద్దు. దీపావళి పండుగనాడు ఆమెకు ప్రత్యేకంగా పూజ చేస్తారు. లక్ష్మీ గణపతులకు మ్రొక్కుతారు. లక్ష్మీదేవి రూపం గణపతితో పాటు వుంటుంది.
తాము నిర్వహించే కార్యాలకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడాలని సిరులిచ్చే తల్లి కరుణాకటాక్షాలు ఎల్లవేళలావుండాలని కోరుకుంటూ దీపావళి వేళ లక్ష్మీగణపతుల పూజ చేస్తారు.
దీపావళి రోజున ప్రతి ఇంటికీ లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తూ, ముంగిళ్ళను రంగవల్లులతో అలంకరిస్తారు. ప్రతిరోజు, అనేక పర్వదినాలలో లక్ష్మీదేవిని కోలిచినా, దీపావళి నాటి లక్ష్మీపూలకు విశిష్టత వుంది.
No comments:
Post a Comment