all

Sunday, February 2, 2014

నూనె పెట్టాలి ఇలా...



'జుట్టుకి నూనె పెట్టుకునేందుకు కూడా ఒక పద్ధతి ఉంది. అలాకాకుండా ఎలాగంటే అలా రాస్తే జుట్టు రాలిపోతుంది, పాడయిపోతుంది' అంటున్నారు ప్రముఖ హెయిర్‌స్టయిలిస్ట్ జావెద్ హబీబ్. అంతేకాదు జుట్టు రకాన్ని బట్టి నూనె ఎంపిక చేసుకోవాలి అంటూ కొన్ని సలహాలు సూచనలు చేశారాయన.

-గోరు వెచ్చటి నూనెలో చేతి వేళ్లు ముంచి, జుట్టును రెండు భాగాలుగా చేసి మాడుకి నూనె పట్టించి మునివేళ్లతో నెమ్మదిగా మర్దనా చేయాలి. పది నుంచి పదిహేను నిమిషాలు మర్దనా చేయడం వల్ల మాడుకి రక్త సరఫరా బాగా అవుతుంది.

-రాత్రి నూనె పెట్టుకుని మరుసటి రోజు తలస్నానం చేస్తే ఫలితం బాగుంటుంది. ఒకవేళ పగలు పెట్టుకుంటే కనక ఎక్కువ సమయం మాడుకి నూనె పట్టించాలి. 24 గంటలకంటే ఎక్కువ మాత్రం తల మీద నూనె ఉంచుకోవద్దు. అలా ఉంచితే జుట్టుపై దుమ్ము చేరుతుంది. దాంతో జుట్టు బలహీనపడి రాలిపోతుంది.

-నూనె పెట్టిన తరువాత వేడి నీళ్లలో ముంచిన తుండుతో ఆవిరి పడితే నూనెని జుట్టు బాగా పీల్చుకుంటుంది. ఇందుకు వేడి తుండును తలకు చుట్టి పదినిమిషాలు ఉంచాలి. ఇలా చేసేటప్పుడు తుండు మరీ వేడిగా ఉండకూడదు. వేడి ఎక్కువగా ఉంటే జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి.

-వారానికి ఒకసారి జుట్టుకి నూనె పట్టించాలి. కుదిరితే ఒకటికంటే ఎక్కువ సార్లు పెట్టినా మంచిదే.
జుట్టు రకాన్ని బట్టి ...
నార్మల్ హెయిర్: ఈ రకం జుట్టు జిడ్డుగా లేదా పొడిగా ఉంటుంది. జొజొబా, బాదం, ఉసిరి నూనెలు వాడాలి.
పొడి జుట్టు: ఈ జుట్టు నిస్సారంగా కనిపిస్తుంది. త్వరగా చిట్లిపోతుంది. బాదం, జొజొబా, కొబ్బరి, నువ్వులు, ఆవాలు, కోకో-బటర్ నూనెలు వాడాలి.

జిడ్డు జుట్టు: ఆలివ్, నువ్వులు, జొజొబా నూనెలు వాడాలి.

చుండ్రు జుట్టు: టీ ట్రీ నూనె చాలా బాగా పనిచేస్తుంది.

ఏ నూనె వాడుతున్నా అందులో విటమిన్-ఇ కలిపి వాడితే జుట్టు ఆరోగ్యకరంగా ఉంటుంది.

వాతావరణం తేమగా ఉంటే జుట్టుకి నూనె రాయొద్దు. అలాగే జిడ్డు చర్మం వాళ్లకి మాడు నుంచి నూనె ఉత్పత్తి అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా జుట్టుకి నూనె వాడాల్సిన అవసరం లేదు. ఎక్కువ సేపు ఆరు బయట ఉండేవాళ్లు కూడా నూనె రాసుకోవద్దు. దీనివల్ల దుమ్ము వచ్చి చేరిజుట్టు ఎక్కువగా రాలుతుంది.

 

రాలే జుట్టుకు కరివేపాకు ప్యాక్........

పౌష్టికాహార లోపం, కాలుష్యాలు దాడి చేయడం వల్ల, షాంపూలు, తలకు వేసుకునే రంగులతో రకరకాల ప్రయోగాలు చేయడం వల్ల జుట్టు ఊడగొట్టుకుంటున్న వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. మరి దీన్ని ఆపడం ఎలా? అది మీ చేతుల్లోనే ఉంది. అందుకు బెస్ట్ మెడిసిన్ కూరల్లో వాడే కరివేపాకు. అదెలాగంటే...పొడవు, మందం బట్టి జుట్టుకు సరిపడా కరివేపాకులు తీసుకుని మెత్తగా రుబ్బాలి.

ఇందులో నానబెట్టిన మెంతుల్ని ఆ నీళ్లతో సహా కలపొచ్చు. ఈ పేస్ట్‌ను మాడుకు రాసుకుని రెండు గంటల పాటు ఉంచుకోవాలి. రాసుకున్న మిశ్రమం త్వరగా ఆరిపోకుండా ఉండేందుకు తలకు షవర్ క్యాప్ పెట్టుకోవాలి. రెండు గంటల తరువాత గోరు వెచ్చటి నీళ్లతో జుట్టు శుభ్రం చేసుకోవాలి.

జుట్టు జిడ్డుగా అతుక్కున్నట్టు ఉంటుంది గాని ఆరిన తరువాత బాగానే ఉంటుంది. ఒకవేళ మరీ జిడ్డుగా ఉన్నట్టు అనిపిస్తే మైల్డ్ షాంపూ వాడొచ్చు.జుట్టు ఆరిన తరువాత దువ్వితే జుట్టుకు కరివేపాకులేమైనా ఉంటే వచ్చేస్తాయి. ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి జుట్టుకు వేసుకుంటే పట్టుకుచ్చులా మెరిసే ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం. అంతేకాదు ఎక్కువ జుట్టు ఉన్నట్టు కూడా కనిపిస్తుంది.

జుట్టుకు పళ్లతో ప్యాక్‌లు, మాస్క్‌లు..



జుట్టు పై రకరకాల ప్రయోగాలు చేసి రసాయనాలతో నింపి పాడుచేశారా. అలాంటి జుట్టుకు జీవం తినే పళ్లతో వస్తుంది. ఒక అరటిపండు, ఒక గుడ్డు తెల్లసొన, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాలను కలిపి మెత్తటి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు ప్యాక్‌లా వేసి అరగంట లేదా నలభై నిమిషాలు ఉండాలి. ఆ తరువాత నీళ్లతో జుట్టుని కడిగి తుండుతో నెమ్మదిగా వత్తాలి. ఇలాచేస్తే రసాయనాల వల్ల పాడయిన జుట్టు రిపేర్ అవడం ఖాయం.
 స్టయిల్, ఫ్యాషన్‌లంటూ తడవకో రంగు వేసి జుట్టు గడ్డిలా తయారైందా... ఈ సమస్యనుంచి బయటపడేయడంలో అరటి పండు సాయపడుతుంది. రెండు టేబుల్ స్పూన్ల వేప పొడి, ఒక కప్పు బీరు, ఒక కప్పు అరటిపండు పేస్ట్, రెండు కప్పుల బొప్పాయి పేస్ట్‌లను ఒక గిన్నెలో వేయాలి. ఇందులో గోరు వెచ్చటి నీళ్లు పోసి పేస్ట్‌లా కలపాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకి రాసి అరగంట తరువాత గోరువెచ్చటి నీళ్లతో కడిగితే మెరిసే జుట్టు మీ సొంతమవుతుంది.
 రోజులో ఎక్కువ సమయం నెత్తిన చెయ్యి పెట్టుకుని గీరుతూనే ఉన్నారా. అయితే చుండ్రు సమస్య కావచ్చు. దీన్నుంచి బయటపడేందుకు అరకప్పు ఉసిరి రసం, ఒక కప్పు పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసాలను గిన్నెలో వేసి మెత్తటి పేస్ట్‌లా కలపాలి. దీన్ని తలకు రాసుకుని గంట తరువాత గోరువెచ్చటి నీళ్లతో తల కడిగేయాలి. చివర్లో కండిషనర్ రాసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల జుట్టు మెరవడమే కాకుండా చుండ్రు సమస్యను ప్రభావంతంగా తగ్గిస్తుంది.
 జుట్టు తెగ రాలిపోతుందా అయితే సగం అవకాడో తీసుకుని మెత్తగా చేయాలి. ఇందులో మూడు టేబుల్ స్పూన్ల మెంతుల పేస్ట్, పావు కప్పు గ్రీన్ టీ, సరిపడా గోరువెచ్చటి నీళ్లు పోసి కలిపి ఈ మిశ్రమాన్ని హెయిర్ మాస్క్‌లా వేయాలి. ఇది మంచి ఫలితాల్ని ఇస్తుంది. ఈ మాస్క్ కాస్త రెగ్యులర్‌గా వేసుకుంటే ఫలితం బాగుంటుంది.

 తలంటుకున్న కాసేపటికే జిడ్డు కారుతుంటుంది కొందరి జుట్టు. ఈ రకం జుట్టు ఉన్న వాళ్లు కమలా రసం మూడు టేబుల్ స్పూన్లు, పెరుగు ఒక కప్పు, ఉసిరి పొడి మూడు టేబుల్ స్పూన్లు, తులసి ఆకుల పొడి ఒక టేబుల్ స్పూన్ కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకి, మాడుకి, జుట్టు చివర్లతో సహా పట్టించి నలభై నిమిషాల నుంచి గంట సేపు ఉంచాక గోరు వెచ్చటి నీళ్లతో కడిగేయాలి.

 

ముందు జాగ్రత్తలతోనే ఆరోగ్యవంతమైన సంతానం......



ఆరోగ్యవంతమైన సంతానం కలిగినప్పుడే దంపతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిస్తుంది. మరి ఆరోగ్యవంతమైన సంతానం కావాలంటే గర్భం ధరించక ముందు నుంచే ప్లానింగ్ చేసుకోవాలి. దంపతులిద్దరూ వైద్యులను సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకోవాలి. అవసరమైన వైద్యపరీక్షలు చేయించుకోవాలి. అప్పుడే ప్రెగ్నెన్సీలో ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా ఉండటంతో పాటు, పండంటి బిడ్డను పొందే అవకాశం ఉంటుందని అంటున్నారు

సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రాధిక. ప్రెగ్నెన్సీ కోసం ప్రత్యేకంగా ఎలా ప్లాన్ చేసుకుంటారు?
అని చాలా మందికి సందేహం ఉంటుంది. ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక వైద్యుల దగ్గరకు వెళతారే తప్ప ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నాం, తగిన సలహా ఇవ్వండని వైద్యుల దగ్గరకు ఒక్కరు కూడా వెళ్లరు. చాలా మంది చేసే తప్పు ఇది. నిజానికి ప్రెగ్నెన్సీలో ఎలాంటి సమస్యలు రాకూడదు అనుకుంటే గర్భం ధరించకముందే వైద్య సలహాలు తీసుకోవాలి.

వంశపారంపర్యంగా వచ్చే కొన్ని వ్యాధులు, వాటి వల్ల తలెత్తే సమస్యలను ముందుగానే గుర్తించడం వల్ల ప్రెగ్నెన్సీలో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.ఏం చేయాలి?ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ముందుగా గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.

అక్కడ వైద్యులు కుటుంబ చరిత్రను అడిగి తెలుసుకుంటారు. అంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా డయాబెటిస్ ఉందా? మేనరికం వివాహమా? ఇతర సమస్యలేమైనా గతంలో వచ్చాయా? తదితర అంశాలను అడిగి తెలుసుకుంటారు. దాని ఆధారంగా సలహాలు ఇస్తారు. ఆరోగ్యవంతమైన గర్భధారణకు దంపతులకు ఈ కౌన్సెలింగ్ బాగా ఉపయోగపడుతుంది. మేనరికం వివాహం చేసుకున్నట్లయితే మరిన్ని జాగ్రత్తలు అవసరమవుతాయి. వారి సంతానంలో క్రోమోజోమ్ అబ్‌నార్మాలిటీస్ వల్ల పిల్లలు వైకల్యంతో జన్మించే అవకాశం ఉంటుంది.

పుట్టుకతో కొన్ని లోపాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కౌన్సెలింగ్‌లో ఈ విషయం చెప్పడం ద్వారా జెనెటిక్ టెస్టింగ్ చేయడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం చేయవచ్చు.ఇవీ పాటించాలిప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నట్లయితే మూడు నెలల ముందు నుంచే ఫోలిక్‌యాసిడ్ మాత్రలు వేసుకోవడం ప్రారంభించాలి. గర్భం నిర్ధారణ అయ్యాక 3 నెలల పాటు కొనసాగించాలి. ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటిస్ ఉన్నా, తల్లిదండ్రులకు డయాబెటిస్ ఉన్నా ఎండోక్రైనాలజిస్ట్, ఫిజీషియన్, గైనకాలజిస్ట్ సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిట్స్ ఉన్నట్లయితే వాడుతున్న మందులు తెలియజేయాలి.

ఫిట్స్ ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీకి ముందు నాలుగైదు రకాల మందులు వాడవచ్చు. కానీ ప్రెగ్నెన్సీలో ఒకే మాత్రను వాడాల్సి వస్తుంది. అంటే పాలీథెరపీ నుంచి మోనోథెరపీకి మారడం జరుగుతుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీలో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ గుండె సంబంధ సమస్యలు ఉన్నట్లయితే వైద్యులు రిస్క్‌ను అంచనా వేస్తారు. రిస్క్ తక్కువగా ఉన్నట్లయితే వారు సూచించిన సలహాలు పాటించడం ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు.

రిస్క్ ఎక్కువ ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీకి దూరంగా ఉండాలి.అన్నీ నార్మల్‌గా ఉన్నప్పుడే...అధిక రక్తపోటు ఇప్పుడు ఎక్కువ మందిలో కనిపిస్తోంది. ప్రెగ్నెన్సీకి ముందే బీపీ ఎలా ఉందో చెక్ చే యించుకోవాలి. ఒకవేళ బీపీకి మందులు వాడుతున్నట్లయితే ఆ వివరాలను డాక్టర్‌కు తెలియజేయాలి.

ప్రెగ్నెన్సీలో మందులు మార్చుకోవాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీకి ముందు ప్లానింగ్ ఉంటే కనుక సమస్య రాకుండా చూసుకోవచ్చు. డయాబెటిస్ ఉంటే కనుక అదుపులో ఉండేలా చూసుకోవాలి. దీర్ఘకాలంగా డయాబెటిస్ ఉన్నట్లయితే కళ్లు ఎలా ఉన్నాయి. కిడ్నీల పనితీరు ఎలా ఉందీ అనే విషయాన్ని వైద్యులు పరీక్షించి తెలుసుకోవడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీలో మరో ముఖ్యమైన అంశం థైరాయిడ్ గ్రంధి పనితీరు సక్రమంగా ఉండాలి.

థైరాయిడ్ లెవెల్స్ నార్మల్‌గా ఉన్నప్పుడే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. థైరాయిడ్ లెవెల్స్‌లో తేడా ఉంటే కనుక మందులు వాడి నార్మల్‌గా ఉండే లా చూసుకోవాలి. కొందరు అధిక బరువు ఉంటారు. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తుంటారు. దీనివల్ల ప్రెగ్నెన్సీలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక బరువు ఉన్నట్లయితే బరువు తగ్గి నార్మల్ వెయిట్‌కు వచ్చిన తరువాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. కొంరదు అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడం కోసం బేరియాట్రిక్ సర్జరీలను ఎంచుకుంటారు.

బేరియాటిక్ సర్జరీ మూలంగా మైక్రోన్యూట్రి యెంట్స్ తగ్గిపోతాయి. కాబట్టి రెండేళ్ల వరకు ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాలని సూచించడం జరుగుతుంది. ఆ తరువాత ప్లాన్ చేసుకోవచ్చు. హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్నట్లయితే పోషకాహారం తీసుకోవడం, మందులు వాడటం ద్వారా సరిచేసుకోవాలి. ప్రెగ్నెన్సీకి ముందే వైద్యుల సలహాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సంతానాన్ని పొందవచ్చని గుర్తుంచుకోవాలి.

డాక్టర్ రాధిక
సీనియర్ గైనకాలజి
స్ట్యశోద హాస్పిటల్స్సో
మాజిగూడ, హైదరాబాద్ఫోన్ : 90300 56362 -

పోషకాలు ఉన్నాయి కాబట్టి...



ఈ మధ్య చిరుధాన్యాలు, ముతకబియ్యం తినడాన్ని ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. వీటిని ఎందుకింతగా ఇష్టపడు తున్నారంటే వాటిలో బోలెడు పోషకాలు ఉన్నాయి కాబట్టి. అవేంటో తెలుసుకుంటే మీరు కూడా వాటికే ఓటేస్తారు. చిరుధాన్యాలుజొన్న, రాగి, సజ్జలపై ప్రేమ బాగా పెరిగిపోవడానికి కారణం ఇవన్నీ గుండెకు మేలుచేస్తాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి.

వందగ్రాముల రాగిలో 350 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. అదే గోధుమ, బియ్యంలలో అయితే 50 మిల్లీగ్రాముల క్యాల్షియమే ఉంటుంది. బార్లీలో ఎనిమిది ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలతో పాటు మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, పాస్ఫరస్‌లు కూడా ఉన్నాయి. జొన్నలో టాన్నిన్, యాంథోసైనిన్ వంటి ఫైటోకెమికల్స్ మెండుగా ఉన్నాయి. ఇవి మనుషుల్లో కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అరికడతాయని శాస్త్రీయంగా రుజువైంది. అలాగే తోటకూర గింజల్లో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియంలు 20శాతం అదనంగా ఉంటాయి.

ముతకబియ్యం (బ్రౌన్‌రైస్)ముతకబియ్యంలో కొవ్వు తక్కువగా ఉండడమే కాకుండా ఎన్నో లాభాలున్నాయి. వడ్ల గింజల పై పొరను మాత్రమే తీయడం వల్ల సహజసిద్ధమైన పోషకాలు బయటికి పోవు. అందుకని ఈ బియ్యాన్ని తినడం వల్ల గుండెజబ్బులకు దూరంగా ఉండొచ్చు.
దీంతోపాటు ఊబకాయం, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటివి కూడా దరిచేరవు. రక్తంలో ఇన్సులిన్ మోతాదును కూడా సరిచేస్తాయి ఇవి. వీటిలో ఉండే 'క్యు10' అనే సహ ఎంజైమ్ కొవ్వు, చక్కెరల్ని శక్తిగా మారుస్తుంది. ఇదేకాకుండా ఈ బియ్యంలో 70 యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, శక్తిస్థాయిని క్రమపరిచే బి-విటమిన్స్ ఉన్నాయి.

పాలిష్ పట్టిన బియ్యంలో ఇవేవీ ఉండవు. ముతకబియ్యంలో విటమిన్-ఇ మెండుగా ఉంటుంది. దీనిపై ఉండే బ్రాన్ పొర జింక్, మెగ్నీషియంలను కలిగి ఉంటుంది. అందుకని ఈ బియ్యాన్ని తిన్న వాళ్ల చర్మం మెరిసిపోతుంది. -

వసంతపంచమి



సకల విద్యాస్వరూపిణి, సమస్త వాఙ్మయానికీ మూలకారకురాలు, భాష, లిపి, కళలకు అధిదేవత సరస్వతీమాత. పలుకు తేనెల బంగరు తల్లి, వేదాలకు జనయిత్రి, వీణాపుస్తకధారిణి అయిన ఆ తల్లి దయ ఉంటే వెర్రిబాగులవాడు వేదవేదాంగవేత్త అవుతాడు, పరమ మూర్ఖుడు కూడా మహావిద్వాంసుడుగా మారిపోతాడు. అందుకు మహాకవి కాళిదాసే మంచి ఉదాహరణ. ఆమెను తృణీకరిస్తే మహాపండితుడు కూడా వివేకం కోల్పోయి మతిహీనుడై సర్వం పోగొట్టుకుంటాడు. అభ్యసించే విద్య, చేసే వృత్తి, చేపట్టిన పని... ఇలా ప్రతిదానిలోనూ ప్రావీణ్యం సంపాదించాలంటే కృషి, పట్టుదలతోపాటు సరస్వతీదేవి అనుగ్రహమూ అవసరం. అందుకే ఆ చల్లని తల్లి కరుణ కోసం తహతహలాడనివారుండరు.

ఆమె ప్రాదుర్భవించిన పరమ పవిత్రమైన మాఘపంచమి పర్వదినాన ఆమెను పుస్తకాది రూపాలలో, విగ్రహంలో ఆవాహన చేసి అర్చన, పూజ, వ్రతోత్సవాలు చేస్తే ఆమె అనుగ్రహం కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. సరస్వతీ దేవికి తెలుపు రంగు ప్రీతికరం కాబట్టి ఆమెకు తెల్లని పూలు, తెల్లని పట్టువస్త్రాలతో అలంకరించి, పెరుగు, వెన్న, వరిపేలాలు, తెల్లనువ్వుల ఉండలు, చెరకురసం, బెల్లం, తేనె, పాలకోవా, చక్కెర, కొబ్బరికాయ, రేగుపండు వంటి వాటిని నివేదిస్తే ప్రసన్నురాలవుతుందని శాస్త్రోక్తి.

సరస్వతి అంటే కేవలం చదువు మాత్రమే కాదు. సంస్కారం, విచక్షణాజ్ఞానం, వినయం, వివేకం, లోకజ్ఞానం, వృత్తి నైపుణ్యం కూడా సరస్వతే! చదువులు నేర్పే గురువులందరూ ఆ తల్లికి ప్రతిరూపాలే! కాబట్టి శారదాదేవి జన్మదినాన ఆమెను పూజించడంతో పాటు వేదపండితులు, గురువులు, విద్యావంతులు, వృత్తి నిపుణులు, సంగీత, నృత్య కళాకారులు... మనకు విద్య గరిపిన గురువుని, వివేకజ్ఞానాన్ని ఇచ్చినవారిని మనకు చేతనైనంతలో సత్కరించడం, చేతకాకపోతే చేతులెత్తి నమస్కరించడం సంస్కారం.