all

Sunday, February 2, 2014

నూనె పెట్టాలి ఇలా...



'జుట్టుకి నూనె పెట్టుకునేందుకు కూడా ఒక పద్ధతి ఉంది. అలాకాకుండా ఎలాగంటే అలా రాస్తే జుట్టు రాలిపోతుంది, పాడయిపోతుంది' అంటున్నారు ప్రముఖ హెయిర్‌స్టయిలిస్ట్ జావెద్ హబీబ్. అంతేకాదు జుట్టు రకాన్ని బట్టి నూనె ఎంపిక చేసుకోవాలి అంటూ కొన్ని సలహాలు సూచనలు చేశారాయన.

-గోరు వెచ్చటి నూనెలో చేతి వేళ్లు ముంచి, జుట్టును రెండు భాగాలుగా చేసి మాడుకి నూనె పట్టించి మునివేళ్లతో నెమ్మదిగా మర్దనా చేయాలి. పది నుంచి పదిహేను నిమిషాలు మర్దనా చేయడం వల్ల మాడుకి రక్త సరఫరా బాగా అవుతుంది.

-రాత్రి నూనె పెట్టుకుని మరుసటి రోజు తలస్నానం చేస్తే ఫలితం బాగుంటుంది. ఒకవేళ పగలు పెట్టుకుంటే కనక ఎక్కువ సమయం మాడుకి నూనె పట్టించాలి. 24 గంటలకంటే ఎక్కువ మాత్రం తల మీద నూనె ఉంచుకోవద్దు. అలా ఉంచితే జుట్టుపై దుమ్ము చేరుతుంది. దాంతో జుట్టు బలహీనపడి రాలిపోతుంది.

-నూనె పెట్టిన తరువాత వేడి నీళ్లలో ముంచిన తుండుతో ఆవిరి పడితే నూనెని జుట్టు బాగా పీల్చుకుంటుంది. ఇందుకు వేడి తుండును తలకు చుట్టి పదినిమిషాలు ఉంచాలి. ఇలా చేసేటప్పుడు తుండు మరీ వేడిగా ఉండకూడదు. వేడి ఎక్కువగా ఉంటే జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి.

-వారానికి ఒకసారి జుట్టుకి నూనె పట్టించాలి. కుదిరితే ఒకటికంటే ఎక్కువ సార్లు పెట్టినా మంచిదే.
జుట్టు రకాన్ని బట్టి ...
నార్మల్ హెయిర్: ఈ రకం జుట్టు జిడ్డుగా లేదా పొడిగా ఉంటుంది. జొజొబా, బాదం, ఉసిరి నూనెలు వాడాలి.
పొడి జుట్టు: ఈ జుట్టు నిస్సారంగా కనిపిస్తుంది. త్వరగా చిట్లిపోతుంది. బాదం, జొజొబా, కొబ్బరి, నువ్వులు, ఆవాలు, కోకో-బటర్ నూనెలు వాడాలి.

జిడ్డు జుట్టు: ఆలివ్, నువ్వులు, జొజొబా నూనెలు వాడాలి.

చుండ్రు జుట్టు: టీ ట్రీ నూనె చాలా బాగా పనిచేస్తుంది.

ఏ నూనె వాడుతున్నా అందులో విటమిన్-ఇ కలిపి వాడితే జుట్టు ఆరోగ్యకరంగా ఉంటుంది.

వాతావరణం తేమగా ఉంటే జుట్టుకి నూనె రాయొద్దు. అలాగే జిడ్డు చర్మం వాళ్లకి మాడు నుంచి నూనె ఉత్పత్తి అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా జుట్టుకి నూనె వాడాల్సిన అవసరం లేదు. ఎక్కువ సేపు ఆరు బయట ఉండేవాళ్లు కూడా నూనె రాసుకోవద్దు. దీనివల్ల దుమ్ము వచ్చి చేరిజుట్టు ఎక్కువగా రాలుతుంది.

 

No comments: