all

Sunday, February 2, 2014

జుట్టుకు పళ్లతో ప్యాక్‌లు, మాస్క్‌లు..



జుట్టు పై రకరకాల ప్రయోగాలు చేసి రసాయనాలతో నింపి పాడుచేశారా. అలాంటి జుట్టుకు జీవం తినే పళ్లతో వస్తుంది. ఒక అరటిపండు, ఒక గుడ్డు తెల్లసొన, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాలను కలిపి మెత్తటి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు ప్యాక్‌లా వేసి అరగంట లేదా నలభై నిమిషాలు ఉండాలి. ఆ తరువాత నీళ్లతో జుట్టుని కడిగి తుండుతో నెమ్మదిగా వత్తాలి. ఇలాచేస్తే రసాయనాల వల్ల పాడయిన జుట్టు రిపేర్ అవడం ఖాయం.
 స్టయిల్, ఫ్యాషన్‌లంటూ తడవకో రంగు వేసి జుట్టు గడ్డిలా తయారైందా... ఈ సమస్యనుంచి బయటపడేయడంలో అరటి పండు సాయపడుతుంది. రెండు టేబుల్ స్పూన్ల వేప పొడి, ఒక కప్పు బీరు, ఒక కప్పు అరటిపండు పేస్ట్, రెండు కప్పుల బొప్పాయి పేస్ట్‌లను ఒక గిన్నెలో వేయాలి. ఇందులో గోరు వెచ్చటి నీళ్లు పోసి పేస్ట్‌లా కలపాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకి రాసి అరగంట తరువాత గోరువెచ్చటి నీళ్లతో కడిగితే మెరిసే జుట్టు మీ సొంతమవుతుంది.
 రోజులో ఎక్కువ సమయం నెత్తిన చెయ్యి పెట్టుకుని గీరుతూనే ఉన్నారా. అయితే చుండ్రు సమస్య కావచ్చు. దీన్నుంచి బయటపడేందుకు అరకప్పు ఉసిరి రసం, ఒక కప్పు పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసాలను గిన్నెలో వేసి మెత్తటి పేస్ట్‌లా కలపాలి. దీన్ని తలకు రాసుకుని గంట తరువాత గోరువెచ్చటి నీళ్లతో తల కడిగేయాలి. చివర్లో కండిషనర్ రాసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల జుట్టు మెరవడమే కాకుండా చుండ్రు సమస్యను ప్రభావంతంగా తగ్గిస్తుంది.
 జుట్టు తెగ రాలిపోతుందా అయితే సగం అవకాడో తీసుకుని మెత్తగా చేయాలి. ఇందులో మూడు టేబుల్ స్పూన్ల మెంతుల పేస్ట్, పావు కప్పు గ్రీన్ టీ, సరిపడా గోరువెచ్చటి నీళ్లు పోసి కలిపి ఈ మిశ్రమాన్ని హెయిర్ మాస్క్‌లా వేయాలి. ఇది మంచి ఫలితాల్ని ఇస్తుంది. ఈ మాస్క్ కాస్త రెగ్యులర్‌గా వేసుకుంటే ఫలితం బాగుంటుంది.

 తలంటుకున్న కాసేపటికే జిడ్డు కారుతుంటుంది కొందరి జుట్టు. ఈ రకం జుట్టు ఉన్న వాళ్లు కమలా రసం మూడు టేబుల్ స్పూన్లు, పెరుగు ఒక కప్పు, ఉసిరి పొడి మూడు టేబుల్ స్పూన్లు, తులసి ఆకుల పొడి ఒక టేబుల్ స్పూన్ కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకి, మాడుకి, జుట్టు చివర్లతో సహా పట్టించి నలభై నిమిషాల నుంచి గంట సేపు ఉంచాక గోరు వెచ్చటి నీళ్లతో కడిగేయాలి.

 

No comments: