రమణగారు దగ్గర్లేకుండా బాపుగారి దగ్గరికి ధైర్యంగా వచ్చేసిన
రెండో పుట్టినరోజు ఇది.
ఇవాళ ఆయన ఎలా ఉండివుంటారు?
ఎప్పట్లా కోటి కోట్ల జ్ఞాపకాలలో ఉండిపోయి, ‘వెంకట్రావు’ చెప్పిన శుభాకాంక్షల్ని తలుచుకుంటూ ఉంటారా? అంతే అయుండాలి. బాపు-రమణలు అవిభక్త ఆత్మసఖులు కదా!
అంచేతే... జన్మదినం ఒకరిదే అయినా, ఇద్దరి గురించీ మాట్లాడుకోవడం.
నేడు ఎనభైల్లో అడుగుపెడుతున్న బాపుకి శుభాకాంక్షలు. అరవై అయిదేళ్లు పైబడినా కొత్తందనాలు తరగని బాపు కుంచెకు వందనాలు! 1955 నుంచి పాతికేళ్ల పాటు ఎక్కడ చూసినా బాపు బొమ్మలే. అన్నిచోట్లా ఆయన ఫ్రీస్టయిల్ అక్షరాలే. ఒకవైపు ముళ్లపూడి వెంకటరమణ తన వచన రచనలతో పెట్టే చక్కిలిగింతలు, మరోవైపు ఇలస్ట్రేషన్లతో, కార్టూన్లతో, కవర్ పేజీలతో తెలుగువారిని అలరించిన బాపు బొమ్మలు... తెలుగు నేలకు వసంతం తెచ్చాయి. బాపు-రమణ అంటే అందమైన ద్వంద్వ సమాసం. బాపు-రమణ తెలుగు సంస్కృతికి ప్రతీక, తెలుగుజాతి సంపద. వారిద్దరి స్నేహం స్నేహానికే ఆదర్శంగా నిలిచింది.
బాపు గీసిన బొమ్మల గురించి, తీసిన బొమ్మల గురించి కొత్తగా విశ్లేషించాల్సిన పనిలేదు. బాపు ఆనాటి కార్టూన్లని తలుచుకు తలుచుకు నవ్వుకునేవారు కోకొల్లలు. బాపు బ్లాక్ అండ్ వైట్‌లో గీసిన సెంటర్ స్ప్రెడ్‌లు ఇప్పటికీ ఆ తరం పాఠకుల కళ్ల ముందు కదలాడతాయి. ఎమెస్కో పాకెట్ బాక్స్‌కి బాపు అద్దిన రంగులు నిత్యనూతనాలు. ఆయన తొలిప్రేమ బొమ్మలు వేయడం. నా చిన్నప్పుడు, ‘ఈ మహానుభావుడెవరో గాని, ఈయన బొమ్మలు వేశాక కుంచెలు కడిగే అవకాశం వచ్చినా చాలు’ అని మనస్పూర్తిగా అనుకునేవాణ్ని. అదొక పగటి కల. తరువాత కొద్ది సంవత్సరాలకు ఒక డైలీలో సబ్-ఎడిటర్‌గా చేరాను. నూతనోత్సాహం, అచ్చులో పేరు చూసుకోవాలన్న తాపత్రయం, పైవారి వాత్సల్యం - అన్నీ కలిసి నా పేరు రోజూ పేపర్‌లో కనిపించేది. ఒకరోజు బాపు-రమణ మా ఆఫీసుకి వస్తున్నట్టు వర్తమానం వచ్చింది. వాళ్లు సినిమా పనుల మీద బెజవాడ రావడం సర్వసాధారణమే. నండూరి రామమోహనరావు వారికి గురుతుల్యులూ మా ఎడిటరు. రావడం సరాసరి నా సీటు దగ్గరకే వచ్చారు.
అదే తొలి ముఖ పరిచయం. ‘నన్ను బాపు అంటారండీ’ అన్నారు. ఉలిక్కిపడి కలయో వైష్ణవమాయో అని అరచెయ్యి గిల్లుకున్నాను. స్పర్శజ్ఞానం ఉంది. ‘నా కార్టూన్లు మొదటిసారి ఒక సంపుటిగా రాబోతోంది. మీరు ముందుమాట రాస్తే సంతోషిస్తాను. అది అడగడానికే వచ్చాను’ అన్నారు బాపు. ‘అలాగేనండీ, ఎప్పటిలోగా ఇవ్వాలి’ అని అడిగాను సిగ్గు లేకుండా. బాపు నవ్వు దాచుకుంటూ (అన్నట్టు బాపు నవ్వు చాలా తీరుగా ఉంటుంది) ‘పర్వాలేదు, టేక్ యువర్ ఓన్ టైమ్’ అని భరోసా ఇచ్చారు. నాల్రోజుల్లో ‘నానృషిః కురుతే కార్టూన్’ పేరుతో బాపు తొలి కార్టూన్ సంపుటికి నిర్భయంగా, నిస్సంకోచంగా ముందుమాట రాసిచ్చాను. కార్టూనిస్టు అది చదివి చాలా ఆనందించాడు. ఏడాది తిరగకుండానే మద్రాసు చేరాను. బాపు-రమణల కుటుంబంలో ఒక సభ్యుడిగా చేరిపోయాను. అయినా కుంచెలు కడిగే అవకాశం నాకు ఒక్కసారి కూడా రాలేదు.
‘సీతాకళ్యాణం’ చికాగో ఫిలిం ఫెస్టివల్‌కి ఎంపికైంది. అదే బాపు తొలి విదేశీయానం అనుకుంటాను. పైగా గౌరవప్రదమైన ఆహ్వానంపై వెళ్లడం. కుటుంబసభ్యులతో పాటు కొంతమంది మిత్రులం మద్రాసు ఎయిర్‌పోర్టుకి వెళ్లాం. ఇక బాపు మాత్రమే లోపలికి వెళ్లాలి. అప్పటికే అందరూ జాగ్రత్తలు చెప్పడం పూర్తయింది. నాలుగడుగులు లోపలి వైపుకు వేసి, బాపు వెనక్కి మళ్లి అలవాటుగా కర్చీఫ్ నోటి దగ్గర పెట్టుకు నిలబడ్డ రమణ దగ్గరకు వచ్చి, ఆయనకు పాదాభివందనం చేసి తలవంచుకు వెళ్లిపోయారు. ఇదీ వారిద్దరి స్నేహానికి పునాది. ఇద్దరి మధ్య చనువు కాదు, గౌరవం ఉన్నప్పుడే స్నేహమైనా, బంధమైనా పదిలంగా ఉంటుందని రమణ అనేవారు. ఆచరించేవారు. బాపు పదేళ్ల క్రితం దాకా పైపు కాల్చేవారు. ఎన్ని పైపులు?! వెయ్యికి పైగా దేశ విదేశీ పైపులుండేవి. మిత్రులు, అభిమానులు ఏ దేశం వెళ్లినా బాపుకి ఇష్టమని పైపులు తెచ్చేవారు. శరీరం ఇంక వద్దంది. మానేశారు. బాపు మంచి చదువరి. సుమారు పాతికేళ్ల క్రితం కెప్టెన్ భల్లా అనే పైలట్, విమానాన్ని తిరుపతి దగ్గర పొలాల్లో దింపేశాడు. అందులో బాపు ఉన్నారు. ఇంకా చాలామంది సినిమా ప్రముఖులు, అసినిమా ప్రముఖులు ఉన్నారు. కొంచెం కుదుపు తప్ప ఎవరికీ ఏమీ అవలేదు. మేమూ చాలా కంగారుపడి హుటాహుటిన తిరుపతికి బయలుదేరాలనుకున్నాం. బాపు వద్దని వార్నింగ్‌లా చెప్పి ఆపారు.
చదువు, సంస్కారంతో పాటు పెద్ద కార్పొరేట్ సంస్థ కూడా ఉన్న పెద్దమనిషి ‘బాపుగారు క్షేమమే కదా’ అని ఫోన్ చేసి అడిగారు. క్షేమమేనని చెబుతూ మిగిలిన జాబితా కూడా వల్లిస్తుంటే, ఆయన అడ్డుకుని ‘బాపుకి ఏదైనా అయితే మరో బాపు రాడు. మిగిలిన వాళ్లంటారా... రాకపోయినా పెద్ద నష్టం లేదు’ అనేసి ఫోన్ పెట్టేశారు. ఆ పెద్దమనిషికీ ఈ పెద్దమనిషికీ ముఖపరిచయాలు కూడా లేవు. తర్వాత బాపుని మీడియా వాళ్లలాగా, ‘‘విమానం ఎక్కడో దిగిపోతున్నప్పుడు మీ మనోస్థితి ఏమిటండీ’’ అని అడిగాను. ‘‘అసలు నాకు విషయం తెలిస్తే కదా, ప్యానిక్ అవడానికి. ఉడ్ హౌస్ నవల పదోసారి చదువుతూ తలమునకలై ఉన్నాను. తీరా చూద్దును కదా, పొలాల్లో ఉన్నా. ట్రాక్టర్లలో మమ్మల్ని తిరుపతి తరలించారు’’. ఆనక భల్లాగారు ఇన్ని ఖరీదైన ప్రాణాల్ని కాపాడారని మద్రాసులో పెద్ద స్టార్ హోటల్‌లో అభినందనసభ ఏర్పాటు చేశారు. మళ్లీ కొద్దిరోజులకి భల్లాగారికి ఇదొక హాబీ, అనవసరంగా అత్యవసర ల్యాండింగ్స్ చేస్తారని ఒక కమిటీ నిర్థారించి, ఆయన్ని ఇకపై కాక్‌పిట్‌లోకి రావద్దన్నారు. అభినందనల్ని మాత్రం వెనక్కి తీసుకోలేకపోయారు. ఈ సంఘటన చెబుతూ బాపు, ‘‘అందుకేనండీ, కాలు జారితే తీసుకోగలం గాని నోరు జారితే తీసుకోలేం’’ అని ముగించారు.
ఈజెన్‌బర్గ్ అనే ఒక పెద్దాయనకు బాపు బొమ్మలన్నా, బాపు-రమణలన్నా చాలా ఇష్టం. ఆయన ఫోర్డ్ ఫౌండేషన్ పక్షాన దక్షిణాది రాష్ట్రాల్లో పుస్తక ప్రచురణని, చదివే అలవాటుని పెంపొందించడానికి వచ్చారు. నాడు ఎమెస్కోవారి ‘ఇంటింటా సొంత గ్రంథాలయం’ పథకం ఇలా ఆవిర్భవించిందే! బాపు 1967లో చిత్ర దర్శకుడయ్యాక, ఈజెన్‌బర్గ్ ఒక సలహా ఇచ్చారు. ‘‘బాపూ! నువ్వు డెరైక్టర్‌వి. నీ సినిమాల్లో ఎక్కడ వీలున్నా వీల్లేకపోయినా, ఆఖరికి అది రిక్షా కార్మికుని పూరి గుడిసె అయినా సరే, ఫ్రేములో కనిపించేట్టు నాలుగు పుస్తకాలు పెట్టు. అది ప్రేక్షకుల్ని ప్రభావితం చేస్తుంది’’ అని చెబుతూ ఒక ఉదాహరణ చెప్పేవారట. ఒక హాలీవుడ్ సినిమా ఇంటర్వెల్‌కి ముందు కొద్దిసెకన్లసేపు మండే ఎండలో ఎడారిని చూపించారట. బయటకు రాగానే ప్రేక్షకులు ఐస్‌క్రీమ్ షాపుమీద పడ్డారట. అందుకే బాపు ఇప్పటికీ ఆయన సూచనని పాటించి పుస్తకాలని ప్రదర్శిస్తారు. బాపు పర్సనల్ లైబ్రరీ వాసిలోనూ, రాసిలోనూ ఘనమైంది. మ్యూజిక్ కలెక్షన్ అపురూపమైంది. బాపు ‘మౌత్ ఆర్గాన్’ అద్భుతంగా వాయించేవారని చాలామందికి తెలియదు. ఒక మ్యూజిక్ డెరైక్టర్ ఆర్కెస్ట్రాలో వాయించేవారు. అయితే ఒక పాట రికార్డ్ చేస్తుంటే, ‘అచ్చు యిదే ట్యూన్ రాత్రి రేడియోలో విన్నానండీ’ అన్నారట. తర్వాత బాపుకి ఎప్పుడూ ఆయన ఆర్కెస్ట్రాలో అవకాశం రాలేదు.
బాపు-రమణలు ఆప్తమిత్రులయినా ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్లవి. ‘బాపు తాచుపాము, నేను వానపాముని’ అని తరచూ రమణ అంటుండేవారు. నిజమే, బాపు వేగం వేరు, తనకేమీ రాదు, తనేదో సాధించాలి అనే దీక్షతో రోజుకి ఇరవై గంటలు పనిచేసేవారు. ‘‘ఎక్కడా చిత్రకళ అభ్యసించకపోవడం వల్ల నేను తగిన స్థాయికి రాలేకపోయాను’’ అనేవారు. ‘‘అందుకే బాపు స్కూల్ అవతరించింది సార్’’ అని నాలాంటి వాళ్లు అన్నప్పుడు చాలా చిరాకు పడేవారు. ‘‘చెబుతున్నా కదా, నా లోపం నాకు తెలుసా? మీకు తెలుసా?’’ అంటూ చివాలున లేచి వెళ్లి పుస్తకాలు తీసి ప్రసిద్ధ చిత్రకారుల పెయింటింగ్స్‌ని, వాటి రూపు రేఖా విలాసాలని విశ్లేషణాత్మకంగా వివరించి చెప్పేవారు. పిలకా నరసింహమూర్తి చిత్రించే రంగులూ రూపాలూ అంటే బాపు-రమణలకు ఇష్టం. ‘సీతా కళ్యాణం’లో చిన్న సీత చూపే దశావతారాలు పిలకా వారితో ప్రత్యేకం వేయించారు. ‘బుల్లెట్’ సినిమాలో ‘మా తెలుగు తల్లికి’ పాట చిత్రీకరణ కోసం తెలుగుదనాలను కూడా నరసింహమూర్తితోనే వేయించారు. మొక్కపాటి కృష్ణమూర్తి చిత్రించిన బొమ్మలు దర్పంగా ఉంటాయంటారు బాపు.
బాపుకి హిందూస్థానీ సంగీతం అంటే ఇష్టం. రమణకి కర్నాటక సంగీతమంటే మక్కువ. బాపుగారి పిల్లలు ఏది కావాలన్నా రమణగారితో చెప్పేవారు. ‘మామ’కి చెబితే పని అయిపోయినట్టే. రమణకి మంచి వాదనా పటిమ ఉంది. రమణ ఏది చెప్పినా ఎదురుచెప్పని సౌజన్యం బాపుది. చాలా సంవత్సరాల క్రితం డా॥సమరం ఒక పత్రికలో మానవ మనస్తత్వాలపై వ్యాసం రాస్తూ, ‘ప్రాణానికి ప్రాణంగా ఉండే బాపు-రమణలలో ఒకరు పోతే మరొకరెలా జీవిస్తార’నే అంశాన్ని ప్రస్తావించారు. చాలామంది అప్పట్లో ఆయన ఊహని ఆడిపోసుకున్నారు. బాపు చాలా సంగతులు రమణ కళ్లతో చూసేవారు, రమణ చెవులతో వినేవారు.
బాపుని అర్థం చేసుకోవడం అందరివల్లా కాదు. అది రమణకి సాధ్యమైంది. అందుకే వాళ్ల స్నేహం అరమరికలు లేకుండా సాగింది. రమణ వెళ్లిపోయి రెండేళ్లు కావస్తోంది. ఇప్పుడు బాపు నిజంగా ఒంటరి. రమణ ఒక్కడే వెయ్యిమంది పెట్టు. ఫెయిల్యూర్‌తో పేచీ పెట్టుకుని దాన్ని ఓడించగల శక్తి ఉంది రమణకి. ఆ గెలుపులో మూడువంతుల వాటా మిత్రుడు బాపుకి ఇచ్చేవాడు. బాపు పొరుగుప్రాంతం నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా, ‘‘వెంకట్రావ్ ఎలా ఉన్నాడు?’’ అనేది మొదటి ప్రశ్న. రమణని వెంకట్రావ్ అని పిలిచేవారు. నిజానికి ఆయన అసలు పేరు అదే. అతను బావుంటే అందరూ బావున్నట్టేనని ఒకసారి చెప్పారు. ఒక్క గీత గాని, అక్షరం గాని రమణ చూడకుండా బయటకు వెళ్లేవి కావు. ఇప్పుడు బాపు గౌరవించేందుకు, సలహాకి, సంప్రదింపుకి, మాట్లాడటానికి, పోట్లాడటానికి ఉన్న ఒకే ఒక్క నేస్తం దూరమవడం చిన్న సంగతి కాదు.
పుస్తకాల మధ్య బడేగులామ్ గజల్స్ వింటూ, ఏదో గీస్తూనో రాస్తూనో తన స్టూడియోలో కూచుని, మధ్య మధ్య తెరచి ఉంచిన తలుపువైపు చూస్తారు. ఎవ్వరూ కనిపించరు. రమణ ఇక రాడు కదా అనే నిష్టుర సత్యం బాపు మనస్సులో కలుక్కుమంటుంది. ఏ సినిమా చూసినా, ఏ మంచి పాట విన్నా, ఏ గొప్ప వాక్యం చదివినా, కమ్మటి భోజనం చేసినా - రుచులు పంచుకునే హితుడు, స్నేహితుడు లేడు కదా అనిపిస్తుంది. బాపు నిగర్వి, కాని బాపు గర్వం రమణ. రమణ నిగర్వి, కాని ఆయన గర్వం బాపు. బాపుకి డబ్బు ఖర్చు చేయడం తెలియదు. రమణ మనసుతో, రమణ చేతులతో ఉదారంగా ఖర్చు చేస్తారు బాపు. రమణ దివ్యస్మృతికి తన పుస్తకం అంకితమిస్తూ, ‘‘నను గోడలేని చిత్తరువుని చేసి వెళ్లిపోయిన నా వెంకట్రావు కోటి కోట్ల జ్ఞాపకాలకు’’ అని రాశారు. ఇది బాపు మనసు పొరల్లోంచి వచ్చిన మాట.
- శ్రీరమణ బాపు నాలుగడుగులు లోపలి వైపుకు వేసి, వెనక్కి మళ్లి, అలవాటుగా కర్చీఫ్ నోటి దగ్గర పెట్టుకు నిలబడ్డ రమణ దగ్గరకొచ్చి, ఆయనకు పాదాభివందనం చేసి తలవంచుకు వెళ్లిపోయారు. ఇదీ వారిద్దరి స్నేహానికి పునాది బాపు చాలా సంగతులు రమణ కళ్లతో చూసేవారు, రమణ చెవులతో వినేవారు. బాపుని అర్థం చేసుకోవడం అందరివల్లా కాదు. అది రమణకి సాధ్యమైంది. అందుకే వాళ్ల స్నేహం అరమరికలు లేకుండా సాగింది.
No comments:
Post a Comment