ఒక గ్రామంలో రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతని కొడుకు సూర్యం చదువులో మిన్నగా వుండేవాడు. సూర్యం ఇంటర్ వరకూ చదివిన తర్వాత రామయ్య అతన్ని రంగయ్య అనే మరో పెద్ద వ్యాపారి దగ్గరికి తీసుకెళ్లి, తన కొడుకును పైచదువు చదివించలేననీ, తగిన ఉద్యోగం చూడమనీ కోరాడు. సరేనన్నాడు రంగయ్య.
అతని చేత పట్నంలోని తన దుకాణంలో లెక్కలు రాయించాలనుకుని, సూర్యాన్ని పిలిచి, ‘‘నీకు లెక్కలు బాగా వచ్చునా? మొన్న పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయి’’ అని అడిగాడు రంగయ్య. తొంభైశాతం వచ్చిందని చెప్పాడు సూర్యం.
‘‘నూటికి ఒక తప్పు చేశావంటే వెయ్యికి పది. నేను లక్షల్లో వ్యాపారం చేస్తాను, కనుక వేలల్లో నష్టపోలేను. నీకు లెక్కలు బాగా వచ్చంటున్నావు కాబట్టి పట్నంలో నాకు తెలిసిన ఒక పెద్ద సంస్థ ఉంది. అందులో చేరు. వాళ్లకి చిన్నపాటి నష్టాలు పెద్దగా ఇబ్బంది కాదు’’ అన్నాడు.
సూర్యం సరేనన్నాడు కానీ ఆ సంగతి తెలిసి రామయ్య రంగయ్య దగ్గరికి కొడుకును తీసుకెళ్లాడు.
‘‘నీ దుకాణం నష్టం నుంచి తప్పించడానికి పిల్లాడిని పట్నానికి పొమ్మన్నావు. మరి అక్కడ వారికి నష్టం వస్తే వాడి ఉద్యోగం పోతుందేమో’’ అని ఆందోళన వ్యక్తం చేశాడు.
అప్పుడు రంగయ్య ‘‘ఓరి పిచ్చివాడా! నేను ఎక్కువ జీతం ఇచ్చుకోలేను. పట్నంలో అయితే వాడి తెలివికి మంచి ఉద్యోగం, మంచి జీతం సంపాదించగలడన్న నమ్మకంతోనే ఆ రోజు వాడిని అక్కడికి వెళ్ళమన్నాను’’ అన్నాడు.
No comments:
Post a Comment