వెతుకు!
సముద్రాల లోతుల్లో బడబాలనం దొరుకుతుంది.
వెతుకు!
కఠిన గండ శిలల గుండెల్లో నీటి చెమ్మ దొరుకుతుంది.
వెతుకు!
క్రిక్కిరిసిన మూర్ఖుల నడుమ ఒక జ్ఞాని దొరుకుతాడు.
వెతుకు!
సిద్ధాంతాల క్రాస్‌రోడ్ల మధ్య ఒక జీవనపార్శ్వం దొరుకుతుంది.
వెతుకు! ఒక గురువును.
వెతుకు! నీలోని గురువును.
కృష్ణం వందే జగద్గురు! క్రిష్‌ణం వందే జగద్గురు!!
కొందరు సినిమావాళ్లు పల్స్‌ను మాస్‌లో వెతుకుతారు.
క్రిష్.... ఇంకో చోట.
ఇది అతని వెతుకులాట. అతడి అదర్‌సైడ్.
ఇందిర పరిమి, ఎడిటర్, ఫీచర్స్ ఇందిర: చిన్నతనమంతా ఎక్కడ గడిచింది? క్రిష్: పుట్టి పెరిగిందంతా గుంటూరు. తాతగారు జాగర్లమూడి రమణయ్యగారు పోలీసాఫీసర్. ఆయనకి ఆరుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. మాది ఉమ్మడి కుటుంబం. మనవళ్లు మనవరాళ్లందరిలోకి నేనే పెద్దవాడినవడంతో తాతగారితో ఎక్కువ అనుబంధం నాకే ఉండేది. ఆయన నాకు పొద్దున్నే న్యూస్‌పేపర్ ఇచ్చి, ఎడిటోరియల్ దగ్గర్నుంచి ప్రతి ఆర్టికల్‌నీ తిరగ రాయించేవారు. ఇక చందమామ పుస్తకం వచ్చిందంటే... పుస్తకమంతా తిరగరాయడమే కాకుండా, ఆయన ఇంటికి వచ్చాక కథలన్నీ వినిపించాలి. నేను కూడా అప్పుడప్పుడు ఉపకథలు రాసి ఆయనకు వినిపించేవాడిని. అవే నాకు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. ఇక అత్త కృష్ణవేణి... సినిమా చూసి వచ్చాక, పిల్లలందర్నీ మెట్లమీద కూర్చోబెట్టుకుని, టైటిల్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వరకు కథ అంతా చెప్పేవారు. కథ చెప్పే అలవాటు నాకు ఆవిడ దగ్గరనుంచే వచ్చింది. ఇక ఒక బాబాయి హేతువాద పుస్తకాలు తెచ్చేవారు... ఇంకొక బాబాయి తనతోపాటు నన్ను సినిమాలకు తీసుకెళ్లేవారు... నాన్నగారు (జాగర్లమూడి సాయిబాబా) గురించి చెప్పాలంటే... ఆయనకు సినిమాలంటే చాలా ఇష్టం. ఒక ఊరిలో సినిమా థియేటర్ రన్ చేసి, వర్కవుట్ కాక వదిలేశారు. అలా... నేను గమ్మత్తయిన వాతావరణంలో పెరిగాను. అంతమంది ఒక్కచోట ఉండడంతో నాకు సమాజాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేకపోయింది. ఇక నా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలంటే... టీచరైన మా పెదనాన్న భాస్కరరావు గారు నన్ను బాగా గైడ్ చేశారు. నేనీరోజు ఈ స్థితిలో ఉన్నానంటే వీళ్లందరూ కారణం!
ఇందిర: తర్వాత లైఫ్... క్రిష్: ఇంటర్ తర్వాత, ఫార్మసీ చదవడానికి విజయవాడ సిద్ధార్ధ కాలేజీలో జాయినయ్యాను. అక్కడ నాకు ఇంకో ప్రపంచం పరిచయమయ్యింది. ‘‘విజయవాడలో చదవకపోతే ‘శివ’ సినిమా తీసేవాడిని కాదు’’ అని రామ్‌గోపాల్‌వర్మ అన్నట్టు ... విజయవాడలో అంతా గ్రూపిజం! చేరిన రోజున ఓరియెంటేషన్ ప్రోగ్రాంలో ఒకచోట కూర్చున్నవాళ్లం, సెమిస్టర్ అయ్యేసరికి గ్రూపులుగా విడిపోయాం. ఎందుకు గొడవపడతారో ఎందుకు కొట్టుకుంటారో తెలీదు కానీ, ప్రతివాడూ తెలీకుండా ఏదో ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ మెంబర్ అయిపోయేవాడు. ఉమ్మడి కుటుంబంలో కలిసిమెలసి తిరిగిన నాకు ఈ కొట్లాటలు నచ్చలేదు. అనీజీగా ఫీలయ్యేవాణ్ణి... అయినా రెండేళ్లు భరించాను. ఇక లాభం లేదని నాదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను... పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. రావిశాస్త్రి, తిలక్, శ్రీశ్రీ, వడ్డెర చండీదాస్, బలివాడ కాంతారావు... ఎవరినీ వదల్లేదు. అలా ఇంకో రెండేళ్లు! ఆ తర్వాత జీఆర్‌ఈ, టోఫెల్ రాసి ఎంఎస్ ఫార్మసీ చదువుకోవడానికి అమెరికా వెళ్లిపోయాను.
ఇందిర:సినిమా మీద ఇంట్రస్ట్ ఎప్పుడు మొదలైంది? క్రిష్: నాకు మొదటినుంచీ పుస్తకాలన్నా, సినిమాలన్నా ఇంట్రస్టే కానీ, అమెరికా వెళ్లాక అది మరింత ఎక్కువైంది. మదర్‌కి, మదర్‌లాండ్‌కి దూరమైనప్పుడు, మనల్ని దగ్గరగా ఉంచగలిగేది పుస్తకాలు, సినిమాలే అనుకుంటా! అందుకే వాటికి మరింత దగ్గరయ్యాను. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి... విజయవాడలో ఉన్నప్పుడు గాంధీనగర్‌లో పాత పుస్తకాలు అమ్మేవాళ్లు. వాటిని నా పాకెట్ మనీతో కొని చదివేవాడిని. అక్కడ నా రూమ్మేట్ సత్యనారాయణకి పుస్తకాల పిచ్చి. ఇంకో రూమ్మేట్ వినోద్‌కి సినిమాల పిచ్చి. వేర్వేరు ప్రాంతాలు... వేర్వేరు కులాలు... కానీ మా కామన్ అంశం పుస్తకాలు, సినిమా! అమెరికాలో కూడా అలాంటి రూమ్మేట్సే దొరికారు. రాజీవ్‌రెడ్డి (గమ్యం ప్రొడ్యూసర్), కాట్రగడ్డ సిద్ధార్థ (సారథి స్టూడియోస్ పాపయ్యగారి అబ్బాయి), శ్యామ్ చింతా, దేవా... నలుగురం సినిమాలు, పుస్తకాల గురించి చర్చించుకునేవాళ్లం. నా ఇంటర్ క్లాస్‌మేట్ కల్యాణ్ (డాక్టర్) కూడా అమెరికా వచ్చాడు. అతను నా కథలు ఎప్పుడు విన్నా ‘నువ్వు సినిమాలు బాగా తీస్తావురా’ అని వెన్నుతట్టేవాడు. అలా నేను ఎక్కడికెళ్లినా నాలాంటి ఆసక్తి కలిగినవాళ్లే నాకు ఫ్రెండ్స్‌గా దొరకడం నిజంగా నా అదృష్టం.
ఇందిర: డెరైక్టర్ కావాలన్న బీజం ఎప్పుడు పడింది? క్రిష్: ఒక్కోసారి మనకు తెలిసేముందే మన ఫ్రెండ్స్ ‘నువ్వు ప్రేమలో పడ్డావ్... పడ్డావ్’ అంటే నిజంగానే పడ్డానేమో అనుకున్నట్టు, ‘నువ్వు బాగా రాస్తావ్ రాస్తావ్’ అని ఫ్రెండ్స్ అందరూ అంటుంటే ‘నిజంగానే బాగా రాస్తాను’ అన్న ఫీలింగ్ నాలో కూడా మెల్లమెల్లగా కలిగింది. ఆ మైండ్‌సెట్‌తోనే అమెరికాలో ఉన్నప్పుడు ఓ కథ రాశాను... క్యాంపస్‌లో జరిగే స్టోరీ అది. అందరూ బాగుంది అనడంతో దాన్ని అక్కడే సినిమాగా తీయాలని అనుకున్నాను. కానీ వర్కవుటవ్వలేదు. అలా ఒకటిరెండుసార్లు జరగడంతో, ఇక లాభంలేదని ఇండియా వచ్చేసి, సినిమా తీయాలని స్ట్రాంగ్‌గా డిసైడైపోయాను. కానీ సేఫ్‌సైడ్‌గా రాజీవ్‌తో కలిసి ‘ఫస్ట్ బిజినెస్ సొల్యూషన్స్’ అనే కంపెనీ స్టార్ట్ చేశాను. అది బాగా రన్ అవుతున్న టైంలో, బిజినెస్ తనకు అప్పగించి నేను సినిమా ప్రయత్నాలు మొదలెట్టాను.
అదే టైంలో రసూల్ ‘ఒకరికొకరు’ సినిమా తీస్తున్నారు. అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేరాను. పేరుకు అసిస్టెంట్ డెరైక్టర్ననే కానీ చేయని పని లేదు... ఆఫీస్‌బాయ్ లేకపోతే టీలు పెట్టి, సర్వ్ చేయడం దగ్గర్నుంచి అన్నీ చేశాను. ఆ అనుభవం బాగానే ఉండింది కానీ, లోపల ఏదో రాయాలని, ఎంతో చెప్పాలన్న తపన! బాలీవుడ్‌కని బయల్దేరాను. ‘అఖండ్ భారత్... బట్ ఇండియా డివెడైడ్’ అనే స్క్రిప్ట్ రాయడం మొదలెట్టాను. అది గాంధీ - గాడ్సేల కథ! ఆ క్రమంలో రిసెర్చ్‌కని పూణే, నాగపూర్, సాంగ్లి... అన్ని ప్రదేశాలు తిరిగాను. ఇక్కడ నేను మీకు ఓ వ్యక్తి గురించి చెప్పాలి... అతను కారు డ్రైవర్ బుజీద్! అతనే నన్ను అన్నిచోట్లకూ తిప్పాడు. ఆ ప్రయాణమంతా నేను - ఏం చదవాలి? ఎవర్ని కలవాలి? ఏం అడగాలి? అని ఆలోచిస్తుంటే, అతను ఎంతసేపూ నేను ఎక్కడ ఆపుతాను? ఏ దాబాలో భోజనం పెట్టిస్తాను? ఏ హోటల్లో స్టే చేస్తాం? అనే ఆలోచించేవాడు. ఇద్దరం కలిసే ప్రయాణిస్తున్నాం.. ఇద్దరం మధ్యలో ఒకేచోట ఆగుతున్నాం.. ఒకేచోటికి రీచ్ అవ్వాల్సిన వాళ్లం.. కానీ, ఇద్దరివీ ఎంత భిన్నమైన ఆలోచనలు? అనిపించేది నాకు.
ఇదిలావుండగా సాంగ్లిలో ఓరోజు ఎంత వెతికినా మినరల్ వాటర్ దొరకలేదు. ఒకటే దాహం! రోడ్డుమీద బోరింగ్ పంపు కనిపించగానే అతను ఆగి తాగేశాడు... నన్ను కూడా తాగమన్నాడు. తాగనన్నాను సరికదా, హెల్త్ గురించి కాస్త జ్ఞానం కూడా ఇచ్చాను. చివరికి అతను ఒక్క మాటన్నాడు - ‘బాటిల్ వాటర్ లేనిదే నడవని జీవితం... అదేం జీవితం సార్’ అని! ఎంతో తెలివైన వాణ్ణనుకుని ఆ ప్రయాణమంతా అతనితో ఎంతో జ్ఞానాన్ని పంచుకున్న నేను, ఒక్కసారిగా అజ్ఞానిగా ఫీలయ్యాను! ఒక్క మాటతో అతను జీవిత సారాన్ని చెప్పేశాడనిపించింది. అందుకే నా ఆలోచనలను మార్చిన వ్యక్తుల జాబితాలో అతను కూడా ఉంటాడు. డ్రైవర్ చెప్పిన ఆ డైలాగ్... అతనితో మరచిపోలేని ఆ ప్రయాణం... నాలో ఎన్నో ఆలోచనలు రేకెత్తించింది. బాలీవుడ్ డ్రీమ్స్‌ని పక్కన పెట్టేసి, హైదరాబాద్ తిరిగి రావాలని నిర్ణయించుకున్నాను. మార్గమధ్యంలో ఉన్నట్టుండి షోలాపూర్‌లో ఆగిపోయి, తెల్లపేపర్లు తెప్పించుకుని, డ్రైవర్‌ను వెనక్కి పంపించేశాను. ఓ చిన్నహోటల్లో బసచేసి, ‘గమ్యం’ స్టోరీ మొదలెట్టాను.
ఇందిర: మంచి సినిమా తీశాక కూడా విడుదలకు ఎందుకంత కష్టపడ్డారు? క్రిష్: సినిమా అంటే కళాత్మకమైన వ్యాపారం కాదు... వ్యాపారాత్మకమైన కళ! ముందు వ్యాపారం... తర్వాతే కళ. కొన్ని కోట్ల వ్యవహారంలో కొత్త వ్యక్తి అనేసరికి ఆమాత్రం భయం ఉండదా! అంతేకాదు, నా కథను నేనెలా తెరకెక్కించగలనో, నా ఐడియా ఎంత సక్సెస్ అవుతుందో నాకు తెలుసు కానీ బయటివాళ్లకు తెలియదు కదా! అందుకే ఎవరూ ముందుకు రాలేదు. తమ్మారెడ్డి భరద్వాజగారి సాయంతో ఎలాగో దాన్ని బయటికి తీసుకురాగలిగాం. ఆ సినిమా వర్కవుట్ అవ్వకపోతే నేను అమెరికా తిరిగి వెళ్లిపోవాలనేది మా పేరెంట్స్‌తో అగ్రిమెంట్.
ఇందిర: రెస్పాన్స్ చూశాక ఏమనిపించింది? క్రిష్: దేవి థియేటర్లో సినిమా చూడ్డానికి వెళ్లినప్పుడు సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు వేసిన ఈలలు, కొట్టిన చప్పట్లు సంగతి పక్కన పెట్టి, ఒక సంఘటన గురించి చెప్తాను. సినిమా అయిపోయాక నేను, హరి అనుమోలు గారు బయటికి వస్తున్నాం. అప్పుడు నేను తిరుపతి మొక్కు తీర్చుకుని గుండుతో ఉన్నాను. ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు. పక్కనుంచి వెళ్తూ ఓ ప్రేక్షకుడు - ‘వీడెవడో భలే తీశాడ్రా సినిమా... పుస్తకాలు తెగ చదివాడ్రా... భలే చెప్పాడ్రా మడిసంటే ఏంటో’ అన్నాడు. ఇప్పటికీ నాకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్లలో అదొకటి!
ఇందిర: మీ సినిమాల్లో హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కువుంటాయెందుకు? క్రిష్: ఎందుకంటే, నేను బయట చూసిన వాటినే సినిమాల్లో చూపిస్తాను కాబట్టి! ఉదాహరణకి గమ్యం సినిమా... దానిలోని పాత్రలు, సన్నివేశాలు చాలా వరకు కల్పించినవి కాదు... నేనెదుర్కొన్న అనుభవాలు! నేనో పెద్ద యాక్సిడెంట్‌కు గురయ్యాను. గమ్యం సినిమా యాక్సిడెంట్‌తోనే మొదలవుతుంది. అందులో గిరిబాబుగారు పేద పిల్లలకు చదువు చెబుతుంటారు. అలాంటి వ్యక్తి నాకు నిజజీవితంలో తెలుసు. పూర్ణచంద్రరావు గారనీ... మా బావగారి కంపెనీలో పని చేసేవారు. ఆయన భార్య కూడా అక్కడే పనిచేసేవారు. భార్య సంపాదనతో చిన్న కుట్టియెస్ట్ రూంలో వుంటూ, ఆయన మొత్తం జీతంతో అనాధ పిల్లలను పెట్టుకుని చదివించేవారు. ఆయన నాకు ఎంత ఇన్‌స్పిరేషన్ అంటే... సినిమాలో ఓ డైలాగ్ పెట్టాను - ‘పూర్ణాగాడి’ ఇల్లెక్కడరా అని ఎవరో అడిగితే, ‘పూర్ణాగాడు కాదురా, పూర్ణ గాడే’ అని! ఆయన దగ్గర చదువుకునే ఒక అమ్మాయి క్యారెక్టరే జానకి. అలాగే, ఆ కథ రాస్తున్నప్పటికి నక్సలైట్లకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు నడుస్తున్నాయి. వాటినీ పెట్టాను. అలానే వేదంలో కూడా చాలా క్యారెక్టర్లు ఇన్‌స్పైర్ అయినవే. నిజ జీవిత పాత్రల నుంచి స్ఫూర్తి పొందడం వల్లే ఎమోషన్స్ పక్కాగా, నిజాయితీగా కనిపిస్తాయి.
ఇందిర: సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయని నమ్ముతారా? క్రిష్: ఎందుకు చేయవు... మంచికైనా, చెడుకైనా తప్పకుండా చేస్తాయి. చిన్నప్పుడు... నేను ట్యూషన్ ఎగ్గొట్టి ‘శివ’ సినిమాకి వెళ్లాను. ఇంటికొచ్చాక అందరం కలిసి భోజనం చేస్తుంటే నాన్న ‘సినిమా ఎలా ఉంది?’ అన్నారు. ‘బాగుందట’ అన్నాను నేను. ‘అట ఏమిటి, చూసొచ్చావు కదా’ అన్నారు. ఎవరో చూసి చెప్పేసి ఉంటారని అనుకున్నాను. భయమేసి ఇంకెప్పుడూ అలా చేయను అని ఏడవడం మొదలెట్టా. ఆయన తలమీద మొట్టారు. అయితే తర్వాత తెలిసింది, ఆయన కొట్టింది సినిమాకి వెళ్లినందుకు కాదు, నేను చొక్కా మడత పెట్టినందుకని! చాలా షాకయ్యాను. ఎందుకంటే నాగార్జునలా చొక్కా ఎప్పుడు మడతపెట్టానో నాకే తెలీదు. అలా ఉంటుంది సినిమా ప్రభావం!
ఇందిర:కానీ ‘శివ’ తీసిన వర్మగారే ఓసారి అన్నారు... సినిమాలు చూసి ఎవరూ ప్రభావితం కారని... క్రిష్: ఆయనలా అనుకున్నారేమో కానీ నేను అలా అనుకోవడంలేదు. ఆయన సినిమా చూసి నేనే సైకిల్ చెయిన్ పట్టుకున్నాను! శక్తిమాన్ చూసి హీరోల్లా ఫీలవుతున్నప్పుడు, సినిమాల్లో పాత్రలు చూసి ఎందుకు నేర్చుకోరు! రివర్స్‌లో... వేదం క్లయిమాక్స్‌లో ఆస్పత్రిలోకి తీవ్రవాదులు నలుగురు వచ్చి కాల్పులు జరిపినట్టు, కొందరు చనిపోయినట్లు సీన్లు పెట్టాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... సినిమా వేరు, సమాజం వేరు కాదు. సమాజంలో జరిగేదే సినిమాలో చూపిస్తాం. సినిమాలో చూపించేవి కొన్నిసార్లు సమాజంలో జరుగుతుంటాయి. ఇరువైపులా ఆ ఇంపాక్ట్ ఎప్పుడూ ఉంటుంది!
ఇందిర: మీ ఇండస్ట్రీకి సంబంధించి అప్పుడప్పుడు ఏదో ఒక వివాదం జరుగుతూ ఉంటుంది కదా... వాటిల్లో కలుగజేసుకుంటారా? క్రిష్: (నవ్వుతూ) తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అని చిన్నప్పుడు చదువుకున్నాను... అందుకే అనవసరమైన విషయాల్లో తలదూర్చను, కామెంట్లు చేయను.
ఇందిర:కానీ మీలాంటి వాళ్లు కూడా మాట్లాడకపోతే ఎలా? క్రిష్: అసలు మనకు వాక్ స్వాతంత్య్రం ఉందనుకుంటున్నారా? ఫేస్‌బుక్‌లో తమ భావాలను వ్యక్తం చేసినవాళ్లను జైల్లో పెట్టడం స్వతంత్రం అంటారా? అక్కడిదాకా ఎందుకు.. సినిమాలనే తీసుకుందాం... ‘మాలపిల్ల’ లాంటి సినిమా ఇప్పుడు తీయగలమా! తీస్తే జనాలు ఊరుకుంటారా? ఒక ‘మిస్సమ్మ’ను మనమిప్పుడు తీయగలమా? అందులో ‘తన మతమేదో తనది, మన మతమనసలే పడదోయ్’ అన్న ఒక్కపాట చాలదా రభస కావడానికి ఈరోజుల్లో! మిస్సమ్మ తక్కువ సినిమానా? మిస్సమ్మను సెన్సార్ చెయ్యాలా? ఇప్పుడు ప్రజలు చాలా సెన్సిటివ్ అయిపోయారు. సెన్సిటివ్ కూడా కాదు... సెన్సేషనలిజంకు అలవాటుపడుతున్నారు అనాలేమో!
ఇందిర:సిరివెన్నెల గారితో మీకున్న అనుబంధం.... క్రిష్: గురుశిష్యుల సంబంధం ఆనుకోండి... తండ్రీకొడుకులది అనుకోండి; నా ఆలోచనా విధానాన్ని మార్చినవాడనుకోండి... నన్ను మలచినవాడు అనుకోండి; గ్రేట్ థింకర్, ఫిలాసఫర్ అనుకోండి... గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అనుకోండి... ఏదైనా ఆయనే! మొదటిసారి ఆయన్ని కలిసినప్పుడు నేను గమ్యం కథ చెప్పాను... వినగానే ఆయన ‘అరే అబ్బాయి... ఒక మనిషి గురించి చెబుదామని నీకెందుకంత తాపత్రయం...’ అంటూ డిస్కషన్ స్టార్ట్ చేశారు. చివరికాయన ఆ కథ సినిమాకు తగదని, కొన్ని మార్పులు చేయాలని సూచించారు. దాంతో కొన్ని మార్పులు చేసి, 9 నెలల తర్వాత మళ్లీ వినిపించాను. అది ఆయనకు చాలా నచ్చి, ముందుకెళ్లమని చెప్పారు. ఆ క్రమంలోనే ఓసారి నేను ఆయనతో ‘నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవండీ... ఒక్క పాట రాయండి’ అడగ్గానే ఆయన,‘ఇది ఒక మనిషి గురించి ఒక మనిషి చెప్తున్న కథరా... ఆ మనిషి కథ కోసం ఈ మనిషి రాస్తున్న పాటలురా ఇవి’ అంటూ, ఒక్క పాటకాదు... ఆ సినిమాలో అన్ని పాటలు తానే రాస్తానని... వాటికి తను ఒక్క పైసా తీసుకోనని కూడా చెప్పారు. ‘మానవ సంబంధాలే ఆర్థిక సంబంధాలు’ అనుకునేదానికి విరుద్ధంగా ఆ మనిషి ఆరోజు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోకపోవడమే కాకుండా నాకు ఎప్పుడు అవసరమైనా ఎదురు ఇచ్చారు.
సినిమా పూర్తయింది... కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రివ్యూ వేశాను. మొదట చూసింది ఆయనే. బయటకు రాగానే ఆయన ‘ప్లెబిసైట్ పెట్టొద్దు... సినిమా తీశావు... నాకు చెప్పినదానికన్నా బాగా తీశావు... యువార్ ఎ మేకర్! ఇవ్వాళ నేనొక మాట చెప్తున్నానురా, ఎప్పటికీ గుర్తుంచుకో! నేనొక కోడిని... సూర్యుడిలా నువ్వు వస్తున్నావన్న విషయాన్ని ముందుగా గమనించి కొక్కొరకో అంటూ లోకానికి తెలియచేస్తున్నాను’ అన్నారు. ఆ మాటలు జీవితంలో మరచిపోలేను. ఆ సినిమాలో ఆయన ‘గమనమే నీ గమ్యమైతే, బాటలోనే బ్రతుకు దొరుకు... ప్రశ్నలోనే బదులు ఉంది, గుర్తుపట్టే గుండెనడుగు...’ అని రాశారు. ఆ గుర్తుపట్టిన గుండే సీతారామశాస్త్రిగారు!
ఇందిర: గురువు అవసరం లేనట్టుగా ‘నీకు నువ్వే గురువు’ అన్న డైలాగ్ ‘కృష్ణం వందే జగద్గురుం’లో ఎందుకు పెట్టారు? క్రిష్:అది ప్రతిసారీ వర్తించదు... మనకు ఒకే గురువు ఉండరు! గురువు అంటే ఎవరు... ఎరుకపరిచేవాడు. తల్లి, తండ్రి, ఆదిశంకరాచార్యులు, జగద్గురువైన కృష్ణుడు... ఇలా మనకెంతమంది గురువులున్నారు? ‘నీకు నువ్వే గురువు’ అన్నదానికి నా ఉద్దేశం... ‘నరుడి లోపల పరునిపై (పరుడు అంటే పరాయివాడని కాదు దేవుడని అర్థం) దృష్టిపరుపగ, తలను వంచి, కైమోడ్చి నీ శిష్యుడవు నీవెతై, నీ ఆర్తి కడతేర్చు నీ ఆచార్యుడవు నీవె’ అని!
ఇందిర: (నవ్వుతూ) ఇంతకీ ఇంకా పెళ్లెందుకు చేసుకోలేదు? క్రిష్: (నవ్వేసి) ప్రస్తుతం మా అమ్మకు అత్యంత ఆప్తులైన వ్యక్తులు ఎవరంటే మీరే... ఈ ప్రశ్న అడిగినందుకు! బట్ సీరియస్లీ, నాకు భారతీయ వివాహ వ్యవస్థ మీద గొప్ప గౌరవం ఉంది. కానీ, పెళ్లి అనేది పెద్ద విషయం. జీవితాంతం హ్యాపీగా ఉంచగలననుకున్న అమ్మాయికోసం వెయిట్ చేస్తున్నాను.
ఇందిర: ఇన్నాళ్లు ఒక్కళ్లు కూడా దొరకలేదంటారా? క్రిష్: దొరికీ దొరకనట్టు... కొన్ని స్వయంకృతాపరాధాలతో... కుదరలేదు!
ఇందిర: కమిట్ అవ్వడానికి భయపడి కాదుకదా? క్రిష్: కాదు... రైట్ పర్సన్‌తో కమిట్ అవ్వడానికి!
ఇందిర: మీరలా అనగానే నాకొక బ్యూటిఫుల్ ఇంగ్లీష్ సేయింగ్ గుర్తొచ్చింది... ‘డోంట్ మ్యారీ సమ్ వన్ యు కెన్ లివ్ విత్... బట్ మ్యారీ సమ్‌వన్ హు యు కెనాట్ లివ్ వితౌట్’ (జీవితాంతం కలిసి బతకగలనని అనుకునేవాళ్లని కాదు పెళ్లి చేసుకోవాల్సింది... ఎవరు లేకపోతే నువ్వు జీవితంలో బతకలేవో వాళ్లని చేసుకో) అని! క్రిష్: యాబ్సల్యూట్లీ ట్రూ! అందుకే ఈ వెయిటింగ్!
నేను పక్కా మాస్...
మీరు ఎప్పటికీ తీయలేను అనుకునే సినిమా... క్రిష్: ఈగ, అరుంధతి. అలాంటి సినిమాలు తీయడానికి దమ్ముండాలి! అది రాజమౌళికి, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి లాంటి ఫిల్మ్‌మేకర్స్‌కే సాధ్యం!
ఫేవరెట్ డెరైక్టర్.. క్రిష్: ద గ్రేట్ డెరైక్టర్ రాజ్‌కపూర్! ‘జిస్ దేశ్‌మే గంగా బెహతీ హై’ వందసార్లయినా చూసుంటాను.
మిస్ అవ్వాలనుకోని టీవీ షో... క్రిష్: ప్రస్తుతం స్టార్ వరల్డ్‌లో ప్రసారమయ్యే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’... ఒక సింహాసనం కోసం కొట్టుకునే షో... చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది.
జాతకాలు నమ్ముతారా... క్రిష్: చెప్పించుకోను కానీ, నమ్ముతాను, చదువుతాను.
మీ గురించి ఎదుటివారు తప్పుగా అనుకునేది... క్రిష్: తెలివైన వాణ్ణని, క్లాస్ డెరైక్టర్నని! కానీ, నేను పక్కా మాస్! లేకపోతే గాలి శీను, కేబుల్ రాజు, బిటెక్ బాబులు లాంటి క్యారెక్టర్లు పుట్టవు.
చూడగానే మనిషిలో నచ్చేవి... క్రిష్: ఇంటలిజెన్స్, కాన్ఫిడెన్స్!
మీరు అన్నీ చెప్పుకునే వ్యక్తి.. క్రిష్: మా బావ బీబో శ్రీనివాస్. నా గురించి తనకు పూర్తిగా తెలుసు.
దేవుడంటే భయమా, భక్తా..? క్రిష్: ఇష్టంతో కూడిన భక్తి. ప్రతి పుట్టినరోజుకి తిరుపతి వెళ్తాను. రెగ్యులర్‌గా గుడికి వెళ్తుంటాను.
మీలో నచ్చేవి/నచ్చనివి? క్రిష్: చాలా మొండివాడ్ని. ఏదైనా చేద్దామనుకుంటే చేసి తీరతాను. అంతేకాదు, ఎమోషనల్ కూడా! ఈ రెండూ నా మైనస్‌లు. అయితే, అవే నా ప్లస్‌లు కూడా! ఎందుకంటే, అవి లేకపోతే గమ్యం తీసుండేవాడిని కాదు.
వీళ్లు లేకపోతే నేను లేను అనుకునేవాళ్లు... పర్సనల్లీ, ప్రొఫెషనల్లీ? క్రిష్: పర్సనల్లీ... ముందు తల్లిదండ్రులు, తర్వాత స్నేహితులు. ప్రొఫెషనల్లీ... సీతారామశాస్త్రిగారు. ఆయన లేకపోతే నా గమ్యం ఇలా ఉండేది కాదు.
ఫ్రీ టైమ్ ఎలా గడుపుతారు? క్రిష్: పుస్తకాలు చదువుతాను, వాలీబాల్ ఆడతాను, ఫ్రెండ్స్‌తో కాఫీషాప్స్‌కి వెళ్తాను..
దేనికి భయపడతారు? క్రిష్: ప్రేమించేవాళ్లు దూరమవుతారేమో అన్న భయం తప్ప ఇంకే భయాలూ లేవు.
కోపం... క్రిష్: ఒకప్పుడు బాగా ఉండేది... సెల్‌ఫోన్లు అవీ విసిరికొట్టేవాడ్ని. అయితే ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఎప్పుడైనా వచ్చినా 30 సెకన్లకన్నా ఉండదు.
సారీ చెప్పాల్సిన వ్యక్తులు, సందర్భాలు... క్రిష్: మా గురువుగారు సీతారామశాస్త్రి గారికి!
‘...అమేయం అనూహ్యం అనంత విశ్వం
ఆ బ్రహ్మాండపు సూక్ష్మస్వరూపం... ఈ మానుషరూపం
కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే... అల్పప్రమాణం
ముజ్జగాలను మూడడుగులతో కొలిచే తైవిక్రమ విస్తరణం...’
అంటూ రాసిన అద్భుతమైన దశావతార రూపకాన్ని... 12 నిమిషాల నిడివి వుందని, అంత పెద్ద పాటను ప్రేక్షకులు వినరేమోనన్న అజ్ఞానంతో, మూర్ఖత్వంతో... శాస్త్రిగారు, మణిశర్మగారు ఎంత పట్టుపట్టినా వినకుండా... తొమ్మిదిన్నర నిమిషాలకు కుదించాను. దశావతార రూపకమైనా, దేవుని గురించి కాకుండా, ఒక మనిషి గురించి రాసిన అంత గొప్ప సాహిత్యాన్ని కిల్ చేసినందుకు ఆయనకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. అంతేకాదు, మిగతాదంతా బాలు గారిచేత మళ్లీ పాడించి, దాన్ని షూట్‌చేసి, ఒక బ్యాలేగా రిలీజ్‌చేసి ఆ తప్పుని సరిదిద్దుకోవాలని కూడా అనుకుంటున్నాను..
మరచిపోలేని రోజు... క్రిష్: గమ్యం సినిమాకు డెరైక్టర్‌గా నేను, ప్రొడ్యూసర్‌గా నాన్న... ఒకే స్టేజి మీద ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాం. అలానే ‘వేదం’కి షోబు, నేను, అనుష్క, అల్లు అర్జున్ - నలుగురం నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నాం. అవి నేను మరచిపోలేని రోజులు!
అందరూ మిమ్మల్నెలా గుర్తుపెట్టుకోవాలనుకుంటారు? క్రిష్: మంచి కథకుడిగా, మంచి వ్యక్తిగా, ‘వాడి పనేదో వాడు చేసుకుపోయాడు... ఎవ్వరికీ చెడు చెయ్యలేదు’ అనుకునేలా!
మీరు నిత్యం వల్లించే వేదం... క్రిష్: నిన్న అనేది లేదు... అనుభూతుల సారం మాత్రమే దాచుకోగలం. అందుకే, సీజ్ ద మూమెంట్! ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి!
మీ గమ్యం... క్రిష్:జీవితానికి పరమార్థం ఏముంటుంది... మంచిగా జీవించడమే! మా గురువుగారు చెప్పినట్టు... గమనమే గమ్యం!
ప్రిపరేషన్‌లో ఫెయిలైతే ఫెయిలవడానికి ప్రిపేరవ్వండి! నన్ను అత్యంత ప్రభావితం చేసినవి తిలక్ రచనలు. ‘నా ఆశయాలేమో అభ్యుదయ దీపికలు... నా అక్షరాలేమో వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్న ఆయన సిద్ధాంతమే నా సినిమా సిద్ధాంతం కూడా!
చలం తెలుగులోకి అనువదించిన రవీంద్రనాథ్ టాగూర్ ‘గీతాంజలి’లోని - ‘శివా నువ్వు ఎక్కడున్నావయ్యా అని మొత్తం వెతుకుతుంటే.. దేశ దేశాలు తిరిగివచ్చిన తర్వాత అర్థమయింది... నువ్వు నా హృదయాంతరంగాలయంలో కొలువై ఉన్నావని’ అన్న మాటలు నాకు గొప్ప స్ఫూర్తి! గుంటూరు - హైదరాబాద్ (వయా) అమెరికా, బాంబే... ప్రయాణం చేయకపోయుంటే నాకు జీవితమంటే ఏంటో అర్థమయ్యేది కాదు!
శ్రీరమణగారు ఓచోట - ‘మనిషి జిరాఫీగా మారుతున్నాడు... హృదయానికీ మెదడుకీ మధ్య దూరం రోజురోజుకీ పెరుగుతోంది’ అన్నారు. దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. నాలో కూడా ఆ దూరం ఎక్కువే ఉన్నా, ఒకప్పటికన్నా తగ్గింది... థ్యాంక్స్ టు సినిమా!
ఎవరైనా నన్ను ‘ఎందుకు అన్నన్ని రాస్తావు, అంత టైం తీసుకుంటావు‘ అని అడిగితే...నేను చెప్పే సమాధానం ఒక్కటే... ‘ఇఫ్ యువార్ ఫెయిలింగ్ టు ప్రిపేర్... యు షుడ్ బి ప్రిపేర్డ్ టు ఫెయిల్’ (ప్రిపరేషన్‌లో ఫెయిలైతే ఫెయిలవడానికి ప్రిపేరవ్వండి).
రామ్‌గోపాల్‌వర్మ ‘శివ’ తీశారు... ఆయనే ‘ఆగ్’ కూడా తీశారు. అయితే అది సరైన కంటెంట్ కాదు. సరైన స్క్రిప్ట్ దొరికితే మళ్లీ ఆయన మొనగాడు డెరైక్టరే! అందుకే అంటారు - ‘వియ్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ అవర్ కంటెంట్’ అని!
చిన్నారుల మీద లైంగిక వేధింపులు చేసే టీచర్లున్నారు... పేషెంట్ల మీద అరాచకం చేసే డాక్టర్లున్నారు... బ్లాక్‌మెయిల్ చేసే మీడియా సంస్థలున్నాయి... లంచాలిచ్చి బతికే సాఫ్ట్‌వేర్ కంపెనీలున్నాయి... ఇలా ఎన్ని లేవు! మేం ఆడియన్స్‌కి లంచమిచ్చి సినిమాలు చూపించగలమా? లైంగిక సంబంధాలు మా ఒక్క ఇండస్ట్రీలోనే ఉన్నాయా... బయట లేవా? సినిమావాళ్లం భూతద్దాల మేడల్లో బతుకుతున్నాం కాబట్టి అందరికీ కనిపిస్తాం కానీ, నా దృష్టిలో ఎన్నో విషయాల్లో సినిమా ఇండస్ట్రీనే అన్నిటికన్నా బెటర్! ఆర్ద్రత, తపన, అన్నిటికంటే ముఖ్యంగా... ఒక్క ‘బాగుంది’ అనే పదం కోసం తహతహలాడతాం!
కసబ్ అనేవాడు ఒక ఆయుధం మాత్రమే! అతన్ని ఉరితీసి ఇక్కడ అందరం చంకలు గుద్దుకుంటున్నాం కానీ, 26/11 రోజు కసబ్ కూడా చనిపోయి వుంటే, ఎవరిని బాధ్యులను చేసేవాళ్లం? అసలు ఆ ఆయుధాన్ని ప్రయోగించినవాళ్లెవరు? ఆ మూలాలను నిర్మూలించడానికి మనం ఏం చేస్తున్నాం?
ఎన్నాళ్లు సినిమాలు తీయగలిగితే అన్నాళ్లు తీస్తా! వీలు కుదిరితే నాకిష్టమైన పుస్తకాలు కూడా రాస్తాను. ఇష్టముంటే డాక్యుమెంటరీలు కూడా తీస్తాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అయామ్ ఎ స్టోరీ టెల్లర్!!
No comments:
Post a Comment