పశ్చిమ దేశాల పెద్దలు న్యాయ దేవత కళ్లకు గంతలు కట్టుకుని, చేతిలో త్రాసుతో నిల్చుని ఉన్నట్లు ఏనాడో చిత్రీకరించారు. ఇప్పటికీ అదే చిత్రం వాడికలో ఉంది. న్యాయ దేవత -అంటే, చట్టమే- నిష్పక్షపాతంగానూ, నిస్వార్థంగానూ వ్యవహరిస్తుందని చెప్పడానికి ఈ చిత్రాన్ని ప్రతీకగా వాడతారు. నార్వేలో శిశు సంక్షేమ సేవల చట్టం తీరుతెన్నులను పరిశీలిస్తే ఆ చట్టానికి కళ్లే కాదు, ఏ జానేంద్రియమూ లేదనిపిస్తుంది. మంగళవారం నాడు -డిసెంబర్ నాలుగో తేదీన- నార్వేలో నివసిస్తున్న తెలుగు జంట వల్లభనేని చంద్రశేఖర్, అనుపమలకు 18 నెలలూ 15 నెలల శిక్ష పడిన నేపథ్యంలో, నార్వే చట్టానికి హృదయమనేదే లేదనిపిస్తుంది. 2011 ఫిబ్రవరిలో మొదలయి, ఈ ఏడాది మార్చ్‌లో విషాదాంతంగా ముగిసిన భట్టాచార్య దంపతుల కథ చూసినా ఇదే అభిప్రాయం కలుగుతుంది. ఇంతవరకూ ఈ రెండు కథలే రచ్చకెక్కాయి. అక్కడ మరెందరు మనవాళ్లు ఎన్నెన్ని యాతనల పాలవుతున్నారో ఏమో అనిపించడం సహజం.
భారతదేశానికి చెందిన విద్యాధికులను సొంత పిల్లలను పెంచుకోవడమే తెలియని ‘అనాగరకులు’గా పరిగణించడం ద్వారా నార్వే ఒక తరహా పాశ్చాత్య జాత్యాహంకార వైఖరిని ప్రదర్శించిందనే చెప్పాల్సి ఉంటుంది. పెపైచ్చు, స్వీడెన్‌లో శిశు సంక్షేమ సేవలు మరింత కఠినంగా ఉంటాయని మనల్ని భయపెట్టే ప్రయత్నం చెయ్యడం క్షంతవ్యం కాదు! ఈ పోకడ వల్ల నార్వేలో నివసించే భారతీయ సంతతి బాలలకు ఏం ఒరిగిపడుతుందో ఏమో గానీ, ఇక్కడ ఉండే వారి తాతలకూ, అవ్వలకూ తీవ్రమయిన మనోవేదన కల్గుతోందనడంలో సందేహం లేదు. మన విదేశాంగ శాఖ ఇప్పటికయినా ఈ విషయంలో కచ్చితమయిన వైఖరి ప్రదర్శించి, జాతి గౌరవాన్నీ, తల్లితండ్రుల ప్రేమాభిమానాలనూ నిలబెట్టేలా ప్రవర్తించాల్సి ఉంది.
ఇంతకీ చంద్రశేఖర్- అనుపమల నేరమేమిటి?
వాళ్ల కుమారుడు తరగతి గదిలోనూ, స్కూలు బస్సులోనూ మూత్రవిసర్జన చేసినందుకు ఆ కుర్రాడిని తల్లిదండ్రులు బెదిరించారట. తానలా చెయ్యలేదని కుర్రాడు బుకాయించబోగా ‘అబద్ధాలు చెప్తే నాలిక మీద వాతలు పెడతా’నని తండ్రి బెదిరించారట. ఒకసారి బెదిరించడానికి చెమ్చాను వేడిచూసి చూపించానంతే మొర్రో అని చంద్రశేఖర్ మొత్తుకున్నారు. అయితే, కోర్టు విచారణ సందర్భంగా కుర్రాడి ఒంటిమీద వాతలూ, కాల్చిన మచ్చలూ కనపడ్డాయని ప్రాసిక్యూషన్ పేర్కొనడం గమనార్హం. అదంతా అబద్ధమనీ, తరచు తమ కుమారుడిని పరీక్షించే వైద్యులు ఇలాంటిదేమన్నా జరిగివుంటే ఊరుకునేవారా? అని చంద్రశేఖర్ దంపతులు నిలదీశారు. అయినప్పటికీ నార్వే ‘న్యాయ’ స్థానం చెక్కుచెదరలేదు- పదేపదే హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో తల్లితండ్రుల పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని, శిక్షలు వేశామని నార్వే అధికారులు కోర్టుకే కాదు- మన దౌత్య కార్యాలయానికి సైతం తెలియచేయడం విశేషం.
మన సమాజంలో క్రమశిక్షణకూ, కర్రపెత్తనానికీ తేడా లేకుండా పోయినమాట వాస్తవమే. అది గృహసంబంధాల్లో సైతం తరచు ప్రతిఫలించే మాటా వాస్తవమే. ఇక్కడ పిల్లలను గొడ్లను బాదినట్లు హింసించి వేధించే తల్లితండ్రులు ఉన్న మాటకూడా ఓ చేదు నిజమే. అయితే, అలాంటి అనాగరకులు -చదువూ సంస్కారాలున్న కుటుంబాల్లో- అల్ప సంఖ్యాకులనే చెప్పాలి. మహా రచయిత చలం తన ఆత్మకథలో పేర్కొన్నటువంటి హిరణ్య కశిపుడి బ్రాండ్ తల్లిదండ్రులు మనకు ఇప్పుడు ఎక్కడోగానీ కనిపించరు. ఏదో మాటవరసకు ‘తాటవలుస్తా’, ‘డొక్క చించేస్తా’, ‘చంపేస్తా’లాంటి మాటలు వాడినంత మాత్రాన తల్లిదండ్రులను ఇడీ అమీన్ ప్రతిరూపాలుగా పరిగణించడం అన్యాయం. అయినా, ఒకవేళ మనవాళ్ల ప్రవర్తన నార్వే చట్టాల ప్రమాణాల మేరకు లేనట్లయితే, వాళ్లను ఉద్యోగాల్లోంచి తొలగించే హక్కు అక్కడి అధికారులకు ఎలాగూ ఉంటుంది. లేదా, వారి వీసాలు రద్దు చేసి తిప్పి పంపగల సావకాశం వారికి ఉండనే ఉంది. అలా చెయ్యకుండా, తమ చట్టాల ప్రకారం ఇతర దేశాల పౌరులను ఇష్టారాజ్యంగా విచారించి శిక్షించడం ఏ ప్రమాణం ప్రకారం చూసినా భావ్యం కాదు.
అసలు లోపం మన పాలకుల్లో ఉందనిపిస్తోంది. నిన్నగాక మొన్న, ఐర్లండ్‌లో మన ఆడపడుచు సవితా హాలప్పనవర్ అన్యాయంగా బలయిపోయినప్పుడు కూడా మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏవో సన్నాయినొక్కులతో సరిపెట్టిందే తప్ప గట్టిగా నిలదీయలేదు. ఐర్లండ్‌ను నిలదీయడానికి జంకిన విదేశాంగ శాఖ నార్వేని కడిగేస్తుందని ఆశించడం అత్యాశే అవుతుందేమో! కానీ, చేతులు కాలాకా కూడా ఆకులు పట్టుకోకపోతే జనం మన విదేశాంగ శాఖను క్షమిస్తారా? అలా క్షమించాలని మనం ఆశించగలమా??
No comments:
Post a Comment