all

Friday, January 4, 2013

మకర సంక్రాంతి స్పెషల్ నేతి అరిసెలు

అరిసెలు తెలుగువారి అత్యంత ప్రీతిపాత్రమైన పిండివంటలలో ఒకటి. ఒకరకంగా మన సంప్రదాయ వంట అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు అరిసెలు తప్పనిసరి. పిన్నా పెద్దలు మిక్కిలి ఇష్టంతో అరిసెలను ఆరగిస్తారు. ఈ అరిసెలు పెళ్ళైన ఆడపిల్లకి పెట్టే సారెలో కూడా తప్పకుండా పెడతాము.
అరెసెలు చేయటం కొంచెం కష్టమైన పనే అయినా... చాలా రుచికరంగా ఉంటాయి. అరిసెలు చేయడం రెండు రోజుల పని. మొదటి రోజు బియ్యం నానబెట్టుకోవటం, రెండవ రోజు ఆ నానిన బియ్యాన్ని పిండి పట్టించి మెత్తగా జల్లించి ఈ పిండిని బెల్లం పాకం పట్టి అందులో జల్లించిన పిండిని కలిపి అరిసెలు చేసుకోవటం ఇది అరిసెల ప్రహసనం....
కావలసిన పదార్థాలు:
బియ్యం: 1kg
బెల్లం తరుము: 1/2kg
నువ్వులు: 100grms
నీరు: 1cup(తగినంత)
యాలకులు: 2-4(మెత్తగా పొడిచేసుకోవాలి)
నెయ్యి: 1/2cup
నూనె: వేయించడానికి సరిపడా


తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 24 గంటలు నానబెట్టుకోవాలి. ఉదయం చిల్లులగిన్నెల్లో వడవేసి పిండి పట్టించుకోవాలి. పిండి తడి ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి.

2. తర్వాత స్టౌ మీద మందపాటి గిన్నె పెద్దది పెట్టుకుని అందులో చిదిమిన బెల్లాన్ని వేసి కొద్దిగా నీరు పోసి పాకం పట్టుకోవాలి. (అరిసెలు గట్టిగా కావాలంటే ముదురుపాకం, మెత్తగా కావాలంటే లేతపాకం) పాకం రాగానే నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.

3. తర్వాత బియ్యం పిండి ఒకరు వేస్తుంటే మరొకరు ఉండ చుట్టకుండా కలపాలి. ఉండలు చేసుకోవడానికి వీలుగా ఉండేంతవరకూ పిండి వేసి కలపాలి.

4. ఇలా పిండి పాకంతో తయారు చేసుకొన్న తర్వాత స్టౌ ఫ్రైయింగ్ పాన్ పెట్టుకోవాలి. అందులో నూనె వేసి కాగనివ్వాలి.
ఈలోపు పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని ప్లాస్టిక్‌ కవర్‌ మీద అరిసెలు వత్తుకొని కాగిన నూనెలో వేసి వేయించుకోవాలి.
బంగారు వన్నె రాగానే వాటిని తీసి అరిసెల పీటపై (గరిటెలు కూడా ఉంటాయి) ఉంచి వత్తుకోవాలి. దీనివల్ల అరిసెల్లో అదనంగా ఉన్న నూనె పోతుంది. వీటిని ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత భద్రపచుకోచ్చు.

ఇవి ఒక నెల రోజుల పాటు నిలవ ఉంటాయి. అంతే నోరూరించే అరిసెలు రెడీ..!

No comments: