ఇంటిరియం
జగత్తులో చైతన్యం నింపే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. సృష్టిలోని సకల జీవరాశులు సూర్యకిరణాల స్పర్శతోనే చైతన్యవంతం అవుతాయి. రవి కిరణాలు మానవులకే కాక సకల జీవజాతులకు, వృక్షజాతులకు ఉపకరిస్తాయి. వేర్వేరు కాంతిదైర్ఘ్యాలకు వేర్వేరు జీవులు స్పందిస్తుంటాయి. ఆత్మకారకుడైన రవి చైతన్యాన్ని కోల్పోతే శరీరం మరణానికి చేరువ అవుతుంది.
మధ్యాహ్న సమయాన తమోగుణాన్ని చూపిస్తాడు. తన ప్రచండరూపంతో ప్రకృతిలోని రజోగుణాన్ని నశింపచేస్తాడు. రోజంతా మనలో చైతన్యాన్ని నింపి, ఆనందాన్ని పంచి ఒక తండ్రిలా కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. సాయంసంధ్యకల్లా పశ్చిమానికి వెళ్లిపోతాడు. జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు గ్రహాలకు రారాజు. ఆరోగ్యకారకుడు, పితృకారకుడు. ఉచ్ఛ్వాసనిశ్వాసలకు, రక్త ప్రసరణ వ్యవస్థకు, అతి ముఖ్యమైన గుండెకు... బాధ్యుడు సూర్యుడే. వేర్వేరు కాంతి దైర్ఘ్యాలకు వేర్వేరు జీవులు స్పందిస్తుంటాయి. ఆ కాంతులు భూ ఉపరితలంపైనా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సూర్యకిరణాల్లో ఆరోగ్యసూత్రాలు ఇమిడి ఉన్నాయి. సూర్యకిరణాలు సోకనివారికి అస్వస్థత, చర్మవ్యాధులు వంటివి సంక్రమించడం తెలిసిందే. అప్పుడే పుట్టిన పిల్లలకు కామెర్లవ్యాధి సోకితే సూర్యుని లేలేత కిరణాలలో ఉంచుతుంటారు. ఇక మనం తీసుకునే ఆహారంలో కాయలు, పండ్లు, ధాన్యాలు కిరణజన్యసంయోగక్రియ ద్వారా వచ్చినవే. ‘ఆహారమే మనసుగా మారుతుంది’ అన్నది ఉపనిషద్వాక్యం. మనసులో అలజడులు, సంతోషాదులే శరీరంలో మార్పులకు, అనారోగ్యాలకు కారణం. అందుకే మనం తీసుకునే ఆహారం శక్తిని కలిగించేదై ఉండాలి. పరోక్షంగా కూడా ఆహారాన్ని, మనస్సును, శరీరాన్ని సూర్యుడే పోషిస్తున్నాడు. సూర్యుడు ప్రత్యక్షదైవం. సూర్యుడిని పూజించడం వలన తేజస్సు, బలం, ఆయువు, నేత్రకాంతి వృద్ధి అవుతాయి. సూర్యోపాసన ద్వారా మానవులు రోగవిముక్తులు కాగలరు. అందుకే ఇంటిలోకి సూర్యకాంతి పడేవిధంగా చూసుకోవాలి. వీలైనంతసేపు ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి. ఉదయాన్నే సూర్యుని నుంచి వచ్చే కిరణాలలో విటమిన్ - డి ఉంటుంది. అందువల్ల సూర్యుని లేలేత కిరణాలు పడే సమయంలో కొద్దిసేపైనా ఎండలో నిలబడటం మంచిది. వీలైతే సూర్యనమస్కారాలు చేయడం ఆరోగ్యదాయకం. ప్రాణప్రదాత అయిన సూర్యుడిని భగవంతునిగా భావిస్తూ సూర్యనారాయణుడు అనడానికి కారణం ఇదే. |
No comments:
Post a Comment