all

Thursday, April 18, 2013

ధనురాసనం...యోగా

 

 
ధనుస్సు అంటే విల్లు. ఈ ఆసనం వేసినప్పుడు దేహం ధనుస్సును పోలి ఉంటుంది. అందుకే దీనికి ధనురాసనం అని పేరు.

ఎలా చేయాలి?
బోర్లా పడుకుని రెండు మోచేతులను మడిచి అరచేతులు బోర్లించి ఒకదాని మీద మరొకటి ఉంచాలి. బోర్లించిన చేతుల మీద గడ్డాన్ని ఆనించాలి.

రెండు మోకాళ్లను వంచి రెండు చేతులతో రెండు కాళ్ల మడమల్ని పట్టుకోవాలి. ఈ స్థితిలో రెండు పాదాలు, మోకాళ్ల మధ్య కొద్దిగా దూరం ఉండాలి.

ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ కాళ్లను, చేతులను పరస్పర వ్యతిరేక దిశలో పెకైత్తాలి. ఈ స్థితిలో మోకాళ్లు, తొడలు, తల, ఛాతీ పైకి లేచి ఉంటాయి, పొత్తికడుపు మాత్రమే నేలను తాకుతూంటుంది. ఈ స్థితిలో దేహం ధనుస్సును తలపిస్తుంది. ఇలా ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత నిదానంగా శ్వాస వదులుతూ యథాస్థితికి రావాలి.

ఈ ఆసనాన్ని రోజూ ఉదయం మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.

ఆ ఆసనం వేస్తే ఉపయోగం ఏంటి?
నడుమునొప్పి, మోకాళ్లనొప్పి, కీళ్ల వ్యాధులు, థైరాయిడ్ సమస్యలతో పాటు ఇతర గొంతు సమస్యలు కూడా తగ్గుతాయి.

కాళ్లు, చేతులు, భుజాలు, గుండెకండరాలు శక్తిమంతం అవుతాయి.

ఛాతీ విశాలమవుతుంది. శ్వాస వాహికలు శుభ్రపడి కఫదోషాలు తొలగుతాయి.

ఊపిరితిత్తులు పూర్తిగా గాలితో నిండుతాయి, తద్వారా శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.

శరీరం బరువు పొత్తికడుపు మీద కేంద్రీకృతం కావడం వల్ల పొట్ట కండరాలు, జీర్ణవ్యవస్థల మీద ఒత్తిడి కలుగుతుంది. దాంతో ఇవి చైతన్యం అవుతాయి. దీంతో మలబద్దకం, గ్యాస్ట్రిక్ సమస్యలు సమసిపోతాయి.

తొడలు, పిరుదులపై ఉన్న అధిక కొవ్వు కరిగిపోతుంది.

రుతుక్రమ సమస్యలు తగ్గుతాయి.

క్రమం తప్పకుండా ఈ ఆసనం సాధన చేస్తే ముఖం ప్రసన్నంగా ఉంటుంది.

ఎవరైనా చేయవచ్చా?
గర్భిణులు, పీరియడ్స్ సమయంలో ఉన్నవాళ్లు చేయకూడదు.

హెర్నియా, డిస్క్ సమస్య ఉన్నవాళ్లు చేయకూడదు.

స్పాండిలోసిస్, హైబీపీ ఉన్నవాళ్లు గురువు పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.

వార్ధక్యదశకు చేరినవాళ్లు, మరీ బలహీనంగా ఉన్నవాళ్లు ఈ ఆసనాన్ని సాధన చేయకపోవడమే మంచిది.


‘చిత్తవృత్తి నిరోధకః’ అంటే... చిత్తంలో ఉండే వృత్తులను నిరోధించడమే యోగ.

చిత్తం... అంటే ఉపచేతన మనసు; వృత్తులు... అంటే అలల వంటి ఆలోచనలు.

మనసులో నిత్యం అలలుగా ఎగిసిపడే ఆలోచనలను అదుపుచేయడం స్థూల - సూక్ష్మ శరీరాల కలయికతోనే సాధ్యం... అదే యోగసాధన.
 

No comments: