all

Thursday, May 16, 2013

ఆపరేషన్ తర్వాత ఈ అవస్థలేమిటి?

 

జెంటిల్‌మెన్ కౌన్సెలింగ్


నాకు 29 ఏళ్లు. నా కిడ్నీలో రాయి ఉందని చెప్పి మూత్రనాళం ద్వారా దాన్ని తొలగించారు. ఆపరేషన్ చేసినప్పటి నుంచి మూత్రంలో మంట, సెక్స్ చేసేటప్పుడు విపరీతమైన నొప్పి, అప్పుడప్పుడు మూత్రంలో కొంచెం రక్తం పడటం జరుగుతోంది. ఆపరేషన్ సమయంలో మూత్రనాళంలోని రక్తనాళాలు ఏమైనా చిట్లాయేమోనని భయంగా ఉంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - ధనరాజ్, ఏలూరు

జ: కిడ్నీలో రాళ్లను ఆపరేషన్ లేకుండా మూత్రనాళం ద్వారా తొలగించడం అన్నది చాలా సాధారణమైన ప్రక్రియ. ఇందువల్ల సాధారణంగా ఏ సమస్యా ఉండదు. కాకపోతే కొద్దిమందిలో మాత్రం యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చి, ఆ సమస్యకు తగిన యాంటీబయాటిక్స్ వాడకపోవడం వల్లగానీ కొన్నిరాళ్లు లోపలే మిగిలిపోవడం వల్లగానీ మీరు చెప్పిన సమస్యలు రావచ్చు.

మీరు యూరిన్ కల్చర్ పరీక్ష చేయించుకుని సరైన యాంటీబయాటిక్స్ వాడితే ఇది పూర్తిగా నయమవుతుంది. ఇక ముఖ్యమైన అంశం ఏమిటంటే... ఈ తరహా సర్జరీ (ఎండోస్కోపీ)లో కిడ్నీలో ఒక స్టెంట్ కూడా ఉంచుతారు. దాన్ని ఒక నెల తర్వాత తీయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మరచిపోయి అలా తీయించుకోకపోతే కూడా ఇన్ఫెక్షన్ సమస్యలు వస్తాయి. దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్‌ను మరోమారు సంప్రదించండి.
 

No comments: