all

Thursday, May 16, 2013

గర్భవతులకు వచ్చే నడుమునొప్పి... తగ్గేదెలా? - గైనిక్ కౌన్సెలింగ్

నేను గర్భవతిని. ప్రస్తుతం ఏడోనెల నడుస్తోంది. ఈ మధ్య నాకు నడుమునొప్పి విపరీతంగా వస్తోంది. దీని నుంచి విముక్తి ఎలా? ఈ విషయంలో నేను పాటించవలసిన, పాటించకూడని వాటిగురించి చెప్పండి.
- రమ, విశాఖపట్నం


గర్భవతుల్లో నడుమునొప్పి రావడం సాధారణం. ఇది జబ్బు ఎంతమాత్రం కాదు. దీని గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు. గర్భం దాల్చాక మహిళలు 10 కిలోల వరకు బరువు పెరుగుతారు. దానికి తోడు పొట్ట ముందుకు పెరుగుతుంది. సహజంగానే మహిళల గరిమనాభి (సెంటర్ ఆఫ్ గ్రావిటీ) లో మార్పు వస్తుంది. దీనికి తగినట్లుగా శరీరం వంగడం వల్ల నడుము మీద ఒత్తిడి పడి నొప్పి రావడం చాలా సాధారణం. దీనికి తోడు నెలలు నిండుతున్నకొద్దీ ప్రసవాన్ని సులభతరం చేసేందుకు ఓవరీస్ నుంచి ‘రిలాక్సిన్’ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది కేవలం ప్రసవం జరిగే మార్గంలోని కండరాలను, ఎముకలనే గాక మన వెన్నెముకలోని వాటినీ రిలాక్స్ చేస్తుంది. ఫలితంగా ఇది వెన్నుపై ఒక రకంగా తన ‘సైడ్‌ఎఫెక్ట్’ను చూపుతుందన్నమాట. గర్భవతుల్లో నడుమునొప్పి రావడానికి దోహదపడే వాటిలో ఇదీ ఒక అంశమే. ఇక దీనికి తోడు ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నవారిలో, గర్భంలో కవలలు ఉన్నవారిలో నడుమునొప్పి ఎక్కువగా వస్తుంటుంది.

జాగ్రత్తలు: నడుమునొప్పి ఎక్కువగా ఉన్న మహిళలు తాము నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకునే సమయంలో నడుముపై ఒత్తిడి పడని విధంగా ఉండే భంగిమ (బాడీ పోశ్చర్)ను పాటించాలి. ఉదాహరణకు నడిచే సమయంలో వెన్నును వీలైనంత నిటారుగా ఉంచాలి. కూర్చున్నప్పుడు మోకాలిపై మరో మోకాలు వేసి ఎక్కువసేపు కూర్చోకూడదు. పాదరక్షల విషయంలో హైహీల్స్ పూర్తిగా మానేయాలి. అలాగే పూర్తిగా ఫ్లాట్‌గా ఉండే చెప్పులనూ వేసుకోకూడదు. దీనికి బదులు మన పాదంలో సహజంగా ఉండే ఆర్చ్‌లాంటి వంపునకు సపోర్ట్ ఇచ్చేలా కొద్దిపాటి హీల్ ఉండే చెప్పులను వేసుకోవాలి. బరువులు ఎత్తే సమయంలో వంగకూడదు. దీనికి బదులు కూర్చుని బరువులు ఎత్తాలి. ఇక పడుకుని టీవీ చూస్తున్నప్పుడు ఎడమవైపునకు ఒరిగి చూడాలి. పడుకునే సమయంలోనూ ఎడమవైపునకు తిరిగి పడుకోవడం మంచిది.

మందుల విషయానికి వస్తే... నడుమునొప్పి తగ్గడం కోసం ఎలాంటి నొప్పి నివారణ మందులూ వేసుకోకూడదు. నొప్పి నివారణ మందులు ఏవైనా సరే... పుట్టబోయే బిడ్డకు మంచిది కాదని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా బిడ్డ కిడ్నీలపై ఇవి దుష్ర్పభావం చూపుతాయి. ఒక్కోసారి నొప్పి నివారణ మందులు పిండంపై చూపే దుష్ర్పభావంతో ఉమ్మనీరు తగ్గిపోయి, అది కడుపులోనే చనిపోయే ప్రమాదమూ ఉంది. అందుకే డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి నొప్పి నివారణ మందులూ వాడకూడదు. నొప్పి నివారణ కోసం వాడే పైపూత మందులను సైతం వాడకూడదు.

ఒకవేళ నొప్పి మరీ ఎక్కువగా ఉంటే వేడినీళ్లతో కాపడం లేదా చన్నీళ్ల కాపడం (హాట్ వాటర్ ప్యాక్, కోల్డ్ వాటర్ ప్యాక్) పెట్టుకోవచ్చు. టాబ్లెట్ వేసుకుంటేగానీ తగ్గదనిపిస్తే సాధారణ పారాసిటమాల్ మాత్రను పరిమితంగా వాడవచ్చు. నొప్పి మరీ భరించలేకుండా ఉన్నప్పుడు ఒకసారి మీ డాక్టర్‌ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోండి. ఇది గర్భధారణకు సంబంధించిన (ప్రెగ్నెన్సీ రిలేటెడ్) నొప్పి కాదని నిర్ధారణ అయితే అప్పుడు ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు ‘లో బ్యాక్ స్ట్రెచ్’ వ్యాయామాలు చేయాలి. వీటితో మంచి ఉపశమనం ఉంటుంది.
 

No comments: