all

Tuesday, June 11, 2013

సర్వశ్రేయోభిలాషి నారదుడు

 

దైవాలజీ - నారదమహర్షి జయంత్యుత్సవాల సందర్భంగా...
దేవర్షులలో అగ్రగణ్యుడు నారద మహర్షి. విష్ణుమూర్తికి మనుమడు, బ్రహ్మకు మానసపుత్రుడు అయిన నారదుడు త్రిభువన సంచారియై, సృష్టి శ్రేయస్సుకు ఎన్నోసార్లు ప్రేరకుడై నిలిచాడు. విష్ణుభక్తుడైన నారదుడు నిరంతర హరినామామృతంతో ముల్లోకాల సంక్షేమాన్ని ఆకాంక్షించి, అందుకోసం అహరహం తపించిన మహనీయుడు. లోక కల్యాణం కోసం కలహభోజనుడు అనే అపవాదును భరించిన ఆ మహర్షి చరితం ఆసాంతం అద్భుతం.

నారద మహర్షి విష్ణుమాయను, మాహాత్మ్యాన్ని తెలుసుకున్న దేవర్షి, జ్ఞాని, వేదాంతి, విరాగి, బ్రహ్మజ్ఞుడు. సర్వశాస్త్రవేత్త అయిన నారదుడు హరినామ సంకీర్తన చేస్తూ, తన వీణా తంత్రులపై కూడా హరినామాన్ని పలికిస్తూ ఉంటే, ఆ శబ్ద మాధుర్యానికి యోగీంద్రులు సైతం పరవశించిపోయేవారు. ఆయన మెడ లో ధరించిన తులసిమాల సువాసనలు గగనాంతరాళం అంతా వ్యాపించిపోతాయట. నారదముని మనసావాచా కర్మణా హరినామ స్మరణలో, మధుర సంగీత కీర్తనలతో కాలజ్ఞుడు, మహాత్ముడు అయి సర్వలోక పూజ్యుడయ్యాడు.

వ్యాసభగవానుడికి మహాభారత రచనలో సహకరించి, భాగవత రచనకు ప్రేరణ ఇవ్వడంతోపాటు పురాణాల ఆవిష్కరణలో తన వంతు పాత్రను పోషించాడు. పలువురు రుషిపుంగవులకు సత్కార్యసాధనలో స్ఫూర్తినిచ్చిన బ్రహ్మజ్ఞానిగా చరిత్రలో సుస్థిరుడయ్యాడు నారదుడు. విష్ణుభక్తితో పావన జీవనాన్ని సృష్టించుకున్న నారదుడు సరస్వతిని సేవించి ఆమె కృపకు పాత్రుడై, సంగీత సాధన చేసుకుని మహతి అనే వీణను మీటుతూ సూర్యునిలా ముల్లోకాలూ సంచరిస్తాడు. వాయువులా సకల జీవుల్లో అంతర్యామిగా మెలుగుతుంటాడు.

నారదుడు తన తండ్రియైన బ్రహ్మదేవుని సమక్షంలో దేవతాగణాల మధ్య తన సంగీత పాండిత్య ప్రకర్షను ప్రదర్శించి దైవగణాలచే పూజలందుకున్నాడు. లోకాలన్నింటికీ విష్ణుగాన మాధుర్యాన్ని ఆనందరసంగా ధారపోశాడు. అజుడు బోధించిన విష్ణుభక్తినీ, ఉపదేశించిన అష్టాక్షరీ మంత్రాన్నీ సర్వస్వంగా మలుచుకున్న దివ్యరుషి నారదుడు.

నారద మహర్షి త్రిలోక సంచారం చేయడంలోని పరమార్థం ఏమిటంటే... దక్షుని పుత్రులకు వైరాగ్యాన్ని ఉపదేశించినందుకుగాను, దక్షుడు కోపంతో నారదుని ‘‘కలహ భోజనుడివై ఏ లోకంలోనూ ఉనికి లేక సంచరించు’’ అని శపిస్తాడు. సర్వసంగపరిత్యాగి, నిత్యయోగశాలి, సర్వశ్రేయోభిలాషి అయిన నారదుడు విష్ణుభక్తుడై మూడులోకాలూ సంచరించడం ప్రారంభించాడు. నిస్వార్థం తో, లోకశ్రేయస్సు లక్ష్యంతో జరిగే కార్యక్రమాలకు మూలహేతువుగా నిలుస్తూ కలహభోజనుడనే నిందను భరించాడు నారదుడు.

స్థూల సూక్ష్మరూపమైన ఈ శరీరం మాయాకల్పితమనీ, రజస్తమోగుణాలను పోగొట్టేది భక్తి మాత్రమేననీ అంటాడు నారదమహర్షి. ఓంకారపూర్వకంగా భగవంతుని నామాన్ని భక్తితో పలికి నమస్కరించి, దేవదేవునికి నిత్యపూజ చేసేవారికి ఆత్మదృష్టి కలుగుతుందని, అది తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని రుషిపుంగవులకే చెప్పిన తత్త్వజ్ఞుడాయన.

నారదమహర్షి భక్తి సూత్రాలను విస్తృతంగా ప్రచారం చేశాడు. అవే నారద భక్తిసూత్రాలు. వాటిని పారాయణ చేసి తరించిన వారెందరో ఉన్నారు. అత్యద్భుత మాధుర్యంగా, శ్రుతి జనకంగా నారద గాన రామాయణం లోకానికి అందించాడు. నారదస్మృతి, నారద శిల్పశాస్త్రము అనే గ్రంథాలు బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. విష్ణుసేవ వల్లనే మనశ్శాంతి, ఆత్మశాంతి కలుగుతా యని, అన్యధా అది అసాధ్యమని నారదుని సిద్ధాంతం. నారదుని దివ్యగాథ పరమపావనం, స్ఫూర్తిదాయకం. ఆత్మానంద భావనాప్రపంచం.

- ఇట్టేడు అర్కనందనాదేవి

**********

స్థూల సూక్ష్మరూపకమైన ఈ శరీరం మాయాకల్పితం అనీ, రజస్తమోగుణాలను పోగొట్టేది భక్తి మాత్రమే అంటాడు నారద మహర్షి. ఓంకారపూర్వకంగా భగవంతుని నామాన్ని భక్తితో పలికి నమస్కరించి, దేవదేవునికి నిత్యపూజ చేసేవారికి ఆత్మదృష్టి కలుగుతుందని, అది తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని రుషిపుంగవులకే చెప్పిన తత్త్వజ్ఞుడాయన.
 

No comments: