ఇంట్లో కాకుండా... ఇండస్ట్రీలో పెరిగి, స్టార్ అయిన నటుడు అలీ! అందుకేనేమో... వెయ్యి సినిమాల తర్వాత కూడా... అతడి కాలర్ ఎక్కడా ఎగర్లేదు. అతడి కళ్లు ఎక్కడికీ ఎక్కలేదు. ‘మనిషి మార్లేదు’ అనిపించుకోవడంఅలీకి గొప్ప, అదొక అవార్డు. ‘టైలర్ కొడుకుని’ అని చెప్పుకోవడం ఇంకా గొప్ప, గౌరవం! సినిమాల్లో కమెడియన్‌గా... నిజజీవితంలో హీరోగా... అలరిస్తూ, ఆదరిస్తున్న అలీ ‘స్టారిస్ట్రీ’ ఈవారం మీ కోసం... ముందు ఆ ‘కాట్రే’, ‘కాట్రవల్లి’ అంటే ఏంటో చెప్పండి? అలీ: ఏమీ లేదండీ.. ఓ అందమైన అమ్మాయి కనిపించిందనుకోండీ... ‘అరేయ్ అమ్మాయి బావుందిరా’ అంటే కిక్ ఉండదు. అదే ‘అరేయ్ కాట్రే కత్తిలా ఉందిరా..’ అన్నామనుకో సౌండ్ బావుంటది. మీ నోటి వెంట వస్తే ఆ సౌండ్ ఇంకా బావుంటుంది. ఓ రకమైన టైమింగ్‌తో చెబుతారు... అలీ: ఆర్టిస్టులం కదండీ... మరో విషయం ఏంటంటే... నేననే ఏ పదమైనా.. తర్వాత ఏదో ఒక భాషలో ఉండి ఉంటుంది. అది నిజంగా యాదృచ్ఛికమే. చాటగాడు, కాట్రేగాడు, లచ్చిమీ... ఇలా రకరకాల పేర్లతో జనాలు మిమ్మల్ని పిలుస్తుంటారు. ఎప్పుడన్నా బాధ అనిపించిందా? అలీ: బాధ దేనికి? ఆనందించాల్సిన విషయమది. ఎన్టీఆర్ లాంటి మహానటుణ్ణే జనాలు ‘ఎన్టీవోడు’ అని పిలుస్తుంటారు. ఓన్ చేసుకునే క్రమంలో వాళ్లు అలా పిలుస్తారన్నమాట. ఉదాహరణకు మల్లికార్జునరావుగారినే తీసుకోండి. అప్పుడెప్పుడో ‘లేడీస్ టైలర్’లో బట్టల సత్యం పాత్ర చేశారాయన. అప్పటినుంచి ఆయన చనిపోయేదాకా జనాలు ఆయన్ను బట్టల సత్తిగాడు అనే పిలిచారు. ఈ ‘గాడు’ అనే పదంతో జనాలు పిలవడం మొదలుపెట్టారంటే...ఆ నటుణ్ని ప్రేక్షకులు సొంతం చేసుకున్నారనే కదా అర్థం! ఈ క్రెడిట్ తక్కువ మంది ఆర్టిస్టులకొస్తుంది. ఎన్టీఆర్‌ని ఎన్టీవోడు అని, ఏఎన్నార్‌ని నాగ్గాడు అని, కృష్ణగారిని కిట్టిగాడు, సత్యనారాయణగారిని సత్తిగాడనీ ఇష్టంతో పిలుచుకుంటుంటారు. నన్ను చాలామంది ‘చాటగాడు’ అంటారు. ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’లో నేను చేసిన పాత్ర అది. ఇంకా దాన్ని గుర్తు పెట్టుకొని పిలుస్తున్నారంటే... అది ఆనందమే కదా! యాక్టర్ అలీ కాస్తా డాక్టర్ అలీ అవ్వడం ఎలాంటి అనుభూతిస్తోంది? అలీ: గుర్తింపు లభిస్తే ఎవరికైనా ఆనందమే కదా... అయితే, 35ఏళ్లు నా నటప్రస్థానాన్ని దృష్టిలో పెట్టుకునో, లేక వెయ్యికి పైగా చిత్రాల్లో నటించాననో నాకు ఈ డాక్టరేట్ రాలేదు. నా తండ్రి పేరున అయిదేళ్ల క్రితం ఓ ట్రస్ట్ పెట్టాను. దాని పేరు ‘అహ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్’. ఆ ట్రస్ట్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. వాటిని గుర్తించి ‘హ్యుమేనిటీ డాక్టరేట్’ పేరిట ఐక్యరాజ్యసమితి వారు నన్ను ఈ డాక్టరేట్‌కి నన్ను ఎంపిక చేశారు. అందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ ట్రస్ట్ ద్వారా మీరు నిర్వర్తించిన సేవా కార్యక్రమాల గురించి వివరిస్తారా? అలీ: రాజమండ్రి చుట్టుపక్కల ఊళ్లల్లో ఉండే వికలాంగులకు వీల్ చైర్లు అందించాము. వితంతు స్త్రీల ఉపాధి కోసం కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్నాము. పేద విద్యార్థుల చదువుకు కావాల్సిన మొత్తాన్ని అందించడం, వ్యాధిగ్రస్థులైన పిల్లలకు ఓ ఏడాదిపాటు మందుల ఖర్చు భరించడం లాంటి కార్యక్రమాలను చేపడుతున్నాము. పిల్లలు వదిలేసిన ఓ 20మంది వృద్ధులకు నెలకు రూ. 500 చొప్పున పెన్షన్ అందిస్తున్నాము. వాళ్లు చనిపోతే... అంత్యక్రియలకయ్యే ఖర్చు కూడా మేమే భరిస్తున్నాము. ట్రస్ట్ పెట్టాలని మీకెందుకనిపించింది? అలీ: రాజమండ్రిలో నేను చూసిన కొన్ని పరిస్థితులు నాతో ట్రస్ట్ పెట్టించాయి. రాజమండ్రి జైలు గురించి మీరు వినే ఉంటారు. రాష్ట్రంలోని పెద్ద కారాగారాల్లో అది కూడా ఒకటి. ఆ జైలు ఉన్న వీధిని ‘జైల్‌రోడ్’ అంటారు. అక్కడకు రాష్ట్రం నలుమూల నుంచీ జనాలు వచ్చి వెళుతుంటారు. జైలును చూడ్డానికి కాదు. జైల్లో ఉన్న తమ వాళ్లను కలుసుకోడానికి. అక్కడ శిక్ష అనుభవిస్తున్న ఆ ఖైదీల భార్యలు తమ పిల్లలతో అక్కడికొస్తుంటారు. మండుటెండలో బిడ్డల్ని తీసుకొని భర్తల కోసం ఎదురుచూస్తుంటారు. ఆ పరిస్థితుల్లో వారికి తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా అక్కడ దొరకవు. ఇక పిల్లలైతే దాహంతో అల్లాడిపోవడమే. చిన్నప్పట్నుంచీ వాటన్నింటినీ చూస్తూ ఉండేవాణ్ణి. కానీ అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. నేను నటునిగా బిజీ అయ్యాక ఓ ఆరేళ్ల క్రితం ఆ వీధికి వెళ్లాను. అప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం మార్పులేదు. ఇప్పుడు ఏదైనా చేసే స్తోమత నాకుంది. ఏం చేస్తే బావుంటుంది అని ఆలోచించాను. అప్పుడే... ఆ రోడ్‌లో మా నాన్నగారి పేరిట తాగునీటి సదుపాయం కల్పించాలని నిర్ణయించుకున్నాను. లక్ష రూపాయలు వెచ్చించి మద్రాసు నుంచి ఓ వాటర్ కూలింగ్ మిషన్ తెప్పించాను. అదే రోడ్‌లో ఓ దర్గా ఉంది. అది రోడ్‌కి అడ్డంగా ఉండటం వల్ల వచ్చేపోయే వాహనాలకు ఇబ్బందిగా ఉండేది. పైగా యాక్సిడెంట్లు జరుగుతుండేవి. అందుకని ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని ఆ దర్గాను అక్కడ్నుంచీ తొలగించి, రోడ్‌కి ఓ పక్కన మళ్లీ కొత్తగా దర్గాను కట్టించాను. ఆ దర్గా పక్కనే ఈ మిషన్ పెట్టించాను. వాటర్ కోసం ఓ మోటర్ కూడా అక్కడ అమర్చాను. ఇవన్నీ చేయడానికి ఓ రెండు లక్షల వరకూ ఖర్చయింది. ఇక అప్పట్నుంచీ ఆ వీధిలో వచ్చేపోయే వారందరూ ఆగిమరీ నీళ్లు తాగుతుంటే... ఆ క్షణంలో నాకు కలిగిన సంతృప్తి మాటల్లో చెప్పలేను. ఆ వీధిలోనే ఓ ప్లే గ్రౌండ్ ఉంది. అక్కడ ఆడుకునే పిల్లలు కూడా అక్కడే నీళ్లు తాగుతున్నారు. ఇవన్నీ నాకు చెప్పలేనంత సంతోషాన్ని, ఆత్మసంతృప్తిని అందించాయి. ఆ క్షణంలో నా మనసులో మొలకెత్తిన ఆలోచనే ‘ట్రస్ట్’! ఎవరి సహాయాన్నీ తీసుకోకుండా నా సొంత డబ్బుతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశాను. ఆ ట్రస్ట్ పెట్టిన రెండోరోజే నాకు అబ్బాయి పుట్టాడు. మా నాన్నే పుట్టాడనిపించింది. అప్పట్నుంచీ ఆ ట్రస్ట్ నాకు ఓ సెంటిమెంట్‌గా మారింది. ఇక నిరవధికంగా ఆ ట్రస్ట్ ద్వారా సేవాకార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాను. మీ నాన్నతో మీకున్న అనుబంధం..? అలీ: నాన్న అప్పుడప్పుడు నా కోసం మద్రాసు వస్తుండేవారు. వచ్చిన ప్రతిసారీ ‘ఏరా.. ఏమైనా తింటావా?’ అని అడిగేవారు. నిజానికి ఆ మాట నేనడగాలి. కానీ ఆయనే అడిగేవారు. దాన్నిబట్టి ఆయనేంటో అర్థం చేసుకోండి. నాన్న అసలు పేరు అబ్దుల్ సుభాన్. అందరూ మహ్మద్ బాషా అని పిలిచేవారు. మా సొంత ఊరు మచిలీపట్నం. మా నాన్నగారి మేనమామకు పిల్లలు లేకపోవడంతో ఆయన ఆస్తి కూడా నాన్నకే రాశారు. దాంతో బంధువులతోనే గొడవలు మొదలయ్యాయి. ఇక అక్కడ ఉండలేక, యావదాస్తినీ వదిలి కట్టుబట్టలతో రాజమండ్రి చేరుకున్నారు నాన్న. అక్కడ అద్దెకు ఓ కుట్టుమిషన్ తీసుకొని జీవితం ప్రారంభించారు. అహరహం శ్రమించి, దినదిన ప్రవర్ధమానంగా ఎదిగారు. చివరకు ఓ పది మిషన్లను కొని రాజమండ్రి కోటగుమ్మం సెంటర్‌లో ఓ షాపు పెట్టారు. ఓ టైలర్ కొడుకునని చెప్పుకోవడానికి ఇప్పటికీ గర్విస్తాను. చదువుకోవాల్సిన వయసులో సినిమాల్లోకి వెళతానంటే మీ నాన్నగారు మిమ్మల్ని ఏమీ అనలేదా? అలీ: సినిమాల్లోకి వెళ్తానని నేనెప్పుడూ ఆయన్ను అడగలేదు. అది అనుకోకుండా జరిగిపోయింది. నాకు ఫస్ట్‌నుంచీ చదువు మీద ఇంట్రస్ట్ ఉండేది కాదు. ఈ కారణంగా నాన్న ఎప్పుడూ బాధపడుతుండేవారు. ఓరోజు ‘టైలరింగ్ నేర్చుకుంటావా?’ అనడిగారు. ఇంట్రస్ట్ లేదని చెప్పాను. ‘మరి నీ ఇంట్రస్ట్ దేనిమీద’ అనడిగారు. ‘నేను మిమిక్రీ చేస్తా..’ అని చెప్పాను. ఎందుకంటే నాకు చిన్నప్పట్నుంచీ ‘షోలే’ సినిమా అంటే ప్రాణం. ఆ సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు. అందులోని డైలాగులు, పాటలు, రీ-రికార్డింగ్ అన్నీ మిక్స్ చేసి సినిమా మొత్తం చెప్పేస్తా. అలా ‘షోలే’లోని గబ్బర్‌సింగ్ డైలాగులు చెబుతుండేవాణ్ణి. అది గ్రహించిన నాన్న వెంటనే నన్ను మా గురువుగారైన శ్రీపాద జిత్మోహన్ మిత్రాగారి వద్ద చేర్పించారు. మిత్రాగారు తమ ప్రోగ్రామ్స్ మధ్యలో నా మిమిక్రీ షోను ఏర్పాటు చేస్తూ ఉండేవారు. మరి సినిమాల్లోకెలా వచ్చారు? అలీ: ఓరోజు నా మిమిక్రీ షోని కె.విశ్వనాథ్‌గారు చూడ్డం జరిగింది. ‘ఏరా సినిమాల్లో చేస్తావా..’ అనడిగారు. చేస్తానని చెప్పేశా. అంతే... ఆయన బస చేసిన హోటల్‌కి రమ్మన్నారు. వెళ్లాను. అక్కడ రమాప్రభగారు, గోకిన రామారావుగారు, కవిత.. ఇలా ఇంకొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్లందరి ముందు నా కేరక్టర్‌ని ‘ఓకే’ చేశారు విశ్వనాథ్‌గారు. అందులో నాది రమాప్రభ కొడుకు వేషం. సాక్షి రంగారావుగారు నన్ను ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు. ఆ సినిమానే ‘ప్రెసిడెంట్ పేరమ్మ’. ఇక రెండో సినిమా విజయలలితగారు నిర్మించిన ‘దేవుడు మామయ్య’. ఆ సినిమా ద్వారా సావిత్రి, వాణిశ్రీ, ఛాయాదేవి, జగ్గయ్య, శోభన్‌బాబు, పద్మనాభం లాంటి లెజండ్లతో నటించే అవకాశం దొరికింది. ఆ తర్వాత నిండునూరేళ్లు, నిప్పులాంటి నిజం, ఘరానాదొంగ సినిమాల్లో నటించాను. వాటిల్లో నా చలాకీతనం ఏడిద నాగేశ్వరరావుగారికి బాగా నచ్చింది. అప్పుడాయన ‘సీతాకోకచిలుక’ చిత్రాన్ని నిర్మించే పనిలో ఉన్నారు. అందులో నేను చేసిన ‘బాబాయి’ పాత్రకు మొదట వేరొకర్ని తీసుకున్నారు. కానీ ఆ కుర్రాడెందుకో ఏడిద నాగేశ్వరరావుగారికి నచ్చలేదు. దాంతో నాగేశ్వరరావుగారు నా గురించి భారతీరాజాకు చెప్పారు. వెంటనే తీసుకురమ్మన్నారాయన. నన్ను వెంటబెట్టుకొని మద్రాస్ పాంగ్రో హోటల్‌కి తీసుకెళ్లారు నాగేశ్వరరావుగారు. భారతీరాజాగారికి తెలుగు రాదు. నాకేమో తమిళం రాదు. ఆయన తమిళంలో ‘నీకేం వచ్చు’ అనడిగారు. నాకు అర్థం కాక ఏడిద నాగేశ్వరరావుగారి మొహం వంక చూశా. ‘నీకు ఏమొచ్చు’ అనడుగుతున్నారని చెప్పారాయన. ‘ఆయనకు ఏం కావాలో అడగండి’ అన్నా. అంతే... అందరూ షాక్! భారతీరాజా గారికి తెగ నచ్చేశాన్నేను. ‘ఏదడిగినా ఇచ్చేస్తావురా?’ అంటూ నవ్వుతూ భుజం తట్టారు. అలా ‘సీతాకోకచిలుక’లో నా పాత్ర సెట్ అయ్యింది. జంధ్యాలగారికి బెజవాడ బాబాయ్ హోటల్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఈ బాబాయ్ పాత్ర సృష్టించారాయన. ఆంధ్రప్రదేశ్ అంతా ఆ సినిమా విడుదలయ్యాక నన్ను చూసి బాబాయ్... బాబాయ్.. అనడం మొదలెట్టారు. ఇప్పటికీ నన్ను ‘బాబాయ్’ అనేవాళ్లు ఉన్నారు. నటునిగా నాకు ఫస్ట్ బ్రేక్ అది. దాంతో ఒక్కసారే సెలబ్రిటీని అయిపోయా! షూటింగ్‌లో భారతీరాజా మిమ్మల్ని కొట్టారంటగా? అలీ: చావబాదారు! క్లైమాక్స్‌లో అందరం సీరియస్‌గా ఉండాలి. కానీ ఎవరో జోక్ వేసేసరికి అందరం నవ్వుతున్నాం. ఇంతలో భారతీరాజా ‘స్టార్ట్... కెమెరా ... యాక్షన్’ అన్నారు. మా మొహాల్లో నవ్వు మాత్రం పోలేదు. ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. కాసేపు ఆగమని కెమెరామన్‌కి చెప్పి మా దగ్గరకొచ్చాడు. సీన్ చెప్పడానికేమో అనుకున్నాం. కానీ రావడం రావడం అందరినీ తలా ఓ దెబ్బ వేశారు. నన్నుమాత్రం రెండు ఎక్కువ పీకారు. అందరిలో చిన్నోణ్ణి. చక్కగా చేతికి అమిరినట్టున్నాను... దాంతో వీపు పగలగొట్టారు. ఇక పక్కకెళ్లి ఏడవడం మొదలుపెట్టా. ఏడిద నాగేశ్వరరావుగారు చూసి ‘ఏంటిరా... ఎందుకు ఏడుస్తున్నావ్’ అనడిగారు. ‘మా నాన్నే నన్నెప్పుడూ కొట్టలేదండీ... ఈనెవరండీ నన్ను కొట్టడానికీ...’ అన్నా ఏడుస్తూ. ‘లేదులేరా ఏడవకు’ అని సముదాయించబోయారు. ‘లేదండీ.. అందరికీ తలా దెబ్బేసి నన్ను మాత్రం చావబాదాడు.. ఇదేం న్యాయం...’ అన్నాను వెక్కుతూ. ‘సర్లే ఇంకెప్పుడూ ఎవరూ కొట్టర్లే...’ అంటూ చేతిలో ఓ రెండొందలు పెట్టారు. దాంతో ఠక్కున ఏడుపు ఆపా! పసివయసులోనే ఈ రంగంలోకొచ్చారు. కె.విశ్వనాథ్, రాఘవేంద్రరావు, ఏడిద నాగేశ్వరరావు, భారతీరాజా... వీళ్లందరి ముందూ ఇప్పుడు మీరు స్టార్‌గా వెలుగుతుంటే... మీ ఫీలింగ్ ..? అలీ: చాలా గర్వంగా ఉంటుంది. ఓ వ్యక్తి బాల్యాన్నీ, ఎదుగుదలనీ చూసేది అమ్మానాన్నలే. కానీ పరిశ్రమలో చాలామంది నా బాల్యాన్నీ, ఎదుగుదలనీ చూశారు. అందుకే వీళ్లందరూ నాకు తల్లిదండ్రులతో సమానం. ‘అలీ అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉంటాడయ్యా...’ అని అందరూ అంటుంటే ఎంతో తృప్తిగా ఉంటుంది. ‘యమలీల’ లాంటి హిట్ కొట్టిన తర్వాత కూడా మళ్లీ హీరోగా ఎందుకు నెగ్గుకు రాలేకపోయారు? అలీ: ‘యమలీల’ లాటరీ. ప్రతిసారీ అలాంటి సినిమాలు రావుగా! వస్తే నాకంటే హీరో ఎవరూ ఉండరు. అయినా హీరోగా నాకు మంచి హిట్లే ఉన్నాయి. ఘటోత్కచుడు, పిట్టలదొర, హంగామా.. కూడా వందరోజులాడినవే. నిజం చెప్పాలంటే... హీరోగా ఎదగాలని నేనెప్పుడూ అనుకోలేదు. ‘యమలీల’ సినిమాను కృష్ణారెడ్డిగారు మీకోసమే తయారు చేశారా? అలీ: కాదు, మహేష్‌బాబుగారికోసం! కృష్ణారెడ్డిగారే నాకు ఆ విషయం చెప్పారు. ‘నంబర్‌వన్’ సినిమా టైమ్‌లో కృష్ణగారు, కృష్ణారెడ్డిగారూ చెన్నయ్ నుంచి ఫ్లయిట్‌లో హైదరాబాద్ వస్తున్నారు. అప్పుడు ఒక్కగంటలో కృష్ణగారికి యమలీల కథ చెప్పారట కృష్ణారెడ్డి. అయితే అప్పుడు మహేష్ చదువుకుంటున్నారు. దాంతో ఓ మూడేళ్ల తర్వాత చేద్దామని కృష్ణ చెప్పారట. అన్ని రోజులు ఆగడం కృష్ణారెడ్డిగారికి ఇష్టంలేదు. అప్పుడే ఆయన మనసులో నేను మెదిలానట. అలీ బాగా డాన్స్ చేస్తున్నాడు. నటనలో కూడా తనకు మంచి ఈజ్ ఉంది. తననెందుకు హీరోను చేయకూడదు అనుకున్నారట. వెంటనే నన్ను పిలిపించారు. పది వేలు అడ్వాన్స్ ఇచ్చారు. మా సినిమాలో నువ్వే హీరో అన్నారు. నాకు నోటి వెంట మాట రాలేదు. రాజకీయాలకు బలైపోయిన హాస్యనటులు సినీపరిశ్రమలో చాలామంది ఉన్నారు. కానీ అవతలి వ్యక్తి ఎంత మోనార్కయినా... అలీని మాత్రం ఏమీ చేయలేడు. ఇండస్ట్రీలో అలీ రేంజ్ అది అని కొందరి అభిప్రాయం... మీరేం అంటారు? అలీ: నా పని నేను చేసుకుపోతాను. ఎదుటివాళ్ల విషయాల్లో వేలు పెట్టడం నాకు తెలీదు. సాధ్యమైనంతవరకూ అందరికీ మంచి చెప్పాలనే చూస్తాను. ఎందుకంటే నా 35ఏళ్ల సినీజీవితంలో చాలా చూశాన్నేను. సముద్రంలో నీటిబొట్టు లాంటిది ఆర్టిస్ట్ జీవితం. ఇప్పుడున్న హోదాలు రేపు ఉంటాయని చెప్పలేం. ఖరీదైన కార్లల్లో తిరుగుతూ ఓ రేంజ్ స్టార్‌డమ్‌ని అనుభవించిన హరనాథ్‌గారు, సిటీబస్‌కోసం బస్‌స్టాప్‌లో పడిగాపులు గాయడం చూశాన్నేను. అందుకే హంగులు, ఆర్భాటాలు, రాజకీయాలు ఇవేమీ పట్టించుకోను. ఇప్పుడున్న కమెడియన్స్‌లో దాదాపు అందరూ నాకంటే జూనియర్లే. కానీ నాకంటే వయసులో పెద్దవారైతే ఎవరు నా ముందుకొచ్చినా.. లేచి కుర్చీ ఇస్తాను. ఎంత మంచిగా ఉన్నా, ఎంత పద్ధతిగా వెళుతున్నా గిల్లి మరీ మన సహనాన్ని పరీక్షించేవారు, ముందుకెళ్లనీయకుండా వెనక్కు నెట్టేవాళ్లు కూడా కొందరు ఉంటారుగా? అలీ: ఎందుకుండరు? ఉంటారు. కానీ అలాంటివాళ్లను నేను ఎంటర్‌టైన్ చేయను. అయితే... నాలో ఇంకో కోణం కూడా ఉంది. నేను ఎవరిజోలికీ వెళ్లను. ఒకవేళ నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం పరిస్థితి డిఫరెంట్‌గా ఉంటుంది. నాలో కమెడియన్ అలీ గురించే అందరికీ తెలుసు. తెలీని అలీ ఇంకొకడు ఉన్నాడు. అది రెండో అవతారం. అది చూస్తే తట్టుకోలేరు (డ్రమటిక్‌గా) అంటే అలీలో సీరియస్ యాంగిల్ కూడా ఉందా? అలీ: అది ఎవరికీ తెలీని యాంగిల్. అప్పుడప్పుడు ఆ యాంగిల్ పరభాషా నటుల విషయంలో బయటకొస్తుంటుంది. అలీ: వాళ్ల జీవితాలు ఎలా ఉంటాయో ముంబయ్‌లో కళ్లతో చూసిన వాణ్ణి. ఇక్కడికొచ్చి బిల్డప్పులిస్తే... కాలదా మరి! మీరూ పరభాషల్లో నటించారు కదా? అలీ: ఇక్కడ నా రేంజ్ ఏంటి? చెప్పండీ? ఇండస్ట్రీ అంతా గౌరవించే స్టేజ్‌లో నేను ఉన్నా. చైల్డ్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా, కేరక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఎన్నోరకాల పాత్రల్లో నటించాను. అలాంటి నేను పరభాషలో నటించడానికి వెళ్లినప్పుడు అవతలివారు గౌరవం ఇవ్వాలి. నేను గతి లేక ఆ భాషలో నటించడానికి వెళ్లలేదు. నా పరిశ్రమలో ఊపిరాడకుండా సినిమాలు చేస్తున్నాన్నేను. వాళ్లు బతిమాలితే వెళ్లాను. కాబట్టి వాళ్లు బాగా చూసుకోవాలి. ఆర్టిస్టు రేంజ్‌ని బట్టి బస ఉంటుంది. కానీ మన తెలుగు పరిశ్రమలో పరిస్థితి అలా లేదు. ముంబయ్‌లో ఏమీ లేని వ్యక్తి ఇక్కడకొచ్చి తాజ్ బంజారాలో సూట్ కావాలి అంటాడు. తెలుగులో ఒక్క డైలాగు కూడా చెప్పలేడు. కానీ మధ్యాహ్నం మెనూ మాత్రం ఓ రేంజ్‌లో చెబుతాడు. నాకు మండేది అక్కడే. ఈ విషయంలో కోటాగారైతే అస్సలు క్షమించరు. ఓసారి దేవ్‌గిల్‌ని పట్టుకొని మోహంమీదే అనేశారు.. ‘నీ పేరేమో దేవ్‌గిల్. యాక్టింగ్‌లో నిల్’ అని! మరి హీరోయిన్లంటే ఎందుకు మీకు కోపం? సినిమా ఫంక్షన్లలో వాళ్లపై తెగ సెటైర్లు వేస్తుంటారు? అలీ: ఒక్క సినిమాకు లక్షల్లో తీసుకుంటుంటారు వాళ్లు. నిర్మాతలసొమ్ముతో స్టార్‌హోటళ్లలో లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. తెలుగు సినిమా పుణ్యమా అని స్టార్ స్టేటస్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ‘మా’లో సభ్యత్వం మాత్రం తీసుకోరు. స్టార్ హీరోయిన్లను పక్కన పెట్టండి. కొత్తగా వచ్చే అమ్మాయిలక్కూడా స్టార్‌హోటళ్లలోనే ఎకామడేషన్ కావాలి. దీని వల్ల నిర్మాతలపై ఎంత భారం పడుతుంది... చెప్పండి? నువ్వు కరీనాకపూర్‌వి అయితే... నిన్ను పువ్వుల్లో పెట్ట్టుకొని చూసుకోవచ్చు. లగ్జరీ అంటే ఏంటో చూపించొచ్చు. ఎందుకంటే ఆమె చేస్తే సినిమాకు హెల్ప్ కాబట్టి. అసలు ఏమాత్రం ఇమేజ్ కానీ, టాలెంట్‌కానీ లేని ఇలాంటి వాళ్లకు స్టార్‌హోటళ్లలో ఎందుకు బస ఏర్పాటు చేయాలి. నాకు వాళ్లపై వేరే ఉద్దేశం ఏమీ లేదు. వాళ్ల యాటిట్యూడ్ చూస్తేనే కోపమొస్తుంటుంది. ఇక్కడ షూటింగ్ ఉన్నన్ని రోజులూ ఇన్నోవా దిగరు. అలాంటివాళ్లు షూటింగ్ అయిపోయి ముంబయ్ ఏర్‌పోర్ట్‌లో దిగగానే... బయటకొచ్చి ‘ఆటో...’ అని పిలుస్తారు. అక్కడే నాకు మండేది. ‘లచ్చిమీ...’ పాత్రను అంతబాగా ఎలా చేయగలిగారు? అలాంటి వాళ్లు నిజజీవితంలో తారసపడ్డారా ఏంటి? అలీ: విషయం ఏంటంటే... బ్యాంకాక్‌లో ఆడాళ్లుగా మారిపోయిన మగాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లే ఆ పాత్రకు స్ఫూర్తి. ఈ మధ్య నా ఫ్యామిలీతో ఓ మూడు రోజులు బ్యాంకాక్ టూర్ వెళ్లాను. అక్కడకెళ్లగానే... అందరూ ‘మిస్టర్... మసా..జ్’ అంటూ పలకరించడం మొదలుపెట్టారు. మొన్నామధ్య ఫ్లైట్‌లో వెళుతుంటే... ఓ 80 ఏళ్ల ముసలావిడ నన్ను చూసి ‘లచ్చిమీ... లచ్చిమీ... బాగున్నారా..’ అంటూ నవ్వేసింది. నేను షాక్ అయ్యాను. అంటే ఆ పాత్ర ఎంత పాపులరయ్యిందో అర్థం చేసుకోండి! మనలో మనమాట... ఎప్పుడైనా మసాజ్ చేయించుకున్నారా? అలీ: నా కాపురంలో నిప్పులు పోయడానికే వచ్చినట్టున్నారు మీరు (నవ్వుతూ). మసాజ్‌లు చాలా రకాలుంటాయి. మీరు అడిగేది ఏ రకం మసాజ్. ఆ రకాలు మాకేం తెలుస్తాయండీ... మీకే తెలియాలి! అలీ: నేను అలాంటి మనిషిని కాదు. మీకు తెలీని విషయం ఏంటంటే... థాయ్ మసాజ్ అనేది ఓ గొప్ప మెడిసన్. దాన్ని పవిత్రంగా భావిస్తారు వాళ్లు. మనం వెళ్లగానే.. మన ప్యాంట్‌ని మోకాళ్ల దాకా వాళ్లే మడిచి, ఆ కాళ్లకు ముందు నమస్కారం చేసుకొని అప్పుడు కాళ్లకు మసాజ్ చేస్తారు. మసాజ్ చేయించుకునే వ్యక్తి యువకుడా, వృద్ధుడా, రోగగ్రస్థుడా ఇవేమీ వాళ్లు పట్టించుకోరు. వారి బాధ్యతను వారు నిర్వర్తిస్తారు అంతే. ఈవీవీ సత్యనారాయణగారి ‘ఎవడిగోల వాడిది’ సినిమా షూటింగ్‌కి బ్యాంకాక్ వెళ్లినప్పుడు నేనూ, బ్రహ్మానందంగారు కలిసి తొలిసారి మసాజ్ చేయించుకున్నాం. అప్పుడు మేం వాళ్లకిచ్చింది రెండొందల రూపాయలే. అదే మసాజ్ ఇక్కడ చేయించుకోవాలంటే... మూడు వేల రూపాయలవుతుంది. ఎంతోమందికి మీరు అభిమాన నటులు. మరి మీ అభిమాన నటుడెవరు? అలీ: ఎన్టీఆర్‌గారు! చిన్నప్పుడు ఆయన సినిమాలంటే వదలకుండా చూసేవాణ్ణి. సినిమాలపై అభిమానం కలగడానికి కారణం ఆయనే. కానీ నేను నటుణ్ణి అయ్యాక ఆయనతో ఒక్కసారి కూడా పనిచేయలేకపోయాను. అది తీరని బాధగా మిగిలిపోయింది. అయితే... ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటైమ్‌లో ఆయన చేతుల మీదుగా నంది అవార్డును అందుకున్నాను. అది మాత్రం నా జీవితంలో మరచిపోలేని సంఘటన. ఆ మధ్య రాజకీయాల్లో కూడా మీ పేరు వినిపించింది. మీరు ఫలానా పార్టీలో చేరారనీ... అలీ: అదంతా మీడియా పుట్టించిన పుకార్లే తప్ప, నేను ఏ పార్టీలో చేరలేదు. అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు. ఒకవేళ సేవాకార్యక్రమాలు విస్తృతం చేయాలనిపిస్తే అప్పుడు ఆలోచిస్తా. అది కూడా నన్ను పిలిచిన పార్టీలోకి నేను వెళతాను కానీ, నేనెళ్లి ఏ పార్టీవారినీ నేను చేరతానని అడగను! - సంభాషణ: బుర్రా నరసింహ తెరపై మీ కామెడీ చూసి మీ మిసెస్ ఎలా ఫీలవుతారు? అలీ: తన ఫేవరెట్ హీరో నేనే. నా సినిమాలు మళ్లీ మళ్లీ చూస్తుంటుంది. నా కామెడీని బాగా ఎంజాయ్ చేస్తుంది. 1993లో నా పెళ్లయ్యింది. కమెడియన్ అలీని చేసుకోబోతున్నాను అని తెలియగానే ఎంతో సంతోషపడిపోయిందట. తన పేరు జుబేదా. నన్ను మా అమ్మలాగే చూసుకుంటుంది. నేను, పిల్లలు తప్ప తనకు వేరే ప్రపంచం తెలీదు. మాకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి పేరు ఫాతిమా, అబ్బాయి పేరు అబ్దుల్ సుభాన్. మా నాన్నపేరే వాడికి పెట్టుకున్నాను. చిన్నపాప పేరు జుబేరియా. కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తాన్నేను. చిన్నవయసులో ఫ్యామిలీని వదిలిపెట్టి చెన్నయ్ వెళ్లిపోయా. పదహారేళ్లపాటు ‘నా’ అనేవాళ్లకు దూరంగా బతికా. అందుకే ఇప్పుడు కుటుంబాన్ని వదిలి ఉండలేకపోతున్నాను. మీ తమ్ముడి గురించి... నా తమ్ముడు ఖయ్యూమ్ కూడా నటునిగానే కొనసాగుతున్నాడు. అయితే వాడికి మంచి బ్రేక్ వస్తుందని ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు వాణ్ణి అందరూ అలీ తమ్ముడు అంటున్నారు. రేపు నన్ను ‘ఖయ్యూమ్ అన్న’ అని పిలవాలి. ఆ రోజు తప్పకుండా వస్తుందని నా నమ్మకం. మీరూ, పవన్‌కల్యాణ్ క్లోజ్ ఫ్రెండ్సని తెలిసింది. మీ ఇద్దరి స్నేహబంధం ఎలా మొదలైంది? అలీ: ‘గోకులంలో సీత’ నుంచీ మా స్నేహం కంటిన్యూ అవుతోంది. నేను చూసిన అతి మంచిమనుషుల్లో పవన్ ఒకరు. చాలా తక్కువమందితో స్నేహం చేస్తారు. వారిలో నేనూ ఒకణ్ణి. ఎలాంటి నేపథ్యం లేకుండా కష్టపడి నేను ఎదిగిన తీరు పవన్‌కి ఇష్టం. అందుకే నన్ను అభిమానిస్తాడాయన. ఇన్నాళ్ల మా స్నేహంలో పవన్ ఒక వ్యక్తిని విమర్శించడం కానీ, ఒకర్ని తప్పుగా మాట్లాడటం కానీ నేను వినలేదు. మేం జోకులేస్తుంటే నవ్వుతాడు తప్ప, తను మాత్రం పెదవి విప్పడు. అంత సంస్కారవంతుడు తను. ********* ఇండస్ట్రీలో కాస్త పేరు ప్రఖ్యాతులు రాగానే... కొందరు కాలర్ ఎగరేస్తారు. ‘ఏంటమ్మా...’ అంటూ ఆకాశం వంక చూస్తూ మాట్లాడతారు. కానీ నాది ఆ తత్వం కాదు. నాకంటే చిన్నవాళ్లను కూడా గౌరవించడం నా తల్లిదండ్రులు నాకు చిన్నప్పుడే నేర్పారు. |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Tuesday, June 11, 2013
ఓ టైలర్ కొడుకునని చెప్పుకోవడానికి గర్విస్తాను!___________ అలీ !
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment