all

Tuesday, June 11, 2013

ఆలోచనే మహాభాగ్యం

 

యంగ్వేదం
బాత్రూమ్‌లో కూర్చున్నప్పుడో, బస్‌స్టాప్‌లో నిల్చున్నప్పుడో, పాటలు వింటూనో మీ బెడ్‌పై అటూ ఇటూ దొర్లుతున్నప్పుడో హఠాత్తుగా పడుతుందది. మీ ఒళ్ళంతా పాకి, మీ మెదడులో కూర్చుంటుంది. కళ్ళు మూసినా, తెరిచినా అదే గుర్తొస్తుంది. అదే మీ మెదడుని తొలిచేసే ఆలోచన!

మీకొచ్చే ఆలోచన పెద్దదయినా కావొచ్చు, చిన్నదయినా కావొచ్చు. కొత్తదవ్వొచ్చు లేదా మీకే చెత్త అనిపించొచ్చు. అలా అని దాన్ని పక్కన పడేయకండి. పాపం అది తట్టడానికి ఎన్ని కోట్ల నాడీకణాలు ఖర్చయ్యాయో! ఎంతటివారికైనా ఆలోచన అనేది, ‘నమస్కారం! నేను మీ ఆలోచన’ అని చెప్పిరాదు. ఎంతటి పెద్ద సంస్థని తీసుకున్నా, దాని వెనకున్న ఆలోచన ఏ ఖాళీ సమయాల్లోనో క్షణికావేశాల్లోనో పుట్టినవే.
‘‘అసలు మా ఆలోచన మాకే సిల్లీగా, హోప్‌లెస్‌గా అనిపించింది’’ అనుకుంటున్నారా?

సాధారణ ఆలోచన నుండి అసాధారణాలు సృష్టించడమే మేధావి లక్షణం.
- చార్లెస్ పెగరీ

‘‘ఈ ప్రపంచానికి మై స్పేస్, ఫ్రెండ్‌స్టర్‌ని మించినది కావాలి. మరీ వాటంత పెద్దది కాకపోయినా, కొంతమంది మేధావులు, బాగా చదివే విద్యార్థులకు మన సైట్‌లో ప్రవేశం ఉచితం అని పెడదాం ... మంచి పేరు వస్తే మొత్తం హావర్డ్ విద్యార్థులంతా చేరతారు’’ ఇవి Facebookని ఆరంభించే ముందు మార్క్ నోటి నుండి వచ్చిన మాటలు. ఈ ఆలోచన వచ్చినప్పుడు అతని మదిలో ఉన్న సంఖ్య ‘కొన్నివేలు’ మాత్రమే. కానీ ఇప్పుడు ఆ సంఖ్య కొన్ని బిలియన్లకి చేరింది.
‘‘మన ఆలోచనలో రిస్క్ ఫాక్టర్ ఎక్కువ అనిపిస్తోందా?’’

మీ ఆలోచనలో రిస్క్ లేకపోతే అది అసలు ఆలోచనే కాదు.
- ఆస్కార్ వైల్డ్

‘‘మనం పుస్తకాలని Onlineలోనే అమ్ముదాం. Online transaction అంటే చాలామంది భయపడతారు, కాని దీని ద్వారా వాళ్ళకి రవాణా ఖర్చు ఉండదు. పైగా తక్కువ శ్రమతో వారి పని అయిపోతుంది, ముందు మనం ముందడుగు వేద్దాం, అప్పుడు కొనేవారికి మన మీద నమ్మకం వస్తుంది’’ అనే మాటలతో పుట్టిందే ౌజ్ఛీ అమ్మకాల్లో ప్రభంజనం సృష్టించిన Amazon.com
‘‘మా ఆలోచనే అంత కొత్తది కాదు...’’ అని మొహమాటపడుతున్నారా?

ఆలోచింపచేయని కొత్త ఆలోచనల కన్నా, ఆసక్తి కలిగించే సాధారణ ఆలోచనలే ముందుకి వెళతాయి.
- మేరీ యాష్

‘‘ప్రపంచవ్యాప్తంగా 90% మంది కంప్యూటర్లలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఉంది. అయితేనేం... మనం దానికన్నా వేగంగా పనిచేసే బ్రౌజర్‌ని తయారు చేద్దాం’’ ప్రపంచంలోనే వేగవంతమైన బ్రౌజర్‌లలో ఒకటైన Mozilla Firefox వ్యవస్థాపకులైన బ్లేక్ రాస్, హెవిట్‌ల మాటలు వింటే ఒకింత ఆశ్చర్యంగానే ఉంటుంది.
‘‘మా ఆలోచన ఊహాజనితంగా ఉంది. ప్రాక్టికల్‌గా సాధ్యపడదేమో?’’ అని సందేహపడుతున్నారా...

విముక్తి పొందిన ఊహే ఆలోచన
- ఫ్రాంక్ లాయిడ్

‘‘నాసాయే చేయగలిగింది మనం చేయలేమా? రాకెట్ సైన్స్ ఏమీ పెద్ద విద్య కాదు’’ అని నాసానే చాలెంజ్ చేస్తూ SpaceX ని స్థాపించాడు ఎలాన్ మస్క్. అసలు ‘నాసా’లాంటిది ఇంకొకటి సాధ్యమా? అన్నవాళ్ల నోళ్లను మూయిస్తూ, ఆ ఊహాజనిత ఆలోచనే ఇప్పుడు రాకెట్లను తయారుచేసి, అంతరిక్షంలోకి ప్రయోగిస్తోంది.
‘‘మాకొచ్చిన ఆలోచనతో ఇప్పటికే మార్కెట్‌లో చాలా కంపెనీలు ఉన్నాయి’’ అని పెదవి విరవకండి.

కొత్తదైనా, పాతదైనా ఏదైనా ఆలోచన నుండే పుట్టాలి.
- ఎర్ల్ నైటింగేల్

‘‘మన కన్నా ముందు 19 సెర్చ్ ఇంజన్‌లు మార్కెట్ లో ఉన్నాయి. మనం ఒక పనిచేద్దాం. మన సెర్చ్ ఇంజన్‌లో యాడ్‌‌స చాలా తక్కువ పెడదాం. దాంతో వినియోగదారుల దృష్టి మరలకుండా వారికి కావలసింది వారు సులభంగా వెతుక్కోవచ్చు’’ ఇవి గూగుల్‌ని ప్రభవించేలా చేసిన ల్యారీ పేజ్ మాటలు అని వేరే చెప్పక్కర్లేదు.

ఇలా కాస్తంత సృజన, ఆశ, కసి తోడైతే చాలు, ప్రపంచాన్నే ఏలేయొచ్చు. ఏది ఏమైనా ఆలోచించడం ఆపవద్దు, ఎందుకంటే మిమ్మల్ని మిగతావారితో వేరు చేసేది మీ ఆలోచనే!

అరే.. కొత్త ఆలోచన ఏమైనా వచ్చిందా? వెంటనే చేతిలో ఉన్న పేపర్ని, ఇంకో చేతిలో ఉన్న కాఫీని పక్కన పెట్టి పరుగెత్తండి. మీ ఆలోచన సాధన కోసం... కాఫీ చల్లారినా తిరిగి వేడి చేసుకోవచ్చు. కాని ఆలోచన చల్లారితే తిరిగి రాదు.

- జాయ్

కాస్తంత సృజన, ఆశ, కసి తోడైతే చాలు, ప్రపంచాన్ని ఏలేయొచ్చు. ఏది ఏమైనా ఆలోచించడం ఆపొద్దు, ఎందుకంటే మిమ్మల్ని మిగతావారితో వేరు చేసేది మీ ఆలోచనే!
 

No comments: