all

Tuesday, June 11, 2013

ఆహారపు అలవాట్లు... మంచిచెడ్డలు

 

అలవాట్లు జీవితంలో కీలక భూమిక పోషిస్తాయి. అది మన ఊరైనా, చివరికి పొరుగుదేశం అయినా సరే... పొద్దున్నే పలుదోము పుల్ల లేకపోతే దంతధావనం జరిగినట్టే ఉండదు కొందరికి. షడ్రసోపేతమైన విందు భోజనం అయినా సరే... చివర్న పిసరంత పెరుగుచుక్క తగలకపోతే అన్నం తిన్నట్టే ఉండదు మరికొందరికి. ఇలా అలవాట్లతోనే మన జీవితమంతా గడచిపోతుంది. ఏదో ఒక అలవాటంటూ లేనివారే ఉండరు. అయితే అలవాట్లలో మంచివి, చెడ్డవి ఉంటాయి. మనం తినే ఆహారానికీ ఈ అలవాట్లూ అందులోని మంచిచెడ్డలూ వర్తిస్తాయి. మంచి ఆహారపు అలవాట్ల వల్ల మనలో వ్యాధినిరోధక శక్తి పెరగడం, దీర్ఘకాలం పాటు ఎలాంటి అనారోగ్యం లేకుండా ఉండటం వంటి మంచి పరిణామాలు సంభవిస్తాయి. అలాగే చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. ఆహారపు అలవాట్లు, మంచి చెడ్డలు, వాటి ప్రభావాలు వంటి అనేక అంశాలను వివరించేదే ప్రస్తుత కథనం.

మన ఆహారపు అలవాట్లను సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యం వంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు కొన్ని సామాజిక పరిస్థితుల్లో ఆహారంలో మాంసం నిషిద్ధం. అలాగే మద్యం కూడా. ఇక సింపుల్‌గా తినడం అనే ప్రక్రియలోనూ అనేక నిబంధనలు ఉంటాయి. కొన్ని చోట్ల నోరు తెరచి నమలడం తప్పు. ఎప్పుడూ నమలడం అన్నది పెదవులు మూసేచేయాలి. అలాగే కొన్ని చోట్ల అసలు ఆహారాన్ని చేతితో ముట్టుకోవడమే పొరబాటు. చెంచాల వంటి ఉపకరణాలతోనే ముట్టాలి. ఈ అలవాట్ల ప్రభావం ఒకరి జీవితకాలంలో చాలాసార్లు మారవచ్చు. మన ఇంట్లోనే మన పెద్దలు తింటున్నట్లుగా మూడోతరంలోని చిన్నపిల్లలు తినకపోవచ్చు. ఇలాంటి సాంస్కృతికపరమైన, నాగరకపు అలవాట్లుగా పరిగణించే అంశాలెలా ఉన్నా మంచి అలవాట్లు ఏమిటో పరిశీలిద్దాం.

మంచి ఆహారపు అలవాట్లు ఇవి...

అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తినడం: ఒక పూట భోజనంలో తక్షణ శక్తినిచ్చే పిండిపదార్థాలు; శక్తి నిల్వ చేసుకునేందుకు దోహదపడే కొవ్వుపదార్థాలు; కణాల రిపేర్లకు దోహదపడే ప్రొటీన్లు; పోషకాలను సమకూర్చే ఆకుకూరలు, కూరగాయలు; విటమిన్లను సమకూర్చే తాజాపండ్లు, లవణాలను ఇచ్చే ఇతరత్రా ఆహార పదార్థాలన్నింటితో కూడుకుంటూనే ఏదీ ఎక్కువా, తక్కువా కాకుండా సమతౌల్యంగా ఉండే ఆహారాన్ని సమతులాహారం అంటారు. ఇది మన రోగనిరోధక వ్యవస్థను బలంగా చేసి మనం అనారోగ్యానికి గురికాకుండా చేస్తుంది.

చిన్న మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం: మనం తినే ఆహారాన్ని ఏ రెండు పూటలకో పరిమితం చేయకుండా... తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు... అంటే ఉదయపు ఉపాహారం (బ్రేక్‌ఫాస్ట్), మధ్యాహ్న భోజనం (లంచ్), సాయంత్రపు ఫలహారం (ఈవినింగ్ శ్నాక్స్), రాత్రి భోజనం (సప్పర్/డిన్నర్) ఇలా విభజించుకొని కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం అన్నది జీర్ణవ్యవస్థపైనా భారం పడనివ్వదు. ఎప్పుడూ శరీరానికి శక్తి క్రమబద్ధమైన రీతిలో అందుతుంది. కాబట్టి ఇది కూడా మంచి అలవాటు. అదే ఇన్ని విడతల్లో తినే భోజనాన్ని రోజులోని ఏ ఒక్కపూటకో లేదా రెండు పూటలలోనో తినడం మంచిది కాదు.

తాజా పండ్లు తినడం: ఏ సీజన్‌లో లభ్యమయ్యే పండ్లను ఆ సీజన్‌లో తింటుండటం అన్నది మంచి ఆహారపుఅలవాట్లలో ఒకటి.

నీళ్లు ఎక్కువగా తాగడం: మన శరీరంలోని 75శాతం కేవలం నీటినే కలిగి ఉంటుంది. మనలోని ద్రవాలను కోల్పోవడం అన్నది ఒక్కోసారి ప్రాణానికే అపాయం. అందుకే మనం రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం అన్నది చాలా అవసరం.

ఆహారంలో చెడు అలవాట్లు...

ముందు పేర్కొన్నవి పాటించకపోవ డంతోపాటు సమతులాహారం తీసుకోకపోవడం, తాజాపండ్లు తినకపోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటివి ఎలాగూ చెడు ఆహారపు అలవాట్లే. ఒక్క ఆల్కహాల్ అలవాటు వల్ల శరీరంలోని అన్ని అవయవాలూ దెబ్బతింటాయి. కాబట్టి దీనికి అలవాటు పడకపోవడం చాలా మంచిది. దీనికి తోడు చెడు అలవాట్లు ఇప్పుడు మన ఆహారపు అలవాట్లలో చోటుచేసుకుంటున్నాయి. అవి...

జంక్ ఫుడ్ తినడం: మన ఆహారంలో త్వరగా లభ్యమయ్యి మార్కెట్‌లో తేలికగా దొరికే జంక్‌ఫుడ్, బేకరీ ఫుడ్ తీసుకోవడం తప్పనిసరిగా చెడు అలవాటు. ఇందులో ఉండే రిఫైన్‌డ్ పిండిపదార్థాల వల్ల డయాబెటిస్ వంటి సమస్యలు రావచ్చు. ఇది మంచి అలవాటు కానేకాదు.

మితిమీరి తీపిపదార్థాలు తినడం: మనం తీసుకునే పదార్థాలలో మితిమీరి తీపి పదార్థాలు తినడం వల్ల పళ్లు పాడైపోవడం, నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే సూక్ష్మజీవులు పెరగడం వంటి నష్టాలు సంభవిస్తాయి. అందుకే ఆహారాల్లో మితిమీరి తీపిని తీసుకోవడం సరికాదు.

బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోవడం: చాలామందిలో ఒక దురలవాటు ఉంటుంది. కొందరు ఆలస్యంగా ఆఫీసులకు వెళ్లేవారు ఉదయంపూట బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకుండా నేరుగా మధ్యాన్నం వరకు ఆగి అప్పుడు ఏకంగా భోజనం చేసి బయలుదేరుతారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మేలు కాదు. రాత్రి విశ్రాంతి తర్వాత మన శరీరంలోని క్యాలరీలు దాదాపుగా ఖర్చయిపోతాయి కాబట్టి మన దైనందిన వ్యవహారాలకు అవసరమైన శక్తి అందడానికి బ్రేక్‌ఫాస్ట్ మంచి అలవాటు. మధ్యాహ్న భోజనం కాస్త మితంగా తీసుకున్నా ఉదయపు బ్రేక్‌ఫాస్ట్ మాత్రం బాగానే తీసుకోవడం అన్నది అన్ని విధాలా ఆరోగ్యానికి మేలు చేసే అంశమే.

పైన పేర్కొన్న అలవాట్లలో మంచి ఆహారపు అలవాట్లను అలవరచుకుని, చెడ్డవాటిని పరిహరిస్తే దీర్ఘకాలం ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
 

No comments: