ఉండలు - నువ్వుండలు...
అరిసెలు - నువ్వరిసెలు...
తేడా పట్టేసే ఉంటారు!
నువ్వులు మిక్స్ ఐతే ‘స్వీట్ నథింగ్స్’ అయినా సరే సమ్‌థింగ్ స్పెషల్ అయిపోతాయి!
జంతికలు, పొడులు...
పులగాలు, చికెన్లు - మటన్లు ఏవైనా నువ్వుల టచ్ పడితే చాలు
హై పిచ్‌లోకి వెళ్లిపోతాయి!
విడిగా నువ్వులు...
కలివిడిగా కమ్మటి కొసర్లు.
కమ్మటి కొసర్లు
కావలసినవి:
నువ్వులు - 2 కప్పులు; బెల్లం తురుము - 2 కప్పులు; ఏలకులపొడి - తగినంత; పుట్నాలు - 2 టీ స్పూన్లు; మైదాపిండి - 2 కప్పులు; నూనె - సరిపడా; ఎండుకొబ్బరి తురుము - 4 టీ స్పూన్లు; బియ్యప్పిండి - 2 టీ స్పూన్లు.
తయారి:
నువ్వులలో కొద్దిగా నీరు చల్లి బట్టపై పోసి, బియ్యప్పిండి వేసి చేతితో బాగా రుద్ది, చెరిగితే పొట్టు పోతుంది
తరవాత బాణలిలో పోసి స్టౌ మీద ఉంచి, మంట తగ్గించి కలిపి, బాగా వేగాక స్టౌ ఆపేయాలి నువ్వులలోనే బెల్లంతురుము కూడా వేసి బాగా కలపాలి
చల్లారాక పొడిపొడిగా ఉండేలా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసి, పుట్నాలు, కొబ్బరితురుము, ఏలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి
మైదాలో... టీ స్పూను నూనె, నీరు పోసి చపాతీపిండిలా తడిపి గంటసేపు నాననివ్వాలి
చిన్న ఉండగా పిండిని తీసుకొని పొడిపిండి అద్దుతూ పూరీలాగ పల్చగా ఒత్తాలి
తగినంత నువ్వుల మిశ్రమం ఉంచి అంచులను చేత్తో నొక్కాలి. చక్రం ఉండే స్పూనుతో రోల్ చేస్తూ అంచులను తీసేయాలి. ఇలా చేసి కాగిన నూనెలో వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించి తీయాలి. ఇవి వారం పదిరోజుల వరకు నిల్వ ఉంటాయి.
కీమా - నువ్వులు రోల్స్
కావలసినవి:
కీమా (మటన్) - 200 గ్రా;
ఉప్పు - తగినంత; కారం - టీ స్పూను; పసుపు - చిటికెడు; అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; ఉల్లితరుగు - కప్పు;
పెరుగు - పావు కప్పు; ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క (అన్నిటినీ పొడి చేయాలి) - టీ స్పూను; మైదా - అర కిలో; డాల్డా లేదా నెయ్యి - మూడు టేబుల్ స్పూన్లు; కోడిగుడ్లు - 2; నూనె - వేయించడానికి సరిపడా; బేకింగ్ సోడా - పావు టీ స్పూను
తయారి:
మైదాలో బేకింగ్ సోడా, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి కరిగించిన నెయ్యి లేదా డాల్డా, గిలక్కొట్టిన కోడిగుడ్డు తెల్లసొన పిండిలో వేసి కలపాలి కొద్దిగా నీరు జతచేస్తూ మైదాపిండి మిశ్రమాన్ని చపాతీపిండిలా కలిపి నాలుగైదు గంటలు నాననివ్వాలి
ఒక పాత్రలో కీమా తీసుకుని, అందులో పసుపు, కారం, అల్లంవెల్లుల్లిపేస్ట్, మసాలాపౌడర్, కొద్దిగా పెరుగు అన్నీ కలిపి అరగంటసేపు నాననిచ్చి, మిక్సీలో వేసి కొద్దిగా మెత్తగా అయ్యేలా చేయాలి
స్టౌ మీద బాణలి ఉంచి అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక, ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి
తయారుచేసి ఉంచుకున్న కీమా మిశ్రమం, ఉప్పు జత వేసి బాగా వేయించాలి
మైదాను చిన్నచిన్న ఉండలుగా చేసుకుని, ఒక్కో ఉండను పల్చగా చపాతీలా ఒత్తి, నలుచదరంగా ఉండేలా చాకుతో కట్ చేసి పక్కన ఉంచుకోవాలి
తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని సన్నగా పొడవుగా రోల్‌లా తయారుచేసి చపాతీ మీద ఉంచి నెమ్మదిగా రోల్ చేయాలి
ఇలా ఒకదాని మీద ఒకటి మూడు చపాతీలను పొరలుగా రోల్ చేయాలి అప్పడాల పీట మీద నువ్వులు చల్లి, మరొక పొర తీసుకుని అప్పడాలకర్రతో ఒత్తి, ముందుగా తయారుచేసి ఉంచుకున్న రోల్‌ను ఈ పొర పై ఉంచి మరోమారు రోల్ చేయాలి
ఫొటోలో చూపిన విధంగా కట్ చేసి, చివర్లు విడిపోకుండా లవంగం కాని టూత్ పిక్ కాని ఉంచాలి
స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక వీటిని ఒకటొకటిగా వేస్తూ డీప్ ఫ్రై చేయాలి
సాస్ కాంబినేషన్‌తో స్నాక్‌లా తింటే రుచిగా ఉంటాయి.
నువ్వుల రొట్టెలు
కావలసినవి:
బియ్యప్పిండి - 4 కప్పులు; నువ్వులు - కప్పు లేదా ఒకటిన్నర కప్పులు; ఉప్పు - తగినంత
తయారి:
ఒక కప్పు పిండిని పొడిపిండి కోసం వేరే గిన్నెలో ఉంచుకోవాలి
ఒక గిన్నెలో మూడుకప్పుల నీరు, తగినంత ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి
ఒక పెద్ద పాత్రలో బియ్యప్పిండి, మరిగించిన నీరు పోసి చపాతీపిండిలా కలపాలి
చల్లారాక నీళ్లు అద్దుకుంటూ ముద్దగా చేసుకోవాలి
జామకాయ సైజులో పిండిని తీసుకుని నువ్వులను రెండువైపులా, చుట్టూరా పట్టేలా అద్ది, పొడిపిండి వేసుకుని చపాతీలా (చేతితోకాని చపాతీకర్రతో కాని) పెద్దదిగా ఒత్తుకోవాలి
స్టౌ మీద పెనం ఉంచి, వేడయ్యాక ముందుగా తయారుచేసి ఉంచుకున్న రొట్టెను వేసి రెండుమూడు నిముషాలయ్యాక కొద్దిగా నీళ్లు జల్లి, మరో రెండునిముషాలయ్యాక తిరగ తిప్పాలి
బాగా కాలిన తరవాత తీసేయాలి
పల్లీ చట్నీ, నువ్వుల చట్నీ, వంకాయ చట్నీ కాంబినేషన్‌తో ఈ రొట్టెలు బాగుంటాయి
(ఈ రొట్టెలను నిల్వ చేసుకోవాలంటే, చిన్న మంటపై గట్టిగా కాల్చి, చల్లారాక డబ్బాలో పెట్టుకోవాలి. నెలరోజుల దాకా నిల్వ ఉంటాయి)
నువ్వుల సకినాలు
కావలసినవి:
బియ్యం - 4 కప్పులు; నువ్వులు - 2 కప్పులు; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి సరిపడినంత; అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; నెయ్యి - 2 టీ స్పూన్లు
తయారి:
బియ్యంలో నీళ్లు పోసి మూడు గంటలు నాననివ్వాలి
బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీరు వంపేసి పొడి వస్త్రం మీద పోసి ఆరనివ్వాలి కొద్దిగా తడిగా ఉండగానే బియ్యాన్ని గ్రైండ్ చేసి పిండిని జల్లించుకోవాలి
ఈ పిండిలో నువ్వులు, ఉప్పు, నెయ్యి, అల్లంవెల్లుల్లిముద్ద వేసి కలపాలి
నీళ్లు పోస్తూ ముద్దగా చే యాలి
సకినాల మాదిరిగా చుట్టి, పొడివస్త్రం మీద పెట్టుకోవాలి మొత్తం పిండిని ఈ విధంగా తయారుచేసి పక్కన ఉంచుకోవాలి
స్టౌ మీద బాణలి ఉంచి, నూనె పోసి కాగనివ్వాలి
తయారుచేసి ఉంచుకున్న సకినాలను ఒక్కటొక్కటిగా నూనెలో వేసి బంగారువర్ణం వచ్చేవరకు వేయించి తీసేయాలి. (ఇష్టపడేవారు కారం కూడా వేసుకోవచ్చు)
నువ్వుల పులగం
కావలసినవి:
బియ్యం - కప్పు; నువ్వుపప్పు - అర కప్పు;
బెల్లం - ఒకటిన్నర కప్పులు; ఏలకుల పొడి - చిటికెడు;
పాలు - 2 కప్పులు; డ్రైఫ్రూట్స్ - తగినన్ని;
నెయ్యి - 5 టీ స్పూన్లు; బియ్యప్పిండి - పావు కప్పు.
తయారి:
బియ్యంలో నాలుగు కప్పుల నీరు పోసి మెత్తగా అన్నం వండాలి
నువ్వులను ఇసుక లేకుండా చూసుకొని కొన్ని నీళ్లు చల్లి బట్టపై పోసి, బియ్యప్పిండి వేసి చేతితో బాగా రుద్దాలి
పొట్టును విడదీసి, నువ్వులను బాణలిలో పోసి స్టౌ పై పెట్టి చిన్నమంటపై ఉంచి, వేగిన తరువాత దించాలి
చల్లారాక గ్రైండ్ చేసి పెట్టుకోవాలి
బాణలిని స్టౌ మీద ఉంచి వేడయ్యాక డ్రైఫ్రూట్స్ వేసి వేయించాలి
ఈ నేతిలోనే ఉడికించిన అన్నాన్ని, నువ్వలపొడిని కూడా వేసి పాలు పోసి ఉడకనివ్వాలి
ఐదు నిముషాల తర్వాత బెల్లం వేసి ఉడికిన తర్వాత ఏలకులపొడి కూడా వేసి కలిపి దించాలి
డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేయాలి
(అన్నం ఉడికించేటప్పుడు రెండుకప్పుల పాలు, రెండు కప్పుల నీరు కూడా పోసుకోవచ్చు)
నువ్వులపొడి
కావలసినవి:
ఇనువ్వులు - పావుకేజీ; ఎండుమిర్చి - 50 గ్రా.; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; మెంతులు - పావు టీ స్పూను; ఇంగువ - కొద్దిగా; నూనె - టీ స్పూను; ఉప్పు - తగినంత
తయారి:
స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నువ్వులు వేసి దోరగా వేయించి దించేయాలి
అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేగాక ఎండుమిర్చి కూడా వేసి వేయించి దించేయాలి
చల్లారాక మిక్సీలో ముందుగా పోపు వేసి గ్రైండ్ చేయాలి
నువ్వులు, ఉప్పు, ఇంగువ కూడా వేసి మరోసారి గ్రైండ్ చేయాలి
ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది.
నువ్వుల ఉండలు
కావలసినవి:
నువ్వులు - కప్పు; బెల్లంతురుము - ఒకటిన్నర కప్పులు; ఏలకులపొడి - అర టీ స్పూను; జీడిపప్పు, కిస్‌మిస్‌లు - రెండు టీ స్పూన్లు; నెయ్యి - రెండు టీ స్పూన్లు
తయారి:
స్టౌ మీద బాణలి ఉంచి కాగాక నువ్వులు వేసి వేయించి దించి, చల్లారనివ్వాలి.
మిక్సీలో నువ్వులు వేసి మెత్తగా చేయాలి
బెల్లం తురుము, ఏలకులపొడి వేసి అన్నీ కలిసేలా బాగా తిప్పాలి
ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని చేతికి నెయ్యి చేసుకుంటూ ఉండకట్టాలి
పైన జీడిపప్పు, కిస్‌మిస్‌లను అద్దాలి
రోజుకొక ఉండ తింటుంటే శ రీరానికి కావలసిన ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది.
కర్టెసీ: పి.సాయిజ్యోతి,
అచ్చంపేట, మహబూబ్‌నగర్ జిల్లా
నువ్వుల చరిత్ర
నువ్వులు... పూలమొక్క జాతికి చెందినది. ఇది అతి ప్రాచీనమైన పంట. సుమారు 3000 సంవత్సరాల క్రితం నుంచి ఈ పంటను పండిస్తున్నారు. పంటలు పండటానికి అనువుగాని ప్రదేశాలలో కూడా ఈ పంట చక్కగా పండుతుంది. ఈ పంటకు నీరు ఎక్కువగా అవసరం లేదు. ఇది బర్మా, ఇండియా, చైనా, ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాలలో ఎక్కువగా పండుతుంది. నువ్వులను గింజల కోసం, నూనె కోసం అధికంగా పండిస్తారు. ప్రపంచంలోకెల్లా నువ్వులను అత్యధికంగా ఎగుమతి చేసే దేశం భారతదేశం అయితే, అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం జపాన్. ఈ దేశస్థులు తమ వంటకాలలో నువ్వులనూనెను ఎక్కువగా వాడతారు. ఇది అధిక లాభాన్ని తీసుకువచ్చే వాణిజ్యపంట.
No comments:
Post a Comment