చినుకు రాలే సాయంత్ర వేళ వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాగని రోజూ బజ్జీలు తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదని డాక్టర్లంటున్నారు. మరి అటువంటి సమయంలో తేలికగా తయారుచేసుకుని ఇంటిల్లిపాది తినే ఆరోగ్యభరిత ఛాట్స్ ఈవారం రుచిలో మీకోసం...
భేల్‌పూరి కావలసినవి మరమరాలు-100గ్రాములు ఉడకబెట్టిన బంగాళాదుంపల ముద్ద-పావు కప్పు చింతపండు-50గ్రా. బెల్లం-50గ్రా సన్న కారప్పూస-50గ్రా పుదీనా ఆకులు-ఒకకట్ట ఛాట్ మసాలా-ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర-ఒకకట్ట పచ్చిమిర్చి-3 ఉప్పు-తగినంత
తయారుచేసే విధానం బెల్లాన్ని నీళ్లలో వేసి ఐదు నిమిషాలు మరిగించిన తరువాత చింతపండును కప్పు వేడినీటిలో వేసి కొద్దిగా చిక్కబడేవరకూ మరిగించి పక్కన పెట్టుకోవాలి. దీనికి పచ్చిమిర్చి ముక్కలను, పుదీనా ఆకులను కలిపి మెత్తగా పేస్ట్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉడికిన బంగాళా దుంపలను తీసుకుని దానికి ఛాట్‌మసాలా వేసి బాగా కలపాలి. మరమరాలను ఒక బౌల్‌లోకి తీసుకుని పుదీనా పేస్ట్‌ను కలపాలి. దీనిపై చిన్న ముక్కలుగా చేసుకున్న ఉల్లిపాయముక్కలు, చింతపండు వాటర్, సన్నకారప్పూస, బంగాళాదుంపల ముద్దను వేసి బాగా గరిటెతో కలపాలి. భేల్‌పూరి తయారైనట్టే. తక్కువ కేలరీల ఆహారం ఇది. రుచికరమైనది కాబట్టి పిల్లలకు తినడానికి ఎంతో ఇష్టపడతారు.
దహీ పూరి కావలసినవి గోల్‌గప్పా-20 పెరుగు-పావు కప్పు బఠాణీ గింజలు-పావు కప్పు (ఉప్పు వేసి మెత్తగా ఉడకబెట్టినవి) ఉడకబెట్టిన బంగాళాదుంపల ముద్ద- పావుకప్పు జీలకర్ర-పావు టేబుల్‌స్పూన్ పసుపు-పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్-పావు టేబుల్ స్పూన్ కారం -ఒక టేబుల్ స్పూన్ తీపి చింతపండు చట్నీ-నాలుగు టేబుల్‌స్పూన్లు ఉప్పు-తగినంత నూనె-తగినంత పైన అలంకరించడానికి తాజా కొత్తిమీర జీలకర్ర పౌడర్ పచ్చికారం బ్లాక్ సాల్ట్ ఉప్పు సన్న కారప్పూస
తయారుచేసే విధానం స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడి చెయ్యాలి. అందులో జీలకర్రను వేసి చిటపటలాడాక ఉడికిన బంగాళాదుంప ముద్దను వేయాలి. దీనికి పసుపు, కారం, గరంమసాలా పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి. సన్నని మంటమీద కొద్దిసేపు ఉడకనిచ్చి స్టవ్ మీద నుంచి దించేయాలి. పెరుగును ఒక బౌల్‌లో వేసుకుని చిక్కగా కవ్వంతో చిలకాలి. ఒక్కొక్క పూరీని తీసుకుని మధ్యలో రంధ్రం చేసి అందులో ఉడికిన బఠాణీ గింజల ముద్దను, బంగాళాదుంపల మిశ్రమాన్ని, స్వీట్ చట్నీని, రెండుస్పూన్ల పెరుగు వేసి ప్లేటులో పెట్టుకోవాలి. ఇలా కావలసినన్ని పూరీలను పెట్టాక పైన కొత్తిమీరను, బ్లాక్ సాల్ట్‌పౌడర్‌ను, సన్న కారప్పూసను, రెండు స్పూన్ల పెరుగును వేసుకుంటే దహీ పూరీ రెడీ. చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు. రుచి కూడా వెరైటీగా ఉంటుంది.
కచోరి కావలసినవి గోధుమపిండి-ఒక కప్పు పెసరపప్పు-అరకప్పు శనగపిండి-పావుకప్పు సోంపు-పావు టేబుల్ స్పూన్ జీలకర్ర-పావు టేబుల్ స్పూన్ గరంమసాలా-పావు టేబుల్ స్పూన్ పచ్చికారం-అర టేబుల్‌స్పూన్ బేకింగ్ పౌడర్-పావు టేబుల్ స్పూన్ నూనె-తగినంత ఉప్పు-తగినంత
తయారుచేసే విధానం పిండిలో ఉప్పు వేసి బాగా కలపాలి. పెసరపప్పును నానబెట్టి బాగా కడిగి మెత్తగా రుబ్బుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా నూనె వేసి దానిలో ఈ రుబ్బిన ముద్దను కూడా వేసి పదినిమిషాలు ఉడికించాలి. దీనికి అన్ని రకాల మసాలా పౌడర్లను వేసి బాగా కలిపి పొడిగా మారేవరకు వేయించాలి. దీనికి శనగపిండిని కలిపి కొద్దిసేపు ఉడికించాలి. కచోరీలో మిక్స్ చేసే స్టఫ్ఫింగ్ రెడీ అయినట్టే. గోధుమపిండి ముద్దను బాల్స్‌లా చేసుకుని దానికి మధ్యలో రంధ్రం చేసి స్టఫ్ఫింగ్ మిశ్రమాన్ని అందులో కూర్చి పైన కవర్ చేసుకోవాలి. వాటిని నూనెలో వేసి బ్రౌన్ రంగులోకి వచ్చే వరకూ వేయించుకోవాలి. వీటిని పచ్చిమిరపకాయల చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
మసాలా పూరి కావలసినవి ఉడకబెట్టిన బఠాణీ గింజలు - రెండు కప్పులు పచ్చిమిర్చి-3 వెజిటబుల్ ఆయిల్-ఒక టేబుల్‌స్పూన్ పచ్చికారం-ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా-ఒక టేబుల్ స్పూన్ ఛాట్ మసాలా-ఒక టేబుల్ స్పూన్ బ్లాక్, రాక్ సాల్ట్-అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి- అరటేబుల్ స్పూన్ మిరియాలపొడి-అర టేబుల్ స్పూన్ తీపి చింతపండు చట్నీ- రెండు టేబుల్ స్పూన్లు పెరుగు-అరకప్పు ఉల్లిపాయ-ఒకటి (సన్నగా తరిగినది) టమాటా- ఒకటి (చిన్నముక్కలుగా తరిగినది) పూరీలు-పదిహేను సన్నకారప్పూస-ఒక కప్పు ఉప్పు-తగినంత
తయారుచేసే విధానం: ఉడికించిన బఠానీలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానికి కొద్దిగా నీళ్లను చేర్చి జారుగా చేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి దానిలో ఈ ముద్దను వేసి కొద్దిసేపు ఉడికించాలి. దీనికి పచ్చికారం, ఉప్పు, గరంమసాలా, మిరియాలపొడి, జీలకర్ర పొడి కలపాలి. అన్నింటిని వేసి బాగా కలిపి ఐదునిమిషాలు ఉడికించాలి. కొద్దిగా జారుగా అవడానికి కావలసినంత నీటిని పోయండి. దీనిని తినే ప్లేటులోకి తీసుకుని దీనిమీద వేయించిన పూరీలను ముక్కలుగా చేసి వేయాలి. దీనిపై చింతపండు చట్నీ, ఛాట్‌మసాలా, బ్లాక్ సాల్ట్, పెరుగు, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, సన్నకారప్పూసతో సర్వ్ చేయండి. రుచి అమోఘంగా ఉంటుంది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.
|
|
|
No comments:
Post a Comment